Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 21


    "కానీ అదే ఎక్కువ చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని భయంగా వుంది ఫణీ!"

 

    "ఎందుకని?"

 

    "ఎందుకంటే....." శైలజకు తమ పాత సంభాషణలు జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది. "ఎప్పుడూ ఎదురెదురుగా ఉంటాం కాబట్టి."

 

    "అంతేనంటావా?" అన్నాడు ఫణి నిరాశగా.

 

    "ఫణీ! మనమిలా ఎక్కువసేపు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే బాగుండదు, చూడామణి వచ్చేస్తుంది."

 

    "ఇప్పుడేగా బయటకు వెళ్ళింది! అప్పుడే లంచ్ పూర్తయిపోతుందా?"

 

    "ఆవిడ లంచ్ అలాంటివేం ఇక్కడ తీసుకోదు. ప్రొద్దున్నే పూర్తిచేసుకుని వస్తుందనుకుంటాను, ఏ బాత్ రూంకో వెళ్ళివుంటుంది."

 

    "సరే, అయితే నేనూ బయటకు వెళ్ళివస్తాను. శైలూ! ఒక్కసారి నిన్ను ముట్టుకొనియ్యి" అతను గ్లాస్ ఛాంబర్ విండోలో తనచేతిని ఉంచాడు. ఆమె తనచేతిని అతని చేతిలో వుంచింది. ఆమె వ్రేళ్ళు మృదువుగా పట్టుకున్నాడు.

 

    ఒళ్ళు పులకించినట్లు....విద్యుత్ ప్రవహించినట్లు ఎంత హాయిగా వుంది!

 

    ఇద్దరూ మైమరచి వున్నట్లు ఉండిపోయారు.

 

    అలా రెండే రెండునిముషాలు ఎక్కడో ఏదో తలుపు తెరుచుకున్నట్లయింది.

 

    ఇద్దరూ ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాగేసుకున్నారు. గ్లాస్ ఛాంబర్ విండో మూతపడిపోయింది.

 

    ఫణి లేచి బయటకు వచ్చేశాడు.

 

    లంచ్ కోసమని రెండుమూడు వందలమంది పట్టే పెద్దహాలు వుంది. క్యారియర్లు తెచ్చుకున్నవాళ్లు అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నారు. అదికాకుండా వేరే క్యాంటీన్ వుంది. ప్రొద్దుటే లంచ్ తీసుకుని వచ్చినవాళ్ళు అక్కడ టిఫిన్ తీసుకోవటమో కాఫీ, టీలాంటివి తీసుకోవటమో చేస్తున్నారు.

 

    ఫణికి కాఫీ త్రాగాలనిపించింది. కౌంటర్ దగ్గరకెళ్ళి కూపన్ తీసుకుని కాఫీ తెచ్చుకుని ఓ టేబుల్ దగ్గరకెళ్ళి కూర్చున్నాడు.

 

    అంతా క్రొత్తవాళ్ళు. ఆఫీసులో కల్నల్ చే పరిచయం చేయబడ్డవారు తప్పితే ఒక్కరుకూడా తెలిసినవాళ్ళు లేరు. ఇంతలో అతనికెదురుగా ఓ యువకుడు వచ్చి కూర్చున్నాడు. ఇరవైనాలుగు, ఇరవై అయిదేళ్ళుంటాయి. ఫణి యధాలాపంగా అతని మొహంలోకి చూసేసరికి పలకరింపుగా నవ్వాడు. కొంచెం చొరవ వున్నవాడిలా కనిపించాడు.

 

    "మీరు ఇవాల్టినుంచే డ్యూటీలో జాయిన్ అయినట్లున్నారు కదూ?"

 

    ఫణి "అవును" అన్నట్లు తల ఊపాడు.

 

    "రీసెర్చి డిపార్టుమెంటా?"

 

    "అవును."

 

    "మీ పేరు?"

 

    ఫణి చెప్పాడు.

 

    ఆ యువకుడు తనపేరు రామకృష్ణ అని పరిచయం చేసుకున్నాడు. ఆఫీసులో ఎకౌంట్సు సెక్షన్ లో పనిచేస్తున్నాడు. అతనిది ఈ ఊరే. వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబమంతా ఎప్పటినుంచో ఈ ఊళ్ళోనే వుంటున్నారు. అందుకని కాలనీలో వుండటంలేదు. రోజూ సువేగామీద కంపెనీకొచ్చి సాయంత్రంపూట ఇంటికి వెళ్ళిపోతూ వుంటాడు.

 

    "శైలజ మీ డిపార్టుమెంటే కదూ?"

 

    "అవును. నా పక్క కంపార్టుమెంటులోనే ఉంటుంది."

 

    రామకృష్ణ అభినందిస్తున్నట్టు చూశాడు "ఎంత అదృష్టం!"

 

    "ఏం?"

 

    "ఆమె ఈ కంపెనీలో పనిచేసే అందరి ఆడవాళ్ళలోకీ అందగత్తె. రియల్ బ్యూటీ! మెడమీది ఆ పుట్టుమచ్చ ఎంత న్యాచురల్ గా ఉంటుంది! ఇంకా...."

 

    "ఇంకా ఏం వర్ణిస్తాడో? ముఖం, మెడతో ఆపితే బాగుండును!" ఫణి వళ్ళు మండుతోంది.

 

    "నాకేం అంత గొప్పగా కనిపించలేదే."

 

    "నిజంగానా? ఆశ్చర్యంగా వుందే! అందరూ ఆమె నడుస్తూంటే కళ్ళప్పగించి చూస్తారు. ఆ నడక వుంది చూశారూ...."

 

    మళ్ళీ వర్ణనలోకి వస్తున్నాడు.

 

    "ఆడవాళ్ళందరూ అలాగే నడుస్తారండీ కావాలని-" అన్నాడు ఫణి.

 

    "అమ్మమ్మా! అలా అనకండి. ఈ కేసు వేరండీ..."

 

    "ఏమిటీ? కేసూ గీసూ అంటున్నారు?"

 

    "మీరామెతో మాట్లాడారా?"

 

    "ఆఁ ఏదో కొద్దిగా డ్యూటీమీద."

 

    "గొంతుకూడా బాగుంది కదూ!"

 

    ఫణి కాఫీ త్రాగటం పూర్తయిపోయింది. "వస్తాను" అని లేచి బయటకు వెళ్ళిపోయాడు.

 

    రామకృష్ణ మాటలే చెవుల్లో మ్రోగుతున్నాయి. అతను మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడోనని, కాసేపు అటూ ఇటూ తచ్చాడి, తర్వాత తన విభాగానికి వెళ్ళిపోయాడు.

 

    ఫణికి ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎదురుగుండా పెట్టుకుని ఈ స్తబ్దతను భరించడం ఎలా?

 

    అర్థరాత్రి రెండుగంటల వేళ తలుపులు తెరుచుకుని ఇవతలకు వచ్చాడు. బయట నుంచుని ఆమె ఇంటికేసి చూశాడు.

 

    మెల్లిగా వెళ్ళి తలుపుతడితే? తీస్తుంది. గభాలున లోపలకు దూరితే? ఎవడికి తెలుస్తుంది? అంతా గాఢనిద్రలో వుండివుంటారు. ఎంత నిశ్శబ్దం? పౌర్ణమిరోజులు కాబట్టి కాటేజీలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

    ఒక అడుగు ఇవతలకు వేశాడు. గుండె దడదడమని కొట్టుకుంటోంది. లోపల్నుంచి ఆవేశం ఉరకలు వేస్తోంది. ఇంకో అడుగు....

 

    ఎక్కడినుంచో గుండెల్ని చీలుస్తున్నట్లు కుక్క మొరుగుడు వినిపించింది. చప్పున బాల్కనీలోకి వచ్చి నిలబడి, ఆ శబ్దం వచ్చినవైపు చూశాడు. సింహాల్లాంటి రెండు అల్సేషియన్ డాగ్స్ ఇటుకేసే నడచివస్తున్నాయి. లోపలకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుందామా అనుకున్నాడు. తనేం అపరాధం చేశాడని? చూద్దాం ఏం జరుగుతుందోనని, ధైర్యంతో అలాగే నిలబడ్డాడు.

 

    ఆ కుక్కలు దగ్గరకు వచ్చాయి. ఫణిని చూసి అతనికెదురుగా ఆగాయి. అతని ముఖంలోకి చూస్తూ పరిశీలిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు, శాసిస్తున్నట్లు నిటారుగా నిలబడ్డాయి.

 Previous Page Next Page