Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 17


    
    వాడ్ని కాలరు పట్టుకుని లేపి కార్లో కూలేసి, నా సీట్లో కూర్చుని తాపీగా డ్రైవ్ చేయటం మొదలు పెట్టాను.
    
    "ఏమిటి దౌర్జన్యం" అని వాడు గింజుకుంటున్నాడు. వాడి నోట్లోంచి రక్తం కారుతూంది.
    
    కారు ఊరి చివరికి తీసుకెళ్ళి నిర్మానుష్యమైన తోపులమధ్య ఆపుచేశాను. కార్లోంచి వాడిని క్రిందికి దిగమన్నాను.
    
    "నిండు బజార్లో నిన్ను కొట్టడం బట్టి నా మనస్తత్వం నీకు అర్ధమై వుంటుంది. నా కెక్కువ టైమ్ లేదు. మొత్తం నీకు తెలిసినదంతా చెప్పు-"
    
    "ఏం చెప్పాలి? ఎవర్నువ్వు?"    

 

    "నువ్విప్పుడు బ్లాక్ మెయిల్ చెయ్యటానికి వచ్చావే. ఆవిడ కొడుకుని".  

 

    "ఓహో దాని కొడుకువా".    
    
    ఈసారి కొట్టిన దెబ్బ చెంప ఎముక్కి కాస్త క్రింద తగిలింది. రక్తంతో తడిసిన రెండు తెల్లటి దంతాలు వూడిపడ్డాయి.
    
    "చెప్పు, భైరవమూర్తికి నీకూ ఏమిటి సంబంధం? నా తండ్రి ఎవరు?"    

    "నే చెప్పను. అంతేకాదు. మీ తల్లీ, కొడుకుల సంగతి పెపంచమంతా చాటుతాను".
    
    నేను కారు వెనక్కి వెళ్ళి డిక్కీ తీశాను. నేనటు వెళ్ళటం చూసి వాడు పరుగెత్తబోయి, దాన్ని ముందే వూహించైనా నేను కాలు అడ్డు పెట్టటంతో ముందు బోర్లాపడ్డాడు. కార్లోంచి డబ్బాతీసి పెట్రోలు వాడిమీద పోశాను.
    
    "మా అమ్మలాగా నాకు సహనం- ఓర్పు-భయం-ఇవేమీ లేవు. నిముషం టైమిస్తున్నాను. మొత్తం నీకూ, నీ గురువుకీ తెలిసినదంతా చెప్పాలి.
    
    వాడిని పూర్తిగా పెట్రోలుతో తడిపి, జేబులోంచి లైటర్ తీశాను. గట్టిగా అరవబోయిన వాడి నోటిని బూటకాలు మూసింది.
    
    "ప్రపంచమంతా చాటుతానన్నావుగా అరుస్తావేం? ఎలా చాటుతావో చాటు. ముందు నిన్ను చంపుతాను. తరువాత జైల్లో వాడిని చంపుతాను. చాలు, ఈ రహస్యం ఇక బైటకి రాదు". లైటర్ టప్ మన్న శబ్దంతో వెలిగింది.
    
    ముందుకు వంగాను. పెట్రోలు గాలికి మంట మరింత ప్రకాశవంతమైంది.
    
    "చెప్తాను, నన్ను చంపకు" అరిచాడు.
    
    లైటార్పి, లేచి నిలబడుతూ, "చెప్పు" అన్నాను.
    
    "నువ్వు భైరవమూర్తి కొడుకువి కావు. నీ తల్లి మెళ్ళో మంగళసూత్రం మాత్రం ఆడు కట్టాడు. నీ తండ్రి ఏరే ఉన్నాడు. ఆడు నీ తల్లిని మోసం చేస్తే మా గురువు పాపం కదా అని ఏలుకున్నాడు".
    
    "ఇదంతా నీ కెవరు చెప్పారు?"
    
    "జైల్లో మా గురువే".
    
    "పద, ఆడి దగ్గర కెళ్దాం".    
    
    "ఆడింకెక్కడున్నాడు? సచ్చి పదిరోజులైంది".    

 

    నేను నిటారుగా అయ్యాను. భైరవమూర్తి చచ్చి పోయాడు. నా తల్లి భర్త చనిపోయాడు.
    
    నాలో మారుతున్న భావాలు పట్టించుకోకుండా వాడు చెప్పుకుపోతున్నాడు. "సచ్చేముందు నన్ను దగ్గిరకు పిల్చి ఆడు చెప్పాడు. 'ఇంకో వారం రోజుల్లో బైట కెళ్తున్నావు. నీకేమైనా డబ్బు అవసరం కావొల్సివస్తే నా పెళ్ళాన్నడుగు. మంచి పొజిషన్ లో వుంది. దాని కొడుకు రహస్యం నీకు తెలుసునని చెప్పు చాలు, డబ్బిచ్చేస్తుంది' అన్నాడు. పాపం సచ్చేముందు కూడా శిష్యుడిని గుర్తుంచుకున్నాడు".
    
    వాడిని మెడ పట్టుకుని పైకి లేపాను.
    
    "నే నెవరి కొడుకుని?"
    
    "నాకు తెల్వదు".
    
    "తెలుసు. ఈ విషయం కూడా అతడు నీకు చెప్పే వుంటాడు. చెప్పు, నా తల్లిని మోసం చేసిందెవరు?"
    
    "సత్తె పెమాణికంగా చెప్తున్నాను. 'పేరు చెప్తే చాలు డబ్బిచ్చేస్తాది' అని చెప్పాడు. మిగతా వివరాలు ఆడికి కూడా తెలియవని నా నమ్మకం. నీ తండ్రెక్కడున్నాడో ఆడిక్కూడా తెలీదు".
    
    పెదవులు బిగించి కటువుగా అడిగాను. "ఏం పేరు చెప్పాడు?"
    
    ..........
    
    "పెళ్ళికి ముందు నా తల్లిని మోసం చేసినవాడి పేరు ఏమని చెప్పాడు వాడు?" అరుపుకి సరుగుడు చెట్లు కదిలిపోయాయి.
    
    "అయినంపూడి ఆనందరావు".    

                                          6
    
    భూమి, గాలి, చెట్లు నా తల్లిని మోసం చేసినవాడి పేరు వున్నాయి. రేపు వాడి చావుకి అవే సాక్ష్యాలుగా మిగుల్తాయి.
    
    ఆ పేరు నాల్గయిదుసార్లు మనసులో మననం చేసుకున్నాను. అయినంపూడి ఆనందరావు.
    
    ఎదురుగా నిలబడ్డ మనిషిలోంచి పెట్రోలు వాసనగాలితో పాటు వస్తూంది. నోట్లోంచి రక్తం ఇంకా కారుతూంది. వాడు పూర్తిగా బెదిరిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఇక వాడి గురించి ఏ ప్రమాదమూ వుండనట్టే తోస్తూంది.
    
    "ఈ పేరు నీకు తప్ప ఇంకెవరికీ తెలీదు కదూ?"
    
    "తెలీదు".
    
    "చెపుతావా?"
    
    "చెప్పను".
    
    "మళ్ళీ మా ఇంటివైపు వస్తావా?"
    
    "రాను".
    
    "నా తల్లిని కలుసుకోవటానికి ప్రయత్నిస్తావా?"
    
    "లేదు. అసలు ఈ వూళ్ళో వుండను. వెళ్ళిపోతాను".  

 

    "వెళ్ళు మళ్ళీ ఇంకొకసారి నిన్ను చూసానంటే, ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావా లేదా నై అడగను. పెట్రోలుతోకూడా కాల్చను. ఒకే పోటు...గుండెల్లో-అర్ధమైందా?"
    
    వాడు తలూపాడు.
    
    "వేళ్ళు, నేను మనస్సు మార్చుకునేలోపులో పరుగెత్తు".
    
    వాడు వెనుదిరిగాడు.
    
    "ఇంకొక విషయం! భైరవమూర్తి చనిపోయినట్టు నా తల్లికి తెలియటానికి వీల్లేదు".
    
    ... వాడు తలూపి, పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
    
    కార్లో కూర్చున్నాను. వెంటనే స్టార్ట్ చెయ్యలేదు. అప్పటి వరకూ వున్న మూడ్ పోయి నిస్సత్తువ ఆవరించింది. ణ ఆతల్లి ఎందుకింత ఆవేదన చెందుతూందో అర్ధమైంది. ఇన్నాళ్ళ గతం తనని నీడలా భయపెడుతూ వచ్చిందన్న సంగతి, ఆమె పట్ల కోపాన్నీ, అయిష్టాన్నీ కలుగచెయ్యలేదు. ఈ ప్రపంచంలో స్త్రీ నష్టపోవటం అనేది మొగవాడి మోసానికి ప్రతీక మాత్రమే. ఇన్నాళ్ళూ ఇన్ని అగ్నిపర్వతాల్ని మనసులో దాచుకుని ఒక కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడిన ఆ స్త్రీ, నాకు తల్లి కాకపోయినా ఈ కథ తెలిశాక నాకు ఆమెపై కోపం రాదు. నా కోపం అంతా అతడి మీదే.

 Previous Page Next Page