Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 19


    ముప్ఫయినాలుగో నంబరు కాటేజి బాల్కనీలో నిలబడ్డ శైలజ అతనివంక అలాగే చూస్తోంది కళ్ళప్పగించి.

 

    నలభయి మూడోనంబరు కాటేజి బయట నిలబడ్డ ఫణి అదే స్థితిలో వున్నాడు.

 

    వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అయినా బయటకు తెలియటానికి వీల్లేదు.

 

    పరాయివారిగా....పరాయివారిలాగా.....ఎంతసేపు గడిచిందో తెలీదు.

 

    ప్రక్క కాటేజీలోంచి కుక్క భౌ భౌమణి మొరిగింది. ఎవరో ఇటువైపు నడిచి వస్తున్నారు.

 

    శైలజ ఉలిక్కిపడి, అతనివంక దీనంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది.

 

    తలుపు మూతపడింది.

 

                                               7

 

    ఉదయం ఆరుగంటలయింది.

 

    కల్నల్ సంజీవరావు రోజూ అయిదు గంటలకే నిద్రలేస్తాడు. పదినిముషాలు చకచక వ్యాయామం చేస్తాడు. తర్వాత అయిదునిముషాల్లో షేవ్ చేసుకోవటం ముగించి, ఇంకో పదినిముషాల్లో స్నానంకూడా చేసేసి, అప్పుడు చాపమీద కూర్చుని మెడిటేషన్ చేస్తాడు. అతను మూఢభక్తుడు కాదు. గుళ్ళూ గోపురాలకు కూడా పోడు. కాని మెడిటేషన్ అనేసి మానసిక వికాసానికీ, పరిపక్వతకూ, దృఢత్వానికీ, ఆరోగ్యానికి ఆయువుపట్టు అనీ, మనిషి అభ్యున్నతికి అది దోహదకారి అవుతుందని నమ్మినవాడు. ఈ మెడిటేషన్స్ లో ఎన్నో రకాలున్నాయి. మనసును ఏకాగ్రతను విడిచిపెట్టకుండా బంధించాలని ఒకరంటారు. వాళ్ళ సిద్దాంతం ప్రకారం ఇష్టదేవత నామం తప్పులేదు. ఆలోచనకు తావుండకూడదు. ఇంకొకరు మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించకుండా, ఆలోచనను అరికట్టకుండా స్వేచ్చగా వదిలేస్తే భావాతీత స్థితి ఏదో ఓ దశలో వస్తుంది. అదే సరయిన పద్ధతి అన్నారు. అదే ట్రాన్స్ న్ డెంటల్ మెడిటేషన్ అనేపేరుతో వ్యాప్తిలోకి వచ్చింది. ఈ పద్ధతిని ప్రచారంలోకి తీసుకువచ్చిన మహర్షి మహేష్ యోగి. ఈ భావాతీత ధ్యానం ఓ మతం కాదు-శాస్త్రం అన్నాడు. అది మనిషి పురోభివృద్ధికి ఉపయోగించే ఓ ప్రక్రియ మాత్రమేగాని దైవానికీ, మతానికీ సంబంధించింది కాదన్నాడు. కల్నల్ సంజీవరావుకు ఈ రకమైన ధ్యానంలో నమ్మకం కుదిరింది. కొన్ని సంవత్సరాలుగా నియమం తప్పకుండా కనీసం ఇరవై నిముషాలు చేస్తాడు. అలాగే సాయంత్రం వేళకూడా ఇంకో ఇరవైనిముషాలు చేస్తాడు. అ తర్వాత నాయర్ ఇచ్చిన టీ త్రాగి డాబామీదకు వెడతాడు.

 

    అతను పెళ్ళి చేసుకోలేదు. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. తల్లీ తండ్రీ ఎప్పుడో గతించారు. బంధువులెవరన్నా వున్నారో, లేదో తెలీదు గాని ఎప్పుడూ ఎవరూ అతని ఇంటికి వచ్చినట్లు కనబడరు.

 

    కల్నల్ బైనాక్యులర్స్ తీసుకుని డాబామీదకి వెళ్ళాడు.

 

    అప్పటికే ఎండ చాలావరకూ వచ్చేసింది.

 

    పిట్టగోడదగ్గర నిలబడి బైనాక్యులర్స్ కళ్ళదగ్గర పెట్టుకుని చూశాడు.

 

    అది చాలా శక్తివంతమైన బైనాక్యులర్స్. మిలిటరీలో వున్నప్పుడు ఆర్మీలో వున్న ఒక చీఫ్ ఆఫీసర్ దగ్గర్నుంచి దాన్ని సంపాదించాడు. ఎంత దూరంగా వున్న వస్తువయినా అందులోంచి చాలా స్పష్టంగా, దగ్గరగా కనిపిస్తుంది.

    ఈ కాలనీ తన సృష్టి.

 

    అతనికి ఆనందంగా వుంది. అతని పెదవులమీద చిన్ననవ్వు దొర్లింది.

 

    ఈ మనుషులంతా తన కనుసన్నలలో మెదుల్తున్నవారు. తను వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు.

 

    బైనాక్యులర్స్ లోంచి ఇళ్ళలోంచి బయటకు వస్తోన్నవాళ్ళు, పని పాటలు చేసుకుంటున్న వాళ్ళు, సంసార తాపత్రయంకొద్దీ ఏదో హడావుడి పడుతున్న వాళ్ళూ అతని దృష్టిని ఆకర్షిస్తున్నారు.

 

    అతనికి వాళ్ళనిచూస్తే జాలి. ఈ తాపత్రయాలకు అంతెక్కడ? ఇతరుల జీవితాలను చూస్తూకూడా మనుషులు అందులోనే ఎందుకు ఇరుక్కుపోతూ ఉంటారు? ఈ స్వేచ్చ, తృప్తి వీటిలోని సంతోషం వాళ్ళకెందుకని తెలియదు.

 

    అతని చేతిలోని బైనాక్యులర్స్ అన్నివైపులకూ కదుల్తోంది.

 

    ఈ కాలనీలో ఇంకో విశేషం వుంది. చుట్టూ కోటగోడవంటి గోడ వుంది. ఒకే ఒక్క రాజమార్గంలాంటి పెద్ద గేటు. ఆ గేటుదగ్గర షిప్టుప్రకారం కాపలా వుండే ఓ ఘూర్ఖా. కాలనీలో ప్రవేశించాలంటే ఆ గేటుతప్పితే వేరే మార్గంలేదు.

 

    అంతలో అతని దృష్టిపథంలోకి ఫణి వచ్చాడు. పైజమా, లాల్చీ వేసుకున్న ఫణి అతని ఇంటిముందు బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచించుకుంటున్నాడు.

 

    "చురుకైన కుర్రాడు" అనుకున్నాడు కల్నల్.

 

    ఎదురుగా వున్న ముఫ్పైనాలుగో నంబరు కాటేజి తలుపు తెరుచుకుంది. శైలజ బయటకి రాబోయి ఎదురుగా వున్న ఫణిని చూసి లోపలే ఆగిపోయింది. ఆమె బయటకువస్తే గాని బైనాక్యులర్స్ లో కనబడదు.

 

    ఆమె యివతలకు వస్తుందని ఆశగా చూసిన ఫణి నిరాశగా వుండిపోయాడు. ఏం జరిగింది? ఆమె ఎందుకని బయటకు రాలేదు?

 

    శైలజ లోపల్నుంచి ఏదో సౌంజ్ఞ చేస్తున్నట్లు కనబడింది. అతనికి మొదట అర్థంకాలేదు. ఏమిటి అంటోంది? రాత్రంతా తాను ఎంత బాధపడ్డాడో ఆమెకెలా తెలుస్తుంది?

 

    చివరకు ఏదో స్ఫురించి తల ప్రక్కకి త్రిప్పిచూశాడు. దూరంగా కల్నల్ గారి బంగళా. ఆ బంగళా డాబామీద బైనాక్యులర్స్ తో నిలబడ్డ కల్నల్ కనిపించాడు. గతుక్కుమన్నాడు. కల్నల్ తనని గమనిస్తూ వుండివుండాలి. ఏమీ కంగారు పడనట్లు, చాలా సాధారణంగా ఆలోచిస్తూ అక్కడ నిలబడి వున్నట్టు యాక్షన్ చేశాడు.

 

    ఇంతలో అటువైపునుంచి వస్తోన్న రాముడు కనిపించాడు. ఫణిని చూసి పలకరింపుగా నవ్వాడు.

 

    దగ్గరకు వచ్చి "ఏమిటి సార్ నిలబడ్డారు, కాఫీ తెచ్చిపెట్టమంటారా?" అనడిగాడు.

 

    "అవునోయ్! నీకోసమే చూస్తున్నాను" అన్నాడు ఫణి.

 

    లోపలకువచ్చి, డబ్బులు తీసుకుని రాముడు వెళ్ళిపోయాడు.

 

    కల్నల్ బైనాక్యులర్స్ పర్యవేక్షణ పూర్తయింది. క్రిందకి దిగి వచ్చి గొలుసులకు కట్టివున్న రెండు ఆల్సేషియన్ డాగ్స్ తో కాసేపు ఆడుకున్నాడు. రాత్రి పదకొండుగంటల తర్వాత వాటిని గొలుసులు విప్పేసి కాలనీలోకి విడిచి పెడతాడు. తెల్లవారేవరకూ అవి కాపలా కాస్తున్నట్లుగా నలువైపులా స్వైర్య విహారం చేస్తూ వుంటాయి.

                                        *    *    *

 Previous Page Next Page