Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 19


    "నవ్వుతున్నారేం?" అడిగింది యశోద. ఆమె ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది. ముఖం ప్రసన్నంగా ఉంది.  
    కళ్లలో ప్రేమాభావం చెదరలేదు. ఆ ముఖం చూస్తోన్నకొద్దీ కొత్త ఊపిరి అందినట్లవుతోంది వివేక్ కి.
    "ఆడమ్మాయిలతో నా అనుభవాలు రకరకాలు.. అది గుర్తొచ్చి నవ్వుకున్నాను."    
    "సరే! మొదట మా చుట్టాల్లోనే ఒక అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించాను. ఆ అమ్మాయి పేరు లీల ... టీనేజ్ లో ఉన్న అమ్మాయిలూ అబ్బాయిలూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే నేను వెళ్ళి కూర్చున్నాను.
    అమ్మాయిల వంక చూడటానికి చాలా భయమేసింది. మనసులో సంకోచం లేదు. కళ్ళూపైకి లేచేవి కావు. లేచినా ఏదో భరించలేని దృశ్యం చూస్తున్నట్లు గభాలున కళ్ళు మూసుకుపోయేవి. లీల ఇంకా ఇంకొందరు అమ్మాయిలు అబ్బాయిలూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
    లీలని నేను చాలాసార్లు దూరం నుంచి చూశాను. ఎదుటపడి మాట్లాడలేదు. సంకోచం అణుచుకుంటూ వాళ్ళ మధ్యకు వెళ్ళాను నేను. వాళ్లంతా నన్ను వింత జంతువును చూసినట్లు చూశారు. ఎందుకంటే నేనువాళ్ల మధ్యకి వెళ్లలేదు. పిలిచినా వినిపించుకోనట్లు వెళ్ళిపోయే వాడిని.  
    "రా! వివేక్ కూర్చో!" అంది లీల. నా కాళ్ళు వణక్కుండా నిలబడడానికి ప్రయత్నించాను. అవి మరింతగా వణికాయి. తడబాటులో సరిగ్గా కూచోలేక తూలిలీల మీద పడ్డాను...   
    "ఏయ్! వివేక్! ఏమిటిదీ? ఎందుకొచ్చావ్?" అంది లీల చిరాగ్గా లేచి దూరంగా జరుగుతూ.
    నా కంగారు మరింత ఎక్కువయింది. "లీ.... లి.... లీలా?...." అన్నాను.... ముఖమంతా చెమటలు. కాళ్ళు వణుకు. అదుపులో పెట్టుకోలేకపోతున్నాను....."
    నన్ను తేరిపార చూసింది లీల. విరగబడి నవ్వుతూ "వివేక్! ఆ పేంటూ షర్టూ తీసేసి పరికిణీ ఓణీ వేసుకుని రాకూడదూ!" అంది. మిగిలిన వాళ్ళు కూడా పడీ పడీ నవ్వారు. ఆ మాటలు తాత్పర్యం అర్థం అయ్యేసరికి...."

    ఆగిపోయాడు వివేక్. ఆనాడు ఎంత లజ్జ అనుభవించాడో అదంతా ఆ క్షణంలో మళ్ళీ అతడి ముఖం మీద కనిపించింది.  

    యశోద మనసు సానుభూతితో నిండిపోయింది. అందగాడూ మేధావంతుడూ మంచివాడూ ఐన ఈ యువకుడి అంతరంతరాల్లో ఎంత క్షోభ అణిగి ఉందో ఊహించుకుని ఎలాగయినా అతడికి సహకరించాలని గట్టిగా నిర్ణయించుకుంది. జాలీ సానుభూతీ లాంటి భావాలు పైకి కనిపించకుండా కులాసాగా నవ్వుతూ "ఓస్! ఇలాంటి జోకులు మేము లక్షవేసుకుంటుంటాం!."
    కొంచెం డల్ గా కనిపిస్తే చాలు "తృతీయా ప్రకృతి!" అని ఏడిపించే వాళ్ళం!" ధైర్యంగా తిరిగే వాళ్లని" మొగరాయుడు!" అని ఏడిపించడం కూడా మామూలే! ఇంతేనా మీరు చెప్పదలుచుకున్నది?
    "ఇంకా ఉంది!"
    "చెప్పండి!"
    "తర్వాత ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళాను."
    ఉలికిపడింది యశోద.
    "అలా అయిపోకు. నేను నిజం చెపుతున్నాను. వాళ్ళయితే నన్ను హేళన చెయ్యరనీ. వాళ్ళముందు నేను సంకోచంతో తడబడవలసిన అవసరం లేదనీ అనుకున్నాను. అక్కడ అడుగుపెడుతూనే వాతారణం నాకు వెగటు కలిగించింది. అరక్షణం కూడా ఉండలేకపోయాను. అసలు వాళ్లు ఆడవాళ్ళుగా కనిపించలేదు నాకు"

    "తర్వాత?"
    "మరొక అమ్మాయి జానకి, నా స్నేహితుడి చెల్లెలు. తనే నాకు లవ్ లెటర్ రాసింది. నేను సరదాగా రిప్లై ఇచ్చాను. కంటి కెదురుగా ఆడవాళ్ళు కనబడకుండా ఉంటే ఏదయినా చెయ్యగలను. మనసులో ఎవరో అమ్మాయిని ఊహించుకుంటూ చక్కని ప్రేమలేఖ రాశాను.
    ఇలా ఇద్దరిమధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. తర్వాత ఒక ఉత్తరంలో ఆ అమ్మాయి నన్ను తమ ఇంటికి రమ్మని రాసింది వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రమ్మంది.
    నేను వెళ్ళగానే ఆ అమ్మాయి నా మీదపడి కావలించుకుంది. ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. తోసేశాను. అక్కడినుండి తిన్నగా సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. నా సమస్య చెప్పుకున్నాను. ప్రాస్టిట్యూట్స్ దగ్గర ఏదో వెగటు చీదర కలిగింది. ఇలా మీద మీదపడే వాళ్లని చూస్తే నాకు వెర్రి కోపం వచ్చి వాళ్ళని చావబాదాలనిపించింది.

    నా జీవితంలో నాకు తెలియకుండానే దాగిన ఏదో రహస్య అనుభూతులే. నరాల బలహీనత కలిగించే. ఈ రకమైన మానసిక వైకల్యానికి కారణం!" అంటాడు సైక్రియాటిస్ట్ ఎన్నోసార్లు నాచేత ఏదేదో మాట్లాడించి నా చేత రికార్డ్ చేశాడు. కానీ నా బలహీనత అలాగే ఉంది.
    తనంత తానుగా నామీదపడ్డ అమ్మాయి తను గర్భవతిననీ, అందుకు కారణం నేనేనని గొడవ చేసింది. నా ఉత్తరాలు బయటపెట్టి గొడవ చేస్తానంది. అసలు విషయం అర్థమయింది. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఉత్తరాలు ఆధారంగా మా అమ్మా, నాన్నగారు నిజమనుకోవచ్చు.

    ఆ అమ్మాయిని నేను సైక్రియాటిస్ట్ దగ్గరకి తీసుకెళ్ళాను. ఆయన నా సమస్య వివరించి అల్లరి చెయ్యటం వల్ల ఆ అమ్మాయి పరువే బయటపడుతుందని హెచ్చరించాడు. ఆ అమ్మాయి బెడద తప్పింది. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి చూసిన చూపు.... నేనసలు మనిషినే కానట్లు..... ఏ పురుగునో క్రిమినో కీటకాన్నో అన్నట్లు....."ఆగిపోయాడు వివేక్. భరించరాని లజ్జ. అతని ముఖం మీద వెనుకటిలాగే తట్టుకోలేని ఆవేదన ఆ కళ్లలో...   
    చటుక్కున ముందుకు జరిగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది యశోద. అతడి శరీరం పులకించింది. ఆ పులకింత స్పష్టంగా కనిపించింది.   
    ఆమె చుట్టూ చేతులువేసి వక్ష స్థలంలో ముఖం దాచుకుని చెప్పాడు..  

    "తర్వాత నువ్వు... నువ్వు నాకు కావాలనిపించింది. తొందరపడలేదు. సైక్రియాటిస్ట్ ని అడిగాను. నాలో ఏ లోపం లేదన్నాడు. ఈ ఆలోచన మనసులో రానీయకుండా పెళ్ళి చేసుకోమన్నాడు. నీ ముందు కూడా మొదట వణికాను. ఎప్పటిలాగ మాట్లాడటానికి భయపడ్డాను.  
    కాని నువ్వు పట్టుదలగా నాతో మాటలు పెంచుకుని స్నేహం చెయ్యటంతో నాలోని సంకోచం పోయింది. నీతో ఫ్రీగా మాట్లాడగలిగాను. నీకు గుర్తుందా? ఆ రోజు నీ చెయ్యి కూడా ముద్దు పెట్టుకోగలిగాను. ఆ ధైర్యంతో నిన్ను పెళ్ళి చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. అయితే నేను నిన్ను చూసి నేను మోసం చెయ్యకూడదనుకున్నాను అన్ని విషయాలూ ముందే చెప్పాలనుకున్నాను.
    కానీ ఆ అమ్మాయి చూపు గుర్తొచ్చింది. లీల నవ్వు భయపెట్టింది. అదీగాక డాక్టర్ ఈ విషయాలు మర్చిపోతేగానీ నా సమస్యకు పరిష్కారంలేదన్నాడు. నీకు చెప్పటంవల్ల ఈ సమస్య మనిద్దరిమధ్య మరింత బలంగా బుసలుకొట్టే ప్రమాదముంది. అంచేత చెప్పలేకపోయాను. అంచేతనే విడాకుల ప్రసక్తి తెచ్చాను..."

    "ఇదా కారణం!" ఒక నిట్టూర్పు వదిలింది యశోద.
    "యశూ! బాధ పడకు! నీకు ఏ క్షణంలో కావాలన్నా విడాకులిస్తాను. నువ్వు కన్యవే అని నిరూపించటానికి నా అవమానం సహించి కూడా సాక్ష్యం చెపుతాను. కానీ నేను ఏ అమ్మాయితోనూ ఇంత మాత్రంగా కూడా సన్నిహితంగా లేను. ఎవరితోనూ ఇలా మనసు విప్పి మాట్లాడలేదు. నువ్వు నాకు కొద్దిగా అవకాశమిస్తే. ఇలాగే సాదరంగా ప్రోత్సాహమిస్తే....."
    తనంత తను వివేక్ ని దగ్గరకు తీసుకుంది యశోద. ఆర్ధ్రమైన చిరునవ్వుతో మనసారా అంది "ఐ లవ్ యూ....!"                           

 Previous Page Next Page