Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 17

       

                                                ఓ దృతరాష్ట్రుని కథ


    ఔత్సాహిక నాటక సమాజంవారు 'శ్రీకృష్ణ రాయబారం' నాటకాన్ని దిగ్విజయంగా ప్రదర్శించే సత్సంకల్పంతో హుషారుగా ప్రయత్నాలు ప్రారంభించారు.


     మరునాడు సాయంత్రమే శారదా కళామందిరంలో ప్రదర్శన.


     ఆ  ఊరి ప్రేక్షకులు మహా కుశాగ్రబుద్దులు. సూక్ష్మగ్రాహులు. నాటక ప్రదర్శనలో కాని, పద్య పఠనంలో కాని ఏమాత్రం హెచ్చూ - తగ్గూ వచ్చినా  ఈలలతో హోరెత్తించి, చప్పట్లతో దరువులు వేసి అరుపులూ, కేకలూ, బల్ల మీద పిడిగుద్దులతో కావలసినంత 'ఆర్కెస్ట్రా' సృష్టించి 'ఫ్లయింగ్ మిస్సైల్స్' లాగా చెప్పుల్ని స్టేజీ మీదకు విసిరి నటులను యధాశక్తి సత్కరిస్తుంటారు.  కొన్నికొన్నిచోట్ల కుళ్ళిపోయిన కోడిగుడ్లనూ, టమోటాలను కూడా రంగస్థలం మీదికి రంజుగా విసురుతారని  వారూ విన్నారు కాని, ఆ విన్యాసాన్ని ఆచరణలో పెట్టలేదు ఇంకా. ఏదో సంసారపక్షంగా ప్రాచీన సాంప్రదాయం ప్రకారం పాత చెప్పులతోనే సరిపెట్టుకుంటున్నారు పాపం!


    ప్రేక్షకులలో ఇంతటి హేమాహేమీలూ, ఉద్దండులూ, జగజ్జెట్టీలూ వున్నారు కనుకనే ఆ ఊరిలో నాటకాలు వేసేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తుంటారు. ఒకవిధంగా ఆ ఊరిలో నాటకం వేయడాన్ని ఒకసవాలుగా, లిట్మస్ టెస్టుగా భావించుకుంటుంటారు.  అక్కడ కనుక విజయవంతంగా నాటక ప్రదర్శన జరిగిందంటే ఇంక ఢోకా లేదు. ఆంధ్రదేశమంతటా నల్లేరు మీద బండిలాగా తమ జైత్రయాత్రను నడపవచ్చు. అదీ ఆ ఊరి పరిస్థితి.

 
    అంతా బాగానే వుంది. 'తాగే తాగే పానకంలో పుడక అడ్డుపడ్డట్టు... ఇష్టమైన మృష్టాన్నంలో మొదటిముద్దలోనే మశకం పడ్డట్లు...' అనుకోని అవాంతరం వచ్చిపడింది ఆ నాటక సమాజం వారికి.

 
    మరునాడు నాటక ప్రదర్శన ఉందనగా - ధృతరాష్ట్ర పాత్రధారి స్కూటర్ మీద నుంచి కిందపడి కాళ్లూచేతులూ విరగ్గొట్టుకుని, నాటకంలో సింహాసనం మీద కళ్లు మూసుకుని కూర్చునే బదలు హాస్పిటల్ లో మంచం మీద కళ్లు మూసుకుని పడుకున్నాడు.


    భారతంలో ధృతరాష్ట్రుని పాత్ర లేనిదే రాయబారం సీను ఎలా నడుస్తుందీ? దాంతో తలలు దిమ్మెక్కి, మతులుపోయి మరో ధృతరాష్ట్రుని వేటలో పడ్డారు సమాజంవారు.

 
    'ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు..., ఐదో కృష్ణుడు ' వంటి ప్రయోగాల్ని ఆ సమాజంవారు కూడా చేశారు కాని, దిక్కుమాలిన  ధృతరాష్ట్రుడు విషయంలో మరో ధృతరాష్ట్రుని అవసరం వచ్చి పడుతుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. అందులోనూ - కనీసం ఇరవైనాలుగు గంటల వ్యవధి కూడా లేకుండా ఈ చావొచ్చి పడడంతో దిక్కుతోచక దిక్కులు చూడసాగారు వాళ్లు.... ధృతరాష్ట్రుడి కోసం!


     ఆ సమయంలో వాళ్ళ కంటబడ్డాడు సుబ్బారావు.


    సుబ్బారావు వాళ్ల ఆఫీసులోనే ఒక గుమస్తా. అప్పుడప్పుడు వాళ్ళ నాటకాలను చూడడానికి వస్తుండేవాడు. ఏమీ తోచనప్పుడు   అప్పుడప్పుడు సరదాగా వాళ్ల రిహార్సల్స్ చూడడానికి వస్తుండేవాడు. అప్పటివరకూ ఆ సమాజం వాళ్లెవరూ 'సుబ్బారావు ' అనే శాల్తీని ఎప్పుడూ ప్రత్యేకంగా  గుర్తించలేదు.


    ఆ సమయంలో వాళ్లకి అతను  ఆపధ్బాంధవుడిలా కనిపించాడు.


    మామూలుగా అయితే 'ప్రేతకళమొహం' అనుకునే అతని ముఖంలో ధృతరాష్ట్ర  కళ గోచరించింది.

 
    "బాబూ ... సుబ్బారావూ! నువ్వే మాకు దిక్కు. ఇవి చేతులు కావు... కాళ్లు!" అంటూ డైరెక్టర్ సుందరం అమాంతం సుబ్బారావు రెండు చేతులూ పట్టుకున్నాడు.

 
    అతని వెనక మరో నలుగురూ ఆశగా అతనివంకే చూస్తున్నారు.


    అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయాడు సుబ్బారావు. తన కాళ్లు పైకెప్పుడు వచ్చాయా.... అని కంగారుపడ్డాడు. అనుమానంగా చేతులవంక చూసుకున్నాడు. చేతులు చేతుల స్థానంలోనూ, కాళ్ళు కాళ్ల స్థానంలోనూ వుండడంతో, 'వీడేమిటి... వసుదేవుడిలా నా కాళ్ళు పట్టుకుంటానంటాడు?' అనుకొని, 'ఛ.... అలా అయితే నేను గాడిదను అయిపోనూ!'అని మనసును మందలించుకుని  అమాయకంగా వాళ్ళవంక చూశాడు.


    వాళ్లందరూ తననే చూస్తూండటంతో - 'కొంపతీసి  వీళ్లు నన్ను హైజాక్ చేయడానికి రాలేదు కదా!' అని బెంబేలు పడ్డాడు.


    నూతిలోంచి  మాట వస్తున్నట్లుగా హీన  స్వరంతో "ఏమిటిది... ఏం కావాలి?" అన్నాడు భయంభయంగా.


    "మేమిలా పెద్ద ఆపదలో చిక్కడ్డాం. నువ్వే కాపాడాలి. కాదనడానికి  వీలులేదు" అంటూ సుబ్బారావు చేతులు గట్టిగా నొక్కాడు సుందరం.

 
    "అబ్బ ... అంటూ విదిలించుకుని, అసలు ఏం జరిగింది?" అన్నాడు సుబ్బారావు అనుకోని ప్రళయానికి బెదిరిపోతూ.


    " అలా  అన్నావు - బాగుంది. ధృతరాష్ట్రుడు హాస్పిటల్ లో చేరాడు" అన్నాడు సుందరం తలాతోకా లేకుండా.


    "ధృతరాష్ట్రుడా? .. వాడెవడు?" అన్నాడు సుబ్బారావు కొంచెం తెప్పరిల్లి.


    "చచ్చాం ... పో! మా నాటకంలో ధృతరాష్ట్రుడి వేషం వేస్తున్నాడే - సత్యమూర్తి... వాడికి స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఆస్పత్రిలో పడేశారు!" అంటూ కొంచెం తోక అందించాడు సుందరం... ఆ సమయంలో యాక్సిడెంట్ కల్పించుకొన్నందుకు  సత్యమూర్తి మీద కసితో.


    "అయ్యోపాపం.... ఎంత పని జరిగింది! ఇప్పుడెలా పాపం...? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? మీరెళ్లి చూసారా?" అంటూ ఛాందసంగా ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు సుబ్బారావు.


    "నీ బొంద! నీ సానుభూతిని ఆపు. కావాలనుకుంటే, ఓపిక ఉంటే ఎల్లుండి ఆస్పత్రికి వెళ్లి తీరిగ్గా పరామర్శించి రా! ముందు నేను  చెప్పేది విను..." అంటూ  అసహనంగా కసురుకున్నాడు సుందరం.


    "ఎల్లుండి వరకూ ఆస్పత్రిలోనే వుండాటా.....? అన్ని దెబ్బలు తగిలాయా?" అంటూమరో ప్రశ్న వేశాడు అమాయక చక్రవర్తి సుబ్బారావు.


    "చూడు సుబ్బారావ్...... నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నేను చెప్పేది సాంతం వినకుండా అడ్డు తగిలావంటే నీ తల పగలకొట్టి ఆస్పత్రిలో సత్యమూర్తి బెడ్ పక్కనే నీ బెడ్ కూడా వేయిస్తాను"  అంటూ కరకరలాడాడు సుందరం.


    సంగతేమిటో అర్దంకాక బిత్తరచూపులు చూడసాగాడు సుబ్బారావు.

 
    "చూడు ... సుబ్బారావ్! ఎక్కువగా మాట్లాడే టైమ్ లేదు. నువ్వు మేం అనేది కాదనడానికి వీలులేదు. రేపటి నాటకంలో నువ్వు  ధృతరాష్ట్రుడి వేషం వేయాలి" అన్నాడు సుందరం - సుబ్బారావు చేతులు మరోసారి పుట్టుకుంటూ.


    "అవును సుబ్బారావ్!  నువ్వీ వేషం వేసితీరాలి. మా మాట కాదనకుండా మమ్మల్ని గట్టెక్కించాలి" అన్నారు అందరూ ముక్తకంఠంతో.

 Previous Page Next Page