మరో ముందడుగు
సి. ఆనందరామం
అర్ధరాత్రి వేళ వచ్చిన పీడకలకు చటుక్కున లేచి కూర్చుంది మయూర. ఇటీవల పీడకలలు బాగా అలవాటై పోయాయి. ఎందుకో ఏమిటో ఎవరో దీనంగా ఎడుస్తున్నట్లు కల వస్తుంది. అక్కడికి పోవాలని మనసూ శరీరమూ తెగ ఆరాట పడిపోతుంటాయి. అదే సమయంలో ఎటూ కదలలేని ఏదో స్తబ్ధత ఆవరించు కుంటుంది. అ సంఘర్షణలో మెలకువ వచ్చింది.
"టక్ ? టక్ ?" తలుపు తడుతున్న చప్పుడు ఇంకా కలగంటున్నానా? అనుకొంది కొంచెం సేపు . కానీ మళ్ళీ 'టక్ టక్' మని మరికాస్త గట్టిగా వినిపించింది . కల కాదు నిజంగానే తలుపు తడుతున్నారు . ఎవరో?
భయం వేసింది మొదట అత్తగారిని లేపాలనుకుంది. అత్తగారూ, మావగారూ గదిలో పడుకున్నారు. ఈ వయసులో కూడా ఆ దంపతులు అంత అన్యోన్యంగా ఉంటారు. తన అదృష్టమే ఇలా ఉంది!
మళ్ళీ తలుపు చప్పుడు. లేచి లైటు వేసింది అత్తగారి గది తలుపు తట్టి "అత్తగారూ" అని పిలిచింది. ఆవిడ పలకలేదు. కొంచెం సంకోచించి మరోసారి తలుపు తట్టబోతుండగా తలుపు చప్పుడుతో పాటు, బలహీనంగా "మయూరా!" అన్న పిలుపు వినిపించింది. ఆ పిలుపు వింటూనే సర్వమూ మరిచి ఒక్క అంగలో తలుపు దగ్గరకు వచ్చి తలుపు తెరిచింది. రక్తం ఒడుతున్న బట్టలతో లోపలికి అడుగు పెట్టాడు యతి. కెవ్వున కేక పెట్టింది మయూర.
ఆ కేకకు కమలా ప్రభాకర్ లిద్దరూ లేచి బయటికొచ్చారు. తూలిపోతున్న యతిని తన హృదయానికి ఆనించుకొని "మావయ్యా!...." అంది మయూర ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక. ప్రభాకర్ అదేమీ వినిపించుకోలేదు. యతిని రెండు చేతులతో ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు సైకిల్ వేసుకుని ఆ చీకట్లో డాక్టర్ కోసం బయలు దేరాడు.
రక్తసిక్తాలైన యతి రెండు చేతులూ తన చేతిలోకి తీసుకుని మంచం దగ్గర కూలబడిపోయింది మయూర. పడుకున్న తరువాత యతి శరీరం మీద గాయాలు మరింత ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కళ్ళు తిరిగినట్లయి అతని భుజం మీదకి వాలిపోయింది. తెల్లబోయి చూస్తున్న కమలకు ఏమీ అర్ధం కావటం లేదు. కత్తిదెబ్బలు, రక్తం .....ఆవ్యక్తి ఎవరో? ఇక్కడి కెందుకొచ్చాడో? ఈ సందేహాలన్నీటిని మించి ముందుగా ఆమెలో మాతృ హృదయమే మేల్కొంది "పాపం! పసిపిల్ల బెదిరి పోయింది. గాయపడిన వాడి మీదకే పడిపోయింది" అంటూ మయూరను నెమ్మదిగా అతడి భుజం మీద నుండి తప్పించింది. తడి గుడ్డతో అతని గాయాలు తుదవసాగింది. "దాహం!" అన్నట్టు సైగ చేశాడు యతి. లేచి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొచ్చి, తననానుకుని కూచోమని , మంచినీళ్ళు తాగించింది. తెల్లని చీరా నిండా ఎర్రని రక్తపు మరకలు! తనను తానూ చుసుకోగానే ఎందుకో అవ్యక్తమైన భయం కలిగింది. అయినా అతడిని ఆదరంగా దిండుమీదా పడుకోబెట్టింది. ప్రక్కన తెలివి లేకుండా పడివున్న మయూరను చూసి అతని కళ్ళు నిండుకున్నాయి ఆ వెర్రి బాగుల తల్లి "ఏడవకు బాబూ? డాక్టర్ వస్తాడు. నీకు దెబ్బలు తగ్గిపోతాయి-" అని ఓదార్చింది. అతడు మాట్లాడలేక చూపులు మయూర వైపు తిప్పాడు జాలిగా.
ఆవిడ నొచ్చుకుంటూ 'అయ్యో! నా మతిమండ నీ దెబ్బలు చూసి మతిపోయి దాని మాటే మరిచిపోయాను." అని లేచివెళ్ళి చల్లని నీళ్ళు మయూర ముఖం మీద చల్లింది. మయూర కళ్ళు తెరవగానే "ఎమ్మా! రక్తం చూసి భయపదిపోయావా?" అంది. మయూర అత్తగారికి సమాధానం చెప్పలేదు. యతి తప్ప మరేమీ కనపడని దానిలా అతనినే చూడసాగింది. కన్నీళ్ళు చెక్కిళ్ళ మీదుగా ప్రవహిస్తూన్నాయనే స్పృహ అయినా లేకుండా, చూపు తిప్పుకోకుండా అతనినే చూడసాగింది.
"మయూరా! ఒకనాడు నీ సుఖం కోరి , నీ జీవితం లోంచి దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ దశలో నీ దగ్గరకు వచ్చి నీ సుఖాన్ని పాడుచేస్తున్నానా?"
"నా సుఖం....." ఏదో చెప్పబోయిన మయూర కళ్ళకు ఎదురుగా అత్తగారు కనిపించింది. ఆమె నోరు మూతబదిపోయింది. పైట కొంగు నోటిలో కుక్కుకుంది.
డాక్టర్ తో ప్రభాకర్ వచ్చాడు.
యతి నీరసంగానే అయినా మాట్లాడగలుగుతున్నాడు. "{మీకు శ్రమ, అంతేకాదు! ప్రమాదం అన్నాడు. "నువ్వురుకో!" అని కసిరాడు ప్రభాకరం ప్రేమగా..."అమ్మా మయూరా! ఇలాంటి సమయంలోనే ధైర్యం తెచ్చుకోవాలి. అలా ఏడుస్తూ కూచోవడం కాదు. రా! కొంచెం సాయం చెయ్యి! ఇతని ప్రక్క లోపల ఏర్పాటు చేద్దాం!" అన్నాడు ప్రభాకర్. మావగారి మాటలతో ఏదో ధైర్యం వచ్చింది మయూరకి. అసలు ప్రభాకర్ లో వున్నా శక్తి అదే! అతడు పక్కనుంటే చాలు, యెంత నిరాశలో వున్న వారికయినా ఏదో నూత్న చైతన్యం వచ్చినట్లవుతుంది.
వెంటనే లేచి, "పక్క లెక్కడ ఏర్పాటు చేయమంటారు?" అంది.
"నీ గదిలో!"
"మయూర నిర్ఘాంతపోయి చూసింది.
"చెప్పినట్లు చేయి , త్వరగా....."
వెంటనే మయూర తన గదిలోనే ప్రక్క ఏర్పాటు చేసింది. డాక్టర్ ప్రభాకర్, ఇద్దరూ అండగా నిలిచి, యతిని నడిపించుకుంటూ లోపలికి తీసి కెళ్ళారు! మయూర ఏర్పాటు చేసిన పక్క మీద పడుకోబెట్టారు!
"మయూరా! ఇతనికి ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందో ఇక్కడే కనిపెట్టుకుని ఉండు-" అని డాక్టర్ నీ, మయూరనూ యతినీ గదిలో వుంచి తలుపులు దగ్గిరగా లాగేశాడు.
"తెల్లబోయి చూస్తూ నిలబడ్డ కమలతో 'కమలా! నీళ్ళు తీసుకురా!' అని నీళ్ళతో రక్తం మరకలన్నీ శుభ్రంగా కడిగి తుడిచేశాడు.
"ఇతనేవరండీ, మీకు తెలుసా!" ఆందోళనగా అడిగింది కమల.
"ఇంతకుముందు తెలియదు. ఇకముందు ఎలానూ తెలుసుంది"
ప్రభాకర్ సమాధానానికి చాలా ఆశ్చర్యపోయింది కమల. ముక్కూ, మొహం ఎరుగని వాడి పట్ల ఈ శ్రద్ధ ఏమిటో ఆమె కర్ధం కాలేదు. ప్రభాకర్ ఆమె కెప్పుడూ సరిగా అర్ధం కాదు. అయినా ప్రభాకర్ చెప్పినట్లు ఇల్లంతా తడి అరిపోయేలా గుడ్డతో తుడిచింది.
ఆ సమయంలో వచ్చాడు తూలుకుంటూ వేణు. రోజూ అతడు ఇంటికొచ్చే సమయమే అది .....కాని, ఆ సమయానికి అందరూ నిద్ర పోతూ ఉంటారు - ఆ రోజు తల్లిదండ్రులిద్దరూ మెలకువగా ఉండటం చూసి గతుక్కుమన్నాడు.
"మీరింకా నిద్రపోలేదా?" అన్నాడు ముద్దముద్దగా. ఆ దంపతులలో ఏ ఒక్కరూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. తమ ఏకైక సంతానాన్ని ఆ స్థితిలో చూసుకొని ఇద్దరికీ మనసు చేరువవుతోంది. తల దించుకొని తమ గదిలోకి వెళ్ళబోయాడు వేణు.