"అవును"
"మరి శవాన్ని మీ గదిలోంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి, ఆ గదిలోంచి బయటకి వచ్చే సమయానికి పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ స్పెక్టర్ హోటల్ కు ఎలా రాగలిగాడు? అంత తొందరగా అతడికీ విషయం ఎలా తెలిసింది?"
ఫాస్టస్ నిశ్చేష్టుడయ్యాడు. తను ఈ విషయం గురించి ఆలోచించలేదు-
ఈ లోపులో అతడు బయటకు నడిచాడు. వరుసగా రెండు మూడు గదుల తలుపులు, తన దగ్గిర వున్న తాళం చెవుల "వూచ"తో తీశాడు. మిషన్ కన్నా వేగంగా అతడి వేళ్ళు కదిలి, ఆ హోటల్ రూమ్స్ తలుపుల్ని తీయటాన్ని ఫాస్టస్ ఆశ్చర్యంగా చూడసాగాడు.
మూడు నాలుగు గదులు చూసాక తిరిగి వస్తూంటే అతడన్నాడు- "కేవలం మీ ఒక్క గదికే కెమేరా అమర్చబడింది. బ్లాక్ మెయిలర్ మీకు ఫోన్ లో చెప్పినట్టు హోటల్లో ప్రతి గదికీ కాదు".
ఫాస్టస్ కి తల తిరుగుతున్నట్టు అనిపించింది. అర్థం కాని అయోమయంతో "ఇది... ఇదంతా ఎందుకు?" అని అడిగాడు.
అతడు వినటం లేదు. ఆలోచిస్తున్నాడు.
"నేను హత్య చేస్తున్నప్పుడు ఇలా ఫోటోలు తీసి నన్ను..."
ఫాస్టస్ మాటల్ని కట్ చేస్తూ "ఆమె ఎలా వుంది... వర్ణించగలరా?" అని అడిగాడు అతడు. ఫాస్టస్ ఆమె రూపు రేఖలు చెప్పాడు. వింటూన్న కొద్దీ అతడి మొహం కఠినంగా మారింది. పళ్ళు కొరుకుతూ "-తారకేశ్వరీ" అన్నాడు. అతడి కంఠం చిత్రంగా ధ్వనించింది. ఫాస్టస్ చెయ్యిపట్టుకొని "నాతో రండి" అన్నాడు.
"ఎక్కడికి?"
"చెప్తాను" అతడి కళ్ళలో అదోలాటి కసి కనిపిస్తూంది. ఫాస్టస్ కే భయం వేసింది. అతడు వేగంగా కారు డ్రైవ్ చేస్తున్న విధానం చూస్తూంటే అదే ఆఖరిరోజు అనిపించింది. కారు విమానంలా దూసుకుపోయి ఒక బంగళా ముందు ఆగింది.
కారుచూసి గేటు తీయబోయిన గూర్ఖా "కారులో మనిషి"ని చూసి చప్పున మూసెయ్యబోయాడు.
అతడి చేతిలో పిస్టల్ మెరుస్తూంది. గూర్ఖా మవునంగా తలుపు తెరిచాడు. కారు పోర్టికోలో ఆగింది. ఇద్దరూదిగి మెట్లెక్కారు. హాలు నిర్మానుష్యంగా వుంది. అతడు పైకి నడిచాడు. వెనుకే ఫాస్టస్. అతడికిదంతా ఏదో కలలాగా వుంది. మెట్లుదిగి రాబోతున్న నౌకరు వీళ్ళని చూసి అరవబోయి అతడి చేతిలో పిస్టల్ చూసి అవాక్కయి మౌనం వహించాడు. ఇద్దరూ కారిడార్ లోంచి ముందుకు నడిచారు.
గది కిటికీ దగ్గిర నిలబడి తను లోపలికి చూడకుండా, ఫాస్టస్ తో "చూడండి" అన్నాడు.
తెరిచివున్న కిటికీ తలుపు సందుల్లోంచి లోపలికి చూసిన ఫాస్టస్ తన జీవితంలో ఎన్నడూ కలగనంత షాక్ తిన్నాడు. ఎదుటి దృశ్యం కలా నిజమా అన్న భ్రమకలిగిస్తూంది.
వారం రోజుల క్రితం తన కళ్ళ ముందే కూలిపోయిన ఆ తాగుబోతు భర్త పంచె, లాల్చీతో శృంగార పురుషుడిలా పక్కమీద వెల్లకిలాపడుకుని వున్నాడు. భర్త మరణంతో బొట్టు చెరిపేసుకుని కన్నీరు మున్నీరుగా రోదించిన ఆమె, అతడికి తమలపాకులు చుట్టి అందిస్తూంది.
"రండి" అన్నాడు అతడు అక్కడ పని అయిపోయినట్టు. ఫాస్టస్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. "ఆ... ఆమె ఎవరు?" అని అడిగాడు.
"నాతో సమానంగా ఎత్తులు వేయగల ఒకే ఒక స్త్రీ ... తారకేశ్వరి".
"అతడు?"
"ఆమె భర్త లాంటివాడు. ఆమే అతడిని వుంచుకుందో, అతడే ఆమెని వుంచుకున్నాడో తెలీదు కానీ మొత్తంమీద ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటూ వుంటారు".
"అతడి పేరేమిటి? ఏం చేస్తూ వుంటాడు?"
"ఏమీ చెయ్యడు. కానీ అన్నీ చేస్తాడు. ముఖ్యంగా రాజకీయం. ఈ రాష్ట్రపు రాజకీయాన్నీ, దేశ రాజకీయాల్నీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తూన్న ముగ్గురిలో- అతడు ఒకడు. మీ ముందు ఇంత గొప్పగా నాటకం ఆడిన అతడి పేరు"- ఒక క్షణం ఆగి అన్నాడు. "వంకచెక్కా రామ్మూర్తి".
* * *
"డాక్టర్ ఫాస్టస్..." అన్నాడతడు. "ఏదో యాదృచ్చికంగా యిదంతా జరగలేదు. మీరు హోటల్లో యే రూమ్ లో దిగుతారు-అన్న దగ్గిర్నుంచీ ప్లాన్ వేసి మిమ్మల్నిందులో ఇరికించారు. రామ్మూర్తి యింత గొప్పగా ప్లాన్ వేస్తాడు అని నేను ముందే వూహించకపోవటం నా తప్పు".
"కానీ నన్నెందుకిలా-"
"చెప్తాను... ఈ రోజు సాయంత్రం మీరు ముఖ్యమంత్రికి రిపోర్టు యివ్వాలి. ఈ రామ్మూర్తి మీతో పెట్టబోయే బేరం యేమిటంటే- నీళ్ళలో కలిపే 'డి- ఆలమ్' అన్న మందు చాలా అపాయకరమైందని మీరు రిపోర్టులో సూచించాలి. అది కలుపుతే మరింత ప్రమాదం అని వ్రాయాలి".
"దానివల్ల అతడికేం లాభం?"
"అతడికి లాభం లేకపోయినా లోహియాకి నష్టం! ఈ ముగ్గురిలో లోహియా ఒకడు... చెప్పానుగా- ఈ ముగ్గురూ ఒకరినొకరు రాక్షసుల్లా పీక్కు తినటానికి ఎప్పుడూ చూస్తూ వుంటారని ... డి-అలమ్ ఫాక్టరీ లోహియాది. మీరిచ్చే రిపోర్టుతో అతడు నాశనం అవుతాడు".
"ఈ యుద్ధంలో మూడో వాడెవడు".
అతడు తాపీగా "నా తండ్రి- జి.కె .... జి. కృష్ణమూర్తి" అన్నాడు.
ఒక్కొక్కటి ఒక్కొక్క బాంబులా తగుల్తూంది ఫాస్టస్ కి. అర్థం చేసుకోవటానికి చాలా టైమ్ పట్టింది. దగ్గరగా వచ్చి అతడి చేతులు పట్టుకొని "నాకంతా అయోమయంగా వుంది" అన్నాడు - "నేనేం చెయ్యను?"
"మీరు మీ రిపోర్టు యివ్వండి డాక్టర్ ఫాస్టస్".
"వారం రోజులుగా నా మనసు మనసులో లేదు. అసలేమీ నా బుర్ర కెక్కలేదు. ఏ పనిమీద మీ ప్రభుత్వం నన్ను యిక్కడికి పిలిపించిందో ఆ పని అసలే జరగలేదు. ఇక సాయంత్రం లోపులో ఏం రిపోర్ట్ ఇవ్వను..." అంటూ ఏదో స్ఫురించినవాడిలా "అన్నట్టు నువ్వు లిమ్నాలజీ మనిషివేగా. పైగా నీకిక్కడ వాతావరణమంతా బాగా తెలుసు. ఆ రిపోర్ట్ నువ్వే యివ్వు. నేను సంతకం పెడతాను- నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలుసు. కానీ ఈ పరిస్థితుల్లో యింకో మార్గం లేదు".
"నే నివ్వబోయే రిపోర్టు మిమ్మల్ని మరింత ఇబ్బందిలో పడేస్తుంది డాక్టర్".
"ఎందుకని?"
"నేను లోహియా తాలూకు మనిషిని కాబట్టి"
"మైగాడ్- మైగాడ్-" అంటూ గొణిగాడు ఫాస్టస్. "ఈరోజు నాకు మతిపోతోంది".
అతడు మాట్లాడలేదు.
"నువ్వు జి.కె. కొడుకునంటావ్ - లోహియా మనిషినంటావ్-"
అతడు చెప్పటం ప్రారంభించాడు. చెల్లెలి ఫోటోలతో లోహియా తన తండ్రి మీద బ్లాక్ మెయిల్ చేసి వత్తిడి తేవటం దగ్గర్నుంచీ, తను లిమ్నాలజీలో డాక్టరేట్ సంపాదించటం వరకూ చెప్పాడు.