Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 19


    మధూ! దేవదాసుల్ని, పార్వతుల్ని సృష్టించటం మీ అభిమతమైతే, అలాంటి ఇన్స్పిరేషన్ మీకు ఇవ్వగలనన్న ధైర్యం నాకుంది. మీ కళ్ళలోకి చూస్తూ మీరు చెప్పే కబుర్లు నాకు వినాలనివుంది. ఎందుకో యివాళ ప్రొద్దున లేచినప్పటినుంచీ మీగురించే ఆలోచిస్తున్నాను. మీ ఉత్తరం చదువుతూ ఏదో ఊహాలోకాల్లో విహరించసాగాను. ఇంతలో ఏదో చప్పుడై ఈ  లోకంలోకి వచ్చి చూసేసరికి ఏముంది? ఎర్రగాపండిన గోరింటాకు చేతిలో తెల్లటి మీ ఉత్తరం!

                                                                  *    *    *

    చాలా అల్లరిపిల్లకూడాను పద్మజ. ఒక్కోసారి ఎంతో అల్లరిచేసేది, చిలిపి మాటలని కవ్వించేది. అతను ఊరుకునేవాడుకాదు. "అల్లరిపిల్ల పద్మజకు" అంటూ మొదలుపెట్టేవాడు. అనగా అనగా ఓ అబ్బాయికి అంటూ మొదలు పెట్టేది ఆమె.

    "మీ ఊరు వస్తే ఏంచేస్తారని" అడిగేది.

    "చెవి పట్టుకుని మా ఇంటికి లాక్కువెళతా" అన్నాడు.

    "ఎవర్రా యీ అమ్మాయి? అని మీ ఇంట్లో వాళ్లు అడిగితే మీరు తెల్లమొహం వేయాలి వొద్దులెండి బాబూ! మీకు కోపం వస్తుంది."

    "మీరు రాయబోయి ఆపేసినట్లు తెల్లమొహం వెయ్యను. నా చెలికత్తె అని చెబుతాను."

    "అన్నీ అబద్ధాలు."

    "అదిగో మీరు నమ్మరు."

    "మీ మొగవాళ్ల మాటలు నేను నమ్మను."


                                *    *    *


    "నాకు పరీక్షలకు దగ్గరకొస్తున్నాయి బాబూ! నేను చదువుకోవాలి."

    "ఎంత పరీక్షలయినా సరే, నాకు రాసి తీరాల్సిందే."

    "మరి నా పరీక్షలు గల్లంతయిపోతేనో? ఈసారి పోయిందంటే ఇహ నేను మీకు కనబడను. ఎవ్వరికీ తెలియని, కనిపించని మారుమూలకు వెళ్ళిపోతాను."

    "వద్దు, అలా జరగదు. జరిగినా నా పిలుపు అందని దూరతీరాలకు  వెళ్ళిపోవద్దు. ప్లీజ్."


                               *    *    *


    ఈ అమ్మాయి ఎలా వుంటుందని ఎప్పుడూ ఆలోచించలేదు. మధుబాబుకి అదే ఇంకెవరి గురించయినా అయితే అనుకోకుండానే ఓ రూపం  కళ్ళముందు మెదులుతుంది. కాని పద్మజగురించి ఓ స్వరూపం అతనెప్పుడూ సృష్టించు కోలేదు. ప్రయత్నించినా విఫలత్వం పొందేవాడు. చేతనయ్యేదికాదు. అతడామెను ఆరాధిస్తున్నాడు. ప్రేమకన్నా ఆరాధన గొప్పది. అంత ఆరాధించే వ్యక్తులను గురించి ఎవ్వరూ రూపకల్పన చేసుకోలేరు. ఇది సత్యం. ఓ రూపం లేనివ్యక్తితో, ఒట్టి మనసుతో మాట్లాడుతున్నాడు మధుబాబు. మనిషి ఎలా  వున్నా  అతనికి నిమిత్తం లేదు. అతని ఆనందానికి భంగంకాదు. పద్మజకు అర్థమవుతుందా యీ విషయం? అతని హృదయాన్ని చదవగలుగుతుందా?


                                *    *    *


    ఓరోజు సాయంత్రం ఐదుగంటలయింది. హైదరాబాద్ లో పద్మజ అప్పుడే ఇంటికివచ్చి తలంటుపోసుకున్నది. మనసంతా  ఎంతో ఉల్లాసంగా వుంది. జుట్టు ఆరబెట్టుకుందామని డాబామీదకు వెళ్లింది. సాయంకాలపు నీరెండలో దూరంగా మెరుస్తోన్న చిన్నికొండలూ, యీ కమ్మటిగాలీ, నీలాకాశపు నిర్మలసౌందర్యం..... ఆమె మనసు సంతోషంతో ఉరకలు వేసింది. ఈ పాటికి ఏంచేస్తుంటాడో మధుబాబు? శ్రద్ధగా పాఠాలు చదువుకుంటూ వుంటాడా? తనగురించి ఆలోచిస్తూ వుంటాడా? అతనికి రాయాలనిపించింది అప్పటికప్పుడు గబగబ క్రిందకు వెళ్ళి కాయితం, కాలం తెచ్చుకుని, కుర్చీలో కూర్చుని రాయసాగింది.

    "మధూ!

    ఎంత ప్రశాంతంగావుంది ఇవాళ? ఎన్ని ఊహలు? అతనో మహారాజు. నాకు అందడు. ఎత్తయిన సింహాసనంమీద కూర్చుని వున్నాడు. అతన్ని చేరుకుందామని మెట్లు ఎక్కుతున్నాను. తలవంచుకుని మరో ధ్యాసలేకుండా ఎక్కుతున్నాను. ఆయాసం వస్తోంది. ఎంతకూ అంతుతేలని ఈ ప్రయాణం, ముఖాన స్వేదబిందువులు అలుముకుంటున్నాయి. అతన్నెట్లా చేరుకుంటాను? అతనికి తెలుస్తుందా నా తపన? మధూ! మధూ! జవాబు చెప్పవేం? అబ్బ! మూడ్స్ చెదిరిపోతున్నాయి. ఇహ ఆపేస్తాను."

    పద్మజ కన్నీరు కారుస్తోంది.

   
                                *    *    *

    పద్మజకు ఓ చిత్రమైన కోరిక కలిగింది. రాబోయే వారం రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు ఇద్దరూ ఒకర్నిగురించి ఒకరు ఆలోచించుకోవాలని. "మీరు ఆదివారం రాత్రి సరిగ్గా  ఎనిమిదిగంటలకు ఉత్తరం రాయండి. అప్పుడు నేను మీగురించి ఆలోచిస్తూ వుంటాను" అని రాసింది.

    తీరా ఆదివారం సాయంత్రం ఐదున్నరయేసరికి ఓ స్నేహితురాలు వచ్చి సినిమాకు వెళదాం రమ్మని కూర్చుంది.

    "అబ్బ! ఇవాళ వద్దులేవే మనసేం బాగాలేదు. రేపెప్పుడైనా వెడదాం" అని పద్మజ తప్పించుకోజూసింది.

    "అయినా ఏమిటీ మధ్య అదోరకంగా వుంటున్నావుగా? మునుపటిలోలాగా సరదాగా వుత్సాహంగా వుండటం లేదు. పద, పద, రాకపోతే ఎత్తుకు తీసుకు వెడతాను" అంటూ బలవంతంగా లాక్కెళ్ళిపోయింది స్నేహితురాలు.


                                                                 *    *    *

    సరిగ్గా అదేరోజు మధ్యాహ్నం మధుబాబు స్నేహితుడొకడు కలకత్తానుంచి వస్తున్నాడు. అతను విశాఖపట్నంలో దిగటములేదు గాని, మాట్లాడవల్సిన విషయాలు చాలా వున్నాయనీ, స్టేషన్ కి వచ్చి కలుసుకొమ్మని మధుబాబుకు ముందురోజు ఉత్తరం రాశాడు. ఇద్దరూ ఇంటర్మీడియెట్ లో క్లాసుమేట్సు. ఎంతో ఆత్మీయులు. మధుబాబు స్టేషన్ కి వెళ్ళాడు.

    ఆ మిత్రుడుకూడా సాహిత్య పిపాసి. ఇద్దరూ లోకాన్ని మరచి కబుర్లలో పడ్డారు. ట్రెయిన్ కదలబోతోంది. మధుబాబుని సంభాషణ మధ్యలో ఒదలటం ఇష్టంలేక "అరె! కొంతదూరం రైల్లో రారా బాబూ. మరో  ట్రెయిన్ లో తిరిగి రావచ్చులే" అంటూ బలవంతంగా కంపార్టుమెంటులోకి ఎక్కించాడు.

    తుని స్టేషను వచ్చేదాకా ఇద్దరూ కబుర్లలో మునిగితేలారు. అప్పటికీ అతడ్ని విడిచి పెట్టాలంటే కష్టమనిపించింది కాని తప్పదు. సెలవు తీసుకుని అక్కడ దిగిపోయాడు.

    అప్పటికి సాయంత్రం ఐదయింది. ప్రొద్దుటినుంచీ భోజనం లేకపోవటం వలన బాగా ఆకలిగా  వుంది. వెళ్లి కాఫీ త్రాగివచ్చాడు. విశాఖపట్నం పోవటానికి మళ్లీ ఇప్పుడిప్పుడే ట్రెయిన్ లేదు. ఎనిమిదిగంటలకల్లా అక్కడకు చేరుకోవాలి. పద్మకు ఉత్తరం రాయాలి. స్టేషన్ బయటకు వచ్చాడు ఆలోచిస్తూ. దూరంగా ఎక్కడినుంచో తిరిగివస్తూ టాక్సి ఒకటి కనిపించింది. దాన్ని ఆపి అందులో కూర్చుని "విశాఖపట్నం, త్వరగా" అన్నాడు.

    "ఎనిమిదికల్లా చేరుకుంటానా లేదా?" అని మనసు ఆరాటంతో కొట్టుకుపోతోంది. ఏమీలేదు ఊరికినే పిచ్చి.

    సరిగ్గా ఏడు యాభయిఐదు నిముషాలకల్లా గదికి చేరుకున్నాడు. చాలా ఆకలి వేస్తోంది. అతనికి నీరసంగాకూడా వుంది. బల్లమీద ఎవరో స్నేహితుడు పంపించిన పూతరేకులున్నాయి. ఒకచేతితో అవి తీసుకుని తింటూ ఉత్తరం రాయసాగాడు.

    "మీరు హాయిగా భోజనంచేసి తాంబూలం వేసుకుని సోఫాలో నన్ను గురించి ఆలోచిస్తూ ఓ చెయ్యి అలా గడ్డంక్రింద ఆనించి వయ్యారంగా పడుకున్నారు కాబోలు. నేనిలా ఆకలితో అమ్మాయిగారికి పూజ ప్రారంభించాను. అయోమయ గాఢాంధకార జీవితంలో వెలుగురేఖ మీరు. అలాంటి మిమ్మల్ని పూజించకుండా ఎలా వుండేది? అబ్బ! మన ఇద్దరిమధ్యా ఇన్నివందల మైళ్ళ దూరం! ఎలా భరించేది అంతదూరాన మిమ్మల్ని? ఈ సాహిత్యం అబద్ధం జీవితం, చదువూ, ప్రపంచం అంతా మిథ్య. మీరు ఒక్కరే నిజం. విమానంలో ఎగిరివచ్చెయ్యనా మీ దగ్గరకు? ఎంత బాధ కలిగిస్తున్నారు. మీరు  నాకు? అసలు మీరు చేసేవన్నీ తప్పులే! మీకే శిక్ష విధించినా పాపంలేదు.  మీ చేపంమీద అలా సున్నితంగా కొట్టాలని వుంది. మీరు చేసే నేరాలన్నీ రాసుకుంటున్నాలెండి. కలిసి అన్నిటికీ పెద్ద పనిష్మెంటు..... పూతరేకులు తింటూ రాసిన ఈ ఉత్తరం తియ్యగావుందో లేదో రాయండి. మధు (తియ్యని కన్నీళ్ళతో.)

   
                               *    *    *   
   
    పద్మజ సినిమా చూస్తుందన్న మాటేగాని ధ్యాస అంతా విశాఖపట్నంలో వుంది. ఆ వంకెల జుట్టు అలా నుదుటిమీద పడుతూండగా, ఆ  తెల్లటి అబ్బాయి  అందంగా కుర్చీలో కూర్చుని తనకు రాస్తూ వుంటాడు. పద్మా, పద్మా అని కవరిస్తూ వుంటాడు. అతని కంఠం, రూపం అన్ని ఎంత మనోహరం! అబ్బ! ఎంత మంచివాడు! ఎంత అందగాడు!

    "ఒసేవ్! సినిమా చూస్తున్నావా లేదా?" అంటూ స్నేహితురాలు నెత్తిమీద ఒక్కటిచ్చుకుంది.


                                                                 *    *    *

    "నేనెవర్ని మీకు?"

    "నా బంగారు తల్లివి."

    "మీరెవరు?"

    "వెలుగును వెదుక్కునే బాటసారిని."

    "ఎక్కడకు ప్రయాణం?"

    "కాంతి కిరణం కడకు."

    "చేరుకుంటున్నారా?"

    "అది యెప్పుడూ అందని, దూరంగా పోని అందమైన ఆశారేఖ."

    "నేనెవర్ని?"

    "నా కంటిపాపవు."

    "మీరెవరు?"

 Previous Page Next Page