Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 16


    "ఊ"

 

    "ప్రపంచ చరిత్రలో ఇది పాతకథే కావచ్చు. కాని, మన కథకిది కొత్త చరిత్రే."

 

    "ఔను."

 

    "నిన్ను ఎలా విడిచి వుండాలి?"

 

    "నాకూ తెలీదు."

 

    "నాకు అందకుండా..."

 

    "ఆకాశమంత ఎత్తున....."

 

    "అవును. మెరుస్తూ..."

 

    "ఎప్పుడో రాలిపడతాను."

 

    "నా చేతుల్లోకి."

 

    "నిజంగానా....? ఎంత బాగుంది!"

 

    "శైలూ! నీకు ఉత్తరం రాస్తున్నాను."

 

    "ఎంత అందమైన ప్రేమలేఖ!"

 

    "చివర్న........"

 

    "నా అనుకునే నీ....."

 

    "శైలూ, ఇంకో ఉత్తరం..."

 

    "చివర్న?"

 

    "నీ అనుకునే - నేను."

 

    ఇలా ఊహల్తో, కలలతో రోజులూ, నెలలూ గడిచిపోతున్నాయి.

 

    ఆమెను కలుసుకుంటూనే వున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. బస్సులో ప్రక్కప్రక్కన నిలబడి ప్రయాణం చేస్తూనే ఉన్నారు.

 

    కానీ.....

 

    ఆ మాటల్లో ఏదో బెదురు, వెలితి, దూరం, బాధ, దుఃఖం, కొంచెం కోపం, ఉక్రోషం మళ్ళీ ఆరాటం.

 

    చదివేస్తున్నారు.

 

    ఒక ఆదివారం సాయంత్రం గదిలో ఏమీ తోచక రామకృష్ణా బీచ్ కువెళ్ళాడు.

 

    ఒంటరిగా ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉలికిపడ్డాడు. శైలు!...

 

    కానీ ఒంటరిగా లేదు. ప్రక్కనే ఆమె మేనత్తా, యిటువైపు ఓ యువకుడు.

 

    'ఇతనెవరూ? ఎప్పుడొచ్చాడు? అసలెప్పటినుంచి వుంటున్నాడు?'

 

    దగ్గరకు వచ్చారు.

 

    ఇప్పుడతని ముఖం బాగా కనిపిస్తోంది. ఎంత అందవికారంగా ఉన్నాడు? స్ఫోటకం మచ్చలు, ఎర్రటికళ్ళు. ఎందుకో నవ్వాడు. వంకరటింకర పళ్ళు.

 

    ఫణిని చూసి శైలజ మాన్ప్రడిపోయింది. నెత్తురుచుక్కలేనట్లు పాలిపోగా మెల్లగా తేరుకొని వాళ్ళతో దూరంగా నడిచి వెళ్ళిపోయింది.

 

    మరునాడు యూనివర్సిటీలో ఒంటరిగా కలిసినప్పుడు ఆమెని నిలదీశాడు.

 

    "అతనేనా నువ్వు అంకితం కాబోతున్న వ్యక్తి?"

 

    ఆమె ధైర్యంగా, నిర్లక్ష్యం వ్యక్తపరుస్తున్నట్లు "అవును" అంది.

 

    "నీకెలా నచ్చాడు?"

 

    "ఇక్కడ నచ్చటంలో ప్రసక్తి లేదు."

 

    "ఏం జరిగింది? ఇప్పటికైనా నిజంచెప్పు శైలూ, ప్లీజ్!"

 

    ఆమె చెప్పింది. కాకినాడలో తన తండ్రి ఒక ఎరువుల కంపెనీలో గుమాస్తా. ముందూ వెనుకా ఆలోచించకుండా పిల్లల్ని కనటంవల్ల గంపెడు సంసారాన్ని ఈదలేక యిడుములు పడుతున్నారు. శైలజకు ఓ అక్కవుంది. ఆమెకు ఎంతో ప్రయాసమీదట పెళ్ళి కుదిరిందిగాని, చెయ్యటానికి డబ్బేలేదు. అప్పు పుట్టించటం కోసం ఎంతగానో ప్రయత్నించాడు. ఫలితంలేదు. అంతలో ఆయన చెల్లెలు సుభద్రమ్మ తాను ఆదుకుంటానంటూ వచ్చింది. ఈ పెళ్ళికి అయ్యేఖర్చు తాను భరిస్తుంది కాని తన కొడుకు సురేష్ కి శైలజనిచ్చి పెళ్ళిచేయాలి. ఆమె తండ్రి ఇరకాటంలో పడ్డాడు. ఒకవైపు పీటలమీద పెళ్ళి ఆగిపోయేలా వుంది. మరోవైపు పెద్దకూతురు మీనాక్షి ఈ పెళ్ళికాకపోతే నూతిలో దూకుతానని బెదిరిస్తోంది. ఆయనకు మతిపోతోంది. శైలజను ఆదుకోమన్నట్లుగా అర్ధించాడు. శైలజ ఆలోచించింది. ఎవరో ఒకరు చితికిపోవాలి, తప్పదు. సరేనంటూ ఒక నిబంధన విధించింది. తనకు చదువంటే ఆసక్తి వుంది. తను ఎమ్.ఎస్.సి. పూర్తిచెయ్యాలి, తర్వాతే పెళ్ళి. మేనత్తకూడా సరేనంది.

 

    ఫణి అంతా విని "ఎమ్.ఎస్.సి. పూర్తయ్యాక ధిక్కరిస్తే?" అన్నాడు.

 

    "మా మేనత్త తానిచ్చిన డబ్బుకి నోటు రాయించుకుంది. అదికూడా హెచ్చు వడ్డీకి. ఈ పెళ్ళిజరిగితే ఆ నోటు చింపేస్తుంది, లేకపోతే దండయాత్ర చేస్తుంది."

 

    "అందుకని?"

 

    "నేను లొంగిపోక తప్పదు."

 

    అని ఆమె వెళ్లిపోతోంటే ఫణి నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాడు.

 

                                              6

 

    చూస్తూ చూస్తూండగానే రెండేళ్ళు గడిచిపోయాయి.

 

    ఇంకా వారంరోజుల్లో పరీక్షలు. ఫణి అన్నీమరిచి దీక్షగా, కసిగా చదువుతున్నాడు.

 

    ఫస్ట్ క్లాస్ రావాలి, యూనివర్సిటీ ఫస్టు రావాలి. ఏదో సాధించాలి.

 

    ఒకరోజు రాత్రి రెండయింది. మంచంమీద కూర్చుని చదువుతున్నాడు. మనిషి సగం చిక్కిపోయాడు. కళ్ళు లోతుకుపోయి వున్నాయి. మనిషి తూలిపోయేలా వున్నాడు, అయినా చదువుతున్నాడు.

 

    బయటనుంచి కేక. "టెలిగ్రాం"

 

    అదిరిపడ్డాడు. తనకా?

 

    తలుపు తీసుకుని యివతలికొచ్చాడు. అవును తనకే.

 

    "ఫాదర్ సీరియస్. స్టార్ట్ యిమ్మీడియట్లీ. వసుమతి."

 

    గుండె దడదడమని కొట్టుకుంది. కళ్ళముందు చీకట్లు క్రమ్మాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు.

 

    వెళ్ళకపోతే? తండ్రికేదయినా జరిగితే? పాపం వసుమతి!

 

    వెడితే! ఇన్నాళ్ళ శ్రమ.

 

    పిచ్చెత్తినట్లయింది. బయటకువచ్చి ఆ చీకట్లో ఆతృతగా నడుస్తూ శైలజ ఇంటికేసి వెళ్ళాడు. 'ఆమెతో చెప్పాలి. ఆమె ఏమి సలహా చెబుతుందో?'

 

    శైలజ గదిలో లైటు వెలుగుతోంది. కిటికీలోంచి ఆమె టేబుల్ ముందు కూర్చుని చదువుకుంటూ వుండటం కనిపిస్తోంది. తను వచ్చినట్టు ఆమెకు ఎలా తెలియటం? ఎలా వస్తుంది?

 

    "శైలూ!" మెల్లిగా పిలిచాడు.

 Previous Page Next Page