నిర్ఘాంతపోయాడు దేవిశంకర్. అతడి నోటమాట రాలేదు. రైస్ మిల్ లో పనిచేసే కూలీల ఇళ్లలో పెళ్ళి అయితే ప్రసూనని వచ్చి ఆశీర్వదించమని ప్రాధేయపడతారు. ఆవిడ ఆశీర్వాదం మంచిదనే.
విశ్వాసం వాళ్లలో ఉంచి.... దేవిశంకర్ వెళ్లమంటాడు. తన సంపాదనలో చాలా భాగం బంగారం రూపంలో భార్య వంటిమీద అలంకరించాడు అతడు. అంతకంటే భద్రమైన స్థలం మరోటిలేదు అతని దృష్టిలో!
వంటినిండా బంగారు నగల అలంకరణతో తన భార్యను చూసుకోవడం అతనికి అత్యంత ఆనందదాయకమైన విషయాలలో ఒకటి! అంచేత ప్రసూనని ఎక్కడికి బయలుదేరినా "నగలు పెట్టుకుని వెళ్ళు!" అని అనటం అలవాటైపోయింది.
"అబ్బాయి పెళ్ళి అంటే....? భలేదానివి. ధర్మరాజు "అశ్వద్ధామా! హతః" అన్నట్లే ఉంది నీ నిజం!"
"ఒప్పుకుంటాను. క్షమించండి నాకింతకంటే వేరే మార్గం లేదు. మీతో "వెళ్ళు!" అనిపించుకునే వెళ్ళాననే తృప్తి కావాలి నాకు!"
ప్రసూన నోట వచ్చే ఇలాంటి మాటలకే కరిగిపోతాడు దేవిశంకర్. ఏమి అనలేని అశక్తుడైపోతాడు.
అతడిని ఏనాడూ ఎదిరించకుండా తన వివేకంతో తనభక్తి భావప్రదర్శనతో తనమాట నెగ్గించుకుంటుంది ప్రసూన. వివేక్ వైపు తిరిగాడు దేవిశంకర్ "ఈ అమ్మాయి మన కులం కాదా"
"మన కులమే!"
"వీళ్లవంశంలో ఏదైనా మచ్చ ఉందా? వీళ్ల అమ్మ... అత్త..."
"లేదు! లేదు! వీళ్లవంశంలో ఆడవాళ్లంతా చాలా మంచివాళ్ళు."
"మరి నాకు చెప్పకుండా చేసుకోవలసిన అవసరం ఏమొచ్చిందని?"
"మీరు జ్యోతిష్యాలతో జాతకాలతో పరీక్షలు జరపటం నాకిష్టం లేదు. ఈ అమ్మాయి నాకు నచ్చింది. అది చాలు నాకు."
"ఈ విషయమే నాకు చెప్పొచ్చుగా?"
"చెప్పొచ్చు! కానీ మీరు వినరు."
"నువ్వు కోరినది ఏది కాదన్నాను నేను?"
"మీరు కాదనేది ఏది కోరాను నేను?"
"ఒక్కకొడుకువి! నీ పెళ్ళి ఎంతో వైభవంగా చెయ్యాలనుకున్నాను. ఇప్పుడైనా నీవు చేసినపని ఒప్పుకుంటావని నమ్మకమేమిటి?"
"లేదు! ఘర్షణ ఎలాగూ తప్పదు. అలాంటప్పుడు నేను కావాలనుకున్నది పొంది ఆ తర్వాత ఘర్షణ పడటం మేలు కదూ"
వివేక్ మాటలు వింటూ తెల్లబోయింది యశోద.
వివేక్ మాట్లాడిన మాటలను బట్టి అతడు తండ్రికి చాలా భయపడతాడనుకుంది. కానీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు... చాలా సంతోషించింది.
దేవిశంకర్ కి కూడా ఆశ్చర్యం కలిగించింది కొడుకు ధోరణి. అతనికి ఆశ్చర్యంతో బాటు లోలోపల ఏదో భయం కూడా ప్రవేశించింది.
"ఇప్పుడేం చేద్దాం?" భార్యని అడిగాడు.
"సాయంత్రం అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు పార్టీ ఇస్తారట! అక్కడి కెళ్ళాలి."
"ఎన్నిగంటలకి?"
"సాయంత్రం ఆరింటికి"
"సరే! అయిదింటికి గుర్తు చెయ్యి."
"అబ్బాయీ, కోడలూ ఇప్పుడే వాళ్ల ఇంటికి వెళ్ళాలి. కోడలి తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు!"
"వెళ్ళమను! వాడి కారులో వెళ్లమను."
"థేంక్యూ నాన్నగారూ"
సమస్య ఇంత తేలికగా విడిపోయినందుకు ఆనందంతో అన్నాడు వివేక్.
"ముందు ముందు నాకు థేంక్స్ చెప్పవలసిన సందర్భాలు చాలా వస్తాయి... నీ జీవితానికి ఇది ప్రారంభం మాత్రమే."
* * *
దక్షిణామూర్తి తన శక్తికి మించి గ్రాండ్ గా ఏర్పాటు చేశాడు రిసెప్షన్ పార్టీ. పార్టీకి ప్రసూనతో కూడా వచ్చాడు దేవిశంకర్. పార్వతి దక్షిణామూర్తి దంపతులు వాళ్లకి చాలా గొప్పగా మర్యాదలు చేశారు. దేవిశంకర్ తనతో వీడియో రికార్డింగ్ వాళ్లని తీసుకొచ్చాడు. ఎక్కడికక్కడ తన డాబు, దర్పం ప్రదర్శించుకోవాలనే ప్రవృత్తి దేవిశంకర్ ది! మూర్తి రిసెప్షన్ ఏర్పాట్లు ఏం చేస్తున్నాడో తెల్సుకుంటున్నాడు.
వీడియో కేసెట్ రికార్డింగ్ ఏర్పాటు చెయ్యలేదని తెలుసుకుని అది ఏర్పాటు చేశాడు. మూర్తి కొంచెం చిన్నబోయినా వెంటనే తేరుకున్నాడు.
తనకూ ఈ ఆలోచన రానందుకు నొచ్చుకున్నాడు. శక్తికి మించి అప్పు చేసి మరీ ఖర్చు చెయ్యటానికి సిద్ధపడినప్పుడు పదిహేనొందలు తనకు ఒక లెక్కా?
తండ్రీ కొడుకుల మధ్య ఏవో అపార్ధాలు వచ్చాయనీ, అందుకే వివేక్ రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకుంటున్నాడనీ, తండ్రీ, కొడుకుల మధ్య ఏదో సీన్ జరుగుతోందని ఊహాగానాలు అల్లుకుంటూ కుతూహలపడుతున్న చాలామంది బంధువులకి దేవిశంకర్ తన భార్యతో అతి మామూలుగా రిసెప్షన్ కి రావటం చాలా నిరుత్సాహం కలిగించింది.
అతిధుల్ని పలకరించే వారు లేరు. కూచోమనే వాళ్లులేరు. డిన్నర్ టేబుల్ దగ్గరికి నడిపించే వాళ్లులేరు. ఒక్కర్తీ అన్నీ చూసుకోలేక బెంబేలెత్తిపోసాగింది పార్వతి.
పైగా దేవిశంకర్ తరపు చుట్టాలు. స్నేహితులూ ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. మూర్తిని అటూ ఇటూ కదలనియ్యకుండా మాటలతో తనపక్కనే నిలబెట్టాడు దేవిశంకర్. ఆ కారణం చేత పార్వతికి మూర్తి అండ అస్సలు లేకుండా పోయింది.
రిసెప్షన్ పార్టీ అభాసుపాలవుతుందేమోనని భయం పట్టుకుంది పార్వతికి.
"అతిధులు చాలామంది వొస్తున్నారు. పార్వతి అవస్థ పడుతోంది. నేను వెళతాను" అని దేవిశంకర్ ని తప్పించుకోవాలని చూశాడు మూర్తి.
"అవన్నీ మనం చెయ్యటం ఎందుకండీ? సర్వెంట్స్ చూసుకుంటారు" అన్నాడు దేవిశంకర్ దర్పంగా. చివుక్కుమంది మూర్తికి. వియ్యంకుడు అనే గౌరవంతో అతడేమీ సమాధానం చెప్పలేకపోయాడు. చిత్రంగా సమాధానం చెప్పింది ప్రసూన.