Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 17

                                 

 

ఆగని పయనం

    1956లో ఇదే నెల, ఇదేరోజు అవతరించింది ఆంధ్రప్రదేశ్__ స్వతంత్ర భారతావనిలో ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తితో తెలుగు వారందరకూ.
    వరద వచ్చినా, నీరు పొంగినా, గండ్లు పడినా ఈ రోజు మనం స్మరించుకోకుండా వుండలేము. ఇది మన ప్రత్యేక రాష్ట్ర అవతరణ శుభదినమని. కష్టసుఖాలలో, చీకటి వెలుగులలో పయనించేదే జీవితం.
    కారుతున్నాయి ఒక కంట ఈరోజు కన్నీళ్లు__
    కనీవినీ యెరుగని వరద భీభత్సంలో తోడుపోయి, నీడపోయి, కూడుపోయి కడగండ్ల పాలయిన లక్షలాది నిరుపేద సోదరీసోదరుల మూగవోయిన బాధనర్థం చేసికొనగలిగినా
    కారుతున్నాయి మరో కంట ఆనందబాష్పాలు__
    ఉప్పెనను మించిన ఉత్సాహంతో పొంగి, ఉదారంగా విరాళాలివ్వడానికి ముందుకు వస్తున్న అశేష ప్రజావాహినిని తిలకించి.
    ముఖ్యంగా బజార్లు పట్టి, జోలెకట్టి, కదం తొక్కుతూ, పదం పాడుతూ ఆర్తులనాదుకోటానికి పైసకు పైసా, రూకకు రూక సేకరించి తెచ్చిన నా చలనచిత్ర కళారంగ సోదరీ సోదరుల సామాజిక సేవాతత్పరతకు మేను పులకించి పరవశిస్తున్నాను__కళా ప్రయోజనాన్ని గుర్తించి.
    కళకు ఆదర్శం ఆదాయం కాదు__వ్యధితులై, బాధితులై, నికృష్టులై, నిరాశులై ప్రకృతి వైపరీత్యాలతో నడుం విరిగి, ఆదరువు కోల్పోయిన కోట్లాది విధి తాడితులకు అండగా వుండటమే, తోడుగా నిలవటమే. పరమోత్కృష్ట సేవాభావంతో కళా పరమార్థాన్ని ప్రయోజనాత్మకంగా చాటి చెప్పిన నటీనట సాంకేతిక నిర్మాణ నిపుణులకు, చలన చిత్ర పరిశ్రమలోని ప్రతివొక్కరికీ నా కళాభినందనలు. మీ యీ సేవ చరితార్థమై చిరస్మరణీయమై కళ కళ కోసమే కాదు, మానవసమాజ సంస్కృతీ వికాసానికే అంకితమైన పరమార్థ కృషిగా, భావితరాల కళాస్రవంతి ఉద్దీపనకు వెలుగుబాట చూపే జీవనాడిగా, ప్రగతిపథంగా గురుతుండగలదని నా విశ్వాసం. మరొక్కసారి ఈ కళావాహినికి నా కృతజ్ఞతాపూర్వక ఆశీస్రవంతులు, అభివందనములు.
    మధురం. ఇది మధురం. ఆర్తుల కన్నీరు తుడిచే మీ జీవితమే సఫలం. ఇదే నాకూ, మీకూ, మనకందరకూ జీవితపరమార్థం. కళకు అర్థం.
    ఔడు గరపించే దెబ్బే తగిలింది తుఫాను వల్ల, వరదల వల్ల తెలుగు నాటికి, సాటివారికి. కాని తాడిత కందుకంలా తిరిగిలేస్తాడు తెలుగు బిడ్డ కొట్టుకొనిపోయిన యిల్లు కట్టుకొంటాడు. మట్టమయిపోయిన ఆర్ధిక స్థితిని చక్కబెట్టుకుంటాడు. గుండెదిటవుతో, నడుం కట్టి శ్రమిస్తాడు. అంతిమ విజయం తనదేనని నిరూపిస్తాడు. ఈ మహాప్రస్థానంలో ఆసేతు హిమాచలం, మానవజాతే మనకు చేదోడు, వాదోడు.
    గతించిన చరిత్ర పుటలలో ఎన్ని దెబ్బలు తగులలేదు తెలుగుగడ్డకు ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురవలేదు?
    ఈ నాటిదా తెలుగుతేజం? శాతవాహనుల నాడే అన్నది__గోదాము పావనోదార వాఃపూరము అభిల భారతం మాదని. కాకతీయులనాడే ప్రతిధ్వనించాయి తెలుగుజోదుల కరవాలాల కణకణలు దిగ్దిగంతాలలో. విజయనగర రాజ వీధులలో రతనాల రాసులు పోసుకొని సాగించారు వ్యాపారు బేహారులు. ఆ వైభవమంతా ఏమయింది? మరువలేని, మరపురాని తీయని గాధగా మిగిలిపోయింది. 
    ముక్క చెక్కలైపోయింది తెలుగునాడు పరాయి పాలనలో. మూలనబడ్డాయి మన గ్రామీణ పరిశ్రమలు. సస్యశ్యామలంగా వెలిగి, ధాన్యాగారంగా పేరొందిన తెలుగుసీమ వెలవెల పోతోంది. పెచ్చుమీరిన అవినీతి గూడుకట్టుకొన్న స్వార్థం, దేశాభ్యుదయాన్ని, జాతి అభ్యుదయాన్ని, మానవాభ్యుదయాన్ని కబళింపజూస్తున్నాయి.
    తిరిగి తెలుగువారంగా ఒక త్రాటిపైకి రావాలని, ఒక నీడకు చేరాలని, తెలుగుభాషా సంస్కృతీ ప్రాభవాలను పునరుజ్జీవింప జేసుకోవాలని ఆకాంక్షించారు మన పెద్దలు. పట్టుదలతో పరిశ్రమించారు ప్రత్యేక రాష్ట్రం కోసం.
    తెలుగుబిడ్డ అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర్య యోధ కిశోరాల మహత్తర త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభిస్తే, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదాన ఫలితంగా మనకు ప్రత్యేకరాష్ట్రం సిద్ధించింది. ఇదే మార్గదర్శకమై, భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
    ఎన్ని కలలు కన్నారు తెలుగుప్రజలు__ ఈ ప్రత్యేకరాష్ట్ర సాధన ఫలితాన్ని ఊహించుకొని! ఎన్ని ఆశలు పెంచుకొన్నారు__ప్రత్యేకరాష్ట్రం పేదరికానికి విమోచన కలిగిస్తుందని! ఆర్తితో, అన్నార్తితో డొక్కలెండుతూ, విజ్ఞాన హీనులై అంధకారంలో అలమటిస్తున్న తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని బంగారు కలలు కన్నారు, గుడిసెలలో మగ్గుతున్న ఆడబిడ్డలందరూ. యుగాలు దాటినా, తరాలు గడచినా తలరాత మారలేదన్నట్లుగా అస్వతంత్ర జీవనులై, అవమానాలపాలౌతున్న మహిళలు ఎదురుచూశారు, వారి జీవితాలకు ఒక నిలకడ ఏర్పడుతుందని.
    స్వార్థం, అసమానత్వం, కులవిభేదం, మతతత్వం మాసిపోయి మన రాష్ట్రంలో మనుషులంతా ఒకటిగా మనగలిగే మంచిరోజు వచ్చిందని అనుకున్నారందరూ. శ్రమజీవులాశించారు తమ స్వేదానికీ, అశ్రువులకూ తగిన ప్రతిఫలం ముట్టచెప్పబడుతుందని. సంబరపడ్డారందరూ అన్నానికి లోటుండదనీ, కట్టుబట్టకు కరువుండదనీ, నిలువ నీడ ఉంటుందనీ. హాయిగా పాడుకొన్నారు__

'ఏ దేశమేగినా ఎందు కాలిడినా
    తలపరా నీ తెలుగు తల్లి భారతిని, __అని.
    ఆ ఆశ లేమయినాయి? ఆ తరువాత ఏం జరిగింది? రాష్ట్రం ఏర్పడి 27 సంవత్సరాలయినా ఇంతవరకు తెలుగుభాష అధికారభాషగా తన ప్రతిపత్తిని సంతరించుకోలేకపోయింది. అవినీతి, అసమర్థత, అధికార వ్యామోహం పెల్లుబికి పిశాచాల్లా సమాజం మీదికి ఎగబడ్డాయి. స్వైర విహారం చేస్తున్నాయి. హద్దుల నతిక్రమించాయి. తానూ, తానన్న భావంతో పొరుగునఉన్న పేదవారిపట్ల జాలి చూపలేకపోతోంది సంపన్న సమాజం. 'సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్'_ అన్న మహాకవి వాక్కులకు కేవలం చప్పట్లు మాత్రమే మిగిలిపోయాయి. ఈనాటికీ సమాజంలో నూటికి 50 శాతం ప్రజలు దరిద్రరేఖకు దిగువన భారంగా బ్రతుకు లీడుస్తున్నారంటే దీని అర్థమేమిటి? అనుకుంటున్నది పేదప్రజానీకం బొంగురు పోయిన గొంతుతో, వెలికిరాని సవ్వడితో మా మొరాలకించే నాథుడే లేడని, నాయకుడే రాడని.
    విసిగి వేసారి ఉస్సురన్న కష్టజీవులు కస్సున లేచారు. మిన్నకుంటే మనుగడ లేదని మార్పు తేవటానికి యత్నించారు. ఆ ప్రయత్న ఫలితమే తెలుగుదేశం పార్టీ అధికార బాధ్యతలు స్వీకరించటం. మానవజాతి చరిత్ర పుటలలో చిరస్థాయిగా సువర్ణ అక్షర లిఖితంగా మిగిలిపోతుంది ఆ చారిత్రాత్మక ఘట్టం. అది అద్వితీయం. అపూర్వం.
    మెదులుతోంది అనుక్షణం గుండెలలో, రగులుతోంది రక్తంలో__ ఆనాడు నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, నా మీదుంచిన విశ్వాసం, నమ్మకం. ఈ రోజు ఆ గురుతుతో, అంకితమైన భావంతో, కృతజ్ఞతతో తెలియజేస్తున్నాను__ ఈ నాటికీ, ఏనాటికీ నేను చేసిన వాగ్ధానాలు వమ్ముకావని, నేను వాటికి బద్ధుడనని.
    ప్రజలిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకొంటానని.

            


    కరీంనగర్ జిల్లా దుర్షీద్ గ్రామంలో 1983 మార్చి 28న ఇళ్ళస్థలాల పట్టాల పంపిణీ

          గుంటూరులో 1983 ఏప్రెల్ 11న బలహీనవర్గాల వారికి ఆర్ధిక సహాయం


      

       


                    నిజామాబాదులో వాచ్ మన సాయిలుతో సహపంక్తి భోజనం

            


        బలహీన వర్గాల మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

    దీని ఫలితమే ప్రభుత్వం తీసుకొన్న విప్లవాత్మక చర్యలూ, పరిష్కారాలూ, ఈనాడు తీసుకొంటున్న నిర్ణయాలూ.
    రెక్కలు ముక్కలుచేసుకొన్నా, డొక్క సగం నిండని పేద ప్రజానీకానికి యింత ఆదరవు కల్పించటానికి కిలో బియ్యం రెండు రూపాయలకే లభించే ఏర్పాటు చేసినా__
    ఎండా వానా లేకుండా, రేయి పగలు ఆనకుండా కండలు కరిగిస్తూ, రక్తాన్ని స్వేదంగా చెమరిస్తూ నిరంతరం శ్రమించే నిరుపేద కార్మికులకు నిలువనీడ చూపించడానికి 2,20,000 శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టినా__
    పట్టిన మేడి వదలకుండా దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న తాను శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభింప చేయాలన్న ప్రయత్నం చేసినా__
    అన్నదాతకున్న అవసరాలన్నీ ఎరువులు, విత్తనాలు, పరపతి, మార్కెటింగ్ సౌకర్యాలను ఒకేచోట ఏర్పాటుచేయాలనుకున్నా__
    యుగాలు మారినా, తరాలు గడిచినా వరకట్నంలాంటి సాంఘిక దురాచారాలతో, ఆదరవు లేక, అవమానాల పాలవుతున్న కోట్లాది ఆడపడుచుల జీవన స్వాతంత్ర్యం, ఆత్మాభిమానం నిలపడానికే ఆనాడన్న మహిళా విశ్వవిద్యాలయం ఈనాడు ప్రారంభించినా__
    ఆస్థిలో మగవారితోపాటు ఆడవారికి కూడా సమాన హక్కులుండాలన్న నిర్ణయం తీసుకొన్నా__ 
    బీడువారిన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా, పచ్చని పైరులతో పరిమళించేటట్టు చేయటానికి, కృష్ణవేణీ జలాలు తరలించినా __
    తమిళ సోదరుల దప్పిక తీర్చడానికి మంచినీరందించే మానవతా పథకాన్ని దానితో చేర్చి 'తెలుగు గంగ'గా రూపొందించినా__
    విద్యను వెలగట్టి, బజారులోపెట్టి అమ్ముకునే అమానుషకరమైన, అనాగరిక విధానానికి స్వస్తిచెప్పి అర్హతకు తగిన గుర్తింపు లభించేలా చేయడానికి విద్యాలయాల్లో కేపిటేషన్ విధానాన్ని రద్దు చేసినా__
    బడుగు వర్గాలవారి జీవితాలలో కాంతిరేఖలు ప్రసరింపజేయడానికి సంక్షేమ, సేవా పథకాలకు నిధుల కేటాయింపు రెట్టింపు చేసినా__    
    ప్రజాసేవ ప్రతిఫలం కోరదన్న భావంతో శాసన సభ్యుల పింఛనులను రద్దు చేసినా __
    కుళ్లిపోయిన కులవ్యవస్థనంత మొందించడానికి అర్జీలలో కులమన్న పదాన్ని తొలగించినా__
    రెక్కాడితేగాని డొక్కాడని స్థితిలో బిడ్డలకింత పెట్టుకోడానికి నోచుకోని బడుగువర్గాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అందించినా__
    సమాజ సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి పదిహేను సూత్రాల కార్యక్రమం 'ప్రగతి పథం' అమలు పరచినా__
    ఏది చేసినా, ఎంత చేసినా అదంతా చేసిన బాసలు చెల్లించడానికే,
    ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికే,
    నా తెలుగువారి సంక్షేమం పెంపొందించడానికే,
    నా తెలుగు రాష్ట్రం అభివృద్ధి కోసమే
    _అని అంకిత భావంతో తెలియజేస్తున్నాను, నా బాధ్యతగా, నా ధర్మంగా.
    ఏమరలేదు అన్నమాట అని చెప్పటానికే గాని ఏకరువు పెట్టడానికి కాదు ఈ జాబితా.
    ఎన్ని పనులు చేసినా, యింకా ఎన్నెన్నో వున్నాయి చేయవలసినవి, ఎంతో ఆశవుంది చేయాలని.
    ఈ చేసినవే కాక, ఈనాడు చేయాలని తీసుకొన్న ప్రభుత్వ నిర్ణయాలను తెలియజెప్పటం ఈ శుభ సందర్భానికి ఉచితం.

నిరుద్యోగ రక్కసి కోరలలో చిక్కి, నిరాశా నిస్పృహలతో స్రుక్కి, భారంగా బ్రతుకులు వెళ్లదీసే యువత జీవితాలలో ఆనందనందనాలు వెలయించాలన్న ఆకాంక్షతో, కేంద్ర సహాయంతో, ప్రవేశపెడుతున్నది ప్రభుత్వం 'గ్రామోదయ' కార్యక్రమాన్ని.
    చీకటిలో మ్రగ్గుతున్న నిరుద్యోగ గ్రామీణ యువ సోదరుల జీవితాలను జ్యోతిర్మయం చెయ్యటానికే 'దీప' కార్యక్రమం.
    నికృష్టమైన వృత్తిని స్వీకరించినా, సమాజానికి అత్యంత ముఖ్యమైన విధంగా సేవ చేస్తున్న పాకీపనివారి హేయమైన జీవన విధానాన్ని మార్చటానికే 'విముక్తి' కార్యక్రమం. దీని ప్రధానాశయం మహిళలకు గౌరవ ప్రదమైన సౌకర్యం కలిగించటానికి ప్రతివూర ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం.
    ఉత్సాహంతో, ఉల్లాసంతో ఉరకలు వేస్తున్న యువతను వృత్తి విద్యా విధానంలో తీర్చిదిద్ది, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో నిమగ్నం చేయటమే 'యువశక్తి' కార్యక్రమం. 
    అపారంగా వున్న వనరులను ప్రకృతిసిద్ధమైన నిక్షేపాలను మలచి, పరిశ్రమలు పెంచి, మన రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను క్రమబద్ధం చేయడానికి నిష్ణాతులైన నిపుణులతో రాష్ట్ర అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయటం.
    ఆర్థికంగా వెనుకబడినవర్గాలవారికి, గిరిజన, హరిజన, దళిత వర్గాల వారికి ఉత్తమ పద్ధతుల్లో విద్య లభింపజేయటానికి ప్రతి జిల్లాలో నాలుగు నివాస పాఠశాలలు నిర్మించే నిర్ణయం తీసుకోవటం.
    పట్టణాలలో ఉద్యోగం చేసుకొంటున్న వనితలకు భద్రమైన నివాసం కల్పించటానికే ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక శ్రామిక మహిళా వసతి గృహాన్ని నిర్మించబూనటం.
    ప్రాథమిక విద్యావ్యాప్తికి నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి ఈనాడు 16,000 మంది ఉపాధ్యాయులను ప్రత్యేక ప్రాతిపదికపై క్రొత్తగా నియమిస్తున్నారు.
    ప్రతి ఊర ప్రాథమిక పాఠశాలకు ఒక భవనం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యసిద్ధికే పాఠశాల భవనాల నిర్మాణ నిర్ణయం.
    మన రాష్ట్రంలో ప్రతిభగల యువక్రీడాకారులకు సరైన అవకాశం కల్గించి, ప్రోత్సహించి, మన రాష్ట్ర గౌరవాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా పెంపొందించడానికే క్రీడామండలి పునర్వ్యవస్థీకరణం.
    సమాజంలో నూటికి 50 శాతం మించివున్నా, అవకాశం లేక, అదనుదొరకక, అస్వతంత్రులుగా బ్రతుకుతున్న సోదరీమణులకు స్వతంత్ర జీవనోపాధిని కల్పించడానికే అర్హమైన ఉద్యోగాలలో వారికి నిర్ణీత శాతం కేటాయించటం.
    ప్రతిభ, సమర్థత, నిజాయితీతో ప్రశంసార్హమైన ఉత్తమ కృషిని కొనసాగించే ప్రభుత్వోద్యోగుల సేవలను గుర్తించడం, ప్రోత్సహించడం.
    అవినీతికీ, అక్రమానికీ పాల్పడి సామాజిక సంక్షేమాన్ని మరచి వ్యవహరిస్తున్న స్వార్థపరులకు తగిన శిక్షాస్మృతిని లభింపజేయడం.
    ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ పథకాన్ని చేపట్టినా స్వచ్చమైన పరిపాలన అందించనిదే, పటిష్టమైన అధికార యంత్రాంగం లేనిదే ప్రయోజనం లేదు. అందువల్లనే పరిపాలనలో అవినీతికి తావులేకుండా చేయటం అత్యంత అవసరం. ఉన్నత స్థాయిలో అవినీతిని నిర్మూలించడానికి నిరోధించడానికి 'లోకాయుక్త' చట్టాన్ని నేటినుండే అమలు చేయటం జరుగుతోంది.
    తెలుగు నేల యిది. తెలుగువారం మనం. అయినా 'తెలుగదేల?' అన్న ప్రశ్న ఈనాటిది కాదు. 'తెలుగులో కావ్యరచనా?' అని హేళనచేసే పండితులనెదిరించి, మహాంధ్ర భారతాన్ని విరచించి, తెలుగుకు కావ్య గౌరవం చేకూర్చాడు నాకు నన్నయ భట్టారకుడు. ధన్యజీవి ఆ ఆదికవి. తిరిగి కృష్ణరాయల కాలంలో 'తెలుగుదేల' అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు
    "తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ, తెలుగొకండ
    ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స"__
    అని సమాధానమిచ్చాడు శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు దేవుడు కృష్ణరాయనికి కలలో కనిపించి.
    తేనెలొలుకు తియ్యదనం తెలుగుభాష సొత్తు. తెలుగుభాషా సంస్కృతుల పునరుజ్జీవనం మన విధి, బాధ్యత. 'తెలుగులో పరిపాలనా?' అని అవహేళనచేసే తెలుగు ప్రబుద్ధులు వుంటే వుందురుగాక__ వారిని సరకు గొనకుండా, తెలుగును ప్రధానభాషగా, అధికార భాషగా అన్ని స్థాయిలలో అమలు చేస్తున్నాము. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టుదలతో పట్టింది విడువక గమ్యం చేరేవరకు ఈ పయనం ఆగదని తెలియజేస్తున్నాను, కృత నిశ్చయంతో.
    తెలుగు సంస్కృతి విస్తరించాలి. తెలుగు బావుటా రెపరెపలాడాలి. కరువు, కాటకం రానీ, వరదలే పొంగనీ, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదురొడ్డి గుండెబలంతో, నిండుదనంతో, ఐక్యభావంతో తెలుగుజాతి పురోగమిస్తుంది. మీ అందరి సహాయ సహకారాలతో తెలుగునాడు వెలుగునాడుగా రూపొందిద్దాం. అలనాటు తెలుగునాట మ్రోగిన విజయ దుందుభులు మరోసారి దిగ్దిగంతాలలో నినదించాలి.
    తెలుగుతల్లి తన ముద్దుబిడ్డల కేరింతలలో ఆనందమయి కావాలి, పరవశించాలి. తెలుగుతేజం వెలుగు నిత్యం. 

    రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా 1983 నవంబరు 1న హైదరాబాదులో.

 

 Previous Page Next Page