Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 18


     సుబ్బారావుకి షాక్ కొట్టినంత పనయింది. కెవ్వున కేక వేయలేదు కాని, ముఖ భంగిమలు మాత్రం అలాగే పెట్టాడు.


    "ఏమిటీ జోక్! నేను నాటకం వేయడమేమిటి? ఇవాళ ఏప్రిల్  ఫస్టు కూడా కాదు" అన్నాడు సుబ్బారావు.


    "ఏ ..నాటకం వేయాలంటే రెండు కొమ్ములే ఉండక్కరలేదు. ఎవరైనా వేయవచ్చు" అంటూ  ధైర్యం చెప్పాడు సుందరం.


    "ఇంకా నయం... స్టేజి అంటేనే చచే భయం నాకు. మన క్లబ్ ఫంక్షన్ లో ఒకసారి ఎవరికో దండ వేయడానికి  వెళ్ళినప్పుడు కూడా నా కాళ్లు వణికాయి. నన్నొదిలిపెట్టి ఇంకెవరినైనా చూసుకోండి!"  అంటూ వెళ్ళిపోవడానికి ఒక  అడుగు ముందుకివేశాడు సుబ్బారావు.


    వెళ్తున్న సుబ్బారావు భుజం పట్టుకొని బలంగా వెనక్కి లాగాడు సుందరం.


    "చూడు ...నాయనా! నువ్వు వేసేది ధృతరాష్ట్రుడి వేషం. నిలబడితే కదా... నీ కాళ్లు వణికేది! ధృతరాష్ట్రుడు హాయిగా సింహాసనం మీద కూర్చుంటాడు. నీకో చక్కని నగిషీ కుర్చీ వేస్తాం. గూట్లో గుడ్లను పొదుగుతున్న గువ్వలాగా ఆ కుర్చీలో కుదురుగా ముడుచుకు కూర్చో!" అంటూ వెన్ను నిమిరాడు సుందరం.


    "లాభం లేదు. నిలబడను కాబట్టి  కాళ్ళు వణక్కపోవచ్చు కాని, జనాన్ని చూస్తుంటే నా వళ్ళంతా వణుకుతుంది" అంటూ మరో పాయింట్ లేవదీశాడు సుబ్బారావు.


    "ఓయి - వెర్రి నాయనా! నీ పాత సంగతే నువ్వు మరిచిపోతున్నావు కదా!  నువ్వు  వేసేది ధృతరాష్ట్రుని వేషం. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు. కళ్లు మూసుకుని కూర్చుంటాడు. నువ్వు చేయవలసింది కూడా ఆ పనే. హాయిగా కబోది పక్షల్లే కళ్లు మూసుకుని కుర్చీలో  ఒదిగి కూర్చో. ప్రేక్షకులు నీ కంటికి  కనిపించినప్పుడు ఇంక భయమేముంది?" అంటూ  మరో సూక్ష్మం వివరించాడు సుందరం - శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తున్నట్లు!

 
    "బాగానే వుందనుకో! కాని, నాకు పోర్షనేం వచ్చు? ఒక్క రోజులో డైలాగ్స్ ఏం నేర్చుకుంటాను?' అంటూ నసగసాగాడు సుబ్బారావు.


    "చూడు బాబూ - అనవసరంగా నువ్వు దిగులుపడి మమ్మల్ని ఇబ్బందిపెట్టకు. ధృతరాష్ట్రుడు రాయబారం సీనులో చివరివరకూ స్టేజి మీదనే వుంటాడు కాని.., ఉలకడు, పలకడు. కళ్లు మూసుకొని సింహాసనం మీద కూర్చుని వుంటాడు. .. .అంతే! ఆ పాత్రకున్న  డైలాగ్ లు మూడు, నాలుగు మించి లేవు. అవైనా చిన్నవి. వాటిని బట్టీ పట్టడానికి నీకు  పది నిమిషాలు  కూడా పట్టదు.  అనవసరంగా  బెట్టుచేయక - సరే నను!" అన్నాడు సుందరం కొంచెం ప్రాధేయపూర్వకంగా.


    "డైలాగ్స్ ఎంత లేకపోతే మాత్రం - ధృతరాష్ట్రుడు, ఊరికే ఎలా వుంటాడు? ఏవో  కొన్ని ఎక్స్ ప్రెషన్స్ అయినా వుండాలి కదా!" అన్నడు సుబ్బారావు.

 
    "నీ సందేహాలకు నిప్పంటిచా! ధృతరాష్ట్రుడు గుడ్డి  ముండాకొడుకు.  వాడికి ఎక్స్ ప్రెషనేమిటి  నా పిండాకూడు!'అంటూ చిరాకుపడ్డాడు సుందరం.

 
    "మరీ..." అంటూ నసిగాడు సుబ్బారావు.


    "మరీ లేదు, గిరీ లేదు. మారు మాటాడకు. ఎక్కువ మాట్లాడావంటే మూతి మీద కొడతా. ఎక్స్ ప్రెషన్ కోసం నువ్వేమీ అవస్థ పడనక్కరలేదు. తలని అడ్డంగానో, నిలువుగానో నీకు తోచినట్లు ఆడిస్తూండు. లేకపోతే అడ్డంగానూ, నిలువుగానూ కూడా ఆడిస్తూండు. ఆ ఆడింపుకు భావాలు ఎవరికి తోచినట్లు వాళ్లు చెప్పుకుంటారు. అటు కృష్ణుడికీ చెప్పలేక,  ఇటు కొడుకులనూ ఒప్పించలేక చిత్తక్షోభలో కుమిలిపోతూ తల  ఆడించేస్తున్నాడు  ధృతరాష్ట్రుడు - అనుకుంటారు. అయినా.... నీ పిచ్చికాని - పద్యాలు ఎవరు ఎలా పాడుతున్నారు,  ఎంత పెద్దగా రాగాలు తీస్తున్నారూ..... అని చూస్తారే కాని,మన ప్రేక్షకుల్లో  ఆ ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడో చూసేవాడెవడయ్యా? ఇంక ఆట్టే మాట్టాడకు. నాకు చిర్రెత్తుకొస్తుంది? " అన్నాడు సుందరం.

 
    "సరే ...మీరు అంతగా చెబుతుంటే నేను కాదని ఎలా అనగలను?పైగా.... మీరు కష్టాల్లో వున్నప్పుడు నేను సాయం చేయకపోతే ఎలా?" అభయముద్రవేశాడు సుబ్బారావు.

 
    "అలా అన్నావు బాగుంది. ఇప్పుడు నువ్వు నిజమైన సుబ్బారావువి. లేకుంటే వట్టి సుబ్బిగాడివి. .., ఇత్తడి సుబ్బిగాడివి..., పొడుం సుబ్బిగాడివి!" అంటూ ఉత్సాహంతో కవిత్వ ప్రకోపనం మొదలుపెట్టాడు సుందరం.


    "ఆపాపు....  నీ పైత్యం!  ఆ... చివరగా ఒక చిన్న ప్రశ్న...." అన్నాడు సుబ్బారావు.


    "నీకేమన్నా టీ. వీ లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళ గాలి సోకిందా ఏమిటి?  చివరగా ఒక చిన్నప్రశ్న అంటున్నావు? .. ఏమిటది?" అన్నాడు సుందరం.


    "ఏంలేదు. ... ఈ బలిపీఠం ఎక్కడానికి మీకు నేను తప్ప ఇంకెవరూ దొరకలేదా -  ఇందరు మహానటులు ఈ మహా పట్టణంలో ఉండగా?!" అన్నాడు సుబ్బారావు.


    "చూడు బాబూ! సత్యమూర్తి మంచం ఎక్కడంతో మా మతులు పోయి ఇలా వీధిన పడ్డాం - ధృతరాష్ట్రుడిని వెతుక్కుంటూ. మా అదృష్టం అను- నీ ఖర్మ అనుకో.... సమయానికి నువ్వు మాకు తటస్థపడ్డావు. దానికితోడు -నీ మొహంలో  ధృతరాష్ట్ర కళ ధగధగా వెలిగిపోతోంది. దాంతో పూలహారం  నీ మెడలోనే వేసేశాం. ఎవరో ఒకరికి వేయకతప్పదు  కదా.. అది నువ్వే కావడం మా అదృష్టం. ఇంక నీ కుశ్శంకలూ, లఘుశంకలూ మానేసి తిన్నగా కొంపకి పోయి భోజనం చేసి సరిగ్గా నాలుగ్గంటలకల్లా సమాజం ఆఫీసుకి రా!  రెండు రిహార్సల్స్ పడ్డాయంటే ఇట్టే అడ్జస్ట్ అయిపోతావు"  అన్నాడు సుందరం.


    "సరే.... తప్పుతుందా? వస్తాను" అంటూ అడుగు ముందుకివేశాడు సుబ్బారావు.


 
    "తప్పుతుందా ..అంటూనే తప్పించుకోవడానికి చూస్తావేమో! నాలుగ్గంటలకి రిహార్సల్స్ కి రాకపోయావో.... నిన్ను నిజంగా ధృతరాష్ట్రుడిని చేసి మరీ కుర్చోబెడతాం... జాగ్రత్త!" అని హెచ్చరించాడు సుందరం.


    "మాటంటే... మాటే! ఇంత లోతు దిగాక  ఇంకా చలేమిటి? ఈ దెబ్బతో నేను. నటుణ్ణైనా కావాలి. లేదా నాటకం..." అంటూ ఉత్సాహంగా ఏదో అనబోయాడు సుబ్బారావు.


    "ఊ... ఇంక ఆపు - నీ అపశకునం మాటలు! నాటకం చెడిందో జాగ్రత్త! నువ్వు నిజంగా ధృతరాష్ట్రుడ వవుతావు" అంటూ టాపిక్ కట్ చేసి ముందుకు వెళ్లిపోయాడు సుందరం తన బృందంతో.


    ముందు ఇష్టపడకపోయినా, మనసులో భయంవేసినా, ఆ తరువాత తాను కూడా నటుడిగా రంగప్రవేశం చేయబోతున్నందుకు ఆనందం కలిగింది సుబ్బారావుకు.


    తియ్యటి ఊహల్లో విహరిస్తూ ఇంటికి చేరాడు.


                                                       *    *    *    *    *

 Previous Page Next Page