Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 17

    "ఏదో కట్టుకథ చెపుతావు."

    "పోనీ అదే విను" కఠినంగా అజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు.

    వందనాదేవి అప్పటికి కాస్త స్థిమితపడింది. వీడెవడో అందంగా, ఎర్రగా, బుర్రగావున్న మోసగాడు వినక చేసేదేంలేదు. అరవనివ్వడు పారిపోనివ్వడు. వీడి కథ విని నమ్మినట్లు నటించి వాడి వేలితో వాడి కంటినే పొడిచి ఇక్కడ నుంచి పారిపోవాలి.

    రాజ్ నవ్వాడు.

    "ఎందుకు నవ్వుతావు?"

    "నాకు మనసు చదవడం ఆలోచనలు చూడటం వచ్చు."

    "నిన్ను చూస్తేనే తెలుస్తున్నది ఎంతటి ఘనుడివో. అలా దూరంగా కూర్చుని చెప్పు" నందితాదేవి మంచం చివరగా కూర్చుంటూ అంది.

    "నువు నా గురించి ఏమనుకుంటున్నావ్?"

    "మోసగాడివని" టక్కున జవాబు యిచ్చింది నందితాదేవి.

    "మరి రాణి అని లెటర్ రాస్తే నీవెందుకు వచ్చావు?" రాజ్ ప్రశ్నించాడు.

    "నా రాజ్ నన్ను రకరకాలుగా పిలుస్తుంటాడు. తరచు రాణీ పద్మినీదేవి అంటూ తమాషాగా ఏడిపిస్తుంటాడు. లెటర్లో పైన రాణి అని కింద నీ రాజ్ అని వుంటే నా రాజు రాశాడనుకోక ఏమనుకుంటాను?"

    "కొయ్ కొయ్."

    "స్థిమితంగా కూర్చోటం, చెప్పింది అర్ధం చేసుకోటం ఏమీలేదా? ఏడుపొస్తే ఏడ్వటం, నవ్వొస్తే నవ్వటం. నా పేరు రాజు అని వుండరాదని ఎక్కడ వుంది? ఈ దేశంలో కోటానుకోట్ల మంది రాజులు వుండవచ్చు, వుష్ అడ్డం రాకు. అనుభవంలేని తొందరపాటుగల అమాయకురాలిలా తోస్తున్నావ్. నీ ప్రియుడి పేరేమిటో, నీ కథేమిటో చెప్పగలను విను.

    నీ ప్రియుడితో గాక వేరొకరితో బలవంతాన వీ వివాహం జరుగుతున్నది. నీవు నీ ప్రియుడితో పారిపోదలచి వార్త కోసం ఎదురు చూస్తున్నావు. నా లెటర్ నీ కందింది. నాతో వచ్చేశావు. నీ ప్రియుడి పేరు రాజు. అవునా నందితాదేవి?"

    రాజు చెపుతుంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి వింటున్న వందనాదేవి "అవును రాజు అని నే పిలుస్తుంటాను. పూర్తి పేరు చాలా చక్కనిది. అందమైనది, గాంభీర్యంగా వుంటుంది- పృధ్వీరాజు" తన్మయత్వంతో చెప్పింది.

    "పృధ్వీరాజ్!" రాజు అన్నాడు.

    సరిగా అప్పుడే తలుపుమీద టక్ టక్ టక్ మని చప్పుడు అయింది.

    నందితాదేవి, జైరాజు ముఖముఖాలు చూసుకున్నారు.

    "బైట వుంది బేరర్ కావచ్చు; మరెవరైనా కావచ్చు. మనం మామూలుగా వుండాలి. నావల్ల నీకేం ప్రమాదంలేదు. మనం పొరపడి ఒకరివెంట ఒకరం ఇక్కడిదాకా వచ్చాము. జాగ్రత్తగా అలోచించి దీనికి పరిష్కారం చూద్దాము. మూడో మనిషికి తెలిస్తే ప్రమాదమేగాని ప్రయోజనం శూన్యం అని గ్రహిస్తే చాలు" లేచి నిలబడుతూ తగ్గుస్వరంతో రాజు అన్నాడు.

    ఏమనుకుందో వందనాదేవి అలాగే నన్నట్లు అమోదసూచకంగా తల వూపింది.

    మరొకసారి తలుపుమీద "టక్ టక్" శబ్దం అయింది.

    తలుపు తీయటానికి లేచి వెళ్ళాడు రాజు.

    నందనాదేవి చూస్తూ కూర్చుంది.

                                           3

    జాస్మిన్ రాత్రిళ్ళు పూరీ కూరాగాని, చపాతీ కూర్మాగాని తిని కొద్దిగా పెరుగన్నం తింటుంది. పడుకునే ముందు కొద్దిగా కాఫీ తాగుతుంది. అది ఆమె అలవాటు.

 Previous Page Next Page