Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 17


    అతనికి అంతుపట్టటంలేదు.

    ఈ హఠాత్ పరిణామాలవల్ల, నిర్ణయాలవల్ల సుఖభ్రాంతేగాని సుఖం లేదన్న నమ్మకం అతనికి కలగసాగింది. టాల్ స్టాయ్ అన్నా కెరినినాలో ఆమె భర్తని విడిచిపెట్టి వెళ్ళాక ఎదుర్కున్న ఒడుదుడుకుల్ని, దారుణ మానసిక నరకాన్ని చిత్రించటానికి వందలకొద్దీ పేజీలు రాయాల్సి వచ్చింది. ఇట్లా కొత్తబాటలు వెదుక్కుంటూన్న కొద్దీ అడుగడుక్కీ అశాంతీ, బీభత్సమేకాని నిజమైన మనుగడ ఎక్కడ? ఇంకో విషయం జీవితాదర్శం సుఖాన్వేషణే అయితే, అది అంతూ, ఫలితంలేని అనుభవాల సంపుటేగాని, చివరిదశలో విరాగిని చేసే  ఓ సాధనమేగాని "యిదే సుఖం" అని స్థిరంగా జీవించే మహత్తర సత్యంమాత్రం కాదు.

    ఎవరు ఎన్ని నినాదాలు చేసినా మనిషి స్వార్థరహితుడిగా, ద్వేషానికీ, అసూయకూ అతీతుడుగా ఎప్పుడూ వుండడంలేదు. స్వార్థం లేకుండా వుండాలనటం ఓ స్వార్థక్రింద పరిణమిస్తోంది. అసూయకి అతీతంగా వుండాలంటే పిరికివాడని పిలవాల్సి వస్తోంది.

    అన్యాయం జరుగుతూన్నమాట వాస్తవమే. కాని వివాహం, బంధం యిదంతా మిధ్య అనటం న్యాయాన్ని స్థాపిస్తాయా?

    అతని తల బ్రద్దలైపోయింది. ఇన్ని ప్రశ్నలతో అటు పూర్వాచారాలన్ని సాంఘిక నిబంధనల నిరంకుశత్వం ఎంత క్షోభ కలిగిస్తోందో, యిటు యీ సమస్యల విపరీత పరిష్కారాలుకూడా అంతే సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి.

    ఈ సంఘర్షణతో ఛాందసభావాలుగల యువకుడ్ని సంఘంచేత దగా చేయబడిన విప్లవభావాలతో మండిపోతోన్న యువతని తీసుకుని పరిస్థితుల్ని అల్లుకుంటూ అతను కొత్తనవల రాయసాగాడు.



                                            18


    మధుబాబు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఇదివరకటికంటే బాగా వళ్లువచ్చింది. చూడగానే యితరుల్ని ఆకర్షించేటట్లుగా వున్నాడు. మొదటి ఆరునెలలూ అసలు ఇంట్లోంచి బయటకు కదలనివ్వలేదు అతన్ని. కానీ  తర్వాత డాక్టరు సాయంత్రాలు పార్క్ కి వెళ్ళటానికి అనుమతి యిచ్చాడు. ఆరునెలల తర్వాత వీధిలోకి వచ్చి రోడ్డుమీద నడుస్తోంటే అతని మనసంతా ఎంతో సంపుల్లమానంగా వుంది. గర్వంగా వుంది. బందర్ రోడ్డుమీదకు వచ్చి అక్కడినుంచి ఆల్ యిండియా రేడియోవైపు ఉల్లాసంగా నడిచి, అక్కడున్న  మైదానంలో పచ్చగడ్డిలో చతికిలపడి, దూరంగా ఆడుకుంటూన్న విద్యార్థుల్ని చూడటంలో నిమగ్నమైనాడు.

    ఈ మధ్యకాలంలో తనలో ఎంతో మార్పు వచ్చింది. మానసింకంగా ఎంతో పెరిగాడుకూడా. ఓ పటిష్టత ఏర్పడింది. ఆత్మవిశ్వాసంకూడా ప్రబలింది.

    అతని మొదటినవల వెలువడింది. సాహితీసమితి పోటీకి దాన్ని పంపించాడు. పత్రికలన్నీ ఎంతో ప్రశంసించాయి. విమర్శకుడు మాత్రం నా  పాతపాట పాడాడు. రెండో నవలకూడా సీరియల్ గా సమాప్తి చెందింది. పుస్తకరూపాన అచ్చవుతోంది. కాని యీ పబ్లిషర్ల ప్రవర్తనపట్ల అతనికి రోత కలిగింది. నిజాయితీ అనేసి శూన్యం. మొదట అనుకున్నదానికి యిబ్బడి కాపీలు అచ్చువేసిపారేస్తారు తెలియకుండా. ఆ అనుకున్న ప్రకారమైనా డబ్బు యిస్తారా అంటే అదీలేదు. ఇదిగో అదిగో అని కాలయాపనచేసి, చివరకు యాభయ్యో వందో చేతుల్లోపెట్టి, మిగతాదాన్ని గురించి ఎత్తనుకూడా ఎత్తరు. ఆ యిచ్చేదైనా ధర్మం చేసినట్లు ఊరికినే యిచ్చినట్లు, జాలితలిచి యిచ్చినట్లు యిస్తారు. పబ్లిషర్ ఆర్ధికసంబంధమైన ఇబ్బందుల్లో వుండి.... ఇవ్వలేనని చెబితే మధుబాబుకు డబ్బుదగ్గర పట్టింపులేదు. కాని తానేమో డబ్బులు చేసుకుంటూ వుండె. రచయితకు న్యాయంగా రావలసిందాన్ని యివ్వకపోవటానికి కారణమేముందిహ? ఇదీ అతని కోపం.

    అసలు పబ్లిషర్ల దుష్కృత్యాలకు కొంతవరకు రచయితలే బాధ్యులు. కాని అది వాళ్ళ తప్పుగాదు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది ఆర్థికంగా ఎంతో ఇబ్బంది వున్నవారు. ఎంతోకొంత డబ్బు వాళ్లకవసరం. ఆ డబ్బుకోసం పబ్లిషర్లు చెప్పిన షరతులకన్నిటికీ ఒప్పుకొని, ఆడుతూన్న నటాకాలన్నిటినీ భరించాల్సి వస్తోంది. ఇలా కొందరు రచయితలు పబ్లిషర్లకు అలుసయి, వాళ్లను అందలం ఎక్కించేసరికి యిది మిగతా రచయితలకు కూడా దెబ్బ కొట్టింది.

    దూరంగా ఆడుకొంటూన్న అబ్బాయిల్ని చూస్తూ మధుబాబు  ఆలోచిస్తున్నాడు. తనకు చిన్నప్పుడు ఆటలంటే సరదాయే. ఆడుతూ వుండేవాడుకూడా. కాని మనిషి బలహీనంగా వున్నాడని తండ్రి మానిపించేశాడు. మెడికల్ కాలేజీలో ఆ మధ్య కొన్నాళ్ళు టెన్నిస్ ప్రాక్టీస్ చేశాడు. కాని ఇప్పుడిహ ఆ అవకాశం లేదు. తన ఆరోగ్యం బాగుపడినా దీన్ని పువ్వులా వాడుకోవాలి. మామూలు మనిషిలా విచ్చలవిడిగా వుండటానికి వీలులేదు.

    తన మూడో నవలకూడా పూర్తికావస్తోంది. తాను యింతత్వరగా వ్రాయగలుగుతున్నందుకు అతనికి ఆశ్చర్యంగావుంది. ఉమాపతికూడా యీ  మధ్య రెండు మూడు  నెలలనుంచీ రాయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత వరకూ సగంకూడా పూర్తికాలేదు. జీవితాన్ని గురించీ, సాహిత్యాన్ని గురించీ అతనికి తనకన్న నిర్దుష్టమైన అభిప్రాయాలున్నమాట నిజమే. తనకు ఓపిక తక్కువ. ఆతృత, మొండిధైర్యం ఎక్కువ. రాసిందాన్ని గురించి పదిసార్లు తర్జనభర్జన చేయటం, రాసింది మళ్లీ రాయటం తెగ చికాకు.

    ఈ మధ్య బొత్తిగా కథలు రాయటం మానేశాడు. అదంత మంచిపని కాదు. కాని బొత్తిగా రాయలేకుండా వున్నాడు కథలు. కథకోసం ఆలోచనలు మొదలుపెడితే నవలా స్వరూపం వస్తోంది. అందులో యీ పబ్లిషర్లుకూడా నవలలు నవలలు  అని గోలపెడుతున్నారుగాని కథల సంగతి ఒకరూ ఎత్తరు. మనిషి నలుగురిమధ్యకూ వచ్చి జీవిస్తూ పలుకుబడి సంపాదించాక, ఇది వరకటిలా స్వేచ్చగా ప్రవర్తించలేడన్న సత్యం తెలుసుకోసాగాడు మధుబాబు.

    ఈ మూడో నవలను ఎందుకో ఏ ప్రతికలకూ సీరియల్ గా ఇవ్వటానికి మనస్కరించటంలేదు. నవలంతా చర్చలమయం. వ్రాయటానికి చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. చాలా పుస్తకాలు పరిశీలించాల్సి వచ్చినది. మతాన్నిగురించి, సంఘాన్ని గురించీ, ప్రచారంలోవున్న సిద్దాంతాలగురించీ చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఓ విధంగా ఇది రాయటం తన  విజ్ఞానాభివృద్ధికి దోహదకారి అయింది. అసలు అవసరం అంటూ లేకపోతే మానవుడు విజ్ఞానాసక్తి లేకస్తబ్ధుగా పడి వుండటానికి చాలా అవకాశాలున్నా యేమో.... ఈ నవల ప్రచురణ ఆరంభమయితే తాను అనేక విమర్శలకు గురికావాల్సి వస్తుందేమో!

    అసలు రచయితలకు ఇలాంటి జీవితం చుట్టూ పరివేష్టించి వుంటుందని ముందుగా ఊహించలేకపోయాడు. ఎవరన్నా చెప్పినా  నమ్మివుండేవాడు కాదు. అంటే తాను  మహాప్రపంచాన్ని కదిపి, కుదిపి వేస్తున్నాడని కాదు. ఒకనాడు తాను ఎలాంటి పేరుకోసం ఆశించాడో ఆ పేరు వచ్చింది. ఇప్పటికీ కొంత మంది తనని రచయితగా అంగీకరించకపోవచ్చు కాని తను కొంతమంది చేత ఆరాధించబడుతున్నాడు. ఇది సత్యం, తన జీవితం ఇలా వుంటుందని ఊహాకల్పనలు చేస్తున్నాడు. ఇలా పేరు ప్రఖ్యాతులు పొదిన అందరికీ వుంటుందా? అతనికి తెలియదు. రచయితగా తను అదృష్టవంతుడు. అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. తృప్తి కలుగుతోంది. మెడికల్ కాలేజీలో కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి. తనని ఎక్కడికో ఈడ్చుకుపోతున్నాయి.

    ఇంకో రెండమూడు నెలలయిన తర్వాత ఇక్కడినుంచి వెళ్లిపోవాలి. వెగటుగా వుంది ఇంట్లోని జీవితం. అక్కడకుపోయి చదువుకోవాలి. తను త్వరగా డాక్టరు కావాలి. ఎన్నాళ్లని ఇలా తండ్రిమీద భారంవేసి వుంటాడు? చప్పున డాక్టరు కావాలనీ, ప్రాక్టీస్ పెట్టాలనీ, స్వతంత్రంగా జీవించాలనీ అతి ఆత్రంగా వుంది. తన వయసు ఎక్కువ లేకపోవచ్చు. కాని మానసికంగా పెరిగిపోతున్నాడు. విద్యార్థి దశనుంచి అప్పుడే విడిపోయినట్లుగా ఫీలవుతున్నాడు. గట్టిగా అనుకుంటేనేగాని తాను ఎమ్.బి.బి.ఎస్. స్టూడెంటునన్న విషయం స్ఫురించదు. తన మనస్తత్వం ఎవరూ అర్థంచేసుకోరు. భవిష్యత్ నంతా ఇప్పుడే అనుభవిస్తున్నట్లు ఏమిటో అనుభూతి.

    చీకటి పడుతూండగా యింటికి తిరిగివచ్చాడు మధుబాబు.

    ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా వుంది. భోజనంచేసి తనగదిలోకి వెళ్లి మెల్లిగా కాసేపు బుల్ బుల్ వాయించుకున్నాడు. ఎవరూ నేర్పకుండానే, స్వయంకృషి వలన బాగా వాయించగలగటం వచ్చింది కాని ఎవరైనా వస్తే ఆపేస్తాడు. సిగ్గు, తన  ఆనందంకోసం వాయించుకుంటాడు.

    బయటకు వెళ్ళి వచ్చినందువలన హాయిగా, మరీ ఆరోగ్యంగా వుంది. ఇలాగే రోజూ వాహ్యాళికి వెడుతూంటే తాను ఇంకా ఆరోగ్యంగా తయారు కావచ్చు.

    ఆ రాత్రి పడుకుని నిద్రపోయేముందు ఎందుకో రజని గుర్తుకువచ్చింది. ఆమెని చూడాలి. మాట్లాడాలి అన్నకోరిక కలిగింది. తనపేరు శైలజ అని మార్చుకుంది. కారణమేమిటో! ఆమెకు మంచి పేరుకూడా వచ్చింది. ఇంకా రెండు మూడుసినిమాల్లో కూడా నటిస్తోంది యీ మధ్య ఏదో పత్రికలో చూశాడు. తనని గుర్తుపడుతోందో, పట్టదో ఎప్పుడైనా  కనిపిస్తే.

    అలా ఆలోచిస్తూ నిద్రపోయాడు.


                                                                       19


    వేసవి గడిచిపోగానే మధుబాబు విశాఖపట్నం వచ్చేశాడు. జనవరినుంచీ రెండునెలలు కష్టపడి చదివి యీ మర్చికే అసలు ఎప్పియర్ అవుదామనుకున్నాడు. కాని డాక్టర్ అంగీకరించలేదు. తిరిగి పరీక్షలు నవంబరులో వున్నాయి. అందులో ప్యాస్ అయితే వెంటనే డిశంబరునుంచీ మూడోఏడు కంటిన్యూ చేయవచ్చు. 

 Previous Page Next Page