Previous Page Next Page 
రాక్షసుడు పేజి 19


    "నిజానికి మీ పక్కనే వుండి లోహియాకి కావలసిన విధంగా రిపోర్టు సంపాదించి పెట్టటమే నా ఆశయం. ఇవిగో ఈ రెండు రిపోర్టులూ చూడండి. ఒకటి మా లిమ్నాలజీ డిపార్టుమెంటు వాళ్ళు ఇచ్చింది. దీని ఆధారంగా మన పరిశోధనలు సాగించాలి. ఇదిగో యిది రెండో రిపోర్టు. లోహియా తయారుచేసింది. డి-ఆలమ్ తప్ప మానవజాతిని రక్షించేది మరొకటి లేదని ఈ రిపోర్టు ఉవాచ. దీనిమీద మీ చేత సంతకం పెట్టించుకోవటం కోసమే ఇన్నాళ్ళూ మీ వెంట వున్నాను. కానీ నాకన్నా తారకేశ్వరి పెద్దయెత్తు వేస్తుందని నేను వూహించలేదు" అతడు ఆగాడు. కిటికీలోంచి చాలాసేపు బయటకు చూసేడు. నెమ్మదిగా వెనుదిరిగి అన్నాడు.

 

    "కానీ ఇప్పుడు అనిపిస్తూంది- ప్రజల భవిష్యత్తుతో, ప్రజల ఆరోగ్యంతో ఆడుకొనే అధికారం మనకేముంది" ఒక నిశ్చయానికి వచ్చినట్టు అతడి స్వరం స్ఫుటంగా పలికింది.

 

    "మీరు ఉన్న యదార్థాన్ని ఉన్నట్లుగానే రిపోర్ట్ ఇవ్వండి డాక్టర్! ఒక లిమ్నాలజీ ప్రొఫెసర్ గా, మీ అభిప్రాయాని నిర్మొహమాటంగా చెప్పండి" అతడు ఆగాడు. "దీనివల్ల నా తండ్రి మండిపడతాడు. లోహియా పగ తీర్చుకుంటాడు, ఇక రామ్మూర్తి సంగతైతే చెప్పనవసరం లేదు.... అయినా- అయినా సరే మీరు మామూలుగానే రిపోర్టు ఇవ్వండి".

 

    "నాకర్థంకాని విషయం ఒకటి మిగిలిపోయింది".

 

    "అడగండి డాక్టర్"

 

    "శత్రు గృహంలోకి అంతటా దూసుకుపోయిన నిన్ను వాళ్ళేమీ చెయ్యలేదేం?"

 

    అతడు జేబులోంచి పిస్టల్ తీశాడు. "మా అండర్ గ్రౌండ్ ప్రపంచాన్ని ఈ మూడు అంగుళాల వస్తువు శాసిస్తూంది ప్రొఫెసర్! నాకు ఏదైనా అపాయం జరిగిందని తెలిసిన మరుక్షణం నా అసిస్టెంట్ రాబోట్- రాబోట్ వరకూ ఎందుకు- వాణి చాలు. శత్రువుల్ని ఖండఖండాలుగా నరికివేస్తారు. మీకు చదరంగం ఆట తెలుసా? రాజు చావడు. కేవలం బంట్లని చంపుకుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరు మీ పనిలో నిమగ్నమవండి డాక్టర్. సాయంత్రానికి రిపోర్టు కావాలి- అది ఏదయినాసరే ప్రజలకి మంచి జరగటం కోసం-"

 

    ఫాస్టస్ అతడి దగ్గరికి వచ్చి ఆర్థ్రమైన కళ్ళతో చూశాడు- "దేశం కాని దేశంలో ఒక మారుమూల ప్రదేశంలో ప్రజలకోసం, తన నగరం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం నిజాయితీగా తపించే ఒక మనిషిని కలుసుకుంటానని, నేను బుయల్దేరినప్పుడు ఊహించలేదు. దీనివల్ల నువ్వు యెన్ని కష్టాల్లో ఇరుక్కుంటావో రాక్షసులకన్నా భయంకరమైన ఎంత మందికి మరింత శత్రువ్వి అవుతావో నేను ఊహించగలను. నీ నుంచి నాకు స్ఫూర్తి కలుగుతోంది. అదే స్ఫూర్తితో సాయంత్రానికి రిపోర్టు తయారుచేస్తాను, నీ ప్రజలకి మేలు కలిగేలా-" ఆవేశంగా అన్నాడు. "ఆ అనాలిసస్ కాగితాలన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళు".

 

    అతడు తలూపి, "సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను. ముఖ్యమంత్రి మీ రిపోర్టు యిచ్చేముందు ముఖ్యమైన పాయింట్లు ప్రెస్ కి చెబుదురుగాని, సో దట్... ఇంకెవరూ ఈ రిపోర్టుని మార్చలేరు" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

 

                                                          *    *    *

 

    అయిదు గంటలు కావొస్తూంది.

 

    అదే హోటల్ లో... మీటింగ్ హాలు రిపోర్టర్ లతో కిటకిటలాడుతూంది.

 

    ముఖ్యమంత్రి యింకా ఇంటి దగ్గర్నుంచి బయల్దేరలేదు.

 

    అయిదవటానికి పావుగంట వుందనగా లోహియా కారు వచ్చి ఆగింది. గుమ్మం దగ్గర నిలబడివున్న 'అతడిని' చూసి లోహియా, మరెవరూ గమనించకుండా నవ్వేడు. పని పూర్తి అయిందా అన్న ప్రశ్న వుంది ఆ నవ్వులో. అతడు నవ్వలేదు. రాబోట్ వైపు చూసేడు. ఒకవేళ రిపోర్టులో "డి అలమ్" నిజంగా ప్రమాదకరమైందని తేలితే ఆ ఆవేశంలో బి.పి. ఎక్కువై లోహియా అక్కడికక్కడే 'అతడిని' కాల్చెయ్యకుండా రాబోట్ సిద్ధంగా వున్నాడు.

 

    4-49 కే జి.కె. కారు దిగాడు. కొడుకు వైపు, ఫోటోలు తీసుకున్నావా అన్నట్టు చూశాడు. అతడి తండ్రికి లోపలికి వెళ్ళటానికి దారి చూపించాడు.

 

    అయిదుకి ఇంకా అయిదు నిముషాలు వుందనగా ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయల్దేరినట్టు కబురొచ్చింది.

 

    ప్రెస్స్ సర్కిల్స్ లో చాలా ఉద్వేగం కనబడుతూంది. లోహియా, జి.కె. ఒకే మీటింగ్ కి రావటం.... అంతా హడావుడిగా వుంది.      

 

    అయిదవటానికి ఇంకొక్క నిముషం వుంది. ఫాస్టస్ ఇంకా రాలేదు. ఉండేది అదే హోటల్ కాబట్టి అతడు లిఫ్టు ఎక్కి ఫాస్టస్ దగ్గిరకి వెళ్ళాడు.

 

    గది తలుపు తెరిచి-

 

    "ముఖ్యమంత్రి వస్తున్నారు ప్రొఫెసర్. మీరు కూడా వస్తారా" అన్నాడు.

 

    ఫాస్టస్ మాట్లాడలేదు.

 

    అతడు దగ్గిరకి వెళ్ళి "డాక్టర్ ఫాస్టస్" అని పిలిచాడు. జవాబు లేదు. భుజంపైన చెయ్యివేసి ఇంకొకసారి పిలవబోతూ వుండగా-

 

    ఫాస్టస్ ముందుకు తూలిపోయాడు. అతడు వీపులో కత్తి దిగబడి వుంది. ప్రాణం పోయి చాలాసేపు అయింది.

 

    బల్లపైన రిపోర్టు కాగితాలు లేవు.

 

    ఒక అయిదు రూపాయల స్టాంపు పేపరు వుంది.

 

            "ఈ హత్య చేసింది నేనే"

 

    అని దానిమీద వ్రాసి వుంది. కింద బొటన వేలి ముద్రవుంది. అది చాలదన్నట్టు దాని మీద పూర్తి సంతకం కూడా వుంది-

 

    "వంకచెక్కా రామ్మూర్తి" అని.

 

    ..................

 

    అప్పుడు అతడు పెట్టిన కేకకి ఆ గది గోడలు కదిలాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెదరకుండా, సీరియస్ గా వుండే అతడు ఆ క్షణం రాక్షసుడే అయ్యాడు.

 

    అప్రయత్నంగా ఆ స్టాంపు పేపరు వెనుక వైపు చూసేడు.

 

    చిన్న అక్షరాలతో "చదరంగంలో చచ్చేది పావులే రాజులు కాదు" అని వ్రాసి వుంది.

 

    అతడు దాన్ని తీసుకుని మెట్లు దిగాడు.

 

    ఇంతకు ముందంత ఆవేశం లేదు.

 

    అవును. చదరంగంలో చచ్చేది పావులే. ఏ పావుని చంపాలి?

 

    ఇది జరిగిన పది నిముషాలకి అతడు కారు కీచుమని శబ్దం చేసుకుంటూ పోలీసు స్టేషన్ ముందు ఆగింది. అతడు వడివడిగా లోపలికి వెళ్ళాడు. అతడి మొహం ఆవేశంతో- అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలా వుంది. 

 Previous Page Next Page