Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 19


    పైగా మానభంగాలు జరుగుతున్నది ఫాషన్ గా వున్న స్త్రీలకనేనా నీ ఉద్దేశ్యం? పొలంలో పనిచేసుకొని పొట్టబోసుకొనే హరిజన యువతిని ఏ మాక్సీలో చూసి ఆమె శీలాన్ని హరించి ప్రాణం తీశారు? పదకొండు ఏళ్ళ పిల్లను ఏ అంగసౌష్ట ప్రదర్శన చేసిందని మానభంగం కేసు కోర్టులో నడుస్తున్నది? ఇవ్వాల్టి న్యూస్ చదివావా? బస్సు కండక్టరూ, మరికొందరు కలిసి బస్సు ఎక్కిన అమ్మాయిని బస్సులోనే మానభంగం చెయ్యడానికి ప్రయత్నించారట."
    "అది కాదండి! ఒకసారి బయటికి వచ్చి చూడండి. ఇంట్లో కూర్చుని రాస్తే లాభంలేదు. బొడ్డు కిందకు చీరగట్టి ఒక్కొక్క ఆడది బజార్లో నడుస్తుంటే రామ: రామ:"
    "మీ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. రాసే ఆడవాళ్ళంతా ఇళ్ళలోనే కూర్చుని రాస్తారని మీ అభిప్రాయం. నేను ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాను.
    ఇంకా దేశంలో చాలాభాగాలు చూశాను. మీకు ఆడవాళ్ళంటే ఎందుకు బాబూ! అంత అక్కసు? మీలాంటి చదువుకున్న వాళ్ళు పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అన్యాయాన్ని ఎదుర్కోవాలి అంతేకాని ఇలాంటి అక్రమాలను సమర్థించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది" అన్నాను ఆ యువకుడు మరి కొంతసేపు వాదించి వెళ్ళిపోయాడు.  
    ఇలాంటి వారు చాలా కొద్దిమందే ఉంటారు. ఆడవాళ్ళకు జరిగే అన్యాయాలను గురించి మాట్లాడినా, రాసినా ఉడుక్కుంటారు ఉత్తరాలు రాస్తారు నేను స్త్రీలకు కరాటే ట్రైనింగ్ చెప్పించాలన్నందుకు చాలామంది అభ్యంతరంగా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరం అని అనిపించడం లేదా? బస్ లో అమ్మాయి గురించే ఆలోచించండి. ఆ అమ్మాయికి కరాటే వస్తే తేలిగ్గా నలుగురికి సమాధానం చెప్పగలదు మన సంస్కారం వెర్రితలలు వేస్తున్నది కారణాలు అనేకం కావచ్చును జరుగుతున్న అన్యాయాలు రోజూ వింటున్నాం. చదువుతున్నాం కాలంతోపాటు వేషభాషల్లో మార్పు వస్తున్నది ఆ మాటకు వస్తే ఇప్పటికీ మలబార్ లో చాలామంది పైట వేసుకోరు కొన్ని ప్రాంతాల్లోని కొన్ని తెగల్లో రవిక తొడుక్కోరు. అందువల్ల మానభంగాలు జరుగుతున్నాయా?
    మొన్ననొకసారి బస్ లో ఒకామె గట్టిగా ఎవరినో మందలిస్తుంటే వెనక్కు తిరిగి చూశాను ఆమెకు దాదాపు నలభై సంవత్సరాలు ఉంటాయ్: చక్కగా పైట భుజాల మీదుగా కప్పుకొని సాదాగా సంప్రదాయబద్ధంగా చూడగానే గౌరవభావం కలిగేలా ఉన్నది. ఆమె ఒక కాలేజీలో లెక్చరర్ నాకు తెలుసు ఆమె తన సీట్లో వదిగి వదిగి కూర్చుంది.   
    నిల్చున్న వ్యక్తి (బస్ రద్దీగా లేదు) మీద మీదకు జరిగి ఆమెను ఆనుకొని నిల్చోవడానికి ప్రయత్నిస్తున్నాడు మరి దీన్నేమంటారు? పక్కన కూర్చున్న ఆడపిల్లను మోచేత్తో వీలు చిక్కినప్పుడు పొడవకుండా ఎంతమంది మగవాళ్ళు కూర్చుంటారు?    
    ఒకరోజు కండక్టర్ ఒక అమ్మాయిని (చీరలోనే ఉంది సుమా) భుజం మీద చెయ్యివేసి టికెట్ అడిగాడు. ఆ అమ్మాయికి కోపం వచ్చింది ఎందుకు భుజం మీద తట్టావని అడిగింది. దానికి అతను "ఏం? నీపేరు నాకు తెలుసా?" అన్నాడు. "పేరెందుకు తెలియాలి, టికెట్ అంటే చాలదా?" అన్నాను ఆ పక్కనే నిల్చున్న నేను. "అంత నామోషి అయితే టాక్సీలో వెళ్ళండి. నేను అలాగే అడుగుతాను" అన్నాడు మొండిగా.
    మాకూ, అతనికీ ఘర్షణ ప్రారంభం అయింది. మగవాళ్లు వెనక్కు తిరిగి చూస్తున్నారు నవ్వుకుంటున్నారు." చూడండి వాళ్ళెలా నవ్వుతున్నారో?" అన్నది ఆ అమ్మాయి దాదాపు ఏడుస్తూ, "పాపం: మూర్కులు నవ్వక ఏం చేస్తారు? రేపు వాళ్ళ కూతుళ్లూ, భార్యలూ ఎక్కినా ఈ కండక్టరు ఇలాగే చేస్తాడని" వాళ్ళు ఆలోచించలేరు. పరాయి పిల్ల గదా అని చూస్తూ ఆనందిస్తున్నారు" అన్నాను. దాంతో అందరూ బిర్ర బిగిసిపోయారు వానలో తడిచిననులక మంచాల్లాగా.     
    "అదేమిటమ్మా: అలా మగవాళ్ళను మాట్లాడతావు?" రాగం తీసింది ఒక పిన్నిగారు.
    "ఏం పిన్నిగారూ? అందులో బాబాయిగారు కూడా ఉన్నారా?" అన్నాను వళ్ళుమండి వాళ్ళ వేషభాషల్ని విమర్శించేందుకు ముందు మీ గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడవాళ్ళకు జరిగే అన్యాయాల గురించి చెప్పడం అంటే పురుషుల్ని నిందించడం కాదని మనవి.
                        సంతృప్తిలోనే సుఖం ఉన్నదా?
    సంతోషి సదా సుఖీ అంటారు హిందీ వాళ్లు. "సంతోషి అంటే తెలుగు సంతోషం కాదు సంతృప్తి కలవాడు అని అర్థం. మన పెద్దలు కూడా మనశ్శాంతి లభించాలంటే ఉన్నదాంట్లోనే సంతృప్తిపడడం నేర్చుకోవాలి అని అంటారు కాని సంతృప్తి మనిషిని సోమరిపోతుని చేస్తుంది ప్రగతి పథానికి అడ్డంగా గోడల్ని నిలబెడుతుంది.  
    ఉన్నదానితో కాలక్షేపం చేసేవాడు జీవితంలో ప్రగతిని సాధించలేడు ఉదాహరణకు ఇద్దరు కొండ దగ్గరకు వెళ్ళారనుకోండి. ఒకడు కొండను చూసి శిఖరాన్ని చూసినట్టే సంతృప్తి పడి తిరిగి వచ్చేస్తాడు. రెండోవాడికి తృప్తి కలగదు కొండను అధిరోహించి శిఖరాన్ని చేరుకుంటాడు అతనిలోని అసంతృప్తే అతనిచేత ఆ పనిని చేయిస్తుంది.
    నాకు తెలిసిన ఒకపెద్ద మనిషి డబుల్ ఎం.ఏ. ప్రైమరీ స్కూల్లో ఉద్యోగం దొరికింది తాత్కాలికంగా ఆ ఉద్యోగంలో చేరడం తేలికైనపనే. కాని దానితోనే సంతృప్తిపడి వూరుకున్నాడు చిన్నపిల్లలతో కాలక్షేపం బాగానే ఉంది రెండువందల యాభై రూపాయల జీతం దానితో సంతృప్తి పడటం నేర్చుకున్నాడు వేదాంతాన్ని జీర్ణించుకున్నాడు.
    వయసులోనే వృద్ధురాలిలా కన్పించే అతని భార్యనూ, ఎండుకుపోయి నకనకలాడుతున్నట్టూ కన్పించే అతని పిల్లల్నీ చూస్తుంటే జాలివేస్తుంది. స్కూలు నుంచి వచ్చి ఇంట్లోనే పడుకుంటాడు సోమరితనం బాగా అలవడింది మరో ఉద్యోగం సంపాదించుకునే ప్రయత్నం చెయ్యడు.  
    ఒకరోజు ఉండబట్టలేక అనేశాను -- "మీకు మంచి డిగ్రీలున్నాయ్ వేరే ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నించరు? మంచి ఉద్యోగం దొరికేంతవరకూ నలుగురు పిల్లలకు ట్యూషన్స్ అయినా చెప్పవచ్చుగదా?"   
    "వేదాంతిలా నవ్వాడు. గోడకేసి చెయ్యి చూపించాడు మురికి పడుతున్న కేలండర్ వేలాడుతున్నది దానిమీద వేంకటేశ్వరస్వామి బొమ్మ ఉన్నది." అంతా శ్రీ శ్రీనివాసుని దయ జన్మను ఇచ్చాడు మార్గం చూపించాడు నా అదృష్టం అంతే: బాధపడి లాభంలేదు. భగవంతుడు ప్రసాదించిన దానితోనే సంతృప్తి పడాలి.    
    "మానవ ప్రయత్నం ఉండాలి. భగవంతుడు నీకోసం ఉద్యోగం ప్రయత్నం చెయ్యడుగా:" అన్నాను వళ్ళుమండి అతనికి నా మాటలు రుచించలేదు.
    "సంతృప్తి ఉండాలి అదిలేని వాడికి వెయ్యి రూపాయల జీతం ఉన్నా సుఖం ఉండదు. ప్రపంచంలో ఎందరో నా కంటే హీనదశలో ఉన్నారు. భగవంతుడి దయవల్లనే నాకీ మాత్రం అన్నం అయినా దొరుకుతున్నది" అన్నాడు నిర్లిప్తంగా. అతనితో మాట్లాడి లాభం లేదని నేను బయలుదేరాను. అతనిభార్య వాకిలి వరకూ వచ్చి ఐదురూపాయలు ఉంటే ఇవ్వమని అడిగింది ఆ రోజు ఇంట్లో బియ్యంకూడాలేవట. పదిరూపాయలు ఇచ్చి, అతని అసమర్థతకు మనసులోనే బాధపడుతూ వచ్చేశాను.
    "సంతృప్తి" అనే వేదాంతం అతనికి బాగా వంటబట్టింది. సోమరితనం అలవాటైంది ఇక చస్తే బాగుపడే ప్రయత్నం చెయ్యడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకు కన్పిస్తూ ఉంటారు.
    ఇక్కడ ఒక కథ గుర్తు వస్తున్నది ఒక సన్యాసితో ఒక యువకుడు --" ఇలా గుడి అరుగు మీద గంజాయి పీలుస్తూ సోమరిలా కూర్చోకపోతే పని చెయ్యరాదూ?" అన్నాడు. "పని చేస్తే?" సన్యాసి ప్రశ్న "నువ్వు యువకుడివి తెలివైనవాడివి పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చును."
    "డబ్బు సంపాదిస్తాను బాగా సంపాదిస్తాను పెద్దఇల్లు కట్టుకుంటాను బోలెడంత బాంకు బాలెన్స్ కూడా ఉంటుంది ఆ తర్వాత?" ప్రశ్నించాడు సన్యాసి.       
    "ఆ తర్వాత ఆ ఏముంది? హాయిగా కాలు మీద కాలు వేసుకొని విశ్రాంతి తీసుకోవచ్చును" అన్నాడు అంతకంటే ఏమనాలో తోచక.
    ఆ సన్యాసి నవ్వి -- "ఇప్పుడు నేను చేస్తున్నది అదేగా? దీని కోసం మళ్ళీ అంత కష్టపడడం ఎందుకూ?" అన్నాడు దానితో ఆ యువకుడు ఇలాంటి వాళ్ళకు చెప్పి ప్రయోజనం లేదనుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.  
    మనుషులంతా దొరికిన దానితో సంతృప్తిపడి ఉంటే మానవచరిత్ర మరోలా ఉండి ఉండేది ఈనాడు మానవుడు ఇంత విజ్ఞానాన్ని సంపాదించి ఉండేవాడు కాదు. చరిత్ర ఇందుకు సాక్ష్యం: మానవులు సాధించిన వైజ్ఞానిక ప్రగతి సాక్ష్యం.     
    ఆదిమకాలంనుంచి మానవుడు సాధించిన ప్రగతివైపు ఒకసారి చూస్తే, ఆలోచిస్తే మానవునిలో నిరంతరం సాగే అసంతృప్తి ఇందుకు కారణం అని తెలుసుకోగలం. చరిత్రను తిరగేస్తే మానవుడు కనిపెట్టిన వైజ్ఞానిక వింతలన్నీ సంతృప్తిగా జీవితం గడిపిన వారివల్ల జరగలేదనేది స్పష్టమవుతుంది.  
    మార్కోని రేడియో కనిపెట్టాడు. ఉన్న దానితో సంతృప్తిపడి సోమరిగా జీవిస్తే కనిపెట్టలేకపోయేవాడు. మనం మన గదిలో కూర్చోని ప్రపంచంలో ఎవరు మాట్లాడినా వింటున్నాం. కాని, మానవుడు అంతతో తృప్తి చెందలేదు.
    కేవలం మాట వినడం వలన అతనికి సంతృప్తి కలగలేదు. మాట్లాడే వానిని చూడాలనే కోరిక కూడా కలిగింది. ఫలితంగా దూరదర్శన్ ను కనుగొన్నారు. మానవుని చంద్రమండల ప్రయాణం మొదలయిన ప్రయత్నాలు ఈ అసంతృప్తికి నిదర్శనాలే!                 

 Previous Page Next Page