Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 16

    రాజ్ వేషంలో మార్పులేదు. కాకపోతే ముఖాన్ని సగం కప్పేస్తూ వున్న పెద్ద సైజు నల్లకళ్ళద్దాలు లేవు.

    "ఆ కళ్ళు- రాజ్ వి కావు. రాజు చూపులు అలా వుండవు. ఇతను రాజ్ కాదు-- నందితాదేవి కెవ్వున కేక వేయబోయి నోరంతా తెరిచింది.
    రాజ్ ఒక్కంగలో నందితాదేవి దగ్గరకు దూకి చటుక్కున నోరు మూశాడు. అరవకు నలుగురూ పోగవుతారు" గద్దించాడు.

    నందితాదేవి గింజుకుంటూ రాజ్ గడ్డం పట్టుకుని లాగింది.

    గడ్డం వూడి చేతిలోకి వచ్చింది విచిత్రంగా, వింతగాను.

    మరోసారి కెవ్వుమనబోయింది వందనాదేవి.

    రాజు ఈ తఫా గట్టిగా నోరుమూశాడు.

    "ఎందుకలా అరుస్తావ్. నలుగురూ పోగు కావాలనా? అల్లరి అయితే బాగుంటుందా? అరవకు అరిచావా-నోరు కుట్టేస్తాను" నోటిమీద నుంచి చేయి తీసేస్తూ అన్నాడు.

    "నువ్వు మోసగాడివి. మారువేషాలు వేసి నన్ను యింతదూరం తీసుకువచ్చిన దొంగని."

    "చుప్ రహో" గద్దించాడు రాజు.

    "ఎందుకు నోరు మూసుకోవాలి. ఎందుకంట!" కయ్యిమంది నందితాదేవి.

    "గట్టిగా మాట్లాడవద్దు"

    "అంతా నీ ఇష్టమేనా?"

    "ఆ... నా ఇష్టమే"

    "ఏమిటి నీ యిష్టం. అన్నెం పున్నెం ఎరుగని నన్ను ఇంట్లోంచి తీసుకువచ్చి యీ హోటల్లో వుంచి నీ యిష్ట మొచ్చినట్లు ఆడిద్దామనుకున్నావేమో! అదేం కుదరదు. అరిచి గోల చేస్తాను. నన్ను అరవనీయక పోతే అక్కడికి నీకు లొంగినట్లు కాదు. నా బొందిలో ప్రాణముండగా నా వంటి మీద చేయి వేయనీయను.

    "నీ వంటిమీద చేయి నేనెందు కేస్తాను!" తెల్లబోయాడు రాజు.

    "అమాయకంగా ఫోజు కొట్టకు. ఇందాక నీవు గదిలో అడుగు పెట్టినప్పుడు నీవేం చేస్తావో అని దొంగనిద్ర నటించాను. నేను నిద్ర పోతున్నాననుకుని... మీద..." నందితాదేవి మంచం మీద కూలబడి ఏడ్పు మొదలుపెట్టింది.

    రాజు చటుక్కున మంచం మీద కూర్చుని నందితాదేవి చేయి పట్టుకుని "ప్లీజ్ నే చెప్పేది విను" అన్నాడు.

    టకీమని మంచంమీంచి లేచింది "అదుగో నువ్వు మోసగాడిని. మాయ మాటలతో నన్ను వశపరుచుకోవాలని చూస్తున్నావు. నే చావనన్నా చస్తాగాని చచ్చినా నీకు లొంగను" ఓ అడుగు దూరంగా జరిగి చెప్పింది నందితాదేవి.

    రాజు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు.

    "అమ్మా! తల్లీ! నమస్కారం పెడతాను. నా మాట కాస్త విను. మీ దృష్టిలో ప్రతి మగవాడూ నరరూప రాక్షసుడిలా రేప్ చేయటమే అతని ధ్యేయం అన్నట్లు కనబడతాడు. నే అలాంటివాడిని కాదు. మోసగాడిని అంతకన్నా కాదు."

    "నువు అలాంటివాడివే. ఇందాక..."

    "ఇందాక... ఇందాక... చెప్పేది సాంతం వినవేం?"

    "కథ చెపుతావ్!"

    "కథలు చెప్పటమే నా పని. నే చెప్పేది వింటావా? వినవా?"

    "వినను... వినను..."

    "మంచిది. బలవంతానా నీ కాళ్ళూ చేతులూ కట్టేసి నోరు కుట్టేసి వినిపిస్తాను" కరకుగా చెప్పాడు రాజ్.

    "అదిగో నే చెప్పినట్లు నువ్వు..."

    "నెత్తిమీద నీళ్ళకుండ ఒకటి..."

    "నా ఇష్టం, నే ఏడుస్తాను."

    "ఏడువు, ఎగిరిపడు. అదంతా నీ యిష్టం. నిన్ను ఒంటరిగా ఈ గదిలో విడిచి నే వెళ్ళిపోతాను. ఈ మహానగరంలో నీ పాట్లు అమోఘం, అధ్బుతం. ఇక యింటికెళ్ళే పనేలేదు. పెదవి కదపకు, నే చెప్పేది కాస్త వినమంటున్నాను. వింటే వచ్చిపడే ప్రమాదం లేదుకదా! నేను మోసగాడి ననుకుంటూనే విను. విన్న తర్వాత నీ యిష్టం. ఏడుస్తావో నవ్వుతావో కావాలంటే బోలెడు టైము తీసుకో."  

 Previous Page Next Page