సీసాలూ,గ్లాసులూ చూడగానే ఒళ్లు మండింది సుమతికి. వెనక్కెళ్ళబోయింది. "కమాన్ ......సిస్టర్ ....రండి" అంటూ లేచి వెనకాల వెళ్ళాడు డే. అయిష్టంగానే వచ్చి కూర్చుంది.
సుబ్బలక్ష్మి ముందొక గ్లాసు. సుమతి ముందొక గ్లాసూ వుంచాడు డే.
"ఏమిటి మాక్కూడానా?" అసహ్యంగా అంది సుమతి.
"ఏం? మీరు మనుష్యులు కారా?" నవ్వుతూ అన్నాడు డే.
"మనుష్యులైతే తాగాలా?"
"తాగితే తప్పా?"
"తప్పే."
"ఎందుకని?"
"తాగుడు అలవాటయిపోతుందని."
"కాఫీ అలవాటు కాదా?"
"అలవాటే కానీ దానివల్ల ప్రమాదం లేదు."
"శృతి మించికపోతే దేనివల్లా ప్రమాదం లేదు."
"శృతి మించి తీరుతుంది. తాగుడలాంటిది."
"పొరపాటు. తాగే ప్రతీవాడూ, తాగుబోతుకానక్కర్లేదు"
"ఏమో! అదంతా నాకు తెలిదు. నాకిష్టం లేదు."
"మీ భర్త ఇష్టాయిష్టాలతో మీకు ప్రమేయం లేదా?"
షాక్ తిన్నట్టు చూచింది సుమతి.
"నాకు తెలుసు, అతని ఇష్టాన్ని మీరు కాదనలేరు"
నవ్వుతూ అన్నాడు డే.
గోవింద్, సుబ్బలక్ష్మి కూడా నవ్వేశారు
"చియర్స్" అంటూ గ్లాసు నోటిదగ్గర పెట్టుకుకున్నారు. సుబ్బలక్ష్మికూడా "చియర్స్" అంటూ సిప్ చేసింది.
వెఱ్ఱిదానిలా చూస్తున్న సుమతి చేతికి గ్లాసందించాడు డే.
"ఊఁ....కానియ్" అన్నాడు గోవింద్.
"డోంట్....ఫన్ అక్కా....మరీ బతిమాలించుకోకు.
'వైల్ .... ఎట్.... రొమ్....బిహేవ్.... ఎ .....రోమన్....' 'రోములో వున్నప్పుడు, రోమన్ లాగే' వుండాలి. కానీయ్....' అంది సుబ్బలక్ష్మి.
సుమతికి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయ్. ఈ తాగేవాళ్ళకి, వాళ్ళ మధ్య తాగని వాడేవాడయినా వుంటే, ఎంతబాదో.....వాణ్ణి తాగించందే వదిలిపెట్టరు. ఏమిటో! ఆ మనస్తత్వం అనుకుంటూ బలవంతంగా చేతిలో పెడుతూన్న గ్లాసు నందుకుంది సుమతి.
నోట్లో పోసేశాడు గోవింద్.
బలవంతంగా, ఆముదం మింగినట్టు మింగుతూన్న సుమతిని చూసి, చప్పట్లు కొట్టారందరూ.
నోరంతా యమచేదుగా వుంది. మొహం అదోలా పెట్టింది సుమతి. ప్లేట్లోంటి వల్లీలు తీసి నోట్లో వేసింది సుబ్బలక్ష్మి. చేదుకొంచెం తగ్గింది. ఎలాగయితేనేం సుమతిచేత రెండు గ్లాసులు తాగించారు.
ఎంతకీ ఎవరూ భోజనానికి రాకపోవడంవల్ల. ఆయమ్మ పిలవడానికొచ్చింది. అక్కడి దృశ్యం చూసి వెనక్కి వెళ్ళి పోయింది. ఆయమ్మని చూడగానే, సుంతికి ఏడుపోచ్చింది. వెక్కివెక్కి ఏడవడం మొదలెట్టింది, తాగుడు ఆపేసి, అందరూ భోజనాలకు లేచారు. ఏడవొద్దని సుమతి కళ్లు తుడిచాడు గోవిందు. లేవబోయిన సుమతి తుళ్ళిపోయింది. మెల్లగా చెయ్యి పట్టుకుని నడిపించి మంచంమీద పడుకోపెట్టాడు గోవింద్ భోజనం వద్దంది సుమతి. నాలుగు మెతుకులు కొరికారు గోవిందు, డే సుబ్బలక్ష్మి. డే వెళ్ళిపోయాడు. సుబ్బలక్ష్మి తన గదిలో కెళ్ళి పడుకుంది. గోవిందూ అప్పుడే కళ్లు మూసుకున్నాడు. తాగి పడున్న సుమతిని చూస్తే దుఃఖం ముంచుకొచ్చింది ఆయమ్మకి భోజనం సహించలేదు మజ్జిగ తాగి ఊరుకుంది. ఏడిచే పాపనీ, అల్లరి చేస్తూ ఇటూ అటూ తిరుగుతూన్న చింటూని పట్టుకోలేక సతమతమవుతోంది ఆయమ్మ.
* * *
సూర్యుడు పడమటికి చేరుకుంటున్నాడు. గడియారం ఆరుగంటలు కొట్టింది. ఒక్కొక్కరే ఒళ్లు విరుచుకుంటూ లేచారు. సుమతి ఇంకా పడుకునేవుంది. మెల్లగా వీపుతట్టి లేపాడు గోవింద్. ఆవలిస్తూ కళ్ళుతెరచి చూసింది సుమతి. శరీరం గాలిలో తెలిపోతుంతా అన్నంత తేలిగ్గా అనిపించింది. లేచి కూర్చుంది. "బాగా నిద్రపోయావు" లాలనగా అన్నాడు గోవింద్.
"చాలా కాలం తరువాత ఒళ్ళు తీలీకుండా పడుకున్నాను." అంటూ లేచింది సుమతి.
ఆయమ్మ అందరికీ కాఫీ లందించింది.
"అమ్మా! నాన్నగారింకా రాలేదా?" అన్నాడు గోవింద్ ఆవిడ పక్కనే మంచంమీద కూర్చుంటూ.
"ఇంకా రాలేదురా! ఎక్కడి కెళ్ళారో ఏమో! భోజనం కూడాలేదు" అంది తల్లి.
ఫోన్ మ్రోగింది. వెళ్ళి తీసాడు గోవింద్.
"హల్లో.....గోవిందున్నారా?"
"ఆఁ...నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు?"
"నేను డాక్టర్ భాస్కర్ రావుని. కె.జి. హెచ్. నుంచి మాట్లాడు తున్నాను"
"ఏంటీ? కె.జి. హెచ్. ఆసుపత్రా?"
"అవును. మీ నాన్న మధ్యాహాం రోడ్డు దాటుతూ కారుకిందపడ్డారు. బాగా దెబ్బలు తగిలాయి. తలకి బలమైన గాయాలు తగిలాయి. కట్లు వేశాం. కారు తాలూకు అద్దంముక్కలు పగిలి కంట్లోకి పోయాయి. కన్ను ఆపరేషన్ చేశాం. అప్పటినుంచి ఆయన స్పృహలో లేనందున మిగతా వివరాలు ఏవీ తెలీనందున చెప్పలేక పోయాం. ఇప్పుడే పోలీసులు ప్రమాదం జరిగిన స్ధలంలో కొన్ని కాగితాలు దొరికాయని పట్టుకొచ్చారు. డ్రైవరు తాగి కారు నడుపుతున్నాట్ట అతన్ని అరెస్టు చేశారు. ఇంటి పన్నుకట్టిన రశీదు, దాంట్లో పేరు చూసి మీ నాన్నగారి పేరు కనుక్కున్నారు." గుక్కతిప్పు కోకుండా డాక్టరు చెబుతూన్నదంతా విని పిచ్చివాడిలా అయిపోయాడు గోవింద్. ఏం మాట్లాడాలో తెలీక అలాగే కొయ్యబారి పోయినట్టు నుంచుండి పోయాడు. కళ్ళలోంచి నీరు చెంపలమీదుగా ప్రవాహంలా జారిపోతోంది.
"ఏమయిందండీ?" ఆదుర్దాగా అడిగింది సుమతి.
"హల్లో.....హల్లో...." అవతలి నుంచి ఫోనులో పిలుస్తూనే వున్నారు.
గోవిందు చేతిలోంచి 'రిసీవర్' లాక్కుంది సుబ్బలక్ష్మి.
"హల్లో .... చెప్పండి" అంది.
"గోవిందు లేరా?"
"ఉన్నారు. కాని అతను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడుస్తున్నారు. ఏం జరిగిందో చెప్పడంలేదు" జరిగిందంతా చెప్పాడు డాక్టర్ భాస్కరరావు.
"అలాగా? ఇప్పుడే వస్తున్నాం. థాంక్యూ," అంటూ ఫోన్ పెట్టేసింది సుబ్బలక్ష్మి.
"ఏమయిందే?" కంగారుగా అరచింది కామాక్షమ్మగారు.
"ఏంలేదు అత్తయ్యా.... మరేమో .... మామయ్యకి...ఏంలేదులే."
"ఏం లేకపోతే, ఎందుకా తొట్రుపాటు? ఏం జరిగిందో చెప్పు" మంచం దిగడానికి ప్రయత్నిస్తూ అంది."
"చెప్పు లక్ష్మి" సుమతి కూడా కంగారుగానే అడిగింది. ఏదో కీడు శంకిస్తోంది తన మనసు. ఇక లాభంలేదని డాక్టర్ చెప్పిన దంతా చెప్పింది సుబ్బలక్ష్మి.
మరుక్షణంలో ఆ యింట్లో శోకదేవత తాండవం చేసింది. ఏడ్చి ఏడ్చి సృహకోల్పోయింది కామాక్షమ్మగారికి డాక్టరుకి కబురు చేశారు. సంగతంతా విని డాక్టర్ కామాక్షమ్మగారికి మత్తు ఇంజక్ష నిచ్చారు. ఆయమ్మని చూసుకోమని చెప్పి గోవిందు, సుమతి సుబ్బలక్ష్మి ఆసుపత్రికి బయలుదేరారు. వెతుక్కుంటూ వెళ్ళి డాక్టరుని కలుసు కున్నారు. తలకి కట్టు, కళ్ళకి కట్టు వంటినిండా దెబ్బలు మనిషిని గుర్తుపట్టలేక పోయారు.