"తిరిగి వచ్చి వంటగదిలో చూశాను! షెల్ఫ్ లో ప్రెషర్ కుక్కర్ లేదు. తర్వాత గుర్తు చేసుకుంటే వాడు గోడ మీద పెట్టి గోడ అవతలికి దూకిన తర్వాత తీసుకున్నది ఆ ప్రెషర్ కుక్కరే అని నమ్మకం కలిగింది."
"వంటగదిలోకి తిరిగి రాగానే కుక్కర్ కోసమే ఎందుకు వెతికావ్? ఇంకా ఎన్నో సామానులున్నాయి , వాడు ఇంకా ఏదైనా ఎత్తుకు వెళ్ళొచ్చుగా!"
"ఏమో ఖచ్చితంగా చెప్పలేను" మాధవి ఎక్కడో చూస్తూ అన్నది.
"బహుశా అది నీకు ప్రైజ్ గా వచ్చిందనే సెంటిమెంట్ కావచ్చునేమో?" సాగర్ మధ్యలో అన్నాడు.
"సాగర్! నువ్వు మాట్లాడకుండా కూర్చో." కొడుకును చూసి విసురుగా అన్నాడు సాంబశివరావు.
'కరెక్ట్! సాగర్ చెప్పిందే నిజం. అందుకే ముందుగా కుక్కర్ కోసం చూశాను. వంటగదిలో ఏదైనా ఎత్తుకుపోయి ఉంటాడని భావించాను. అక్కడ ఉన్నవాటిలో నాకు ప్రియమైనది ఆ కుక్కరే కాబట్టి దానికోసం మెదట వెతికాను" మాధవి ఏ సంకోచమూ లేకుండా చెప్పింది.
"నాగరత్నమ్మగారూ! నిజంగా కుక్కర్ పోయిందేమో చూసుకున్నారా?"
"ఏం కుక్కరో ఏం పాడో! పిల్ల కనిపించడం లేదని మేము గుండెలవిసి చస్తుంటే , యీ కుక్కరూ గిక్కరూ ఎవరు చూశారు నాయనా?" నాగరత్నమ్మ ఒకే గుక్కలో చెప్పేసింది.
"పోనీ ఇప్పుడన్నా వెళ్ళి చూడు." భార్యతో అన్నాడు రామనాధం.
నాగరత్నమ్మతో పాటు సాగర్ కూడా లేచాడు. వాళ్ళ వెనకే సాంబశివరావు, డాక్టర్ మూర్తి బయలు దేరారు. లేవబోతున్న రామనాధం గార్ని సంజ్ఞా చేసి కుర్చోపెట్టారు. నాగరత్నమ్మ వెనకే నడుస్తున్న సాగర్ ఆలోచనలో పడ్డాడు. మాధవి ఇంతవరకూ దాదాపు తనకేమి చెప్పిందో అదే చెప్పింది. కాని తర్వాత ఏం చెప్తుందో? అందరినీ కూర్చోపెట్టి తండ్రి ఇలా ప్రశ్నలు వేయటం సాగర్ కు అంత బాగా అనిపించడం లేదు. అంతా పోలీసు వాడి తంతులాగా వున్నది. సైక్రియాట్రిస్ట్ పరిశోధించవలసిన ఈ కేసు పోలీసు ఆఫీసరు వల్ల ఏమవుతుంది? ఆ మాట తండ్రికి చెప్పే ధైర్యం లేదు. పైగా ఇందులో తన పాత్ర చాలా వున్నది. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే తండ్రి తనను అపార్ధం చేసుకునే అవకాశం ఉన్నది.
వాళ్ళందరూ అటు వంటగదిలోకి వెళ్ళగానే రామనాధం గారూ మాధవిని దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్పారు. మాధవి తండ్రికి ప్రక్కగా వచ్చి కూర్చున్నది.
"నిన్నెవరో ఎత్తుకు పోయారని హడాలిపోయాననుకో! తీరా చూస్తే నువ్వు సాగర్ తో తిరిగి వచ్చావు. ఇప్పుడేమో కుక్కరు, గిక్కరూ అని ఏవేవో కధలు చెపుతున్నావు/ నా పరువును మంటగలిపెస్తున్నావు!"
"నాన్నా ! ఇందులో నేను కల్పించి చెప్పిందేమీ లేదు! నా మాట నమ్ము."
"ఏమి నమ్మడమో? మీ అమ్మకూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావ్."
"నాన్నా" మాధవి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"రామనధంగారూ! మీరు తొందరపడి మాధవిని కంగారు పెట్టకండి. సాంబశివరావు, నేను ఉన్నాము మేమంతా చూసుకుంటాము. మీరు ఆదుర్దా పడడం వల్ల మీ ఆరోగ్యం ఇంకా దెబ్బతినడం తప్ప సమస్యలు పరిష్కారం కావు." అప్పుడే అందరితో పాటు వంటగదిలో నుంచి తిరిగి వచ్చిన డాక్టరు మూర్తి అన్నాడు.
"మాధవి ఆరోగ్యం చాగుచేసే బాధ్యత నాది. అంతా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. రామనాధం గారూ!" జడ్జిగారి భుజం తట్టి మళ్ళీ చెప్పాడు డాక్టర్ మూర్తి .
"థాంక్యు డాక్టర్! థాంక్యు !" కళ్ళు తుడుచుకున్నాడు రామనాధం.
"అసలు విషయాని కొద్దాం. మీరంతా కూర్చోండి. నా పని పూర్తీ చేయనీయండి! తను కూర్చుంటూ అన్నాడు సాంబశివరావు.
"చూడమ్మాయ్! నువ్వు చెప్పింది , చూసింది నిజం! కుక్కర్ లేదు ఆ దొంగ కుక్కర్ వెత్తుకు వెళ్ళిన మాట వాస్తవం."
సాంబశివరావు మాటలు వింటూనే మాధవి నిట్టూర్చింది. ఆమె మనసు తేలికపడింది.
కాని సాగర్ అయోమయంలో పడిపోయాడు. మాధవి తనకు చెప్పిందంతా ఊహ జనితమనీ విపరీత మానసిక స్థితిలో ఉండి అప్పుడు తన మస్తిష్కంలో మెదిలిన దృశ్యాలన్నీ వాస్తవాలనే భ్రమతో ఉన్నదని అనుకొన్నాడు. కానీ ఆమె చెప్పిందంతా భ్రమ కాదు. కొంత వాస్తవం . కొంత భ్రమ. దొంగ వంటింట్లో నుంచి పారిపోవడం గోడ దూకటం, కుక్కర్ ఎత్తుకు పోవడం వరకూ నిజం కావచ్చు! తల్లీ తండ్రి రక్తపు మడుగుల్లో పడి ఉండడం భ్రమ కావచ్చు! ఈ రెంటికీ ఉన్న సంబంధమేమిటి? సాగర్ మొదటి నుంచీ జరిగిన సంఘటనలన్నీ ఒకదాని ప్రక్కన మరొకటి చేర్చి ఆలోచించసాగాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టయి పోతున్నది ------
చూడు మాధవీ! దొంగ కుక్కర్ నీ తీసుకొని ప్రహరీ గోడ దాటడాన్ని ఎంత దగ్గర్లోంచి చూశావు?" సాంబశివరావు ప్రశ్నించాడు.
"రెండు మూడు గజాల దూరంలో చూసాను."
"అంటే వాడి ముఖం బాగా కన్పించిందా ఎలా ఉన్నాడు."
"అంత బాగా కంపించక పోయినా కొద్దిగా కన్పించింది."
"పోలిక లేమయినా చెప్పగలవా?"
"ఎక్కడో చూసినట్టే ఉన్నది."
"ఎక్కడా?"
"ఎక్కడో, ఎప్పుడో చూసినట్టే ఉన్నది."
"ఊ! ప్రయత్నించు!"
"ఎక్కడో - ఎప్పుడో ....." మాధవి ముఖం వివర్ణమయి పోతున్నది. చూపులు అగాధంలో ఉన్న దేన్నో పెళ్ళగించాలనే ప్రయత్నమూ. విఫలమౌతున్నప్పుడుండే ఆరాటం ఆవేదన, ఆమె కళ్ళల్లో చూడసాగాడు సాగర్.
'ఓ.కే, మాధవి లీవిట్! ప్రస్తుతానికి! అది వదిలేయ్! ఇలా చూడు!"
మాధవి సాంబశివరావు కేసి చూసింది.
'ఆ దొంగ! కుక్కర్ తీసుకొని పారిపోయాక ఏం చేసావ్?"
"దొంగ దొంగ అని అరుస్తూ మళ్ళీ ఇంట్లోకి వచ్చినట్లు గుర్తు."
"ఊ ఇంట్లోకి వచ్చీ-"
మాధవి మాట్లాడలేదు.
"ఇంట్లోకి వచ్చాక ఏమైంది?" సాంబశివరావు స్వరం కొంచెం విసుగ్గా ఉన్నది.
"తెలియదు."
"తెలియదా?"
"గుర్తు రావడం లేదు."