Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 17


    "బయటకు ఎలా వెళ్ళావ్?"
    "తెలియదు."
    "ఎవరన్నా తీసుకువెళ్ళారా? నీ అంతట నీవే వెళ్ళావా?"
    "తెలియదు"
    "సాగర్ వచ్చి తీసుకెళ్లాడా?"
    "తెలియదు. తెలియదు. తెలియదు. "గట్టిగా అరిచినట్టే అన్నది మాధవి.
    సాంబశివరావు మాధవి ముఖంలో వచ్చే మార్పులను గమనించి ఖంగారు పడ్డాడు.
    "డోంట్ డిస్టర్బ్ హర్ సాంబశివరావ్! మీరా గండి. డాక్టర్ సాంబశివరావును వారించి డాక్టరు మూర్తి దగ్గరకు వచ్చి తల నిమురుతూ , అన్నాడు. "టేకిట్ యీజి బేబీ!"
    సాంబశివరావు పోలీసు బింకం వదిలేసి చల్లబడ్డాడు.
    పోనీ ఇంట్లోకి ఎలా తిరిగి వచ్చావో గుర్తుందా మాధవీ" మృదువుగా అడిగాడు డాక్టర్ మూర్తి.
    "సాగరూ నేనూ కలిసే వచ్చాము. మీరంతా చూశారూ! మళ్ళీ నన్నడుగుతారేమిటి డాక్టర్?" మాధవి చిరాకుపడింది.
    "యూ ఆర్ కరెక్ట్ బేబీ! ఐ యాం సారీ!" డాక్టర్ ,మూర్తి సర్దుకున్నాడు.
    "మిమ్మల్ని కించపరచాలని కాదు. మీరు కూడా చూశారు కదా? మళ్ళీ నన్ను ప్రశ్నిస్తే కొంచెం చిరాకు పడ్డాను. అంతే ,మీరు వేరేం అనుకోవద్దు" మాధవి తేరుకొని నింపాదిగా అన్నది.
    'సాగర్ నువ్వూ కలసి వచ్చింది నేను చూశాను. అయితే సాగర్ నువ్వూ ముందు ఎక్కడ కలుసుకొన్నారు?" మూర్తి మళ్ళీ అడిగాడు.
    మాధవి కళ్ళు గుండ్రముగా తిప్పింది.
    "బాగా గుర్తు చేసుకో?"
    మాధవి సాలోచనగా డాక్టర్ కేసి చూడ సాగింది . "ప్రయత్నించు!"
    "మాధవి" మాట్లాడలేదు డాక్టర్ ముందుకు వంగి "పోనీ ఎక్కడనుంచి వచ్చారో చెప్పగలవా?" ముఖంలో ముఖం పెట్టి అడిగాడు.
    "మీ ఇంటి దగ్గర నుంచే?" మాధవి ఠపిమని సమాధానం చెప్పింది.
    "మా ఇంటి దగ్గర్నుంచా?" డాక్టర్ గుండు దెబ్బ తగిలినట్టయిపోయాడు.
    "అవును! అవును!" మాధవి వెర్రిగా అరిచింది.
    "డాక్టర్ ! మీరాగండి!" సాగర్ మాధవికీ డాక్టరు మధ్య కొచ్చి నిలబడ్డాడు. సాగర్ తండ్రి సాంబశివరావు బుర్ర గోక్కున్నాడు. అతని ఆలోచన ఓ పట్టాన తేలి రావడం లేదు.
    జడ్జి రామనాధం గారు అయోమయ స్థితిలో పడిపోయాడు. నాగరత్నమ్మకు చిర్రెత్తి పోతున్నది.
    "ఎమిటర్రా మీ పిచ్చి? నాకు మతిపోతున్నది. మీ ప్రశ్నలేమిటి దాని సమాధానాలేమిటి! అమ్మాయ్! ముందు నువ్విక్కడ్నుంఛి లేచి గదిలోకి వెళ్ళి పడుకో" నాగరత్నమ్మ కూతురు జబ్బ పట్టుకొని లేవదీసింది. సాంబశివరావును చూసి "యస్పిగారూ! ఇహ నుంచి విచారణ ఇంతటితో ముగించడం మంచిది." అన్నది నాగరత్నమ్మ.
    "నేనూ అదే అనుకుంటున్నాను! డాక్టర్ గారూ! లేవండి వెళదాం!" సాంబశివరావు లేచి నిలబడ్డాడు.
    "సాగర్! ఎందుకురా అలా నిలబడ్డావ్? వెళ్ళి కార్లో కూర్చో!' కొడుకుని చూసి మందలింపుగా అన్నాడు సాంబశివరావు.
    "ఏమిటే ఇంకా చూస్తున్నావ్ నడువ్?" నాగరత్నమ్మ మాధవి రెక్క పట్టుకొని గుంజుతూ అన్నది. మాధవి దీనంగా సాగర్ కేసి చూసింది. సాగర్ నిస్సహాయంగా మాధవి కేసి చూశాడు. డాక్టర్ ఇద్దరి చూపులకు మధ్యగా వచ్చాడు. రామనధంగారి భుజం తట్టి అన్నాడు.
    "మీరేం వర్రీ కావద్దు ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకోండి! యూ విల్బీ అల్ రైట్, యీ టాబ్ లెట్స్ ప్రతి అరుగంటలకూ ఒకటి వేసుకోండి. రేపు వచ్చి చూస్తాను.
    "థాంక్యు డాక్టర్!' రామనాధం నెమ్మదిగా అన్నాడు.


        
                                                             8


    "అదా కధ!"
    "కధ కాదు ప్రొఫెసర్ వాస్తవం . జరిగింది అంతా చెప్పాను."
    "కధ అంటే కాంప్లికేటివ్ గా ఉంది!" ప్రొఫెసర్ చంద్ర శేఖరం కళ్ళ జోడు తీసి టేబుల్ మీద పెట్టాడు. ప్రొఫెసర్ చంద్ర శేఖరం ముందు కూర్చున్న సాగర్ లేచాడు. నుదుట పట్టిన స్వేదబిందువులను తుడుచుకున్నాడు.
    "ఏమయింది మిస్టర్ సాగర్? ఇది ఏర్ కండిషన్ రూం అయినా నీకు చెమటలు పోస్తున్నాయి?"
    "ప్రొఫెసర్! నాకు తల తిరుగుతున్నట్లుగా ఉన్నది. అలా కాసేపు బయట నిలబదతాను ఫ్రెష్ ఏర్ కావాలి!'
    "బయటికి వెళ్ళాల్సిన పని లేదు. కిటికీ రెక్కలన్నీ తెరచి ప్యాన్ వేస్తాను కూర్చో" అంటూ ప్రొఫెసర్ లేచి కిటికీ రెక్కలన్నీ తెరచి ప్యాన్ స్విచ్ వేశాడు. నౌకర్ని పిలిచి టీ తెప్పించాడు. సాగర్ టీ తాగాక కొంచెం తేరుకున్నాడు.
    "ప్రొఫెసర్! మీనుంచి నేను చాలా ఆశించాను. మీమీద పెద్ద నమ్మకంతో ఉన్నాను. ఈ కేస్ స్టడీ చేసి పరిష్కార మార్గం చూపగలిగేది  మీరొక్కరే అని నా నమ్మకం" ప్రొఫెసర్ చురకయినా కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
    ప్రొఫెసర్ తెల్ల పాయలున్న నల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ చ్వ్హిరునవ్వు నవ్వాడు.
    "మిస్టర్ సాగర్! నువ్వూ సైకాలజీ డాక్టరేట్ చేస్తున్నావు కదా! ముందు నీ అభిప్రాయ -మేమిటో తెలుసుకోవాలని వున్నది. ఏ సంకోచం లేకుండా చెప్పు!"
    "మీముందు నాకు సంకోచం ఎందుకు సార్! కాని నేను ఈ కేసు విచారణ చేయలేనేమో అనిపిస్తుంది! ఐమీన్ శాస్త్రీయ పద్దతిలో నిర్వహించి, మూల కారణాలను ఎత్తి చూపలేనేమో!"
    "డోంట్ బాదర్! అలా సందేహిస్తే నువ్వు ముందుకి పోలేవు. ఈ కేసు స్వయంగా నువ్వు చూసింది. చాలావరకు స్టడీ చేసినది కూడాను. నీనుంచి వినాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది. ఊ కమాన్!" ప్రొఫెసర్ చంద్రశేఖరం పెద్ద పెద్ద అంగలు వేస్తూ గదిలో తిరగసాగాడు.
    "ఓ.కే ప్రొఫెసర్!"
    "స్టార్ట్!' ప్రొఫెసర్ టేబుల్ దగ్గర ఆగి - టేప్ అన్ చేశాడు.
    "టేప్ చేస్తారా ?" సాగర్ కలవరపడ్డాడు.
    "యస్! వాటీజ్ రాంగ్?"
    "చాలా లింకులు వుండవు. కొంత అయోమయంగా కూడా వుంటుంది."
    "అందుకే టేప్ చేస్తున్నాను. నీ బుర్రలో వున్నది ఆలోచనలు రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి విను. దాని ఉపయోగం నీకే తెలుస్తుంది. ఊ స్టార్ట్!"

 Previous Page Next Page