Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 18


    తనతో కలిసి చదివిన వాళ్ళందరూ ఒక్క ఏడాది ముందు వెళ్ళిపోయేసరికి అతనికి పూర్వము వున్న పరిసరాల్లో వుందబుద్ధికాలేదు. మహారాణి పేటలో మరోగదికి మారి అక్కడవుంటూ శ్రద్ధగా చదవసాగాడు.

    సాహితీ సమితివాళ్లు తాము ఇచ్చిన బహుమతి వివరాలు ఎనౌన్స్ చేశారు. పేపర్లో  ఉత్తమ నవలా  రచయితగా తాను ఎన్నికయిన వార్త చూసి స్తబ్ధుడై పోయాడు మధుబాబు. కలా నిజమా అనిపించింది. నిజానికి ఆ మధ్య పోటీ విషయంకూడా మరచిపోయాడు. ఎలా వచ్చింది తనకు ప్రైజ్? కేవలం  అదృష్టమా! ఆ రాత్రి అంతా ఆ సుఖమైన అనుభూతే స్ఫురించింది.

    మరునాడు ప్రాక్టికల్స్ కని  కాలేజీకి పోయేసరికి మిగతా స్టూడెంటులంతా వచ్చి అతన్ని అభినందించారు. టీ పార్టీ  ఎప్పుడని మొదలుపెట్టారు. ఆ సాయంకాలం  అతనికి సాహితీ సమితినుండి అభినందనలేఖ అందింది. బహుమతి ప్రదానం  వివరాలు తరువాత తెలియపరుస్తామని  రాశారు.

    ఈలోగా అతని మిగతా నవలలుకూడా పుస్తకరూపాన వెలువడినయి. మూడోది క్రొత్త పబ్లిషర్ కిచ్చాడు. ఈ కొత్త పబ్లిషర్ యువకుడు . ఉత్సాహవంతుడు. మర్యాద తెలిసినవాడు. మధుబాబుతో బాగా స్నేహం కలిసి  పోయింది. డబ్బు విషయంలో ఇద్దరిమధ్యా పేచీలేదు. తనకు కావలసినంత అడిగి తీసుకున్నాడు మధుబాబు. ఇహమీదట తన పుస్తకాలన్నీ అతనికే ఇద్దామని సంకల్పించుకున్నాడు.

    మూడో నవలమీద అనుకున్నట్లుగానే విమర్శలు చెలరేగాయి. నవలంతా అతను చిత్రించిన విరుద్ధ మనస్తత్వాలుగా రెండుపాత్రలు కూడా తాము జీవితాన్ని అపార్థం చేసుకున్నామని ఒప్పుకుంటాయి. ఇరువుర్నీ పశ్చాత్తాపం ఆవహిస్తుంది. కొంతమందికి ఇది నచ్చలేదు. మధుబాబుని ఛాందసుడనీ, పిరికి అనీ నిందించారు. మరికొందరు చదివి పులకరించిపొయ్యారు. కొందరు ఏమైనా మొదటి నవల్లాగా మధుబాబు రాయలేకపోతున్నాడని ఓ నిశ్చయం ప్రదర్శించారు. సాఫీగా వున్నవి వున్నట్లు పరువకుండా విపరీత మనస్తత్వాల జోలికి పోవటమెందుకని కొంతమంది వాదం.

    భాషా విషయంలో కథచెప్పే తీరులో వాస్తవికత లోపించిందని మరికొందరి నమ్మకం. మొత్తంమీద  అతని మిగతా నవలలకంటే ఇదే తొందరగా అమ్ముడు కాసాగింది. ఏమైనా ప్రత్యేకతలేని నవలని అనటానికి ఎవరూ సాహసించలేదు.

    "వాస్తవికత" అనేపదం తరుచు వినబడుతూండేసరికి దాన్నిగురించి తీవ్రంగా ఆలోచించి చూశాడు మధుబాబు. వాస్తవికతకు చేరువగా వస్తున్నారే గాని, వున్నది వున్నట్లు ఎవరూ రాయలేరు. రాస్తే చాలా అసహజంగా, అసహ్యంగాకూడా వుండే ప్రమాదం వుంది. అతి వాస్తవికంగా రాశామనుకున్న రచనల్లో నిండుతనం లోపిస్తుంది. నిర్జీవంగా పేలవంగా వుంటున్నాయి. అనుభూతినియ్యవు. పెద్ద రచయితలని పిలవబడేవాళ్లు ఆ వట్టి పేరేగాని, అన్నివర్గాలవారిని ఆకర్షించకపోవటానికి ఇదో పెద్ద కారణమని విశ్వసించాడు మధుబాబు.

    ఓ రచనయొక్క  విషయం దానికి పెట్టే పేరుమీదా, అందులోని పాత్రలకు  పెట్టే పేర్ల మీదకూడా  కొంతవరకూ ఆధారపడి వుంటుంది. నిత్యజీవితంలో పుల్లయ్య అనేపేరుగల ఒకడు ఎమ్.ఏ నో లేక ఇంజనీరింగో చదువుతూ వుండవచ్చు. అతడు అనేక ఆకర్షణీయమైన కార్యాకలాపాలు చేస్తూనే వుండొచ్చు. ఓ రొమాటింక్ హీరో కావచ్చు గాని, అదే కథలోకి వచ్చేసరికి అలాంటి లక్షణాలుగల కథానాయకుడికి పుల్లయ్య అనో, ఎల్లయ్య అనో పేరు పెడితే చదివేవాళ్లకి చిరాకెత్తుతుంది. అలాగే ఎంతమంది వెంకటసుబ్బమ్మలు, రంగనాయకమ్మలు లేరు అందమైన కాలేజి స్టూడెంట్లుగా? ఓ నవల్లో నాయికను వయ్యారంగా వర్ణిస్తూ అలాంటి పేర్లు పెడితే పాఠకలోకం హర్షిస్తుందా?

    మధుబాబు తనరచనల్లోని పాత్రల పేర్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు.


                                *    *    *

    శ్రద్ధగా చదువుతున్నాడు. కాని ఎక్కువగా అలసట చెందవద్దని తండ్రి చేసిన  హెచ్చరికలు జ్ఞాపకం  వచ్చినప్పుడల్లా తానిహ జీవితాంతం అందరిలాగా స్వేచ్ఛగా  వుండలేనా అన్న తలంపు వేధిస్తూ వుండేది.

    ఒకరోజు యధాలాపంగా ఓ వారపత్రిక చదువుతోండగా ఓ అమ్మాయి  రాసిన కథ అతడ్ని  ఆకర్షించింది. ఆ అమ్మాయిపేరు పద్మజ. కథ గొప్పగా  ఏంలేదు. శైలికూడా విలక్షణంగా ఏమీలేదు. కాని ఉల్లాసంగా , ఆహ్లాదకరంగా , మధురంగా  వుంది. అతనికి హాయనిపించింది. వెంటనే తనగురించి తనకు స్ఫురించింది. తాను ఎంతో గంభీరమైన జటిలమైన, మనస్తత్వ చిత్రణలు చేశాడు. ఒకవేళ ఈ యాతన, గంద్రగోళం ఇదంతా జీవితాన్ని మరింత క్లిష్టం చేయటానికేనేమో! ఇప్పుడీ అమ్మాయి రాసిన కథ చదివితే ఎంతో సంపుల్లమానంగా వుంది మనస్సు. తియ్యని ఆలోచనలు కలుగుతున్నాయి. ఎంత నిశ్చింతగా వుంటుంది..... యిలాంటి రచనలు చేస్తూ వుంటే.... చికాకు లేకుండా.

    అతనికి వెంటనే ఆ అమ్మాయికి వుత్తరం రాద్దామనిపించింది. అమ్మాయో, వయసులో పెద్దో ఏమీ తెలియదు. పేరున్న రచయిత్రికూడా కాదు.

    తనగ్గరనుంచి ఉత్తరం వస్తే ఏమనుకుంటుంది? ఇలా పాఠకుడిగా ఒకరికి రాయటం ఇదే ప్రథమపర్యాయం. పోనీ మారుపేరుతో రాస్తే? అతనికి మనసు ఒప్పుకోలేదు.

    వెంటనే ఓ చిన్న ఉత్తరం రాసేశాడు. పద్మజగారికి అని మొదలుపెట్టి.

    "బహుశా జీవితంలోని సీరియస్ నెస్ వల్లనేమో మీ కథ హాలా నచ్చింది. అసలు  మనుషులకి కావలసింది ఇలాంటి కథలేనేమోనన్న నమ్మకం కలుగుతోంది. చాలా సరదాగా వుంది. వీలుంటే జాబు రాయండి."

    క్రింద సంతకం చేశాడు.

    ఆమె ఎడ్రస్ తెలియదుమరి. తనకొచ్చే ఉత్తరాలన్నీ పత్రికల ఆఫీసునుంచి రీడైరెక్ట్ చేయబడి వస్తాయి. అలాగే ఆ వారపత్రిక కేరాఫ్ కు పోస్ట్ చేశాడు.

    అయిదురోజుల్లో పద్మజ దగ్గరనుంచి జవాబువచ్చింది. ఆమెది హైద్రాబాద్.

    "మధుబాబు గారికి,

    మీ దగ్గర్నుంచి ఉత్తరం రావటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒక సంగతి  చెప్పనా? మధుబాబు నా అభిమాన రచయిత. వీలయితే ఎప్పుడన్నా  కలుసుకోవాలన్న కోరికకూడా రహస్యంగా నాలోవుంది. నేను మీ  రచనలన్నీ చదివాను. ఎంతో ఇష్టం నాకు. మీ రచనలముందు నావి సూర్యుడిముందు  దివిటీలలాంటివి. అసలు  నేను రెండుమూడు కథలకంటే ఎక్కువ రాయలేదు. అవునుగాని ఈ ఉత్తరంలో ఆపేస్తారా? నాకు వరసగా రాస్తూ వుంటారా? ఈసారి పాఠకుడిగా కాకుండా రచయితగా, నా అభిమాన రచయితగా రాయగోరుతున్నాను.

    ఈసారి అంత చిన్న  ఉత్తరం రాస్తే..... ఇహ ఏంలేదు. నాకు కోపం వస్తుంది.

                                                                                                                పద్మజ."

    ఎంత అప్యాయంగా వుంది లేఖ! అతనికి శరీరం  పులకరించింది. ఒక్కసారి కాదు. పదిసార్లు చదువుకున్నాడు.

    ఈ మధ్య అతన్ని వంటరితనం మరీ వేధిస్తోంది. ఎందుకనో తనకెవరూ లేరనిపిస్తోంది. ఎప్పుడూ అర్థంకాని అవ్యక్తాందోళన. తనప్రక్కన ఓ అందమైన అమ్మాయి వుండాలని, ఇద్దరూ  ఎక్కడో  ఎవరికీ  తెలియని  ఏకాంతంలో ఒకరికొకరు సమీపంలో అలా పచ్చికలో పడుకుని తానామె కళ్ళలోకి చూస్తూ తన మనసుని విప్పి చెబుతోంటే, ఆమె ఊకొడుతూ, నిట్టూరుస్తూ ఆలకించాలని..... ఇలా తియ్యటి కలలు. తాను ఒట్టి అయోమయం మనిషి. తనకు తోడుకావాలి. ఆ తోడుకోసం మనసు తహతహలాడుతోంది.

    అనుకోకుండా ఎంతో ఆప్యాయంగా మళ్ళీ జవాబు రాసేశాడు మధుబాబు. ఈసారి కాస్త  పెద్దది రాశాడు. ఆమె బొత్తిగా అపరిచిత. తాను ఏంరాస్తే ఏంవస్తుందో? జాగ్రత్తగానే రాశాడు. స్వంతవిషయాలు లేకుండా, అటు బొత్తిగా జనరల్ గా కాకుండా రాశాడు.

    పద్మజ వెంటనే జవాబు రాసింది.

    మధుబాబుకి యీ అనుభూతి కొత్తగా వుంది. ఇదివరలో తనకెందరో రాశారు. ఇప్పటికీ రాస్తున్నారు. తాను వాటికి జవాబులు యిస్తూనే వున్నాడు. కాని అవన్నీ సమస్యలమయం, చర్చలమయం. తాను వాళ్ళకు సన్నిహితంగా వచ్చినమాట వాస్తవమేగాని..... ఈ ఆకర్షణ, మధురయాతన అక్కడలేదు. ఒకరకంగా చాలా చిన్నపిల్లలా,  అభమూ, శుభమూ తెలియని అమ్మాయిలా రాస్తోంది.

    "అప్పుడే చెప్పులు తొడుక్కుని బయటకు పోదామనుకుంటున్నాను. ఇంతలో మీ ఉత్తరం వచ్చింది. ఎవరో  నామీద బుట్టెడు పువ్వులు చల్లినట్లునిపించింది..... మీ అక్షరాలు ఎంత అందంగా వుంటాయి? నా దస్తూరి బాగాలేదు కదూ....." యిలా సాగింది ఉత్తరం.

    మళ్లీ జవాబు రాశాడు మధుబాబు.

    రాసినప్పటినుంచీ ఆమె ప్రత్యుత్తరంకోసం ఎదురుచూడటం ఓ నూతన దినచర్య అయింది. అబ్బ! స్త్రీ ఎంత ఆకర్షణ?


                                            20

    ఎక్కడి మధుబాబు? ఎక్కడిపద్మజ? ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. బహుశా మధుబాబు ఫోటో చూసివుండవచ్చు పద్మజ. కాని ఓ మనిషి ఫోటోని బట్టి రూపంమీద విశ్వసించటం కష్టం. మొత్తంమీద ఒకరికొకరు సన్నిహితంగా రాసాగారు.

    ఆ ఉత్తరాలు చిత్రవిచిత్రంగా వుండేవి.

    "పద్మా!" అని సంబోధించేవాడామెను మధుబాబు. "పద్మా! ఇక్కడ నాకేం  తోచటంలేదు. ప్రపంచంమీద చిరాకు కలుగుతోంది. మీ కబుర్లు ఎంతసేపైనా వినాలని వుంది. మీరెందుకు అప్పుడప్పుడూ రాయటం ఆలస్యం చేస్తారు? ఎందుకో యీ సాహిత్య వ్యాసంగంమీద విరక్తి పడుతోందండి నాకు. ఎందుకివన్నీ.....అర్థంలేకుండా అనిపిస్తోంది. మళ్లీ విషాదంమీద మోజు, ఒక్కోసారి అర్థరాత్రి లేచికూర్చుని దేవదాసుల్ని, పార్వతుల్ని ఎడతెరిపి లేకుండా సృష్టించి యీ ప్రపంచాన్ని దుఃఖమయం చేయాలనిపిస్తుంది." 

 Previous Page Next Page