నేను వెంటనే మా వూరు వెళ్ళిపోలేదు. అక్కడే నాలుగు రోజులు వున్నాను. ఒక్కక్షణం వృధా చేయలేదు. ఆనందరావు గురించి మొత్తం అన్ని వివరాలు సేకరించాను. నేను అనుకున్నది నిజమే. వివాహం కాకముందు అతడు చాలా బీదవాడు. పల్లెటూళ్ళో వుండేవాడు. తరళని వివాహం చేసుకున్నాక వ్యాపారం విస్తీర్ణం చేశాడు. అతడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు కొడుకు ప్రబంధ్. కూతుళ్ళు ఇంకా చిన్న వాళ్ళు. ఆ ఇంట్లో తరళ చాలా డామినేటింగ్. కాస్త పిచ్చి కూడా వున్నట్టు అనుమానం. ఆమె ఏమంటే అది ఆ ఇంట్లో చెల్లాల్సిందే!
ఇవీ నేను సేకరించిన విషయాలు!
ముందు ఆ తరళనుంచి ప్రారంభించదల్చుకున్నాను. ఆ సంసారాన్ని విచ్చిన్నం చేయటం నా లక్ష్యం ఆ కుటుంబంలో ప్రతీ ఒక్కరూమనస్సులోనే కుమిలి కుమిలి చావాలి.
నా యీ నిర్ణయం మీకు నామీద అసహ్యాన్నీ, కోపాన్నీ కలిగిస్తే క్షమించాలి. తినటానికి తిండిలేక, తండ్రి ఎవరో తెలియక- రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతూ, అర్ధరాత్రి ప్రక్కనుంచి అమ్మ నిశ్శబ్దపు రోదనలు వింటూ పెరిగిన ఒక యువకుడికి ఇంతకన్నా తక్కువ కోపం, కసి వుంటే, అతడిలో ఏదో లోపం వుందన్నమాట.
* * *
ప్రబంధ్ వెళ్ళి వరంగల్ దగ్గిర మిల్లులో జాయినయ్యాడు. అక్కడ గొడవలు మరీ ఎక్కువయ్యాయి. దిన దిన గండంలా వుంది పరిస్థితి. ఇంకొక టైమ్ లో అయితే ఆ వుద్యోగం వదిలేసి ఎవరైనా వెళ్ళిపోక తప్పదు. కానీ ప్రబంధ్ నుంచి ముందే అగ్రిమెంటు తీసుకున్నాను. ఆ విధంగా అతడిని ఇరికించి వేశాను. అతడు పంపించిన ఏ ప్రపోజలూ ఇక్కడ నుంచి వప్పుకోలేదు. కార్మికుల సమస్య రోజు రోజుకీ ఎక్కువై ఉద్రిక్తంగా వుంది. అక్కడ ఏ క్షణమైనా ఫ్యాక్టరీ కాల్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక రకంగా అదే మంచిదికూడా ఈ తలనొప్పులన్నీ పోయి, ఇన్సూరెన్సు వస్తుంది.
ఆనందరాఉ కొడుకుని ఈ విపత్కర పరిస్థితుల మధ్య ప్రతిష్టాపించిన తరువాత, రెండో విక్టిమ్ కోసం చూశాను. ఆమె తరళ..
దాని తాలూకు ప్లాన్ కూడా అనుకోకుండా వచ్చేసింది.
వికలాంగుల సంక్షేమ కార్యక్రమానికి వెళ్ళాను ఒకరోజు. సహాయం కోసం నాటకం వేశారు.
అప్పుడు చూశానా అమ్మాయిని! పేరు రాణి అట! పదహారు సంవత్సరాల కన్నా ఎక్కువ వుండదు వయసు. అద్భుతంగా నటించింది. మొత్తం థియేటర్ అంతా ముగ్ధులై చూశారు. అప్పుడే ఆ ప్లాన్ నాకు తోచింది.
ఆ అమ్మాయి ఇల్లు కనుక్కుని మరుసటిరోజు వెళ్ళాను.
మామూలు పరిచయాలయ్యాక అడిగాను. "ఎంతిస్తారు నీకు ఒక్కొక్క ప్రదర్శనకి?"
"నాలుగొందల రూపాయలు..."
"ఎన్నాళ్ళు చేయవలసి వుంటుంది రిహార్సల్సు...?"
"వారం రోజులు".
"నాతో పాటు ఒక నాటకం ఆడితే నీకు పదివేల రూపాయలు ఇస్తాను".
ఆ అమ్మాయి అనుమానంగా చూసింది. నేను నవ్వి "నాకేమీ దురుద్దేశ్యంలేదు. నాకు చెల్లెలుగా నటించాలంతే" అన్నాను.
"నా కర్ధం కావటం లేదు".
మొత్తం అంతా వివరించి చెప్పాను. అయితే అందులో నా తల్లికి జరిగిన అన్యాయం వగైరా విషయాలు చేర్చలేదు. కేవలం ఆనందరావు అనే వ్యక్తిని ఎలా మానసికంగా కంగారు పెట్టాలో, ఆ విషయాలే చెప్పాను.
ఆమె ఉత్సాహంగా వప్పుకుంది. ఎక్కువ ప్రశ్నలు కూడా వేయలేదు. నాకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ గా ఫీలయింది. "ఎప్పటినుంచి ప్రారంభిద్దాం?" అని అడిగింది.
"రెండు మూడు రోజుల్లో... నీతో పాటు ఎవర్నైనా తీసుకొచ్చేట్టయితే తీసుకురా-"
"అవసరం లేదు".
ఆ అమ్మాయిలో నాకు నచ్చిన గుణం ఏమిటంటే- తనకి అవసరమైనవి తప్ప మిగతా వివరాలు ఒక్కటి కూడా అడగలేదు. తనకి వప్పచెప్పిన బాధ్యత నిర్వర్తిస్తుందని నాకెందుకో అనిపించింది.
అయిదువేలు అడ్వాన్సు ఇచ్చాను.
"ఒక బ్రోతల్ హౌస్ లో నిన్ను పట్టుకుంటారు. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. ఆ పోలీస్ స్టేషన్ లో వున్న ఇన్ స్పెక్టర్ నాకు బాగా స్నేహితుడు. నువ్వు ఈ ఆనందరావు ఫోటో చూపిస్తే చాలు, ఆ వార్త ఆనందరావుకి చేరుతుంది. తనకి తెలియని ఈ కూతురెవరా అని కంగారు పడతాడు. ఈ విషయం అతడి భార్యకి తెలిసే ఏర్పాటు నేను చేస్తాను".
"ఒకవేళ నన్ను చూడటానికి పోలీస్ స్టేషన్ కి వస్తే?"
"నీకు నచ్చిన కథ ఏదో ఒకటి చెప్పు. నీ తల్లి పేరు మాత్రం ప్రమద్వర అని చెప్పు. ఆ పేరు చెప్పగానే అతడి మొహంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మాత్రం గమనించు. ఆ పేరు చెప్పినా కూడా అతడు పట్టించుకోకపోతే ఇక ఆ సంగతి వదిలెయ్యి. నిన్ను నేను వెంటనే విడిపిస్తాను".
"రైడింగ్ కేసులో పట్టుబడి పోలీస్ స్టేషన్ లో వుండటం చాలా రిస్కు". "నీకు రెండొందల గజాల దూరంలో రాత్రంతా నేను వుంటాను. నువ్వేమాత్రం భయపడకు ఆనందరావు అడిగిన ప్రశ్నలన్నిటికీ మాత్రం తడుముకోకుండా జవాబు చెప్పు".
నేను వెళ్ళబోతూంటే ఆ అమ్మాయి అడిగింది- "మీరేమీ అనుకోనంటే ఒక ప్రశ్న - ప్రమద్వర ఎవరు?"
"నా తల్లి".
7
తరువాత మేము అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. ఆనందరావు ప్రమద్వర ఎవరో తనకు తెలియనట్లుగా నటిస్తాడనుకున్నాను కానీ, అతడు రాణిని తనతోపాటు తీసుకువెళ్ళటం ఆశ్చర్యమనిపించింది.
అతడిని పోలీస్ స్టేషన్ నుంచి ఫాలో అయ్యాను.
రాణిని హోటల్ కి తీసుకెళ్ళి గది బుక్ చేశాడు. ఖరీదైన హోటల్ నా ఆశ్చర్యం ఎక్కువైంది. అనుమానం కూడా పెరిగింది. ఈ సాక్ష్యాన్ని మాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాడా ఆనందరావు?
అతడు రాణితో కలిసి రూమ్ చేరుకునే సమయానికి నేను వరండాలో ఎదురు చూస్తున్నాను. ఆమెని దిగ పెట్టి అతడు వెళ్ళి పోగానే గదిలోకి వెళ్ళాను. నన్ను చూసి నవ్వింది.