భారతదేశంలో ముఖ్యంగా తెలుగునాట గ్రంథాలయోద్యమానికి ఒక ప్రత్యేకత, విశిష్టత వున్నాయి. గ్రంథాలయోద్యమం భారత స్వాతంత్ర్యోద్యమంలో, జాతీయోద్యమంలో అంతర్భాగంగా నిర్వహించబడింది. వూరూర, వాడ వాడ జాతీయోద్యమాన్ని ప్రచారం చేయడంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించాయి. గ్రంథాలయోద్యమం జాతీయోద్యమానికి పట్టుగొమ్మగా విలసిల్లింది.
స్వాతంత్ర్యం వచ్చింది. ఒకటి కాదు. రెండు కాదు. 35 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఒకనాడు జాతీయోద్యమంలో, గ్రంథాలయోద్యమంలో గోచరించిన అమూల్యమైన త్యాగ, సేవా భావాలు ఎక్కడ? ఒకనాడు స్వాతంత్ర్యోద్యమంలో ముందుకు వురికి ధన మాన ప్రాణాలను వొడ్డి దేశం కోసం అష్టకష్టాలు ఆనందంతో సహించిన ఆ త్యాగమూర్తులు ఎక్కడ? ఏ స్వాతంత్ర్యం కోసం మనం కలలు కన్నామో ఆ స్వాతంత్ర్యం వచ్చినా స్వాతంత్ర్యం తెస్తుందనుకున్న స్వర్గం దివినుండి భువికి దిగి రాలేదు సరికదా పేద నిరుపేదై, ధనికులు అతి ధనికులై, మితిమీరిన ఆర్థిక వ్యత్యాసాలతో, దుర్భర దారిద్ర్యంతో, వేదనతో సంఘం నీరసించిపోయింది.
అజ్ఞానంలో, దారిద్ర్యంలో కొట్టుమిట్టాడిపోతున్న సమకాలీన సమాజాన్ని ఉద్ధరించి, ముందుకు నడిపించి, తిరిగి జాతిలో నూతన జీవం పోయడానికి నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుకుగా పట్టుదలతో కృషి ప్రారంభించింది. అనేక కార్యక్రమాలను సంఘ సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమాలన్నీ గ్రామ గ్రామాన, విరివిగా ప్రచారం కావలసిన ఆవశ్యకత ఎంతైనా వున్నది. ఈ మహోద్యమంలో గ్రంథాలయాలు ప్రధానపాత్ర వహించాలి. ప్రతి గ్రంథాలయం ఏవో నాలుగు పుస్తకాలను, రెండు పత్రికలను వుంచే స్థలంగా కాకుండా గ్రామ జీవితంలో, గ్రామ సౌభాగ్యంలో, గ్రామ చైతన్యంలో పాలుపంచుకొనే మహోన్నత సంస్థగా, ముఖ్యంగా యువశక్తి కార్యస్థానంగా రూపొందాలి. ప్రభుత్వం సాగిస్తున్న అనేక కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రజల సహాయసహకారాలను అభివృద్ధి కృషికి లభ్యమయ్యేలా ప్రతి గ్రంథాలయం ఒక సమాచార కేంద్రంగా, ఒక సమాజాభివృద్ధి కేంద్రంగా, ఒక సంస్కృతీ కేంద్రంగా విస్తరించాలి.
గ్రంథాలయోద్యమం నాడు జాతీయోద్యమ అంతర్భాగంగా ఎలా వేళ్లు పాతుకుపోయిందో, జాతి సేవ చేసిందో ఆ విధంగానే నేడు జాతి పునర్నిర్మాణ కార్యక్రమంలో, గ్రామీణాభివృద్ధి ఉద్యమంలో, సమాజ సంక్షేమ ప్రగతి కార్యక్రమంలో ఒక భాగంగా రూపొందాలి.
గ్రంథాలయోద్యమం పురోగతికి ప్రభుత్వం తన శాయశక్తులా చేయకలిగింది తప్పక చేయగలదు.
గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా 1983 నవంబరు 20న హైదరాబాదులో.