Previous Page Next Page 
హనీమూన్ పేజి 19


    "గెజిటెడ్ ఆఫిసరంటే ఏదో పెద్ద సుఖపడే ఉద్యోగం అనుకుంటారుగాని-చాలా సమస్యలుంటాయ్ ఇక్కడ ఈ తాలూకాలోఎక్కడేం జరిగినా మాకే మాట వస్తుంది. అ సేంబ్లిలో కోశ్చేన్స్ వేస్తారు. చీఫ్ మినిష్టర్  సక్సెస్ అవాలంటే  కేవలం  మా మీదే ఆధారపడాలి."

    "అవునండి!"

    "ఇంక వెళ్ళిరండి-ఏమీ అనుకోరని నాకు తెలుసు."

    "అబ్బే! కొంచెంకూడా  అనుకోమండి"

    "సాయంత్రమయినా మిరోచ్చారని పెట్టటమే....లేకపోతే నేనేవ్వరిని  ఎంటర్ టెయిన్ చేయను."

    "అలాగండి."

    "యస్! అతను మీకు బాగా దగ్గరవాడన్నారు కదూ?"

    "అవునండి."

    "సంతకం పెట్టక మళ్ళి నాకేం సమస్యలు రావు కదా?"

    "ఒరిజనల్స్ చూసే సంతకం చేస్తారు కదండి."

    "ఈ రోజుల్లో ఏది  నమ్మటానికి  వీల్లేదు."

    "ఆ మాట నిజమేననుకోండి."

    జేవురించిన మొఖంతో బయటపడ్డాను. నాలుగడుగులు వేశానో లేదో ప్యూన్ పట్టుకున్నాడు నన్ను.

    "ఏం సార్....తెలిసివాడు గాడిదగుడ్డు అని అన్ని  అబద్దాలు చెప్పారా నాకు?"

    "ఏయ్....మర్యాదగా  మాట్లాడు ! అబద్దాలేందుకయింది?"

    "మరి  తెలిసిన వారయితే తాసిల్దరుగారలా ఎందుకు తిట్టారు నన్ను."

    "ఎందుకంటే వాడొక వెధవ కాబట్టి" అనేసి వాడు నోరు తెరిచి చూస్తూండగా వచ్చేశాము.

    "పోనిలే! నేనింకేక్కడయిన తీసుకుంటాను సంతకం" అన్నాడు మా కజిన్.

    ఆ సంగతలా ముగిస్తే బాగుండేది.

    మర్నాడు పొద్దున్నే మా విధిలో ఎదురయ్యాడు శివానందం.

    "అరె!నిన్న సాయంత్రం మళ్ళి రాలేదేమిటి? మీ కోసం చాలా సేపు ఎదుర్చూశాను" అన్నాడు వెధవ నవ్వు నవ్వుతూ.

    "అవసరం లేదు లెండి! మా వాడు వేరే చోటేక్కడో ప్యూన్ కి రెండ్రూ పాయలు పార్సి వల్లాఫిసరు సంతకాలు తీసుకున్నాడట" అన్నాను కసిగా.

    శివానందం మొహం మాడిపోయింది.

    "నేను చెప్పాను  కదా....కర్రప్షన్-తెగ పెరిగిపోతోంది."

    "అదే నయం లెండి- పనులు తేలిగ్గా అవుతాయ్" అన్నాను ఇంకో దేబ్బకోడుతూ.

    "అవున్లెండి. నానాచావూ చచ్చిదేశాన్ని నడిపించేది మేము- లంచాలు తీసుకుని ఎంజాయ్ చేసేది వాళ్ళు" అనేసి వెళ్ళిపోయాడు హడావుడిగా.

    ఆ తరువాత మేమెప్పుడూ మళ్ళి శివానందం దగ్గర  కెళ్ళలేదు. ఇప్పుడు శివానందాన్ని చూసేసరికి  పాత కధంత గుర్తుకోచ్చేసింది.

    "అర్దరూపాయ్ పడేస్తే జిరాక్స్ కాఫి దోరుకుతుంది. దానికోసం అడ్డమయిన  గెజిటేడ్ ఆఫీసర్ గాడి కాళ్ళూ పట్టుకోటం ఎందుకూ?" అన్నాన్నేనుశివానందంతో.

    "ఆ-ఆ-అవును...జిరాక్స్ "అన్నాడు వాడిపోయిన మొఖంతో.

    "ఏమిటిలా రచ్చారు?" అనడిగాడు సారధి.

    "మరేం లేదోయ్- మీరు డార్జిలింగ్  వెళ్ళుతున్నరాణి తెలిసింది నిజమేనా?"

    "అవునండి."

    "వయా అలహాబాద్ వెళ్తూన్నారటకదా?"

    "అవును"

    "అలహాబాద్ లో మా తోడల్లుడి బ్రదర్ పార్క్ చేస్తున్నాడు. ఈ మధ్యే  అక్కడికి పోస్టింగాయిందతనికి. ఉత్తర దేశంకదా! ఆ తిండి. అలవాటు లేక నానా చావూ చచ్చిపోతున్నాడట! అతనికి పచ్చళ్ళు పంపాలని మావాళ్ళు అంటున్నారు. 'ఆ కుర్రాళ్ళు , మనవాళ్ళే ? నేనంటే చాలా గౌరవం అవి ఉన్నాయ్ మనం చెప్తే  కళ్ళ కద్దుకని తిసుకేల్తారా'నీ మా వాళ్ళతో అన్నాను" అన్నాడాయన సగర్వంగా.

    "ఏ కుర్రాళ్ళ గురించీ మీరు మాట్లాడేది?" అడిగాను నేను.

    "అదే-మీ గుంరిచే."

    "అలాగా! ఇంకెవరి గురించో మాట్లాడుతున్నారనుకున్నాం" అన్నాడు సారధి.

    మేమిద్దరం బిజీగా ఉన్నట్లు నటించసాగాము. శివానందం మా సంగతేమి పట్టించుకోకుండా తన దారిన తనేదో మాట్లాడుతున్నాడు.

    "సర్విస్ లో నేను సహాయం చేయనివాడు లేడు. అందరికి చాలా సార్లు 'అవుటాఫ్ వె' వెళ్ళికూడా  సహాయాలు చేశాను. ఆప్టరాల్ -ఒకరి  కొకరు సహాయం చేసుకోపోతే  ఎలా? అందాకా ఎందుకు? ఆరోజు సారధి మళ్ళి నన్ను కలువలేదనుకో అది వేరే సంగతి ఇలా ఎంతమందికి ఎన్ని రకాల సహాయాలు చేశాను."

    "మీ పచ్చళ్ళు మేము తీసుకెళ్ళటం కుదరదు" అన్నాడు సారధి  అతని మాటలు పూర్తి అయిన వెంటనే.

    అతను నమ్మలేనట్లు  సారధివంక  చూశాడు.

    "ఏమిటన్నారు?"

    "పచ్చళ్ళు తిసుకెళ్ళటం మాకు కుదరదన్నాను."

    "కుదరదా?"

    "ఏమాత్రం కుదరదు."

    కొద్ది క్షణాలపాటు అంతా నిశ్శబ్దం తాండవించింది. శివానందం మొఖంలో  మారే రంగులు నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయ్.

    "ఎందుకని?" అడిగాడతను గొంతు తగ్గించి.

 Previous Page Next Page