ఆమె పుస్తకంవైపే ధ్యాసవుంచి దీక్షగా చదువుతోంది. వినబడలేదు.
అంతకంటే గట్టిగా పిలవటానికి అవకాశంలేదు.
ఓపిగ్గా ఓ అరగంటసేపు నిల్చున్నాడు-ఇటు చూస్తోందేమోనని. ఆమె తల తిప్పటంలేదు. ఆమె గది రోడ్డుకు దగ్గరలో లేదు, పది గజాలదూరంలో వుంది.
శైలజ లేచింది. ఇటువైపు చూస్తోందా? మళ్ళీ పిల్చాడు. ఆమెకు వినబడలేదు. కాసేపటికి గదిలో లైటు ఆరిపోయింది. అతను నిరాశతో వెనక్కి తిరిగి కాళ్ళీడ్చుకుంటూ గదికేసి వచ్చాడు.
నిర్ణయం తీసుకున్నాడు. చిన్నపెట్టెలో సామాను సర్దుకుని, ఏ బండి దొరికితే అందులో బయలుదేరుదామని స్టేషన్ కి బయలుదేరాడు.
* * *
అలావెళ్ళిన ఫణి పరీక్షల టైముకు రాలేకపోయాడు. వెళ్లేసరికి తండ్రి అవసాన దశలో వున్నాడు. వసుమతి పరిస్థితి ఎదుర్కోలేక నానా హైరానా పడుతోంది.
"అన్నయ్యా, క్షమించు, నేనే ఈదుకువద్దామని ఎంతగానో ప్రయత్నించాను. నావల్ల కాలేదు. నాకు తెలుసు నీకు పరీక్షలని. అయినా నిన్ను నాశనం చెయ్యక తప్పలేదు" అంది కన్నీళ్ళతో.
ఫణి చెల్లెల్ని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు.
సరిగ్గా పరీక్షలు ప్రారంభం కావల్సినరోజు తండ్రి చనిపోయాడు. తర్వాత తతంగమంతా నెత్తిమీద పడిపోయింది.
* * *
శైలజ ఏంచేస్తోంది? ఎలావుంది? ఆమెను ఎలా కలుసుకోవాలి? ఏం చెయ్యాలి?
కాకినాడలో ఆమె ఎడ్రస్ తెలీదు.
అక్కడేం జరిగిపోతోంది? ఆమె తననించి దూరం కావటానికి వీల్లేదు.
ఎన్నోసార్లు కాకినాడ వెళ్ళి ఎక్కడన్నా ఆమె కనిపిస్తుందేమోనని పిచ్చెక్కినట్లు తిరిగాడు.
ఇక్కడ ఇంట్లో పరిస్థితులు అధ్వాన్నంగా వున్నాయి. ఆ ఊబిలోంచి బయట పడలేకుండా వున్నాడు.
పేపర్లో రిజల్ట్సు వచ్చాయి. శైలజకి ఫస్టుక్లాసు.
ఆశ్చర్యం కలిగించేటట్లు ఆ మరునాడు తనకి ఉత్తరం వచ్చింది శైలజ దగ్గర్నుంచి. కాకినాడ పోర్టుస్టేషన్ దగ్గరకు ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు వచ్చి కలుసుకోమని.
ఉత్సాహంతో ఎంత ఊగిపోయాడో! కరిగిపోయే కల మళ్ళీ నిలబడుతోంది.
ఆదివారం సాయంత్రం ఆమె చెప్పిన టైముకల్లా పోర్టుస్టేషన్ దగ్గరకెళ్ళాడు. అప్పటికే శైలజవచ్చి ఎదురుచూస్తోంది.
అతన్ని చూసి ఆమె ముఖం వికసించింది కానీ ఆమె ముఖంలో దిగులు వుంది.
"శైలూ! నా ఎడ్రస్ ఎలా తెలిసింది?" అనడిగాడు ఆప్యాయంగా.
"నువ్వు పరీక్షలముందు కనబడకపోతే కారణం తెలీక ఇంకా వస్తావు ఇంకా వస్తావని కాలం గడిపాను. పరీక్షలయినాక ఇక్కడికి వచ్చేముందు నీ రూం కెళ్ళాను. అక్కడ తెలుసుకున్నాను."
"అయితేలే, ఇన్నాళ్ళకన్నా రాశావు."
ఆమె దానికేమీ జవాబు చెప్పలేదు.
"ఫణీ! అసలేం జరిగింది? ఎందుకలా వచ్చేశావు?"
అతను వివరంగా చెప్పాడు.
"సారీ ఫణీ!" అంది బాధగా.
"శైలూ! కంగ్రాచ్యులేషన్స్."
"నాకేం సంతోషంగా లేదు" అన్నదామె పొడిగా.
"శైలూ! అలా నడుద్దాం పద."
ఇద్దరూ బయటకువచ్చి సముద్రంకేసి నడవసాగారు. "ఫణీ, నీకెందుకు లెటర్ రాశానో తెలుసా?"
కొద్దిగా ఊహించగలుగుతున్నాను.
"పరాయిదాన్ని కాబోతున్నాను."
"పరాయిదానివి" అతను కోపంగా అన్నాడు "అంటే ఇంతవరకూ నా మనిషివని ఒప్పుకున్నట్లేగా?"
"ఫణీ! అలా మాట్లాడకు. నాకేం తెలియటంలేదు."
"ఏం తెలుసు? ఇతరుల జీవితాల్లో మంటలురేపటం తెలుసా?"
శైలజ ఏమీ మాట్లాడలేదు. కష్టంమీద కన్నీళ్ళనాపుకుంటోంది. "నీ జీవితాన్నే ఫణంగా పెట్టడం-ఇవన్నీ నాకు తెలియదు. నచ్చలేదుకూడా. నువ్వు నాదానివి. పరాయిదానివి కావటానికి వీల్లేదు."
"కానీ ఎట్లా ఫణీ?"
"మీ నాన్న వాళ్ళకి నోటురాశాడు కదా, దానికి పరిష్కారం ఏమిటని అడుగుతున్నావు? రేపు నాకు చదువు పూర్తవుతుంది. ఇద్దరం ఉద్యోగాలు చేద్దాం, సంపాదిద్దాం, అప్పులు తీరుద్దాం."
"ఈలోగా ఆవిడ కేసు పెడితే?"
"ఎదుర్కొందాం."
"ఫణీ! ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదు. నేను తప్ప వాళ్ళకి ఆధారంలేని పరిస్థితి వచ్చేసింది."
"శైలూ, ఇవన్నీ ఛాలెంజ్ గా తీసుకుని ఫేస్ చేద్దాం. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం నీకులేదా?"
"పిరికిదాన్నయిపోతున్నాను ఫణీ! ఉద్యోగాలు అంత తేలిగ్గా వస్తాయన్న నమ్మకం నాకు లేదు."
"తేలిగ్గా ఏవీరావు. కాని ఆత్మవిశ్వాసం మనిషిని పడిపోకుండా నిలబెడుతుంది. శైలూ! రేపు శుక్రవారం ఉదయం పదిగంటలకు యిక్కడికే పోర్టుస్టేషన్ దగ్గరకే వస్తాను. అన్ని ఏర్పాట్లూ చూసుకుని వస్తాను. దేనికో తెలుసా? నిన్ను పెళ్ళి చేసుకునేందుకు. నిన్నిలా దూరంగా వుంచితే ఏవో సమస్యలు ఎదురవుతూనే వుంటాయి. ఉండు, ఇప్పుడు నాకేం చెప్పవద్దు. ఈ నాలుగురోజులూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే రా, లేక బలైపోవటానికే సిద్ధపడితే, నన్నూ బలిచేయటానికే సిద్ధపడితే రావద్దు. శైలూ, నువ్వు చదువుకున్న యువతివి, జాగ్రత్తగా ఆలోచించు."