Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 19


    
    "ఏ వూరు మీది?"
    
    చెప్పాడు.
    
    "మీ నాన్నగారేం చేస్తూంటారు? ఆనందరావు కదూ ఆయన పేరు".    

 

    "అవును మీకు తెలుసా?"
    
    తెలుసని చెప్పనా? మహాత్మాగాంధీ అన్నట్టు మనందరిలోనూ ప్రవహించేది ఒకే రక్తం, మన ముగ్గురిలోనూ.
    
    తెలీదు. అప్లికేషన్ లో చూశాను. ఏం చేస్తూవుంటారాయన?" మామూలుగా అడిగినట్లు అడిగాను కారు నెమ్మదిగా పోనిస్తూ.
    
    "తరళా ఇండస్ట్రీస్ ప్రొప్రయిటరు".
    
    ఆశ్చర్యంగా చూసి, "మరెందుకు మా కంపెనీలో ఉద్యోగం?" అన్నాను. అతడు వెంటనే సమాధానం చెప్పకుండా ఆగి, తరువాత అన్నాడు- "కొంచెం అనుభవం వస్తుందని అదీగాక, నా కాళ్ళమీద నిలబడదామని".    

 

    గుడ్ అయినంపూడి ఆనందరావు రక్తంలో ఇండివిడ్యువాలిటీని వారసత్వానికిచ్చే లక్షణం ఉందన్నమాట.
    
    "తరళా ఇండస్ట్రీస్- పేరు గమ్మత్తుగా వుంది".
    
    "అమ్మ పేరు తరళ, అన్ని ఇండస్ట్రీసూ తన పేరుమీదే వున్నాయి".
    
    "మీ తాతగారివా?" మళ్ళీ క్యాజువల్ గా అడిగాను.
    
    "అవును".
    
    సో... తల్లిని ఆనందరావు ఎందుకు పెళ్ళాడలేదో అర్దమైంది. మామూలు ఎరని తినేశాక, వీలైతే మరొక మంచి ఆహారంవైపు వెళ్ళటం చేపకి అలవాటే కదా.
    
    నేను మౌనంగా డ్రయివు చెయ్యటం చూసి "మీరు...." అని అర్ధోక్తిగా ఆగాడు.
    
    "మా పేపర్ మిల్లులో అసిస్టెంట్ మానేజర్ ఉద్యోగానికి కదా మీరు అప్లయ్ చేసింది".
    
    "అవును".
    
    "మానేజర్ ఉద్యోగం ఇస్తాను. చేస్తారా? మరో అయిదొందలు ఎక్కువ వస్తుంది".
    
    అతడి కళ్ళల్లో విస్మయం కొట్టొచ్చినట్లు కనబడింది. "నాకా...." అన్నాడు.
    
    "అవును, మీరు ఎల్లెల్ బీ కదా?"
    
    అతడు తలూపి, "అది చదవడం కోసమే ఈ వూళ్ళో వున్నాను. శలవుల్లో సరదాగా అప్లయ్ చేశాను ఉద్యోగానికి" అన్నాడు.
    
    "అలా అని ఉద్యోగం కూడా సరదాగా చేయరు కదా".
    
    "సారీ నా ఉద్దేశ్యం అదికాదు".
    
    "చాలా రిస్క్ జాబ్ అది. ఆ ప్రాంతం అంత మంచిదికాదు. అక్కడి స్థానికుల్తో, లేబర్ తో ప్రతి క్షణమూ ప్రమాదమే. ఏ మాత్రం కోపం వచ్చినా మూకుమ్మడిగా వచ్చి ప్రాణాలు తీస్తారు".
    
    "అయినా సరే, చేస్తాను".
    
    "అడిగిన ఉద్యోగం కంటే పెద్దదిస్తున్నాను కాబట్టి మూడు సంవత్సరాలు బాండ్ వ్రాయవలసి ఉంటుంది".    

 

    "అభ్యంతరం లేదు".
    
    "అది కనుక్కుందామనే వచ్చాను. ఎంత తొందరగా జాయిన్ అవ్వగలరు?"
    
    "మూడ్రోజుల్లో వచ్చేస్తాను".
    
    "గుడ్" కాఉర్ స్టేషన్ ముందు ఆగింది. అతడు దిగి "థాంక్స్" అన్నాడు తలూపాను. అతడు వెంటనే వెళ్ళలేదు- "ఇంటర్వ్యూ అవగానే ఇలా స్వయంగా వచ్చి అడిగారంటే- నాకు చాలా సంతోషంగా వుంది. రికమెండేషన్స్ తో నిండి పోయిన ఈ ఇంటర్వ్యూల్లో మీరిలా స్వయంగారావటం- నిజంగా నాలో అంత క్వాలిఫికేషన్ ఏముందో నాకే తెలియటం లేదు. వెళ్ళొస్తాను. మూడ్రోజుల్లో వచ్చి కలుసుకుంటాను".
    
    అతడు వెళ్ళినవైపే చూస్తూ మనసులో అనుకున్నాను. 'చాలా పెద్ద క్వాలిఫికేషన్ వుంది ప్రబంధ్ నీకు! అదేమిటో త్వరలోనే తెలుస్తుంది!'
    
                                     * * *
    
    ఆఫీసుకి రాగానే మానేజర్ తో, ఫ్లయిట్ కు టిక్కెట్టు కొనమని చెప్పాను. కృష్ణమూర్తితో మానేజర్ నియామకం గురించి వివరించాను. అతడు ఆశ్చర్యపడ్డా అభ్యంతరం చెప్పలేదు. 'అంత నచ్చాడా నీకా కుర్రాడు' అని మాత్రం అన్నాడు.
    
    "కుర్రాడు కాదు. నా వయసే వుంటుంది అతడికి" నవ్వాను.
    
    "కొంపతీసి బంధువా ఏమిటి?"
    
    "అలాంటిదే కాని అతడికి తెలీదు".
    
    "తెలుసంటే రికమెండేషన్ తెచ్చేవాడే".    

 

    ఈ లోపులో మానేజర్ వచ్చి టిక్కెట్టు ఓ.కే. అయినట్గ్టు చెప్పాడు. ఆ సాయంత్రం బయల్దేరి, గంటలో ఆ వూరు ప్రయాణం చేశాను. ఎయిర్ పోర్ట్ లో దిగ్గానే, డైరెక్టరీలో చూసి తరళా ఇండస్ట్రీస్ కి ఫోన్ చేశాను.
    
    "ఎవరు కావాలి" ఆపరేటర్ అడిగింది.
    
    "ఆనందరావు"
    
    "మీరెవరు?"
    
    "ఎ. సాయిచందర్".
    
    క్షణం తరువాత ఆనందరావు లైన్లోకి వచ్చాడు. అప్పటికే ఫోన్ పెట్టేశాను.
    
    ఎయిర్ పోర్ట్ నుంచి సరాసరి తరళా ఇండస్ట్రీస్ కి వెళ్ళాను. "ఆనందరావు గారున్నారా?" అని అడిగాను. "ఇప్పుడే వెళ్ళిపోయారండి" రిసెప్షనిస్టు అంది.   

 

    "ఎక్కడికి?"
    
    "ఇంటికి"
    
    "కొంచెం ఇంటి అడ్రసు ఇస్తారా?" అని అది తీసుకొని, ఇంటికి బయల్దేరాను.
    
    పెద్ద బంగ్లా అది గేటు కిటువైపు 'ఆనందరావు', అటువైపు స్థంభానికి 'తరళ' అన్న పేర్లు చౌకబారు టేస్టుని సూచిస్తున్నాయి. అతడి భార్య అనుకుంటా నలభై అయిదేళ్ళకు పైగా వుంటుంది. బైట తోటలో కూర్చుని టీ కలుపుతూంది.
    
    ఈ లోపులో అతడు లోపల్నుంచి తోటలోకి వచ్చాడు. లాల్చీ, పైజామాలో వున్నాడు. జుట్టు తెల్లగా వుంది. ఏ వ్యక్తి కోసం నేను వారం రోజులుగా- ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకోవాలని ఎంతగా తహ తహ లాడిపోయానో- ఆ వ్యక్తి.
    
    అయినంపూడి ఆనందరావులు ఇద్దరున్నారేమో అన్న అనుమానం నా మనసులో ఏ మూలో వుండేది. అతడిని చూడగానే పోయిందది.
    
    ఆ జుట్టుకి కాస్త రంగేసి మా ఇద్దర్నీ పక్క పక్కన నిలబడితే కవలలనుకుంటారు. అతడి కొడుకుని నేను, సందేహంలేదు.
    
    చాలాసేపు వాళ్ళనే చూస్తూ వుండిపోయాను. ఆమె ఏదో అంటూంది. అతడు నవ్వుతూ చెబుతున్నాడు. ఆ అమ్మాయి కూడా నవ్వుతూంది.
    
    మా ఇంటిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యం కనపడదు. బరువు బాధ్యతలు, ఒక నిర్దుష్టమైన గమ్యం, మా తల్లీ కొడుకుల్ని ఇలాటి ఆనందాలకీ, సంతోషాలకీ దూరం చేశాయి. మా మొహాల్నుంచి చిరునవ్వుని శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు నాకు వందగజాల దూరంలో తన స్వంత సంసారంతో సుఖం అనుభవిస్తున్నాడు.

 Previous Page Next Page