"దీపశిఖ, నందిని- వాళ్ళే కదా ఆ పత్రికా రిపోర్టర్ కి నా రహస్యాల్ని చెప్పింది."
"ఏం శిక్ష వేశావ్?"
"కురూపుల్ని చేశాను."
"ఎలా?"
"భైరవుడ్ని ప్రయోగించాను- ఇక వాళ్ళు జీవితాంతం అలా బతకాల్సిందే. శత్రువు చావకుండా ప్రతీక్షణం నరకం అనుభవించడం నాకు యిష్టం."
భైరవుడు అంటే కుక్క అని అర్థమైంది. కానీ కుక్కని ప్రయోగించి అమ్మాయిల్ని ఎలా కురూపుల్ని చేశాడు? ఇక వివరణ జోలికి పోలేదు చలపతిరావు. రాఘవానందకు తెలియని విద్యంటూ లేదు.
"ఇక మిగిలింది ఆ తనూజ ఒక్కటే. దాని విషయమూ తొందరగా తెల్చేస్తాను- ఇంతకీ అనూహ్యను ఏం చేయదలిచావ్?"
తను అనూహ్యవల్ల, ఆమె అన్నయ్యవల్ల ఎంత అవమానం పొందిందీ మొదటిసారి అక్కడికి వచ్చినప్పుడు చలపతిరావు చెప్పాడు.
"దానికి పెళ్ళి" చలపతిరావు తన పథకాన్ని వివరించే ముందు ఉపోద్ఘాతంలా చెప్పాడు.
"ఎప్పుడు!"
"రెండు నెలలుంది"
"పెళ్ళికొడుకెవరు?"
"నా కొడుకు కానప్పుడు ఇక ఎవరైనా ఒకటే. ఎవడో లెక్చరర్ అట."
"మరి వాళ్ళిద్దరికీ చేతబడి చేసెయ్యమంటావా?"
"ఒద్దొద్దు" కంగారుగా అన్నాడు చలపతిరావు.
"మరిక ఏం చేద్దాం?"
"దానికి ఓ ప్లాన్ వుంది"
"ఏమిటి?"
"నా కొడుకును కాదన్నందుకు నేనెంతగా అవమానంతో కుమిలిపోయానో ఆ అన్నాచెల్లెళ్ళిద్దరూ అంతే అవమానంతో జీవితాంతం కృశించిపోవాలి"
"దానికి ఏం చేయాలంటావ్?"
"ఆ పిల్ల పెళ్ళి వచ్చే నెల ముప్పై ఒకటి తెల్లవారుజామున నాలుగు గంటలకి. ముప్పయ్యవ తేదీ రాత్రి అది మరో యువకుడితో గడపాలి. అంటే పెళ్ళి ముందు రోజు రాత్రి దానికి వేరేవాడితో శోభనం అన్నమాట."
"అది శోభం చేసుకుంటే మనకేమిటి లాభం?"
"ఆ శోభనమే దాని బతుకులో చీకట్లు నింపేది. అది వేరే యువకుడితో ఆ రాత్రి గడపడాన్ని మనం ఫోటోలు తీస్తాం. ఆ విషయం దానికి తెలియదు.
తెల్లవారుజమున ముహూర్తం అప్పుడు వధూవరులమీద చల్లడానికి ఆహుతులందరికీ అక్షింతలు ఇస్తారు. మన వాళ్ళు ఆ అక్షింతలతోపాటు ఆ పిల్ల నగ్న ఫోటోలు పంచుతారు. బంధువులంతా అసహ్యించుకుని వెళ్ళిపోతారు.
పెళ్ళికొడుకు ఆ చెడిపోయిన దానిని పెళ్ళి చేసుకోనని వుడాయిస్తాడు. పెళ్ళి ముందురోజు రాత్రి వ్యభిచరించిందన్న ముద్రపడిన ఆ పిల్ల ముఖం అప్పుడు ఎలా వుంటుందో ఊహించు" ఎఫెక్ట్ కోసం అన్నట్టు ఆగాడు చలపతిరావు.
తాను దీపశిఖకు, నందినికీ వేసిన శిక్ష కంటే ఇది మరింత క్రూరంగా అనిపించింది రాఘవానందకు.
"శెభాష్- మంచి ప్లాన్ వేశావు" ఆయన చలపతిరావును మెచ్చుకున్నాడు.
"ప్లాన్ ఓ.కే. కానీ ఆ పిల్ల పెళ్ళి ముందురోజు రాత్రి వేరే యువకుడితో వ్యభిచరించాలి కదా. ఆ పిల్ల అట్లాంటి ఇట్లాంటి అమ్మాయి కాదు. అనుభవం కన్నా, అనుభూతి ముఖ్యమనుకునే గొప్ప ఈస్థటిక్స్ వున్న అమ్మాయి. చదువుకున్నది, సంస్కారం వున్నది. అల్లరి చిల్లర పిల్లకాదు. అలాంటి అనూహ్య వేరే యువకుడితో- అదీ పెళ్ళిరోజు ముందు రాత్రి ఓ అబ్బాయితో గడుపుతుందా? అదీ ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం."
అతని మాటలు విని రాఘవానంద నవ్వాడు తప్ప పెదవి విప్పలేదు.
"బలవంతంగా ఎత్తుకొచ్చి విషయం కాస్తంత కానిచ్చేటట్లు చేద్దామంటే కుదరదు. మా అల్లుడు అంగబలం, అర్థబలం వున్నవాడు. పోనీ ఏదో రిస్కు తీసుకుని చేద్దామంటే అప్పుడది రేప్ అవుతుందిగానీ శోభనం కాదు.
దానంతట అది అతి ఇష్టంగా ఓ అబ్బాయితో గడపాలి. ఫోటోలు చూస్తే ఆ విషయం అందరికీ అర్థం కావాలి. అదీ నాక్కావలసింది."
అప్పటికీ మాట్లాడలేదు రాఘవానంద.
"ఈ ప్లాన్ లో వున్న ఏకైక రిస్కు అదే వ్యభిచరించే ఉద్దేశ్యం లేని అమ్మాయిని ఇష్టంగా ఓ యువకుడితో గడిపేటట్లు చేయడం, అదీ రెండు నెలల్లో."
ప్రకృతి సైతం ఈ పథకాన్ని భయం భయంగా వింటున్నట్టు నిశ్శబ్దం ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని ఆవహించింది.
"అలానే" అంతకుమించి ఒక్కమాట కూడా చెప్పలేదు రాఘవానంద.
గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయిని రెండునెలల్లో పెళ్ళి ముందురోజు రాత్రి ముక్కూ ముఖం తెలియని ఓ అబ్బాయితో గడిపేటట్టు చేయడం సంభవమా?
చేస్తానంటున్నాడు ఆ మంత్రగాడు. ఎలా చేస్తాడు?
ఆ మాటే అడిగాడు చలపతిరావు.
రాఘవానంద తల పైకెత్తి ఆకాశం వంక చూస్తూ చెప్పాడు-
"వశీకరణ విద్య ప్రయోగిస్తాను"
దూరంగా ఎక్కడో పాము పట్టుకోడంతో హృదయ విదారకంగా అరుష్తోంది ఓ కప్ప.
సాయంకాలం దీపాలను తన సిగలో పువ్వుల్లా సింగారించుకున్నట్టు సిటీ మెరిసిపోతోంది. రోడ్లమీద వాహనాలు నదిలో వదిలిన కార్తీకదీపాల్లా మెల్లగా కదులుతున్నాయి. పేవ్ మెంట్ల మీద రంగు కాగితాలను వేలాడదీస్తే, అవి గాలికి ఊగుతున్నట్టు జనం వస్తూ పోతున్నారు.
ఒకప్పుడైతే చంద్రహాస్ రాత్రి మేల్కొన్నట్టు వుండే ఇలాంటి సందర్భాలను బాగా ఎంజాయ్ చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం వీటిని భరించలేని స్థితికి చేరుకున్నాడు బాధ తప్ప అతని మనసు దేనినీ ఆహ్వానించడం లేదు. రోడ్ల పక్కనున్న ఎర్రటి దీపాలు పచ్చటి బతుకుల్ని మాడ్చేసే విషపు జంతువుల కనుగుడ్లలా వున్నాయి.
హడావుడిగా నడిచే మనుషులు పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంటూ వెళితే ఏదో దొరుకుతుందన్న ఆశైనా వుంది. అతనిలో అదీ లేదు.
తను తప్ప జనమంతా హ్యాపీగా వున్నట్టు అనిపిస్తోంది. తనకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాదు. ఆ కష్టం తన బతుకుని కాల్చేసింది. ఆనందాన్ని మింగేసింది. రక్తంతో విచ్చుకునే గుండెను బూడిద పేటికగా మార్చేసింది. ఈ అగ్నిని ఆర్పడానికి ఫెయిర్ ఇంజన్లలా తన కళ్ళు ఎప్పుడూ వర్షిస్తూనే వుంటాయి.
అయితే ఆ కన్నీళ్ళకు గుండెల్తో ఎగిసే మంటలు చల్లారడం లేదు. అతను అనాలోచితంగా కళ్ళను తుడుచుకున్నాడు. చెమ్మగా తగిలింది అక్కడ. అతని బాధను పరామర్శించడానికి ఎప్పుడూ వచ్చే బంధువులు కన్నీళ్ళే. కళ్ళల్లో నీటిపొర అడ్డం రావడం వల్ల దారిసరిగా కనిపించడం లేదు అందుకే కారు స్పీడ్ ను తగ్గించాడు.
"అయ్యో! వెనకబడిపోతున్నావ్- ఇప్పుడైనా పరుగు లంకించుకో" అని హెచ్చరిస్తున్నట్టు వెనక వస్తున్న వాహనాలు హారన్లతో హెచ్చరిస్తున్నాయి. తన ఓటమిని ఒప్పేసుకున్నవాడిలా అతను తన కారును మరింత స్లో చేసి వాటికి దారిచ్చాడు.
పేవ్ మెంట్ మీద ఎవరెవరో ఒక జంట తమ పాప వచ్చీరాణి నడకలతో నడుస్తుంటే ఆశ్చర్యం, ఆనందం తమ రెండు కళ్ళు అయినట్టు చూస్తున్నారు.
అతను ఆ దృశ్యాన్ని చూడలేక ఠక్కున పక్కకు ముఖం తిప్పేసుకున్నాడు.
గుండె మరింత బరువెక్కింది. బాధ కళ్ళల్లోకి తన్నుకొచ్చేసినట్టు నీళ్ళు ఊరాయి.