చంద్రలేఖలో ఇంకా ఏం మిగిలింది?
రిక్షావాడు గంటకొట్టి గొందిలోకి దూరాడు. ఇనుపరేకు కప్పులున్న గుడిసెల వరుసముందు రిక్షా ఆగింది. కాలూ రిక్షావాడికి డబ్బిచ్చి లేఖను తీసుకొని నాలుగడుగులు వేశాడు. కాలూ గుడిసె వచ్చింది. తలుపుకు ఉన్న ఇత్తడి తాళం తీసి తలుపు తెరిచాడు.
కాలూ లోపలికివెళ్ళి గూట్లో ఉన్న ఒక సన్నని కొవ్వొత్తి వెలిగించాడు. లేఖ లోపల అడుగుపెట్టింది. కొత్తచుట్టంలా లేఖ ఇరుకుగదిలో ప్రవేశించే నగ్నవృక్షాన్ని రెండుచేతుల్తోను కప్పుకొని నుంచుంది. ఆమె వంచిన తల ఎత్తలేదు. కాలూ ఆమెను చూడలేదు.
"ఆకలిగా ఉందా?"
"లేదు," ఆమె గొంతు పట్టుకుంది. "దాహంగా ఉంది."
కాలూ ఒక ఎనామిల్ మగ్ లేఖచేతికి ఇచ్చాడు. మట్టిముంతలోంచి అందులో నీరుపోశాడు.
గోడకు ఆనించి ఉన్న నులకమంచం వాల్చి "అయితే పడుకో" అన్నాడు. మంచంతో సగం గది నిండిపోయింది. ఒక రెల్లుచాప తీసుకొని కాలూ వరండాలోకి వెళ్ళి తడిగా ఉన్న సిమెంటు గచ్చుమీద పరచుకున్నాడు. పడుకునేముందు తలుపు వేశాడు.
కాలూ పడుకున్నాడు. అతడు మూర్ఖుడు అయిపోయాడు. మొద్దుబారిపోయాడు. అతనిలో నమ్రత నశించింది.
లేఖ పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం ఆమె పతిత. బోగం కొంపగాలి సోకుతేనే ఆడది అణగారి పోతుంది. అతని ఆశాసౌధాలకు అగ్గి అంటుకుంది. లేఖ పతనానికి బాధ్యత ఎవరిది? సంఘం ఆమెను బతికి ఉన్నన్నాళ్ళూ పతితగానే భావిస్తుంది. సంఘం హిమాలయంలాంటిది. దానిముందు చీమలాంటి కాలూ ఏం చేయగలడు?
కాలూకు పుట్టుకతో వచ్చిన కులంమీదా, వారసత్వం మీద బాగా విశ్వాసం ఉంది. లేఖ పవిత్రం అయింది కాకున్నా పతిత అయినా ఆమె కాలూకు ప్రాణమే. ఆమెమీద అతనికి ఏ కొద్ధిమాత్రం తక్కువ ప్రేమ ఉన్నా ఆమె పతనాన్ని అంగీకరించి ఆమెను స్వర్గమూర్తిగా కాక మృణ్మూర్తిగా స్వీకరించేవాడు. కాని అలాకాదు. లేఖ కాలూకు దేవి. అతడు ఆమెను పూజించే అర్చకుడు. అలాంటప్పుడు ఆమె పతనాన్ని అతడు సహించలేడు. తన పోరాటం నేరంతోగాని నేరస్తునితోకాదు. తాను నమ్ముకున్న వందల, వేల సంవత్సరాలనాటి పూర్వాచారాలే అందుకు కారణం.
కాలూ తాను పెరిగిన వాతావరణాన్ని ధిక్కరించడంతో సరిపోదు. దాన్ని కూకటివేళ్ళతో కదిలించివేయాలి.
కాలూ చాపమీద మేనువాల్చాడు. అతని శరీరం అంతా సూదులు గుచ్చినట్లు బాధకావడంతో మొద్దుబారిన అతని శరీరం ప్రాణం పోసుకుంటూందని అతడు తెలుసుకున్నాడు. అతడు వర్తమానాన్ని ఎదిరించలేడు. కాని గతంలోని మధురస్మృతులు ప్రవహించినాటి రంగురంగుల పూలతోటల్ను చూస్తూ ఈ దుర్దినాలకు దూరంగా ఉండవచ్చు. లేఖ ప్రయత్నపూర్వకంగా మోకాళ్ళమీద పాకడమూ పట్టు లేకుండా నాలుగు తప్పటడుగులు వేయడమూ అతనికి గుర్తుకు వచ్చాయి. ప్రథమ పర్యాయం పాఠశాలకు వెళ్ళడం, ప్రగతి నివేదికలూ, పది సంవత్సరాలూ ప్రథమశ్రేణికి తగ్గకుండా ఉత్తీర్ణురాలుకావడం అన్నీ అతని స్మృతిఫలకంమీద మెరిశాయి. స్కూల్ ఫైనల్ పరీక్ష ఇంకొక నెల ఉందనగా కొలిమికి వచ్చిన ప్రధానోపాధ్యాయిని లేఖకు స్కాలర్ షిప్పు వస్తుందని చెప్పింది. లేఖ కాలేజీకి వెళ్ళడానికి స్కాలర్ షిప్పు!
సంతోషం అన్యమార్గం తొక్కింది. పుట్టీపుట్టని పసిబిడ్డ చచ్చిన తల్లిదగ్గర పడి ముఖంకందిపోయేట్లు పిడికిళ్ళు పట్టుకుని ఏడుస్తూంది. మంత్రసానికి సహాయం చేయడానికి వచ్చిన పక్కింటావిడ "తల్లిని మింగేశావ్. ఇంకెందుకు ఏడుస్తున్నావ్" అని కేకలు వేసింది.
ఆ కేక అతనిగుండెలో శూలంగా గుచ్చుకుంది. వాత్సల్యం పొంగింది. లేఖకు కవచంగా నిలవాలని నిశ్చయం చేసికొన్నాడు. ఇంతవరకూ కాలూ జీవితం ఆమెకు రక్షాకవచంగానే గడిచింది. ఈ విధంగా గతం అంతా నాటకంలా రంగాలురంగాలుగా గడిచిపోయింది. లేఖ భయంతో వణికిపోతూ లోకపు దృష్టిలో పతిత అయిన ఈ దుష్టగడియల్లో ఆ కవచం ఏమి అవుతుంది?
కాలూ పసిపాపలా ఏడ్చాడు. కాని నోటిమీద చేయివేసుకొని నిశ్శబ్దంగా ఏడ్చాడు. అంతవరకు ఒక్కసారిమాత్రమే - లేఖ తల్లి చనిపోయిననాటిరాత్రి - అంతగా ఏడ్చాడు. ఆనంద ఘడియల్ను నెమరువేసు కుందామనుకున్నా అతడిగుండె చిల్లిపడి ఆనందం కారిపోయింది. అతని మనస్సు ఎంతదూరం పయనించినా చెవులుమాత్రం లేఖను అంటిపెట్టుకున్నాయి. గదిలో ఏదో ధ్వని వినిపించింది. చెవులు నిక్క పొడిచాడు. పంచెతో ముఖం తుడుచుకుని లేచి తలుపు తెరిచాడు. కొవ్వొత్తి ఆరిపోయి గది అంధకారమయం అయిపోయింది.
లేఖ కనిపించలేదు. కాని దుఃఖాన్ని దిగమింగుతున్న ధ్వని వినిపించింది. అతడు మంచపు చివర కూర్చొని చేతితో ఆమె ముఖం తాకేదాకా తడిమాడు. కాయలుకాసిన అతనిచేతులు ఆమెకన్నీటిని తుడిచాయి. కన్నీరు కట్టలుతెంచుకుని అతని వేళ్ళమీదినుంచి పారింది.
కాలూ ఏం చేయాలి. ఆమె ఏడుపు ఆపాలి. పూర్వం అయితే దగ్గరికి లాక్కొని బుజ్జగీస్తూ ప్రేమతో వెన్ను తట్టేవాడు. తట్టినప్పుడల్లా తగ్గుతూ చివరి తరంగం చెక్కిళ్ళ వెంట దొర్లి ఆగిపోయేది. మరి ఇప్పుడూ?
"నేను మూడునెల్లు జేల్లో ఉన్నాను." అతని బాధపరితప్తస్వరం "నేను.....నేను దొంగలించాను" అన్నది. తానూ లేఖలాగే పతితున్ని అయినాననే విషయం ఆమెకు తెలియపర్చాలని అతడు అలా అన్నాడు.
దుఃఖతరంగాలు ఉపశమించాయి. కాని ఆగిపోలేదు.
"జేల్లో ఎద్దులా గానుగకాడి తిప్పాను. అక్కడొకగొప్ప వ్యక్తి కనిపించాడు. అతడు ఈ మహానగరంలో జరిగే మహాపాపాల్ను గురించి చెప్పాడు. ఆకలితో చచ్చే అబలల్ను వంచించి తెస్తారు......"
ఇంక చెప్పలేక ముఖంతిప్పేసుకున్నాడు. తన చివరి పతనాన్ని గురించి చెప్పలేకపోయాడు. కాని తాను రూపాకు రావడం ఎలా సంభవించింది అని లేఖ అడుగుతే?
లేఖ తండ్రిచేతిని పట్టుకుని వీపుమీద రుద్ధించింది. చేతికి బాగా పొంగిన దద్దర్లు తగిలాయి. "నిన్ను కొట్టారా?" అని కేకవేశాడు. అతని గొంతులో ప్రాణం లేకుండా అయింది. "నిన్ను కొట్టారూ?" అన్నాడు హీనస్వరంతో.
లేఖ ఏడ్చింది. ఆమె దుఃఖాన్ని పంచుకోవడానికా? అన్నట్టు కాలూ చేతితో గాయాలు రుద్దాడు. తరువాత "నిన్ను కొట్టారూ?" అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. 'ప్రతీకారం' అని అతని కంఠం గర్జించింది.
ప్రతీకారం....ప్రతీకారం.....ప్రతీకారం ఎలా? జేల్లో బి-10 అన్నమాటలు కొత్త రంగులతో కళ్ళముందు ప్రత్యక్షం అయినాడు. "మనమంటే పైవాళ్ళకు భయం. అందుకే వారికి మనమంటే అసహ్యం వారు మనను పొట్టలో పొడుస్తారు. మనం వారిని వీపుమీద గుద్దాలి."
కాలూ లేఖలు ఆగంతుకులుకారు. వాత్సల్యంగల తండ్రీ. ప్రేమ గల కూతురూ.
పుల్లని వాంతి వాసన కొట్టింది. వాంతి వాసన. ఆమె వాంతి ఎందుకు చేసుకుంది? జబ్బున పడలేదుకదా? బోగంకొంప తివాసీమీద వాన్తిని కాలూ తొక్కాడు. మళ్ళీ ఆ వాన్తినిగురించిన ఆలోచన ఇప్పడే వచ్చింది కడుక్కోవడానికి లేఖకు ఒక ముంతెడు నీళ్ళు ఇవ్వాలి. కట్టుకోవడానికి తన ధోతి ఇవ్వాలి. ఆమెకంటే మూడు రెట్లు పెద్దదే అయనా తన చొక్కా తొడుక్కోవడానికి ఇవ్వాలి. ఆమె కట్టుకున్న ఉల్లిపొర సిల్కు చీర చెత్తకుండిలో పారేయాలి. రేపు కొత్తచీరా జాకెట్టూ తెచ్చిపెట్టాలి.
కాలూ గుండె ఎందుకు ఆరాటపడుతూంది? ఉపశమనానికి మార్గం ఏమిటి? ఈ ద్రోహం తల పెట్టింది ఎవరు? చేసింది ఎవరు? తెలుసుకోవాలి. 'దేవుడా! నాకావిషయం తెలియపర్చు'. అతని చెవులు వింటూనే ఉన్నాయి. కాని అతని రక్తం గడ్డకట్టుకొనిపోతూ ఉన్నట్లు ఉంది.
లేఖ లేచికూర్చుంది. కాలూ కండ్లు ఆమెను చూడ్డానికి ప్రయత్నిస్తున్నాయి. కాలూ కాకుంటే ఆమె బాధను అర్ధం చేసుకునేది ఇంకెవరు? కాలూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు.
హీనస్వరంతో మాట్లాడింది. దుఃఖం ఆమెను తినేసింది.
"నీ మొదటి ఉత్తరం అందినప్పుడు ఇంట్లో చిల్లిగవ్వలేదు. ఉన్నవన్నీ పిడికెడు పిడికెడు గింజలకు అమ్ముకున్నాం. నా మెడల్ కు మూడుసేర్ల బియ్యం వచ్చాయి."
"నీ మెడల్" అని కాలూ అరచాడు.
"నీవు ఎప్పుడు వస్తావో అని రోజులు లెక్క పెట్టాం. ఈలోగా ఆ ముండ వచ్చింది. నీ ఉత్తరం ఇచ్చింది."