Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 19

       
    శారదా కళామందిరం ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది.


    'శ్రీకృష్ణ రాయబారం' పేరున్న నాటకమేమో... ఇరుగుపొరుగు పల్లెటూళ్ల నుంచి కూడా జనం బాగానే వచ్చారు. దానికితోడు - ఆ నాటక సమాజం కూడా అంతకుముందు అదే నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించింది.

 
    నాటకం మొదలయ్యింది.


    కృష్ణుడూ, ధుర్యోధనుడూ మొదలైనవారు పద్యాలను పేల్చేస్తూ, హాలును దద్దరిల్ల జేస్తున్నారు. ఉత్సాహంతో ప్రేక్షకులు చప్పట్లు చరుస్తూ" 'ఒన్స్ మోర్' లు వదులుతున్నారు. అడిగిందే తడవుగా 'మోర్' అనేమాట వినగానే పద్యాలను మారువడ్డన వడ్డిస్తున్నారు వేషధారులు.

 
    ధృతరాష్ట్రుని వేషంలో సుబ్బారావు బుద్దిగా, ఒబ్బడిగా కూర్చుని కళ్లు మూసుకుని తనకు తోచినట్లు తల ఆడిస్తున్నాడు. మొదట్లో స్టేజీ మీద కూర్చున్నప్పుడు కొంచెం భయం అనిపించినా - అంతలో ఆ భయం ఎగిరిపోయింది.  ఏదో ఊహాలోకాల్లో విహరిస్తూ కళ్లు మూసుకుని ఉండిపోయాడు.


    నాటకం అంతా సవ్యంగా సాగిపోతోంది. అనుకోని సమస్య ఎదురైనప్పటికీ, అనుకున్నదానికంటే విజయవంతంగా నాటకం సాగుతూండడంతో అమితానందంగా వుంది సుందరానికీ, అతని బృందం వారికీ!


    నాటకం చివరిదశకి చేరుకుంటోంది.


    రాయభారం విఫలమయ్యే దృశ్యం అది. 'ఐదు ఊళ్ళు కాదుకదా.... సూది మొన నిలిచేటంతటి భూమిని కూడా ఇవ్వను పొమ్మం'టాడు దుర్యోధనుడు. అది విని కుమారుని మందలించమని  హితవు చెబుతాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి.


    అప్పటివరకూ అంతా బాగానే వుంది.


    అయితే... ఆ కిందటి రాత్రి సరిగా నిద్ర లేదో, ఏమో - దానికితోడు కళ్లు మూసుకుని కూర్చునేసరికి, అందులోనూ - మెత్తని బాలీసులున్న సింహాసనం మీద దృతరాష్ట్రుని వేషంలో ఉన్న సుబ్బారావుకి నిద్ర ముంచుకొచ్చింది. ఆడిస్తూండిన తల ఆగిపోయి ఒక ప్రక్కకి వాలిపోయింది. అంతలో నెమ్మదిగా గురక కూడా మొదలయింది.  మొదట్లో పద్యాలను దంచే ఉషారులో వున్న శ్రీకృష్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ ఈ విషయాన్ని గమనించలేదు. ఉత్సవ విగ్రహాలలా  కూర్చున్న మిగిలిన పాత్రలేవీ దీనిని పట్టించుకోలేదు.


    శ్రీకృష్ణుడు - "ధృతరాష్ట్ర మహారాజా! వింటివా నీ కొమరుని ధూర్త వాక్యములు! కంటివా నీ ముద్దులపట్టి  దురుసుతనము? నీవు జన్మాంధుడవే కాని, జ్ఞానాంధుడివి కావు. ఇప్పటికైనా మేల్కొనుము. నీ పుత్రునికి హితవు చెప్పుము" అని ధృతరాష్ట్రుని వైపు తిరిగి అన్నాడు.


    అందుకు బదులుగా గురకస్థాయికి పెంచాడు  సుబ్బారావు. అదృష్టవశాత్తూ మైకు దగ్గర లేకపోవడంతో  ఆ గురకనాదం  ప్రేక్షకుల చెవుల దాకా వెళ్లలేదు.


    అయితే రానున్న ప్రమాదాన్ని పసిగట్టాడు శ్రీకృష్ణుని వేషంలో వున్న సుందరం.


    'కొంప ముంచావు కదరా సుబ్బిగా!' అనుకుంటూ, ధృతరాష్ట్రునికి మరింత దగ్గరికి వెళ్ళి -


    "ఏమి ధృతరాష్ట్రా! నా మాటలు నీ చెవికి ఎక్కుట లేదా? మహారాజు వయ్యుండి  నీ కుమారునికి  ఇంతమాత్రం బుద్ది గరవలేవా?' అంటూ సొంత డైలాగ్ ను సృష్టించి వదిలాడు.


    అయినా.... ధృతరాష్ట్రుడి చెవులకు ఆ మాటలు సోకనే లేదు. గురక స్థాయి ఇంకా పెరగడమే కాక, మధ్యలో ఈలలు కూడా రాసాగాయి.

 
    ఇంక లాభం లేదనుకొని, "ధృతరాష్ట్రా! ఏమి ఈ నిర్లిప్తత?" అంటూ సుబ్బారావు భుజం పట్టుకొని బలంగా ఊపాడు సుందరం.


    ఆ ఊపుతో కంగారుపడ్తూ లేచి నిలబడబోయి, ధన్ మని ముందుకి పడ్డాడు సుబ్బారావు.

 
    హాలు ప్రేక్షకుల ఈలలతో, చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

 
    మరు నిమిషంలో స్టేజి మీద చెప్పుల వర్షం కురిసేదే కాని,  అత్యంత సమయస్పూర్తిని  ప్రదర్శించాడు సుందరం. శ్రీకృష్ణుని వేషంలో వున్న అతను కౌరవ సభలోని పెద్దలవంక  తిరిగి -


    "కురు వృద్దులారా.. ., గురు వృద్దులారా!భీష్మ, ద్రోణ, కృపాచార్యాది పెద్దలారా!

చూచితిరా... ధృతరాష్ట్ర మహారాజు దైన్యస్థితి! అటు రాయబారము తెచ్చిన నా మాటలనూ కాదనలేడు.  తన మాట  వినని కొడుకును ఒప్పించనూ లేడు. ఈ పరిస్థితిలో  మానసికాందోళనను తట్టుకోలేక ఏ విధముగా కుప్పకూలినాడో గమనించితిరి కదా!" అని ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి - "ధృతరాష్ట్ర మహారాజా.... మనసును చిక్కబరచుకొమ్ము. ఇదే నీకు బలము నొసగుచున్నాడను"  అంటూ చేయిబట్టి లేవదీసి సింహాసనం  మీద మళ్ళీ కూర్చోబెట్టాడు.

 
    క్రింద పడడంతో మెలకువ వచ్చింది సుబ్బారావుకి. పరిస్థితిని అర్దం చేసుకుని కిమ్మనకుండా సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత "శ్రీకృష్ణా....! నేను నిమిత్తమాత్రుడను.  భూత వర్తమాన భవిష్యత్తులు ఎరిగిన నీకు ఈ రాయబారము యొక్క పర్యవసానమెటుల యుండునో  తెలియనిదా? నీ చిత్తము వచ్చినట్లే కావింపుము' అంటూ తిరిగి తలాడిస్తూ కూర్చున్నాడు సుబ్బారావు.


    నాటకంలో కొత్తగా చోటుచేసుకున్న ఈ దృశ్యం - దర్శకుడు 'గుడ్ ఎపెక్ట్' కోసం  కొత్తగా, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినదని భావించారు ప్రేక్షకులు. ఆ దృశ్యం అత్యంత సహజంగా వుండివారికి నచ్చడంతో, చప్పట్లతో తమ ఆనందామోదాలను తెలియజేశారు.


    అటు తర్వాత మిగిలిపోయిన నాటక భాగాన్ని  అందుకుని విజయవంతంగా  నాటకాన్ని పూర్తి చేశాడు సుందరం.


    అప్పటినుంచీ ఆ దృశ్యం   ఆ సమాజంవారు ప్రదర్శించే శ్రీకృష్ణ రాయబారం నాటకంలో శాశ్వతంగా  చోటుచేసుకుంది. అంతేకాదు... , ధృతరాష్ట్రుడు ఆవేదనను తట్టుకోలేక క్రింద పడిన దృశ్యాన్ని అత్యంత  సహజంగా చూపించిన సుబ్బారావు ఆ దెబ్బతో  నటుడయిపోయాడు - 'ధృతరాష్ట్రుడిగా!'


                                                  - ఆంధ్రప్రభ వార పత్రిక.... 15 ఆగస్ట్ '84

        
                                                           తంతి లీలలు


    'సాబ్ ఆజ్మీర్ గయే' అన్న వాక్యాన్ని -


    "సాబ్ ఆజ్ మర్ గయే" అని పంపి నిష్కారణంగా  సాబ్ ని చంపివేసిన ఘనత మన తంతిశాఖది.


    అలాగే - "సుంకర  కనకారావు" అన్న పెద్ద కంకర వ్యాపారికి వచ్చిన టెలిగ్రాం ని తిరగవేసి "కంకర శునకారావు" అని పంపినట్లు  కింవదంతి.


    "లీలా మెచ్యూర్డ్" అన్న వాక్యాన్ని -


    "లీలా మారీడ్" అని కొట్టి అయినవారిని కంగారుపెట్టిన ఘనత కూడా తంతిశాఖకుంది.       

 Previous Page Next Page