ఉత్తిష్ఠత
శ్రీ రామకృష్ణ - వివేకానంద బోధాసాగరాన్ని మధించి జ్ఞానామృతాన్ని సాధించిన పెద్దలు స్వామీ రంగనాథానంద సమక్షంలో, శ్రీ రామకృష్ణ మఠ ప్రాంగణంలో నేను శ్రీరామకృష్ణుల గురించి, వివేకానందుల గురించి ప్రసంగించటం వ్యాసునికి భారతం చదివి వినిపించినట్లుగా వుంటుందేమో. అయితే నేనీ కార్యక్రమంలో పాల్గొనటానికి అంగీకరించటానికి కారణం:
"సాధూనాం దర్శనం పుణ్యం
స్పర్శనం పాపనాశనం
సంభాషణం కోటి తీర్థం
వందనం మోక్షసాధనం"__అన్న పెద్దల సూక్తి.
అంతేకాదు, 'నైష్కర్మసిద్ధి' రచించేముందు సురేశ్వరాచార్యులవారు చెప్పినట్లు "న ఖ్యాతి లాభ పూజార్థం-" అని పేరు ప్రఖ్యాతుల కొరకో, వేరే ప్రయోజనం కొరకో కాక, నాకు తెలిసిన విషయాలను పెద్దల సమక్షంలో ప్రస్తావించి రూఢిపరచుకోవాలన్న ఆతృతతోనే ఈనాడు మీ ముందు నిలవటానికి సాహసిస్తున్నాను.
'భగవంతుడున్నాడా? ఈ ప్రశ్న కొత్తది కాదు. 'ఉన్నాడు' - ఈ జవాబు తరచుగా వినవచ్చేదే. కాని 'మీరు చూశారా?' అని అడిగితే...? "అవును, చూశాను. అంతేకాదు, నీకు కూడా భగవంతుని దర్శించే మార్గం చూపుతాను"__అని నిస్సంకోచంగా, విస్పష్టంగా చెప్పగలిగిన గురుదేవుడు శ్రీరామకృష్ణుడు. కామినీ కాంచనాలను జయించిన ముక్తసంగుడు ఆయన. తామరాకుకు నీరంట వచ్చునేమో కాని ఒక ఇంటివాడయినప్పటికీ ఆ పరమహంసకు సంసారబంధ మంటలేదు. "భావనామాత్ర సంతుష్ట" అని దేవీ సహస్ర నామాలలో జగదంబను వర్ణించారు. తల్లికేం కావాలి-తల్చుకుంటేచాలు, సంతోషిస్తుంది. 'అమ్మా' అని తన చిన్నారి శిశువు పిలిస్తే ఎన్ని పనులున్నా వదిలివేసి వస్తుంది. అక్కున జేర్చికొని లాలిస్తుంది. 'అమ్మా' అని గుండెల నిండుగా ఆర్తితో పిలిచాడు శ్రీరామకృష్ణుడు. అంబను సాక్షాత్కరింప జేసికొన్నాడు అనన్య సామాన్య భక్తి భావనతో __ అందువల్లనే అంత్యకాలంలో కూడ శిష్యులతో__"ఎవడు రాముడో, ఎవడు కృష్ణుడో ఆయనే ఈ దేహంలో రామకృష్ణుడుగా వున్నాడు" అని అసందిగ్ధంగా, అత్యంత విస్పష్టంగా చాటి చెప్పగలిగాడు ఆ ఆత్మజ్ఞాని.
అట్టి గురువుకు తగ్గ శిష్యుడే స్వామీ వివేకానంద. శ్రీరామ కృష్ణుడు జ్యోతి అయితే వివేకానంద కాంతి. మనకు తెలుసు నారాయణుడు, నరుడు. మనకు తెలుసు__రాముడూ, ఆంజనేయుడూ. మనకు తెలుసు__కృష్ణుడూ, అర్జునుడు. అట్టి దివ్యావతార ద్వయమే రామకృష్ణ, వివేకానందులు__అని మనవిచేస్తున్నాను. శ్రీరామకృష్ణ బోధామృతాన్ని దేశదేశాలూ తిరిగి పంచిన మహనీయుడు వివేకానందుడు. తన గంభీర ప్రవచన ప్రవాహవేగంతో ప్రపంచపు నలుచెరగులు ముంచెత్తిన మహా మనిషి ఆయన.
వివేకానందస్వామి శాస్త్రాన్ని అంగీకరించాడు కాని చాదస్తానికి బానిస కాలేదు.మిడిమిడిజ్ఞానంతో, మూఢాచారాలలో మురిగిపోతూ__అదే హైందవమత వైభవమని మురిసిపోతూ వుండే ఛాందసులకు మన మతమంటే ఏమిటో తెలియచెప్పిన మహానుభావుడాయన. భారతీయులకు కావలసింది మతబోధలు కాదు. ఆకలితో, చీకటిలో అలమటించే అభాగ్య సోదరులకు అవసరం పట్టెడన్నం__అని చాటిన యదార్ధవాది ఆయన. "అన్నం బ్రహ్మ..." అన్న శ్రుతిసూక్తి ఆయన ప్రసంగాలలో ప్రతిధ్వనించింది. అవును. ముందు మానవాళి కోరుకునేది కనీస అవసరాలు తీరాలని.ఆపైన వస్తుంది__ "జ్ఞానం బ్రహ్మ"__అన్న స్థాయి. తరువాత అందుకోవచ్చు. ఆపై కృషి కొనసాగించిన నిస్సంగుడు 'ఆనంద బ్రహ్మ' అన్న అంతస్తు.
నాడు వివేకానంద చెప్పిన మాటలు నేటికీ అన్వయిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 35 సంవత్సరాలు గడచినా, జనాభాలో సగానికి సగం ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన మ్రగ్గి పోతున్నారు. రెక్కాడినా డొక్కాడక క్రుంగిపోతున్నారు. ఈ దురదృష్టకర పరిస్థితిని మార్చి సమ సమాజాన్ని నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ మహత్తర కృషిలో జాతి ముందుకు సాగిపోతుంటే అడ్డంకులు కల్పించే అనైక్యతాశక్తులు చెలరేగుతున్నాయి. మతంపేరిట, కులం పేరిట, ప్రాంతం పేరిట, భాష పేరిట పరస్పర ద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఆకలికి మతముందా? అజ్ఞానానికి కులముందా? అని అడుగుతున్నాను. మమతలబంధాలు పెంచుకోవాలిగాని మనిషి మనిషికీ మధ్య నాగజెముడు కంచెలు పాతుకొనమని ఏ మతమూ చెప్పదు. రాముడైనా, రహీమైనా, క్రీస్తు అన్నా, కృష్ణుడన్నా__ ఆ అనంతుడే కాని వేరుకాదు. నదులన్నీ సాగరంలో సంగమించినట్లు ఏ దేవునికి చేసిన నమస్కారమైనా ఆ ఆదిమధ్యాంత రహితునికే అందుతుంది. "ఏకం సద్విప్రా బహుధా వదంతి'__ఆయన ఒక్కడే, వేరు వేరు పేరులతో పిలుస్తారు__ అన్న మహత్తర భావన మన సంస్కృతిలో జీర్ణించివుంది.
'అంతా దేవుని బిడ్డలమే' అన్న సర్వమత సారాన్ని సూటిగా హృదయానికి హత్తుకునేలా పలికిన ఘనత స్వామీ వివేకానందులది. చికాగోలో జరిగిన చరిత్ర ప్రసిద్ధమైన సర్వమత మహాసభలో పాల్గొంటూ ఆయన సదస్యులను 'Ladies and Gentlemen' అని సాంప్రదాయిక పద్ధతిలో సంబోధించలేదు. "అమెరికా దేశపు నా ప్రియమైన సోదరీ సోదరీమణులారా!" అని సంబోధించాడు. ఆ పిలుపులో వున్న ఆప్యాయతకు, చనువుకు ప్రేమ భావనకు పులకించిపోయిన సదస్యులు ఆయన పలుకులకు హర్షం తెలుపుతూ విడవకుండా కరతాళధ్వనులు చేశారు. ఆ ఒక్క మాటలోనే ఆయన సర్వమతసారమైన మానవాళి పరస్పరానురాగబంధాన్ని వ్యక్తం చేశారు.
అయితే నేడు మనం చేస్తున్నదేమిటి? మతం పేరిట సాటి మనిషిని చంపుకోవటమా? కొరాన్ లో ఒక కథ వుంది. ఆదాము కుమారు లిరువురు భగవంతునికి నైవేద్యం అర్పిస్తారు. ఒకరు పెట్టిన నైవేద్యం స్వీకరించి భగవంతుడు రెండవవాని నైవేద్యం తిరస్కరిస్తాడు. ఎందుకని? "నేను నిన్ను చంపుతాను"-అన్నాడు ఒకడు. రెండవవాడు బదులు చెప్పాడు: నీవు నన్ను చంపటానికి చేయెత్తినా సరే, నేను నిన్ను చంపను. నేను జగత్పిత అధికారంలో ఉన్నాను. ఆయన అందరికీ తండ్రి"-అని. రెండవవాని నైవేద్యమే భగవంతుడు స్వీకరించాడు కాని, "సోదరుని చంపుతా" నన్నవాడు వడ్డించినది కాదు. మతాలు మంచినే బోధించినా మన దురదృష్టం - కొందరు విపరీతార్థాలనే మన నెత్తిన రుద్దుతున్నారు. పరమార్థాన్ని వదలి పరస్పర ద్వేషాన్ని పెంచుకొంటున్నాం. పరమాత్మకు దూరంగా, బహుదూరంగా పోతున్నామని గ్రహించటంలేదు.
"బ్రహ్మైవాహ మిదం జగచ్చ సకలం
చిన్మాత్ర విస్తారితం
సర్వం చైత దవిద్యయా త్రిగుణయా
శేషం మయా కల్పితం
ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే
విత్యే పరేనిర్మలే
చండాలోస్తు సతుర్ద్విజోస్తు గురు
రిత్యేషా మనీషామమః"
అంతా బ్రహ్మమేనంటూ అస్పృశ్యత పాటించటం సముచితమా?
మనీషాపంచకం వల్లించే నోట
తగునా__"చండాలుడా! తొలగు"__అన్నమాట!
__ఒక్కసారి ఆలోచించుకోండి! సద్ర్బాహ్మణువైనా,
చండాలునైనా సమంగా చూచే వాడే ఆత్మజ్ఞాని.
ఇంతటి పరిణతి చెందిన మతం నేడెంతగా దిగజారిందో?
అన్ని మతాలు బోధించే ఉత్కృష్ట ధర్మం మరొకటి వుంది. అదే త్యాగం. మానవుడు త్యాగంవల్ల ప్రకాశిస్తాడు. 'నప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః' __సంతతిద్వారా గాని, సంపదద్వారా గాని అమృతత్వమును పొందలేవు. త్యాగంవల్ల మాత్రమే అది సాధ్యం; కురాన్ దానధర్మాలను ఒక పవిత్ర విధిగా బాధ్యతగా చెప్పింది. ఉన్నవాడు లేనివాణ్ణి ఆదుకోవాలన్నది. ఆర్తులకోసం నీ సంపదను వెచ్చించు. అది భగవంతుని వద్ద భద్రంగా దాచబడుతుంది__అని వివరించింది. బైబిల్ తీసికొనండి! సూది బెజ్జం నుండి ఒంటెను దూర్చవచ్చు. కాని, ధనవంతుని స్వర్గానికి చేర్చలేము అన్నాడు ఏసుప్రభువు. నీ ధనాన్ని బీదలకు పంచి నావద్దకు రా, ముక్తిమార్గం చూపుతాను అని బోధించాడు.
'అభ్యాగతః స్వయం విష్ణుః,' అని అతిథి దేవులను మర్యాద చేయవలసిన తీరును మన శాస్త్రాలు వర్ణించాయి. పరమ పవిత్రమైన స్ఫూర్తిదాయకమైన సక్తుప్రస్తుని కథ, రంతిదేవుని చరిత్ర మీకుతెలుసు. ఈరోజు సునముందు లక్షలాది అభ్యాగతులు నిలుచొని వున్నారు. వరదలలో సర్వం కోలుపోయి కట్టుబట్టలతో మిగిలారు. లక్షలాది ఎకరాల పంట నాశనమై నోటిముందు కూడు ఏటిపాలైన రైతన్నలున్నారు. వారిని ఆడుకోవటం మన కర్తవ్యం. వారికి సాయపడటంలోనే మన సంపదలకు సార్థక్యత వుంది అని మనవిచేస్తున్నాను.
ముగింపుగా _స్వామీ వివేకానందులు పదేపదే చెప్పి మనలను హెచ్చరిస్తూ వచ్చిన ఉపనిషద్వాక్యం విన్నవిస్తాను.
"ఉత్తిష్ఠత! జాగ్రత్త! ప్రాప్యవరాన్నిబోధత!"
"లేవండి! మేలుకొనండి! గమ్యం చేరేవరకు ఆగకండి!"
'శ్రీ రామకృష్ణ __వివేకానంద
ఉద్యమ సమగ్ర అధ్యయనం'
పై హైదరాబాదులో ఆక్టోబరు 20న జరిగిన జాతీయ
గోష్ఠిలో.........