Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 17


    "సర్వెంట్స్ ఉన్నది. మన చేతికింద పని చెయ్యడానికి. అంతేకానీ అతిధుల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళకేం కావాలో చూడటానికి కాదు. ఎవ్వరూ తిండికోసం రారు. మనం వీడియో కెమెరాల ముందు పోజులిచ్చుకుంటూ తైతెక్కలాడుతుంటే అతిధులొచ్చిన సర్వెంట్స్ ని "మాకు కాస్త తిండి పెట్టండి!" అని అడగరు. మనింట్లో అన్నీ నేను స్వయంగా చూసుకోనూ? అందుకే అందరూ దేవిశంకర్ గారింట్లో ఏపార్టీ అయినా ఎంతో బాగా జరుగుతుందని మెచ్చుకుంటారు. మీరు వెళ్లండి అన్నయ్యగారూ. కబుర్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు."
    ప్రసూన మాటలు దేవిశంకర్ ని ఎదిరిస్తున్నట్లు లేవు. ఎదురు పొగుడుతున్నట్లుగా ఉన్నాయి. ఎప్పటిలాగే భార్య ముందు మూగవాడయిపోయాడు అతడు.  
    అతిధులకు మర్యాద చెయ్యటంలో తన అలంకరణ గురించి పట్టించుకోకుండా ముఖానికి పట్టిన చెమట కూడా తుడుచుకోక అలిసిన మొహంతో గాభరాతో కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది పార్వతి.

    దూరం నుంచి ఆమెను చూసి కౄరమైన తృప్తితో నవ్వుకుంటున్నాడు దేవిశంకర్. కెమెరా అటు తిప్పమని వీడియో కేసెట్ రికార్డ్ చేసే కెమెరామెన్ కి సైగ చేశాడు దేవిశంకర్!
    అది గమనించింది ప్రసూన. భర్త చిరునవ్వు వెనుక క్రౌర్యాన్ని కూడా గుర్తించింది.
    "నేను ఒకచోట కూర్చోవటం నాకు బాగోలేదు. రిసెప్షన్ హాల్లో అటూఇటూ తిరుగుతాను" అంది భర్తతో. వంటినిండా నగలతో భార్య అటూ ఇటూ తిరగటం దేవిశంకర్ కి ఇష్టమే.  
    "అలాగే వెళ్ళూ!" అని మళ్ళీ కెమెరా మెన్ కి సైగ చేశాడు ప్రసూనని ఫిల్మ్ తీయమని.
    మరుక్షణం ప్రసూన పార్వతి పక్కన నిలబడింది. ఏం జరుగుతుందో పార్వతికి అర్థమయ్యేలోగానే పనులన్నీ వాటంతట అవి జరిగిపోతున్నట్లు పూర్తి కాసాగాయి.  
    స్వీట్స్ బేత్స్ ఖాళీ అవుతూనే నిండిపోసాగాయి. తిన్న ఎంగిలి ప్లేట్లన్నీ హాల్లోంచి మాయమై మళ్ళీ కడిగి తుడిచి శుభ్రమైన ప్లేట్లు వచ్చి చేరుతున్నాయి. ప్రసూన ప్రసన్నమైన చిరునవ్వు అతిధులకు స్వాగతం పలుకుతోంది.

    ఆ చిరునవ్వు ముందు బయట "వెల్ కం!" ఇంగ్లీష్ అక్షరాలలోని మెర్ క్యూరీ బల్బులు వెలవెలబోతున్నాయి.
    రగిలిపోయాడు దేవిశంకర్. తనకు ఏమాత్రం ఇష్టంలేని పనులన్నీ తన అంగీకారంతో చేస్తుంది ప్రసూన. పార్వతికి ఊపిరి తిరిగింది. వియ్యపురాలి పట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయింది.
    ప్రసూన చేస్తున్న సందర్భాలన్నీ కెమెరాలోకి వచ్చాయి. రిసెప్షన్ అయిపోయాక కోపం అణుచుకోలేక అన్నాడు దేవిశంకర్.   
    "ఒక పనిమనిషిలాగ నువ్వు వాళ్లందరికీ చాకిరీ చేశావు"
    నవ్వింది ప్రసూన "మీకా భయం అక్కరలేదు! నా చీరనలిగినా ముఖం సడిలినా నన్ను పనిమనిషి అని ఎవరు అనుకోరు. నేను దేవిశంకర్ గారి భార్యని"    
    "అదేనీలో ఉన్న చాతుర్యం" మనసులో సణుక్కున్నాడు దేవిశంకర్.
    "ఇది వాళ్ల పార్టీ! పెళ్ళికొడుకు తల్లివి! నువ్వు చాకిరీ చెయ్యడమేమిటీ?"
    "పోనీయండీ! పెళ్ళి కొడుకు తల్లి అయి కూడా పని చేసిందని అందరూ మెచ్చుకుంటారు."

    "అలా అనుకోరు! ఆడపెళ్ళి వాళ్ళే పెత్తనం చెలాయిస్తూనీచేత చాకిరీ చేయించారని అనుకుంటారు."

    "అలా అనుకున్నా ఫర్వాలేదు. కొడుకు కోసం కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం కోసం పెళ్ళి కొడుకు తల్లి అయినా చాకిరీ చేసిందని అనుకుంటారు."
    "వాళ్ళంతా కెమెరాల ముందు ఫోజులు కొడుతూ తిరుగుతుంటే చాకిరీ చేస్తూ తిరగటం నీకు చిన్నతనం కాదూ?"  
    "కాదు! లోలోపల తమనితాము తక్కువగా అంచనా వేసుకునే వాళ్ళే పనిచెయ్యడం చిన్నతనమనుకుని ఫోజులు కొట్టడానికి ప్రయత్నిస్తారు. నాకేమిటీ? నేను పని చేస్తూ కనిపిస్తే నాకు మరింత గొప్ప....."
    కొత్తదంపతులిద్దరికీ ఈ సంభాషణ ఇబ్బందిగానే ఉంది. ఆ దశలో తప్పెవరిదనేది ఇద్దరికీ పట్టదు.
    గొడవలు లేకుండా ఉంటే చాలు! అదీగాక తప్పైనా ఒప్పైనా ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు చిన్నబుచ్చుకోలేరు.     

    "మీరుకూడా సైకాలజీ చదివారా?" అడిగింది యశోద.  

    "సైకాలజీ చదవలేదు! మా ఇంటికి వచ్చేపోయే మనుషుల్ని చదివాను."
    "అందరిలోనూ మామయ్యగారు బాగున్నారు. చరిత్రలోంచి దిగివచ్చిన యువరాజు లాగ....!"
    ఆ మాటకి అందరూ నవ్వటంతో కలతలు తాత్కాలికంగా వెనక్కు తగ్గాయి.
    "ఈరాత్రే మీరు మనఇంటికి వచ్చేయండి" దంపతులనుద్దేశించి అన్నాడు దేవిశంకర్. ఆ అనటంలో" మీరిక్కడ ఉండలేరు" అనే ధ్వని ఉంది.
    అంతకుముందు వివేక్ కూడా ఇంటికి వచ్చేయాలనే అనుకున్నాడు. కానీ తండ్రి అలా అనటంతో....
    "సారీ నాన్నగారూ! మేము హోటల్ రూం బుక్ చేసుకున్నాము. రెండు మూడు రోజులక్కడ ఉండి ఇంటికొస్తాం" అన్నాడు.   
    యశోద మనసులో వివేక్ పట్ల గౌరవం పెరిగింది.
                                          6
    బంజారాహోటల్లో ఖరీదైన 'ఏసీ రూం'. జన సమ్మర్ధానికి కొంత దూరంలో ఉన్న హోటల్ కావటంవల్ల ప్రశాంత వాతావరణమని భ్రమ కలుగుతోంది. గదిలో మరీ చల్లగా మరీ వేడిగా కాకుండా కంట్రోల్ చేస్తుంది ఏసీ మిషన్.
    అటాచ్ డ్ బాత్ రూంలో నుంచి వివేక్ స్నానం చేస్తున్న చప్పుడు వినిపిస్తోంది. బెరుగ్గా కూచుంది యశోద.
 

    ఇలా హోటల్ కి రాకుండా అమ్మ దగ్గరుంటే ఎంత బాగుండును? పాపం వంచిన నడుము ఎత్తకుండా చాకిరీ చేసింది. ఫంక్షన్ అయ్యాక కాసేపు మాట్లాడటానికి కూడా కుదరలేదు. ఇలాంటి సమయంలో అమ్మ దగ్గరే ఉండాలి. న్యాయానికి అప్పుడే రాజీపడిపోతోంది.
    వివేక్ తండ్రి మాట శిరసావహించివాళ్ల ఇంటికి బయలుదేరదీస్తే నిశ్చయంగా ఎదిరించి ఉండేది. కాని వివేక్ తండ్రికి ఎదురు తిరిగి సొంత నిర్ణయం తీసుకున్నాడు. అంచేత తల వంచింది.......
    "ఏయ్! నిన్నే!" బాత్ రూం తలుపు ఓరగా తెరిచి, గట్టిగా అరిచాడు వివేక్.
    ఉలికిపడింది యశోద "ఏమిటీ?" అంది బెంబేలుగా.
    నవ్వాడు.
    "పెద్దధీరవనితలా ఫోజు! తీరా సమయం వచ్చేసరికి అచ్చుముచ్చు ఆడపిల్లలాగ....!" అప్రయత్నంగా సిగ్గుపడిపోయింది యశోద.
    "ఏమిటో! చెప్పరాదూ?"          

 Previous Page Next Page