7
ముఖం దిండులో దాచుకుని బోర్లా పడుకున్నాడు వివేక్. అతడి తల ఆప్యాయంగా నిమురుతూ అతడి పక్కనే కూర్చుంది యశోద. మనసులో కమ్ముకొస్తున్న నిరాశామేఘాల్ని ప్రయత్నపూర్వకంగా వెనక్కినెడుతోంది. ఆ దంపతుల ఆశాభంగానికి అది మూడవరోజు.
"వివేక్! నువ్వు.... సరిగ్గా..... ఆ సమయానికి ఎందుకలా భయపడిపోతున్నావో ఊహించగలవా!"
దిండులోంచి ముఖం తీసి చంటిపిల్లాడిలా యశోద ఒళ్ళో తల పెట్టుకున్నాడు వివేక్.
"ఊహించనక్కరలేదు. నిర్ధారణగానే చెప్పగలను. సరిగ్గా ఆ సమయానికి నా మనసులోకి సలసల కాగుతున్న నూనె మూకుళ్ళు కణకణ మండుతున్న నిప్పు స్థంభాలు, భగ్గునమండుతూ ఉవ్వెత్తున ఎగిసిపడే అగ్ని జ్వాలలూ వస్తున్నాయి. నా మనసు మీద నాకు వశం తప్పుతోంది. భయం! భయం! భయం! తప్పమరేదీ ఉండదు. మనసులో"
తెల్లబోయింది యశోద. అతనికి శారీరకంగా ఏ లోపమూ లేదు. అది తెలుస్తూనే ఉంది యశోదకి.
సైక్రియాటిస్ట్ అన్నట్లు ఏ అజ్ఞాత భయాలు దేనికి కారణమో తెలుసుకొనటం ఎలా? వివేక్ చెప్పగలిగిన దశలో ఉంటే ఏనాడో తన సైక్రియాటిస్ట్ కి చెప్పి సమస్య పరిష్కరించుకునేవాడు. అతడిని అడిగి ప్రయోజనం లేదు... మనసు మరింత చికాకు పెట్టటమే అవుతుంది.
"మీ సైక్రియాటిస్ట్ పేరేమిటి?"
"అనంతపద్మనాభస్వామి"
"ఎక్కడుంటాడు?"
"మా సబ్ టేంక్ దగ్గర"
"ఒకసారి నేను ఆయనతో మాట్లాడితే మీకేమైనా అభ్యంతరమా?"
కాసేపు సమాధానం చెప్పేలేదు వివేక్. "ఏం లేదు" అన్నాడు నెమ్మదిగా.
"మిమ్మల్ని చిన్నబుచ్చేలాగ ఏం మాట్లాడను. నేను కూడా సైకాలజీ స్టూడెంట్ ని కదా. డిస్కస్ చేద్దామని! ఏవైనా కొత్త విషయాలు తెలియవచ్చు."
"ఇటీజ్ ఒకే!"
"మీరు రాకూడదు!నేను ఒక్కదాన్నే ఆయనతో మాట్లాడతాను."
"నీ ఇష్టం"
రెండు నిముషాలు మౌనంగా దొర్లాయి.
"యశూ! ఈ రోజు వరకే నేను హోటల్ బుక్ చేశాను! రేపు ఖాళీ చెయ్యాలి"
"అవును!"
"రేపు.... నువ్వు ఎక్కడికెళతావ్?"
"అదేంప్రశ్న? రేపు మనం ఎక్కడికివెళ్దాం? అనండి!"
దిగ్గున లేచి నుంచున్నాడు వివేక్. అతడి కళ్లలో కాంతి! అందమైన ముఖం మరింత అందంగా వెలుగుతోంది.
"నిజం?"
"అబద్ధాలాడటానికి అవసరమేముందీ?"
"మా ఇంటికి బాగుంటుందని అనుకుంటున్నాను నేను"
"నేనూ మీతోనే వస్తాను"
"థేంక్యూ!"
"మొదట అమ్మని చూసి నా సామానులు కొన్ని తీసుకుని వెళ్దాం"
"ఒకే!"
* * *
డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. దేవిశంకర్, ప్రసూన, వివేక్, యశోద.
వంటవాడు బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాడు. ప్లేట్లలో ఇడ్లీ, చట్నీ, కారప్పొడి పెట్టి పక్కన స్టీల్ బేత్ లలో సాంబారు పెట్టాడు. యశోద తినటం ప్రారంభించటానికి ముందే వివేక్ ఆమె ప్లేట్ లోని ఇడ్లీ ముక్క తుంపి చట్నీ కారప్పొడి సాంబారు అన్నీ రుచి చూశాడు. అది చిలిపితనంగా అనుకున్న యశోద నవ్వింది.
మనసులో పెద్దవాళ్ళ ఎదుట అలా ప్రవర్తించినందుకు బెరుగ్గా అత్తామామలవంక చూసింది.
అప్పటికే వివేక్ ని చూస్తున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వంటవాడు తర్వాత వడ, చట్నీ తీసుకొచ్చాడు. వివేక్ చటుక్కున అదీ రుచి చూశాడు.
యశోద మనసులో ఏదో అనుమానం మెదిలింది. మామగారివైపు చూసింది. కళ్ళు పెద్దవి చేసి కొడుకువైపు చూస్తున్నాడు ఆయన. ప్రసూన తినటం ఆపేసి అందరినీ చూడసాగిది కంగారుగా.. తర్వాత కాఫీ వచ్చింది. అదీ యశోద కంటే తనే ముందుగా రుచి చూశాడు వివేక్.
ఇక భరించలేకపోయాడు దేవిశంకర్. "వివేక్! ఏమిటిదంతా?"
"ఏమిటి నాన్నగారూ!" అమాయకత్వం నటిస్తూ అడిగాడు వివేక్. అతడి కళ్ళనిండా చిలిపితనం.
"పిచ్చి వేషాలు వెయ్యకు?" కసిరారు.
"నేనూ, యశూ ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ చెయ్యటం మీకు ఇష్టం లేకపోతే నా గదిలోకి తీసుకుంటాం!" చాలా సీరియస్ గా అన్నాడు వివేక్.
విస్తుపోయాడు దేవిశంకర్. కలవరపడింది ప్రసూన. యశోద మనసులో ఆశ్చర్యమే కాక ఆనందం. తనకోసం ఏం చెయ్యటానికైనా జంకడు వివేక్.
కాఫీ, ఫలహారాలూ పూర్తయ్యేసరికి ఒక కొత్త వ్యక్తి వచ్చి. వివేక్ కి సలాం చేసి "కారు చూపించండి సార్! శుభ్రం చేసి కండిషన్ లో ఉంచుకుంటాను!" అన్నాడు.
దేవిశంకర్ ఆశ్చర్యంగా "ఇతనెవరూ?" అన్నాడు.
"నా దగ్గర కరాటే నేర్చుకుంటున్నాడు. కారు డ్రైవింగ్ వచ్చు! నా డ్రైవర్ గా పెట్టుకున్నాను. పేరు దుర్గయ్య"
"నీకు వేరే డ్రైవర్ దేనికీ? మన డ్రైవర్ యాదయ్య ఉన్నాడు కదా!. నువ్వు మోటార్ సైకిల్ మీద వెళ్ళడం మానేస్తున్నావా?"
"నేను మోటార్ సైకిల్ మీదే వెళ్తాను. డ్రైవర్ ని పెట్టింది యశోద కోసం. యశోద ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసికెళ్తాడు. కరాటే వచ్చు"
"మనిషికొక డ్రైవర్ దేనికీ? డబ్బులు పండుతున్నాయా. ఇలా దుబారా చెయ్యటానికి?"
"యశోదకి ప్రత్యేకంగా డ్రైవర్ కావాలి. డబ్బు సంపాదిస్తాను. ఈ ఖర్చు దుబారా కాదు. అవసరం"
"చదువు మానేసి డబ్బు సంపాదిస్తావా?"