Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 20


    ముఖ్యమైన ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని కంపెనీలోని అన్ని విభాగాలూ చూపించటం, అక్కడున్న ఇతర ఉద్యోగస్తుల్ని పరిచయం చేయటం కల్నల్ కి అలవాటు.

 

    అలాగే ఆరోజు ఫణిని వెంటబెట్టుకుని బయల్దేరాడు.

 

    మొదట సెక్రటరీ విజయకుమారిని పరిచయం చేశాడు. ఆఫీసంతా చూపిస్తూ మేనేజర్ని, ఇతర ఉద్యోగుల్ని పరిచయం చేశాడు. తర్వాత లేబొరేటరీలోకి తీసుకెళ్ళాడు.

 

    ఒకచోట పెద్ద మెషిన్ లో పౌడరు టాబ్లెట్లుగా మారిపోతోంది. అవన్నీ బాటిల్స్ లోకి ఎక్కిపోతున్నాయి.

 

    ఓ గదిలో ఎప్రాన్ వేసుకున్న స్త్రీలు ఎవరిసీట్లలో వాళ్ళు కూర్చునివున్నారు. వాళ్ళ ముందున్న కన్వేయర్ బెల్టు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. దానిమీద బాటిల్స్ ప్రయాణం చేస్తున్నాయి. వాళ్ల దగ్గరకు రాగానే అవి అందిపుచ్చుకుని లేబిల్స్ అంటించి ప్రక్కన పెట్టేస్తున్నారు. మరికొందరు యూనిఫారంలో వున్న స్త్రీలు వచ్చి అవి తీసుకుని అప్పటికప్పుడు ప్యాక్ చేస్తున్నారు.

 

    వేరొకచోట ఇంజక్షన్ యాంపుల్స్ తయారౌతున్నాయి.

 

    మరోచోట చిన్న ప్రెస్సులాంటిది వుంది. అందులో లేబిల్స్ ప్రింటు అవుతున్నాయి.

 

    చివరకు పరిశోధనా విభాగంలోకి తీసుకువెళ్ళాడు. ఎక్కడికక్కడ అద్దాలు బిగించివున్న గదులు, ఎవరి కంపార్టుమెంటు వారికి వున్నట్లు చిన్నచిన్న అరల్లాగా ఏర్పరిచి వున్నాయి. ప్రతివారిముందూ ఒక మైక్రోస్కోప్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఆ అరలో బిగించివున్న తలుపులాంటిది ప్రక్కకి నెట్టి మాట్లాడుకుంటే తప్ప లేకపోతే మూగ సౌంజ్ఞలులాగానే వుంటాయి.

 

    శైలజ నిన్ననే పరిచయం అయినట్లు లెక్క.

 

    రీసెర్చి విభాగంలో వున్న సీనియర్ సైంటిస్టు మిస్ చూడామణిని పరిచయం చేశాడు.

 

    ఫణి నమస్కారం చేసినప్పుడు ఆమె చాలా యాంత్రికంగా ప్రతినమస్కారం చేసింది.

 

    చూడామణికి ముప్పయి అయిదేళ్ళ వయసుంటుంది. చామనఛాయ, బిగువైన శరీరం. కానీ ఆ బిగువులో ఆకర్షణ కన్నా పటుత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అందమైన ముఖమే, కాని ముఖంలోని కఠినత్వం ఆ అందాన్ని కప్పేస్తుంది.

 

    కొంతమందిని చూస్తే ప్రేమించబుద్దేస్తుంది, కొంతమందిని చూస్తే గౌరవించబుద్ధేస్తుంది, కొంతమందిని చూస్తే భయంవేస్తుంది.

 

    ఫణికి చూడామణిని చూడగానే అలాంటి భయం కలిగింది.

 

    కల్నల్ అతనికి సీటుచూపించి, చెయ్యవలసినపనిని గురించి పది నిముషాలు మాట్లాడి, అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

 

    ఫణి తన సీట్లో కూర్చున్నాడు. ఎందుకో గుండెలో అదురుగా ఉంది, భీతిగా వుంది. ప్రక్క కంపార్టుమెంటులో శైలజ మైక్రోస్కోపులో చూస్తూ స్లైడ్ ని అటూ యిటూ కదిలిస్తోంది. ఎడమవైపు చూశాడు. చేతిలోని గ్లాస్ రాడ్ ని అటూఇటూ త్రిప్పుతూ చూడామణి. ఇద్దరిమధ్యా తను ఇరుక్కున్నాడు. మెల్లిగా తేరుకుని టేబిల్ మీద పరిచివున్న ఒక్కొక్క బాటిల్ ని పరిశీలించసాగాడు.

 

                                                                 *    *    *

 

    మధ్యానం ఒంటిగంటయింది. లంచ్ అవర్. అక్కడినుంచో బెల్ మ్రోగింది. అందరూలేచి బయటకు వెడుతున్నారు.

 

    ఆ గదుల్లో చివరికి చూడామణి, ఫణి, శైలజా మిగిలారు.

 

    "ఈవిడ బయటకు వెళ్ళదేం? భోంచెయ్యదా? ఆకలి లేదా? అసలావిడకు అలాంటివి ఉండవా?"

 

    శైలజవంక చూశాడు. మైక్రోస్కోప్ ని దూరంగా జరిపి టేబిల్ మీద చేతులు ఆనించి ఆలోచిస్తున్నట్లు కూర్చుంది. తనవైపు చూడటంలేదు.

 

    తనేం చెయ్యాలి? బయటకు వెళ్ళాలా? ఇక్కడ వుండాలా? బయటకు వెడితే శైలజతో మాట్లాడటం ఎలాగ?

 

    ఏమయితే అదయిందని మొండికేసి, పనిలో నిమగ్నమైపోయినట్లు నటిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు.

 

    అయిదు నిముషాలయినాక చూడామణి లేచింది. ఇద్దరివంకా ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోయింది.

 

    "హమ్మయ్య!" అని ఫణి ఊపిరి పీల్చుకున్నాడు. అటూఇటూ చూసి నెమ్మదిగా ఇద్దరిమధ్యా వున్న అద్దాల తలుపుని ప్రక్కకి త్రోశాడు. ఏదో తప్పు చేస్తున్నట్లు గుండె దడదడమని కొట్టుకుంటోంది.

 

    "శైలూ!"

 

    ఆమె తలత్రిప్పి ఇటువైపు చూసింది. కళ్ళల్లో ప్రేమ, బెదురు.

 

    "ఫణీ! ఇలా ఎందుకు చేశావు?"

 

    "ఎలా?"

 

    "ఇక్కడికే వచ్చి ఎందుకు చేరావు?"

 

    "నీ కోసం."

 

    "కానీ ఇక్కడి రూల్సు అన్నీ క్షుణ్ణంగా నీకు తెలుసు. మనం కలుసుకోటానికి వీల్లేదు, స్వేచ్చగా మాట్లాడుకోవటానికి వీల్లేదు."

 

    "అయినా నువ్వు కనిపిస్తావుగా కళ్ళెదురుగా."

 

    "ఎదురుగా కనిపిస్తూ దూరంగా వుండటం బాధాకరం కాదా?"

 

    "దూరంగా వుండి కనిపించకపోవటంకంటే తక్కువ బాధాకరం."

 

    "ఫణీ!"

 

    "ఊ"

 

    "నీ ఆరోగ్యం బాగుందా?"

 

    ఫణి నవ్వాడు. "మనసు బాగుండకపోయినా ఆరోగ్యం చెక్కుచెదరదని రుజువు చేశాను."

 

    "కాదు. నువ్వు చిక్కావు."

 

    "నీ కంటికి."

 

    "ఫణీ! అక్కడి పరిస్థితులెలా వున్నాయి?"

 

    "చెల్లాచెదురుగా వున్నాయి. మనమే వాటిని చక్కపరచాలి."  

 

    "నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు మా అత్తయ్యవాళ్ళకు తెలీదుగా?"

 

    "తెలీకుండా ఇంతవరకూ జాగ్రత్తపడ్డాము. ఇహముందు కూడా బయటపడకూడదు."

 

    "అమ్మో! తెలిస్తే ఇంకేముంది?"

 

    "శైలూ! నా అదృష్టం, నీ యిల్లుకూడా నా యింటికి ఎదురుగానే ఉంది.

 Previous Page Next Page