ఇద్దరూ విడిపోయారు.
* * *
శుక్రవారం ఉదయం పదిగంటలకు -
శైలజ తెల్లచీరె కట్టుకుని, తెల్లజాకెట్టు వేసుకుని పోర్టు స్టేషను దగ్గర నిలబడివుంది. ఎండవేడికి కందిన ఆమె ముఖం ప్రశాంతమైన వెలుగులో మెరుస్తోంది.
ఫణి ఎదురుగా వచ్చాడు.
"ఫణీ! నేను వచ్చాను-నీకంటే ముందుగానే."
"శైలూ! నేను అదృష్టవంతుడ్ని."
"ఫణి! ఇప్పుడేం చేద్దాం?"
"రా, చెబుతాను."
ఇద్దరూ ఇవతలకు వచ్చాక, రిక్షా ఎక్కారు.
ఫణి అంతకుముందే ఏర్పాట్లన్నీ చేసుకువచ్చాడు. రిజిస్ట్రార్ ఆఫీసుదగ్గర అతని స్నేహితులు ఎదురుచూస్తున్నారు.
శైలజకు అంతా కలలా, గిలిగింతగా వుంది. అంతా కలసి పదిపదిహేను నిముషాల్లో ముగిసిపోయింది. రిజిస్ట్రార్ ముందు సంతకాలు పెట్టేశారు. సాక్షి సంతకాలూ అయిపోయినాయి. పెళ్ళయిపోయాక దగ్గరలోనే వున్న రెస్టారెంటుకు వెళ్ళి అంతా కూల్ డ్రింక్స్ తాగారు. అదే పెళ్ళి విందు.
శైలజకు సంతోషంగా వుంది. ఒకింత దుఃఖంగా వుంది. ధైర్యంగా వుంది, తెలియని భయంగా వుంది. గర్వంగా వుంది, ఏమూలో కొద్దిపాటి సంకోచం.
భర్తని తీసుకుని ఇంటికి వెళ్ళగానే మొదట ఆమె తండ్రికి శోష వచ్చినంత పనయింది. తేరుకున్నాక కోపం వచ్చి ఇంత ఎత్తున ఎగిరాడు. తర్వాత భవిష్యత్తు తలుచుకుని ఒణికిపోయాడు. ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఫణి అతనికి ధైర్యంచెప్పాడు.
"రండి భోంచేద్దాం" అంది శైలజ.
క్రొత్త ఆవకాయ, మజ్జిగతో అతని మొదటిభోజనం అత్తవారింట్లో చేస్తోంటే, పిల్లలంతా కిటికీలోంచి విడ్డూరంగా చూస్తున్నారు.
"వెడతాం నాన్నా!" అని కాళ్ళకి దణ్ణం పెడుతూన్న కూతుర్ని దగ్గరకు తీసుకుని ఆయన చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు.
"ఏమ్మా! రెండు రోజులు ఉండకూడదా?"
"మళ్ళీ వస్తాం నాన్నా."
"అన్నట్టు, ఇందాక వచ్చిందమ్మా" అని ఓ కవరు అందించాడు.
ఆ హడావుడిలో తెరచి చూసుకోలేదు. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఫణితో పెద్దాపురం బయల్దేరింది.
హఠాత్తుగా ఇంట్లోకి ఓ అందమైన అమ్మాయిని తీసుకొచ్చి "ఇదిగో మీ వదిన" అని ఫణి ప్రకటించేసరికి వసుమతి మొదట్లో తెల్లబోయినా, మెల్లిగా తట్టుకుంది. అంతేకాదు సంతోషించింది. పిల్లలందరూ చుట్టూచేరి వింతగా బొమ్మని చూసినట్టు చూస్తున్నారు.
"వసూ! పరిస్థితుల్నిబట్టి ఇలా తొందర పడాల్సివచ్చింది" అన్నాడు ఫణి చెల్లెలితో తప్పు చేసినట్లు.
"ఆ పరిస్థితులేమిటో నాకు తెలియదుగానీ, అవి నిన్ను చుట్టుముట్టినందుకు అభినందిస్తున్నాను" అన్నది వసుమతి.
ఆ రాత్రి పిండివంటలతో భార్యాభర్తలిద్దరకూ భోజనంపెట్టి దగ్గరకూర్చుని కొసరి కొసరి తినిపించింది. "అదేం లేదు వసూ, అక్కర్లేదు" అని ఫణి గోల పెడుతున్నా, ఓ గదిని పిల్లలందర్నీ బయటకుతోసి, శుభ్రంచేసి హాయిగా తెల్లని పక్కవేసి ఇద్దర్నీ లోపలకు తోసింది.
ఫణికి అన్నీ ఇలా తరుముకొస్తున్నందుకు అదోలావున్నా, కొత్తగా, గొప్పగా, కావ్యనాయికలా గదిలో గోచరించిన శైలజని చూసి పులకించిపోయాడు.
"శైలూ!" అన్నాడు దగ్గరకెళ్ళి చిన్నగా.
"ఊఁ"
"కోపంగా ఉందా?"
"ఉంది."
"దేనికి?"
"దేనికని, కోపంగా వుందా అని అడిగావు, దానికి."
"కాదు. నిన్ను దురాక్రమణ చేశానేమోనన్న అనుమానం. అందుకని..."
"చెయ్యి దాటిపోయిందిగా, గతం వద్దు. ముందులోకే తొంగిచూద్దాం ఫణీ!"
"థాంక్యూ శైలూ!" చేతులురెండూ ఆమె భుజాలవెనగ్గా వేసి దగ్గరకు లాక్కున్నాడు.
తనకి ఇదివరకు తెలిసిన శైలజ వేరు. ఈమె వేరు. ఈమె కవ్విస్తోంది. రా రమ్మని పిలుస్తోంది. తనలోకి రమ్మంటోంది.
ప్రక్కమీద వాలబోతోన్న శైలజకు ఎందుకొచ్చిందో-హఠాత్తుగా ఉదయం తండ్రి ఇచ్చిన కవరు గుర్తొచ్చింది. అదేమిటో సరిగ్గా చూడనుకూడా చూడలేదు. ఎందుకనో-అలాంటి సమయంలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కనిపించి "ఒక నిముషం" అంటూ అతన్ని మృదువుగా విడిపించుకుని లేచి కిటికీ దగ్గరవున్న హ్యాండ్ బ్యాగ్ దగ్గరకెళ్ళింది. ఫణి ఆమెవంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
శైలజ కవరు తెరిచింది. జనతా ఫార్మాస్యూటికల్స్ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు. మరునాడు ఉదయం పదిగంటలకల్లా హాజరవాలి.
"అయ్యయ్యో!" అని గతుక్కుమంది.
"ఏమిటి?" అంటూ ఫణి దగ్గరకు వచ్చాడు. ఆమె ఉత్తరం అందించింది.
"ఇప్పుడెలా?"
"రేపు ప్రొద్దుటికల్లా విజయవాడలో వుండాలి."
శైలజ మేనత్త, కాబోయే మొగుడు, ఆమె తండ్రి రాసిచ్చిన నోటు అతని కళ్ళముందు మెదిలాయి. క్షణంలో, అతన్లో బుసలుకొట్టిన కోరికలన్నీ ఎటో ఎగిరిపోయినాయి.
"శైలూ! సూట్ కేసు తీసుకో, నిన్ను ఏదో ఒక బస్సు ఎక్కిస్తాను."
తలుపులు తెరచుకుని ప్రయాణానికి సిద్ధపడిన వాళ్లలా బయటకు వచ్చిన అన్నయ్యనూ, వదిననూ, చాపమీద పడుకునివున్న వసుమతి చూసి తెల్లబోయింది. ఫణి రెండుముక్కల్లో ఆమెకర్థమయ్యేలా చెప్పాడు. వసుమతి కన్నెపిల్ల అయినా, ఆ సమయంలో అలాంటి బాధను అర్థంచేసుకోవటానికి వున్న ఏకైక ప్రేక్షకురాలు. నిట్టూర్పును అణచుకుంటూ నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది.
* * *
రెండురోజుల తర్వాత విజయవాడనుంచి ఉత్తరం వచ్చింది.
"ఫణి!
గుడ్ న్యూస్! నాకు ఉద్యోగం వచ్చింది. చాలామంచి ఉద్యోగం. జీతం ఏడువందలు.
నీకు కోపమొస్తుంది. నీకు చెప్పకుండా నేను ఉద్యోగంలో చేరిపోయాను. ఎందుకో తెలుసా? ఈ ఉద్యోగం పెళ్ళికానివారికే ఇస్తారు. అన్నీ కఠినమైన నిబంధనలు. అయినా అబద్ధం చెప్పేశాను పెళ్ళికాలేదని. మన పరిస్థితులూ, బాధ్యతలూ అన్నీ ఆలోచించి ఈ పనిచేశాను. మా కోసం, మనకోసం, నాకోసం ఈ పనిచేశాను. నువ్వుకూడా చదువు పూర్తిచెయ్యాలి. మన ఆశయం నెరవేరాలి. ఈ విషవలయంలోంచి మనం విముక్తులం కావాలి.
అందుకనే ఈ పని చేశాను.
ఈ విషయం చెప్పటానికి నేను తిరిగి పెద్దాపురం వస్తే, నువ్వు అభ్యంతరం చెబితే, నీ కళ్ళలోకి చూస్తూ నేను కరిగిపోతే నేను లొంగిపోవచ్చు. అందుకని మనసు రాయిచేసుకుని వెంటనే డ్యూటీలో చేరిపోయాను.
కోపం వస్తోందికదూ? ఏం చెయ్యను! ఎన్నో సమస్యలు మనసులో వుంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఈ ఉత్తరం నేను పోస్టాఫీసులో కూర్చుని రాస్తున్నాను. వాళ్ళ దృష్టిలో పెళ్ళి కానిదాన్ని. కాబట్టి విడిగా వుండటానికి వీల్లేదు. ఆ కంపెనీ కాలనీలో ఓ కాటేజీ ఇచ్చారు. నువ్వు అక్కడికి ఉత్తరాలు రాయటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఉత్తరాలన్నీ వాళ్ళు విప్పిచూస్తారని నా ఉద్దేశం. అంత కఠినంగా వున్నాయి వాళ్ళ నిబంధనలు.
వసుమతి పేరుతో నేనే ఉత్తరాలు రాస్తూ ఉంటాను.
ఎప్పటికి కలుసుకుంటానో తెలియదు, సెలవా?
నీ
శైలు."
ఫణి నిశ్చేష్టుడయ్యాడు, కాని నీళ్ళు కారిపోలేదు.
* * *