జాతికి అంకితం
చరిత్రాత్మకమైన స్థలం కొండపల్లి. శత్రువుల కభేద్యంగా పేరొందిన యిక్కడి ఖిల్లా సుప్రసిద్ధం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గణుతికెక్కినవి కొండపల్లి బొమ్మలు__ఇక్కడి పనివారి హస్తకళాకౌశలానికి తార్కాణాలు. చరిత్ర ప్రసిద్ధమైన ఈ చోటు నేడు మరోవిధంగా చరిత్రను సృష్టిస్తున్నది. ఈనాడు యిక్కడ తయారయ్యేవి అందాల బాలలకు ఆనందాలు పంచే రంగురంగుల బొమ్మలు కావు, బ్రహ్మాండమైన పారిశ్రామిక కర్మాగారాలకు పనికివచ్చే భారీ యంత్ర సామాగ్రి. ఎంతో అభివృద్ధిచెందిన దేశం సోవియట్ రష్యాకే యంత్ర పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి, తొలిదశలోనే చేరుకొన్న ప్రజల సంస్థ __హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగు కర్మాగారానికి కొండపల్లి పుట్టినిల్లు కావటం తెలుగునాడంతా గర్వించదగిన శుభ పరిణామం. ప్రగతి పథంలో పురోగమిస్తున్న ప్రజల సంస్థ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగు కర్మాగారాన్ని జాతికి అంకితం చేయటానికి నాకెంతో ఆనందంగా వుంది నేడు.
ఈ సంస్థ సాధించిన అసాధారణమైన అభివృద్ధి ఎంతో ప్రశంసనీయమని చెప్పక తప్పదు. సామాన్యంగా పారిశ్రామిక సంస్థలు నిర్మాణం పూర్తయిన కొన్నాళ్లకు గాని, కొన్ని సందర్భాల్లో కొన్ని ఏళ్లకు గాని ఉత్పత్తిని ప్రారంభింపజాలవు. అటువంటిది నిర్మాణం యింకా పూర్తికాకుండానే ఈ సంస్థ ఉత్పత్తిని సాధించడం ఎంతో అరుదైన సంగతి. అంతేకాదు. మొదటిదశ పూర్తయిన సంవత్సరంలోనే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం ఎంతో అభినందనీయం.
ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడమే కాదు, ఉత్తమ స్థాయిని అందుకోవడం కూడ మహత్తర విశేషం. 1981లోనే మద్రాసులో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో ఈ సంస్థ రూపొందించిన splitting మెషిన్ అత్యుత్తమమైనదిగా ఎంపిక కావడం ఇందుకు నిదర్శనం.
ఏ ప్రాజెక్టును చేపట్టినా అనుకున్న అంచనాకన్నా అనేక రెట్లుగా నిర్మాణ వ్యయం పెరిగిపోవడం మనకు తెలుసు. నిజానికి ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణ వ్యయం ఏటా 15 శాతం పెరుగుతున్నది. అయినప్పటికీ నిర్ణీత పద్ధతిలో ముందుగా అంచనా వేసిన పెట్టుబడితోనే ఈ ఫ్యాక్టరీ మొదటిదశ నిర్మాణం పూర్తికావడం ఒక ప్రత్యేకత, విశిష్టత.
దేశంలోగల హెవీ మెషినరీ సంస్థలన్నీ డోలాయమాన స్థితిలో వుండగా, ఆంధ్రప్రదేశ్ సంస్థ మాత్రం వినూత్న ఉత్సాహంతో ముందడుగు వేస్తూ వుండడం, మనందరకూ గర్వకారణం. ఇందుకు గర్వకారణమైన, ప్రశంసాపాత్రమైన ప్రగతిని సాధించిన మీ అందరికి ఇవే నా అభినందనాంజలులు.
ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రమని మీకు తెలుసు. ప్రకృతి మనకు అపారమైన వనరులను ప్రసాదించింది. పరిశ్రమలకు ఎంతో అవసరమైన నల్ల బంగారం-బొగ్గు మన సొత్తు. తెలుగుతల్లి ఒడిలో ఎంతో విలువైన ఖనిజ సంపద దాగివుంది. గోదావరి, కృష్ణ, పినాకినుల వంటి జీవనదులు తెలుగునాటిని పరమపావనం చేస్తున్నాయి. విద్యుత్తు ఉత్పాదనలో మన రాష్ట్రం చక్కటి ప్రగతిని సాధించింది. తెలుగు బిడ్డ కష్టపడి పనిచేయడానికి, తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి పేరెన్నికగన్న శ్రామికరత్నం. రాష్ట్రంలో పారిశ్రామిక శాంతి నెలకొనివుంది. ఇంతగా అనుకూల వాతావరణం వున్నా, పరిశ్రమలను సక్రమ పద్ధతిలో పెంపొందించడానికి జరుగవలసినంతగా కృషి జరుగలేదని చెప్పడానికి విచారిస్తున్నాను. సహజ సంపదలను సక్రమంగా వినియోగించుకొని దరిద్రంపై దాడిని ఉధృతం చేయడానికి, సౌభాగ్య సంపదలను సాధించుకోడానికి పారిశ్రామికీకరణం ఏకైకమార్గం. ఉత్సాహంతో ఉరకలువేస్తూ, ముందుకు సాగవలసిన మన యువతను నిరాశా నిస్పృహలలో ముంచెత్తి నీరసింపజేస్తున్న నిరుద్యోగ రక్కసిని నిర్మూలించడానికి పరిశ్రమలను పెంపొందించుకొనడంకన్నా వేరే మార్గంలేదు. అయితే స్వరాజ్యం వచ్చినా, స్వరాష్ట్రం వచ్చినా మన పరిస్థితిలో ఏం మార్పు కలిగింది? ఆశతో, ఆకాంక్షలతో నిరీక్షించే జాతికి ఏం జరిగింది? నాగార్జున ఎరువుల కర్మాగారం గురించి మంగళగిరి టైర్ల కర్మాగారం గురించి దశాబ్దాలుగా వింటూనే వున్నాం. అంచనాల వంచనలకు బలియై, అకారణ ఆలస్యానికి గురియై అట్టడుగున పడివున్న ఈ కర్మాగారాల నివేదికలను వెలికితీసి, వాటి నిర్మాణానికై అవసరమైన అన్ని చర్యలను తీసుకొంటున్నాం. లోగడ జరిగిన ఆలస్యాలను, లోపాలను సవరించుకొని, చక్కదిద్దుకొని అచిరకాలంలోనే ఈ కర్మాగారాలను నిర్మించడానికి ప్రభుత్వం చురుకుగా కృషిని కొనసాగిస్తున్నది. తెలుగువారి ఆశలకు, ఆకాంక్షలకు ఆలంబన ఈ పరిశ్రమలు. మీ అందరి అండదండలతో, సహాయసహకారాలతో ఈ కర్మాగారాలను త్వరలోనే నిర్మించుకోగలమన్న పూర్తి విశ్వాసం నాకుంది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని ఆశిస్తున్నాను.
వ్యవసాయిక రంగంలో సుప్రతిష్టితమై, భారీ పారిశ్రామికీకరణ మార్గంగా ఇప్పుడు మన రాష్ట్రం పురోగమిస్తున్నది. మనం "గ్రామోదయ' కార్యక్రమాన్ని చేపట్టినా, 'దీప' కార్యక్రమాన్ని అమలుపెట్టినా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలను స్థాపించటం మన ధ్యేయం. నిజానికి ఏ భారీ కర్మాగారాన్ని మనం చేపట్టినా, ఆ మహా నిర్మాణం చుట్టూ అల్లుకొనిపోగల అనుబంధ పరిశ్రమలను ముందుగానే యోచించుకొని స్థాపించుకొనాలి__యువత స్వయం ఉపాధి పథకాల రూపంలో. అప్పుడే భారీ పరిశ్రమల స్థాపనవల్ల నిజమైన ప్రయోజనం, ఉపయోగం సిద్ధిస్తాయి.
పారిశ్రామికీకరణ సందర్భంలో మనం గుర్తుంచుకోవలసిన అంశం ఒకటుంది. అభివృద్ధి ఎంత వాంఛనీయమైనా అభివృద్ధితోబాటు పిలవని పేరంటంలా అడుగిడే వాతావరణ కాలుష్యం విషయంలో మనకు ఎంతో జాగరూకత వుండాలి. పరిశ్రమల నిర్మాణ పథకాలలోనే కాలుష్య నివారణ అంతర్భాగంగా రూపొందాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ సంస్థ ఆదర్శవంతంగా ముందడుగు వేయగలదని ఆశిస్తున్నాను. కాలుష్య నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడమేగాక, అసలు ఈ కర్మాగారంలోనే కాలుష్య నివారణకు ఉపయోగపడే యంత్రాల నిర్మాణాన్ని చేపట్టడం విశేషించి హర్షదాయకం.
పారిశ్రామికీకరణ జరగాలంటే ఆ మహత్తర ప్రయత్నంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఈ హెవీ మెషినరీ సంస్థ విషయంలో ప్రజలే ముందుకు వచ్చి, పెట్టుబడి పెట్టి, ఈ సంస్థను నిజమైన ప్రజల సంస్థగా తీర్చిదిద్దారు. ఈ సంస్థ త్రొక్కిన బంగారు బాట ఇతర కర్మాగారాలకు, నిర్మాణాలకు ఆదర్శప్రాయం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కర్మాగార స్థాపనకు వాటాలు తీసుకొని సహకరించిన ప్రజాసామాన్యాన్ని, ఈ పరిశ్రమ క్రమాభివృద్ధిలో పాలుపంచుకొన్న అధికార, అనధికార ప్రముఖులను, ఉద్యోగులను ప్రధానంగా కార్మిక సోదరీ సోదరులను ఈ శుభ సందర్భంలో హృదయపూర్వకంగా మరొక్కసారి అభినందిస్తున్నాను.
ఈ కర్మాగార స్థాపనలో సహకరించి, సహాయపడిన ఆర్థిక సహాయసంస్థలకు, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చిన విదేశీ సంస్థలకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
ప్రజల తోడ్పాటుతో, ప్రజల సంస్థగా పేరుపొంది జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అచిరకాలంలోనే మంచిపేరు గడించి ముందడుగు వేస్తున్న ఈ సంస్థను_అత్యంత శ్రద్ధాసక్తులలో, అనంత పునీతభావంతో జాతికి అంకితం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ, ఇంజనీరింగ్ సంస్థ అంకితోత్సవ సందర్భంగా విజయవాడలో 1983 నవంబరు 9న...