Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 18


    
    అయినంపూడి ఆనందరావు! అతడెక్కడున్నాడో పట్టుకుంటాను. ప్రపంచంలో ఎక్కడున్నాసరే.
    
    ఇప్పుడిక భైరవమూర్తి మరణం సంగతి వెల్లడి చెయ్యాలా వద్దా అన్నది ప్రశ్న ఎందుకు ఆమెకు చెప్పటం? మొత్తం జీవితంలో పది, పన్నెండుసార్లు కలుసుకుని, కలుసుకున్నప్పుడల్లా డబ్బుకోసం వేధించి, ఇప్పుడామె జీవితం నుంచి నిష్క్రమించిన ఆ వ్యక్తికి, తాను వెళ్ళిపోతూ, నా తల్లి నుదుట కుంకుమ, గాజులు తీసుకెళ్ళే హక్కు ఏముంది? అమ్మ సుమంగళిగానే మరణిస్తుంది. బ్లాక్ మెయిల్ చెయ్యటానికి అతడింకా రాలేదేమిటా అని కొంతకాలం ఆశ్చర్యపోయినా, క్రమంగా మర్చిపోతుంది.... పోనీ, అంతకన్నా కావల్సింది ఏముంది? నా ఆలోచన కరెక్టు అనిపించింది.
    
    నాతల్లి భర్త మరణ విషయం ఆమెకి చెప్పదల్చుకోలేదు. నా తండ్రెవరో తెలిసిన మరుక్షణం నుంచి మాత్రం అనుక్షణం అతడిని మానసికంగా చంపుతాను.
    
    ఆ ఆలోచన వచ్చాక మనసు కొంత సర్దుకుంది.
    
    కారు స్టార్టు చేసి, ఇంటికి వచ్చేశాను. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. చీకటిపడినా ఇంట్లో లైట్లు లేవు. అమ్మ లాగే కూర్చుని వుంది. లైటు వేసి, అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన వాడిలాగా, "ఏమిటమ్మా అలా కూర్చున్నావు?" అని అడిగాను. దీర్ఘమైన ఆలోచనలోంచి బెదిరినట్టు ఆమె ఉలిక్కిపడి "ఏం లేదురా" అంది.
    
    "చాలా పెద్ద ఆక్సిడెంట్ అమ్మా వస్తూంటే చూశాను. వాడెవడో బాగా తాగి వున్నాడు. రోడ్డు కడ్డంగా వచ్చి బస్సు క్రింద పడ్డాడు".
    
    "పాపం ఎవడ్రా?"
    
    "గెడ్డం బాగా పెరిగి వుంది.  ఎర్రచొక్కా వేసుకున్నాడు. ఎవడో జైలుపక్షి అట. పోలీసులు అనుకుంటున్నారు".
    
    అమ్మ మొహం తెల్లగా పాలిపోయింది. కానీ ఏదో తెలియని రిలీఫ్ లాటి భావం ఆమెలో కనిపించింది. చాలు-
    
                                      * * *
    
    వరంగల్ కి, గోదావరికి మధ్య నున్న ప్రదేశంలో ఒక చిన్న పేపర్ మిల్లుని ప్రమదా ఇండస్ట్రీస్ తరఫున కొన్నాము. కాని సంవత్సరం అయింది. కానీ, కొన్న సంవత్సరం నుంచీ అక్కడ గొడవలే. రెండు నెలల కొకసారి లక్షల ఖరీదుచేసే వెదురు దొంగతనంగా రాత్రిళ్ళు  ఎవరో కాల్చేస్తున్నారు. లేబర్ స్ట్రయికు ఒకవైపు మేనేజర్ని హత్యచేశారు. మనుష్యులకి దూరంగా అడవిలో, ప్రతి నిముషమూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాలి అక్కడ. మా వాళ్ళెవరూ అక్కడికి మానేజరుగా వెళ్ళటానికి ఇష్టపడటంలేదు. అక్కడి గొడవలు తగ్గేవరకూ ఏదో ఒక సాకు పెట్టుకుని ఆగిపోయే ఆలోచనలో వున్నారు.
    
    కొత్తవాళ్ళని తీసుకుని కొందర్ని అక్కడికి పంపాలన్న ఆలోచన వుంది. దానికోసం ఇంటర్వ్యూలకి పిలిచాము.
    
    ఆ అప్లికేషన్స్ చూస్తూంటే మతిపోయింది. నాలుగు ఉద్యోగాలకి దాదాపు రెండువేల అప్లికేషన్స్ వచ్చాయి. అందరూ బాగా చదువుకున్నవారే నా తల్లి నన్నిలా తీర్చిదిద్దకపోతే నేను కూడా వారిలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు చదువులో గడిపి, ఎవరుద్యోగమిస్తారా అని అప్లికేషన్లు పూర్తిచేస్తూ గడిపి వుండేవాణ్ణి.
    
    "మీరు వస్తారా సార్ ఇంటర్వ్యూకి?" మానేజర్ వచ్చి అడిగాడు.
    
    "ఎంతమంది మిగిలారు?"
    
    "రిటెన్ టెస్ట్ లో వందమంది దాకా తేలారు సార్. అందులో ఇరవై మందిని ఫైనలైజ్ చేశాము."
    
    "సరే....ఇంతకీ ఎప్పుడు ఇంటర్వ్యూ?"
    
    "ఇంకో గంటలో".
    
    "కృష్ణమూర్తిని చెయ్యమను. మధ్యలో నేను వచ్చి చేస్తాను" అన్నాను. కృష్ణమూర్తి పార్టనరు.
    
    మానేజర్ వెళ్ళిపోయాడు. నేను మరికొంతసేపు పనులు చూసుకుని వెళ్ళేసరికి అప్పటికే సగంమంది ఇంటర్వ్యూలైపోయాయి. ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నాను.

 

    "అర్జెంటైనా ముఖ్య పట్టణం ఏమిటి- హిమాలయాలెక్కుతూ జారిపడి చచ్చిన మొదటి కొరియా యువకుడి పేరేమిటి"-లాటి నాన్సెన్సికల్ ప్రశ్నలు వేస్తున్నాడు కృష్ణమూర్తి మా కార్లకి బ్రేక్ లైనెర్లు సప్లయ్ చేసే మరొక కంపెనీ డైరెక్టరు రికమెండ్ చేసిన ఒకతనికి ఈ ఉద్యోగం ముందుగానే రిజర్వ్ అయిపోయి వుండటంతో ఈ తతంగమంతా కళ్ళనీళ్ళు తుడవటానికే. నేను మౌనంగా కాగితాలు చేతిలోకి తీసుకుని పరిశీలిస్తూ కూర్చున్నాను. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ లిస్టు అది. దానికే అప్లికేషన్లు జతపర్చి వున్నాయి.
    
    ఒకచోట నా చూపు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఒక యువకుడి ఫోటో దానికి అతికించి వుంది. అదికాదు నేను చూస్తూంది. ఆ పేరు,
    
    ఎ. ప్రబంధ్,
    
    s/o అయినంపూడి ఆనందరావు.
    
    నా చేతులు వణకసాగాయి, చప్పున కుర్చీలోంచి లేచి నిల్చున్నాను. కృష్ణమూర్తి ప్రశ్నలాపి నావైపు చూశాడు. నేను పట్టించుకోలేదు. ఆ లిస్టు పట్టుకుని అలాగే బయటికి వచ్చాను. మానేజర్ ఒకరొకర్నే లోపలికి పంపుతున్నాడు.
    
    నా జీవితంలో నేనెప్పుడూ అంత ఉద్వేగం పొందలేదు. వెదక పోయిన తీగ కాలికి తగిలినట్టు అనిపించింది. "ఇతను.... ఇతని ఇంటర్వ్యూ అయిపోయిందా?"
    
    "అయిపోయింది సార్. ఇప్పుడే వెళ్ళిపోయాడు" మానేజర్ అతడి నెంబరు చూసి చెప్పాడు. కొద్దిగా నిరాశ ఆవరించినా పూర్తిగా నిస్పృహ చెందలేదు. అతడి అడ్రసు అప్లికేషన్ లో వుంది.
    
    నిముషం తరువాత కారులో ఉన్నాను.
    
    ఆ అడ్రసు పట్టుకుని ఇల్లు వెదకటం అరగంట పట్టింది. అయితే నేను అనుకున్నట్టు అది ఇల్లు కాదు. ఒక ఇంట్లో ఈ ప్రబంధ్ అనే అతను ముందు గదిలో వుంటున్నాడు.
    
    నేను వెళ్ళేసరికి అతడు బ్రీఫ్ కేసు పట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
    
    అయినంపూడి ఆనందరావులు ఇద్దరు లేని పక్షంలో ఇతడు నా తమ్ముడు "ఎవరు కావాలి మీకు?"
    
    అతడి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, "ప్రమదా ఇండస్ట్రీస్ పార్టనర్ ని నేను" అన్నాను. అతడి మోహంలో వెంటనే మార్పొచ్చింది. "ఏం కావాలి సార్" అన్నాడు.
    
    "ఎక్కడికి ప్రయాణం?"
    
    "ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడే మీ ఆఫీసులో ఇంటర్వ్యూకొచ్చాను". "అవును తెలుసు".
    
    "ఇంటర్వ్యూ అవకపోతే రాత్రి ట్రెయిన్ కి వెళ్దామనుకున్నాను. తొందరగా అయిపోయింది. వెళ్తే ఈ ట్రెయిన్ కే వెళ్ళొచ్చు".
    
    "కార్లో వస్తే దింపుతాను".    

 

    అతడి కళ్ళల్లో పూర్తిగా అయోమయం పోలేదు. అలాగే వచ్చి కూర్చున్నాడు. కారు కదిలింది.

 Previous Page Next Page