Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 16


    
    పదో తరగతి పాసయ్యాక నేను చిన్న ఉద్యోగంలో చేరాను. ఒక కార్ల కంపెనీ ఫిట్టర్ గా! అమ్మకు అది ఇష్టంలేదు. కానీ నేనన్నాను. "ఈ చదువులు చదవటానికి పగలంతా కాలేజీ, సాయంత్రాలు స్నేహితులు, రాత్రిళ్ళు సినిమాలు అనవసరం అమ్మా! చివరి రెండూ వదిలేస్తే, రోజుకి రెండు గంటలు చాలు" అని. అమ్మ కళ్ళల్లో ఎంత దాచినా దాగని సంతోషం కనపడింది. బహుశా తన పట్టుదహాల జీవితం పట్లవున్న కమాండ్ లో కొద్దిగానైనా  కొడుకులో కనపడుతున్నందుకేమో అమ్మదాచిన డబ్బాలో అప్పట్నుంచి నేను కూడా డబ్బు వేయడం ప్రారంభించాను. ప్రైవేటుగా చదువు కొనసాగించాను.
    
    నేను బి.కామ్. పాసయినరోజు ఇద్దరం కలసి దాన్ని ఓపెన్ చేసాం. ఆ ఆనందం చెప్తే అర్ధంకాదు. అనుభవించి తీరాల్సిందే. బ్యాంకులో వేసుకున్నా రాదు. ఇరవై సంవత్సరాల కృషి అది. అమ్మ ఒక్కొక్కటే లెక్క పెడుతూ వుంటే చూస్తూ కూర్చున్నాను. దాదాపు గంట పట్టింది. ఆ చిల్లరా, నోట్లు, పదులూ వందలూ అన్నీ లెక్కపెట్టేసరికి, మొత్తం పాతికవేల దాకా తేలింది.
    
    అప్పుడేడ్చింది అమ్మ....ఆనందంతో....చెప్పానుగా కొన్ని ఫీలింగ్స్ కి రీజనింగ్ వుండదని.
    
    ఆ పాతిక వేలతో ముగ్గురితో భాగస్వామిగా చేరి సెకండ్ హాండ్ కార్లు కొనడం- అమ్మటం షాప్ పెట్టాం. ఇందిరాగాంధీ పుణ్యమా అంటూ కారు ధరల్లో విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో మేము పట్టిందల్లా బంగారమయింది. అందులోనూ నాకు ఈ నరకంలో చిన్నప్పటినుంచీ అనుభవం వుండటం మేలు చేసింది. నాలుగు సంవత్సరాలు తిరిగేసరికల్లా నా ఎమ్.బి.ఎ పూర్తయింది. మరోవైపు ప్రమదా ఇండస్ట్రీస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.
    
    అన్నట్టు మా అమ్మ పేరు మీకు చెప్పలేదు కదూ.
    
    ప్రమద్వర.
    
    ప్రతీ పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ వుంటుందంటారు. ఆ స్త్రీ ప్రేయసి అయితే విజయం యవ్వనం నుంచీ స్టార్టఉతుంది. తల్లయితే బాల్యం నుంచీ మొదలవుతుంది.
    
                                     * * *
    
    ఆ రోజు సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి వస్తూంటే మధ్యలో కారు ట్రబులిచ్చింది. ఇల్లు దగ్గిరే అవటంతో నడిచి వచ్చేశాను. నా రాక వాళ్ళకి తెలీదు. ముందు హాల్లో కూర్చుని వున్నాడతను. అమ్మ అటు తిరిగి మాట్లాడుతుంది.
    
    అతడి గెడ్డం పెరిగివుంది. బుగ్గలు లోపలికి పోయాయి. నా మొదటి అనుమానం నా తండ్రి మీదకు వెళ్ళింది. కానీ అతడు తండ్రి కాదు. అతడు అంటున్నాడు-
    
    "నిన్న నువ్విచ్చిన పదివేలు చాలా సాయం చేశాయి పెద్దమ్మా ఇంకొక పదివేలియ్యి భైరవమూర్తి కివ్వాలి".
    
    కొంచెంసేపు  అతడు అడుగుతున్నది నాకు అర్ధంకాలేదు. భైరవమూర్తి అన్న పేరు నా ఆలోచన్లని స్థంభింపచేసింది.
    
    నా తండ్రి జైల్లో వుండి ఇతడిని పంపాడు అన్నది అర్ధమైంది. ఇన్నాళ్ళూ లేదనుకున్న పీడ తిరిగి మొదలైంది.
    
    పక్క కిటికీ ఊచల మధ్యనుంచి నా తల్లి మొహం అస్పష్టంగా కనిపిస్తూంది. ఆమె మొహం భావరహితంగా, ఒక తెల్ల కాగితంవలె వున్నది. వివాహం జరిగిన మరుక్షణం నుంచీ బాధలు పెట్టి, మొత్తం జీవితంలో నాల్గయిదుసార్లు కన్నా ఎక్కువ కలుసుకోకుండా, కలుసుకున్న ప్రతీసారీ డబ్బుక్సోం బాధపెట్టే అతనిమీద ఆమెకి గౌరవంగానీ, ప్రేమగానీ ఏముంటాయి? కానీ ఇంతవరకూ జరిగింది వేరు. తాగుడుకోసం భార్యను పీడించటం సామాన్యవిషయం కానీ జైలునుంచే ఎవడో చెమ్చాగాడిని పంపించటం సహించలేని విషయం! ఇలాంటి రాయబారాలు ఇంకోసారి తేకుండా వాడికి బుద్ది చెప్పటం కోసం అడుగు లోపలికి వెయ్యబోతూ వుంటే తిరిగి వాడి కంఠం వినిపించింది.
    
    "ఇవ్వక తప్పదు పెద్దమ్మా నీ కొడుకు భైరవమూర్తికి పుట్టినోడుకాదు, నీ మొగుడి రక్తం ఆడిలో ప్రవహించటంలేదు- అని ఎవరికీ చెప్పకుండా వుండాలంటే పదివేలు ఇయ్యాల్సిందే-"
    
    భూమి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. తలుపు రెక్క పట్టుకుని నిలదొక్కుకున్నాను. నా తల్లి, నన్ను పెంచి పెద్దచేసిన మాతృమూర్తి... ఆమె జీవితం వెనుక నీడలు పరిహసిస్తున్నట్టు కనిపించాయి. వికృతంగా నవ్వుతున్నట్టు కనిపించాయి. ఒక నల్లటి మేఘం నన్ను కమ్మేస్తున్నట్టు కదిలిపోయాను.
    
    ముందుకురికి "అమ్మా-ఏమిటిది? వీడు చెపుతున్నది నిజమేనా?" అని నిలదీద్దామని అనిపించింది. కానీ ఏదో తెలియని వివేకం నన్ను వెన్ను తట్టి ఆపుచేసింది.... ఆమె నా తల్లి!!
    
    "నా దగ్గిర డబ్బులేదు. నేనివ్వలేను" అంటూంది అమ్మ.
    
    అతడు లేచాడు. "-ఆలోచించుకో పెద్దమ్మా రేపీ వేళకే వస్తాను. నువ్వు డబ్బు ఇవ్వలేదనుకో, నీ కొడుకు ఇప్పుడు పెద్ద పొజిషన్లో వున్నాడు. ఆడు జైల్లో వున్నోడి కొడుకు అని బైటపెపంచానికి తెలియటం అంత బాగోదు. ఆ తరువాత కొన్ని రోజులకి- ఈడసలు ఆడి కొడుకు కాదు, మెళ్ళో మంగళసూత్రం కట్టినోడు మాత్రమే మా భైరవమూర్తి! కడుపు నింపినోడు ఇంకోడు ఏరే వున్నాడు. కడుపుతో వున్నదాన్ని జాలిపడి మా భైరవమూర్తి చేసుకున్నాడని ఇంకో ఫీలరు వదుల్తాను. దానికి పల్లెపల్లెంతా వచ్చి సాక్షమిస్తది. నువ్వంటే పారిపోయి వచ్చావుగానీ, గోదారి పక్కన ఆ పల్లె అట్లాగే వుందిగా ఆళ్ళ అందరికీ నీ సంగతి తెలుసు. ఆళ్ళకి నువ్విక్కడున్నావని తెలిస్తే అప్పుడు నీ గతి ఎట్టా వుంటదో ఆలోచించుకో- ఈ రహస్యం నాకూ, భైరవమూర్తికి తప్ప ఇంకెవరికీ తెలీదు. నన్ను మంచి చేసుకున్నావా ఇంకసలు బైటపడదు. ఎల్లొస్తా- మళ్ళీ రేపొస్తా డబ్బు రెడీగా వుంచు-"
    
    నేను పక్కకి తప్పుకున్నాను. వాడు ఛాతీ విరుచుకుంటూ వెళ్ళిపోయాడు. లోపల అమ్మ చిత్తరువులా నిలబడి వుంది. రక్తం ఇంకిపోయిన మొహంతో పాలరాయిలా.
    
    వాడిని కాస్త బయటికి వెళ్ళనిచ్చి, నేనూ మెట్లు దిగాను. వాడు గేటుదాటి వెళ్తున్నాడు. క్రింద మెకానిక్ వచ్చి నిలబడి వున్నాడు. కారు తాళాలు అందించి, "బాగైంది సార్" అన్నాడు.
    
    కారు తీసుకొని బయటకొచ్చాను. వాడిని రెండుసందులు నడవనిచ్చి వెనకనుంచి కారు పక్కగా తీసుకెళ్ళి ఆపుచేశాను.
    
    "కారెక్కు".
    
    "ఎవర్నువ్వు?"
    
    "కారెక్కు చెపుతాను!"
    
    "ఎవరంటే చెప్పవేం?"
    
    కారు దిగి, చుట్టూ తిరిగి, వాడి దగ్గిరగా వెళ్ళి ఫ్రంట్ డోర్ తీసి పట్టుకుని "ఎక్కు చెపుతాను" అన్నాను.
    
    "ఎందుకో చెప్తేగానీ ఎక్కను. ఎవరు నువ్వు?"
    
    పిడికిలి బిగించి వాడి గెడ్డం పక్కకి తిరిగిపోయేలా కొట్టాను. కార్లు రిపేర్లు చేసిన చేతులవి. వాడి తల వెళ్ళి కారుకు కొట్టుకుంది. వీధిలో వెళ్ళేవాళ్ళు ఆశ్చర్యంగా ఆగి చూశారు. బుద్దుడు పుట్టిన దేశంలోని ప్రజలు సాధారణంగా ఎవరి గొడవల్లోనూ జోక్యం చేసుకోరు. పక్కన మర్డర్లు జరుగుతున్నా పట్టించుకోరు.

 Previous Page Next Page