ఇంత చేస్తున్నా జీవితం నిస్సారంగా వుండేది. విధి తనని దగా చేసినట్లు నిరంతరం తపన పడుతూండేవాడు. ఎంతచేసినా యీ నాలుగుగోడలు దాటి బయటకుపోయే వీలులేదు. ఓ రకం చెరసాల. ఏ అర్థరాత్రప్పుడో మెలకువ వచ్చేది. ఉలికిపడేవాడు. మళ్లీ నిద్రపట్టేదికాదు. ఎన్నో ఆలోచన్లు.
ఈ భూమ్మీద బాధించే వాళ్లెవరంటే.... బంధువులు. మెడికల్ కోర్సు చదువుతున్న కుర్రాడు ఇలా ఇంట్లో నెలలతరబడి కూర్చునేసరికి ముఖ్య బంధువుల్లోనూ ఇరుగుపొరుగుల్లోనూ సంచలనం కలిగింది. ఇంటికి ఎవరైనా వస్తూంటేనే తనగురించి ప్రశ్నిస్తారేమోనని భయంగా వుండేది మధుబాబుకు. సరిగ్గా అలాగే జరిగేది. మధు వచ్చాట్ట కదే సుందరం అంటూ ఎక్కడినుంచో ఎవరో ఊడిపడటం, కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పి "కాలేజీకి సెలవు లేమిటి?" అని ఆరా తియ్యటం ఇదీ వరస.
"వాడికి ఒంట్లో కులాసాగా వుండడంలేదు" అని సుందరమ్మగారు బదులు పలికేసరికి....
"ఏం జబ్బూ? ఏం కథాకమామిషూ? దాక్తరికి చూపించారా? ఏమన్నాడు? ఆపాయమేమీ లేదుగదా?" ఇలా ప్రశ్నల పరంపరలు. అవతలకు పోయి గుడగుడలాడుకోవడం.
రంపపుకోతగా వుండేది మధుబాబుకు.
ఇలాంటి మాయదారి రోగాలు దాపరించినప్పుడు దాని బాధకన్నా ఈ ప్రజల బాధ ఎక్కువ.
ప్రపంచమంటే అసహ్యం కలుగుతోంది అతనికి!
* * *
అతని కథలు అచ్చేసిన పబ్లిషర్ ఓ రోజు వచ్చి నవలకూడా వేసుకుంటానని అడిగాడు. ఈసారి డబ్బు అడగాలనిపించింది మధుబాబుకు. ముఖం ఎదుట అడగలేక, అప్పటికి సరేఅని తర్వాత పనివాడిచేతికి ఉత్తరం ఇచ్చి పంపించాడు.
ఆ పబ్లిషర్ రెండొందలు ఇస్తానని కబురు చేశాడు. ఇది అన్యాయం. ఆ పుస్తకం ధర ప్రకారం కనీసం అయిదారువందలు రావాలి. మధుబాబు ఆ సాయంత్రం ఉమాపతి వచ్చినప్పుడు సలహా అడిగాడు. "అయిదువందలకు దమ్మిడీ తక్కువైనా ఒప్పుకోబోకండి" అన్నాడు ఉమాపతి. మొహం ఎదుట అయితే నోరు విప్పుడుగాని ఉత్తరాల్లో తనప్రతాపం ప్రదర్శిస్తాడు మధుబాబు. అలాగే రాసి పంపించాడు. పబ్లిషర్ మరో యాభయిదాకా చేసి బేరం పెట్టాడు మధుబాబు అంగీకరించలేదు. చివరకు వ్యవహారం విఫలమైపోయింది.
డబ్బుకోసం ఆశపడి అవకాశం పాడుచేసుకున్నానేమో అనుకున్నాడు మధుబాబు. కాని అతను భయపడనక్కరలేకపోయింది. మరునాటి సాయంత్రాని కల్లా మరో పబ్లిషర్ తయారయినాడు. మొదట అతనికి వ్యాపారంలో ప్రతిద్వంది. మనిషి డాంబికంగా, సభ్యత గలవాడుగా కనిపిస్తాడు. మాట మృదువుగా వుంటుంది. పాతికలదగ్గరా, యాభయిల దగ్గరా పెంకుతనం చెయ్యడు "అంత ఇస్తాను, ఇంత ఇస్తాను" అని ముందుగానే చవులూరిస్తాడు. మధుబాబు ఉబ్బితబ్బిబ్బయిపోయి నవల కటింగ్స్ తెచ్చి ఆయనచేతిలో పెట్టాడు.
"ఎగ్రిమెంటు రాసుకోకపోయినారా?" అని అడిగాడు ఉమాపతి.
"అబ్బే! ఆయన చాలా పెద్దమనిషి అంత నిక్కచ్చిగా వుండటం బాగుండదు. రేపు ఫస్ట్ కల్లా ఎడ్వాన్స్ గా సగం ఇస్తానన్నాడు" అన్నాడు మధుబాబు. ఉమాపతి మౌనంగా వూరుకున్నాడు.
మెల్లిగా రోజు గడుస్తున్నాయి. మధుబాబు ఆరోగ్యం కుదుటపడుతోంది. మనిషి కొంచెం వళ్ళుచేస్తున్నాడు. బయటకుపోకుండా, నీడపట్టున వుండటం వల్ల శరీరానికి వింతకాంతి రాసాగింది. ముఖం గుండ్రంగా, పొంకంగా తయావుతోంది. అద్దంలో చూచుకుంటూంటే అతనికి విచిత్రంగా , ఉత్సాహంగా వుండేది.
హైదరాబాద్ వీక్లీవాళ్ళు మరో నవలేమైనా వుంటే పంపమని కోరుతూ రాశారు కొన్నాళ్ళకు.
అతనికి మహా ఉద్రేకం. తను రాయాలి! రాయాలి! ఎందుకిలా కాలం వృధా చేస్తున్నాడు? ఆ రాత్రి చాలాసేపటివరకూ దాన్నిగురించే ఆలోచిస్తూ పడుకున్నాడు. అయితే మునుపటికీ ఇప్పటికీ తేడా తెలిసివచ్చింది. ఇంత వరకూ తనకు తెలియని ఏ సంగతి గురించయినా తడబాటులేకుండా స్పష్టంగా యోచించి ఓ రూపకల్పన చేస్తూండేవాడు. ఇప్పుడెంత బుర్ర బద్దలుకొట్టుకున్నా తన పరిసరాలూ, తనూ, తన మనస్తత్వం ఇవే మనోపథంలో మెదుల్తున్నాయి గాని కొత్త ఇతివృత్తం గిరగిర స్ఫురించటంలేదు. తను కొత్తబాట తొక్కనున్నడా? కొత్త అధ్యాయంలో ప్రవేశిస్తున్నాడా?
మొత్తంమీద స్థూలంగా ఓ ప్లాట్ తయారుచేసుకున్నాడు. రెండుమూడు పాత్రల్ని వాటి విచిత్ర మనస్తత్వాలనీ మనసులో సృష్టించుకున్నాడు. ఇప్పుడు మనసు కొత్తరకంగా భావనచేస్తోంది. అడుగడుక్కి ఏమిటో సంఘర్షణ ! మనిషిమీద మనిషి ప్రభావం, స్వార్థం-త్యాగం, పుణ్యం-పాపం వీటితేడాల విలువలు, పాపానికి పరిధి ఎంత? సత్యానికి సరిహద్దులేమిటి? అదృష్టానికి ఆనకట్ట ఎక్కడ? ఓ మహా సంకులసమరం చెలరేగుతుంది అతని మస్తిష్కంలో. ఇహ ఆ పాత్రల్ని తలుచుకుంటూ, ఈ సంఘర్షణను పరుచుకుంటూపోవాలి. జీవితంలో పిరికివాళ్ళన్నా, అసమర్థులన్నా ఓ ఆసక్తి, సానుభూతి పెరిగింది. విభిన్న దృక్పధాలు గల వేరు వేరు వ్యక్తుల్ని తీసుకుని వారిచుట్టూ పరిస్టితులూ, వాతావరణం కల్పిస్తూ ముందుకు పోసాగాడు.
17
అతని నవల అచ్చు వేస్తానని తీసుకువెళ్లాడే గాని.... ఎన్నిసార్లు కబురు చేసినా ఆ పబ్లిషర్ ఉలకడు పలకడు. గట్టిగా ఉత్తరం రాసి పంపించేసరికి "ఇదిగో ఈ నెలలో ప్రారంభిస్తున్నా" అంటాడు. ఎందుకని త్వరగా మొదలు పెట్టడో అర్థంకాదు మధుబాబుకు. అతన్లో అసహనం యెక్కువ కాసాగింది. ఇంతలో సాహితీసమితి పదేళ్ళుగా వచ్చిన నవలలన్నిట్లోనూ ఉత్తమ నవలను బహూకరించటానికి నిర్ణయంచేసి ప్రకటించింది. డానికి పుస్తకరూపంలో వున్న నవలలే పరిశీలించబడతాయి. మధుబాబుకు మరీ ఆతృత హెచ్చింది. తను బయటకు పోవటానికి వీల్లేదు. పబ్లిషర్ రావడం మానేశాడు. గట్టిగా ఓ జాబు రాసి పంపించాడు. నెలాఖరులోగా తప్పకుండా పుస్తకం పూర్తిచేస్తున్నాం" అని హామీ ఇస్తూ జవాబు పంపించాడు.
హైద్రాబాద్ వీక్లీలో అతని రెండోనవల ప్రచురణ ప్రారంభమయింది. అయితే మొదటిదాని శైలికీ బొత్తిగా సంబంధం లేదు. ఇది చదివి ఎవరూ పోల్చకపోవచ్చు. "అయ్యో పాపం" నిట్టూర్పులు విడవకపోవచ్చు. కాని అడుగడుక్కీ రచయిత పడే ఆవేదన, అతనిలోని సంఘర్షణ, మానసిక పరిణామం, అతడ్ని గందరగోళపరుస్తోన్న సమస్యలు కనిపించి తీరుతాయి. మొదటినవల స్కూలు విద్యార్థుల దగ్గరినుంచీ కూడా ఆకర్షించి తేలిగ్గా హృదయంలో నాటుకుంది. అది ప్రతివాడికీ సన్నిహితంగా వున్న సమస్య. నిత్యజీవిత సంఘటనలకు స్పష్టమైనా చిత్రణ! అది మామూలు పాఠకుడి గుండెల్లో సూటిగా గ్రుచ్చుకోకపోవచ్చు. అతీతమైన మనస్తత్వాలకు సంబంధించినది. గండిపడ్డ జీవితాల విషాదచరిత్ర, కదిలినవారు విపరీతంగా కదిలిపోయారు. అట్లా మధుబాబు అజ్ఞాతంగా వున్న కొందరివ్యక్తులకు మరీ సన్నిహితుడైపోయాడు. అతనికి చిత్ర విచిత్రమైన ఉత్తరాలు రాసాగినై. వాటిలో కొన్ని తల్లి చూసింది. ఇలా ఆడపిల్లల దగ్గరనుంచి కొడుక్కి ఉత్తరాలు రావటం ఆవిడను కంగారు పెట్టింది. కాని మధుబాబు శీలాన్నిగురించి, నడవడికను గురించి ఆవిడకు దృఢమైన నమ్మకం, గురీ వున్నాయి. అందుకని బయటకు ఈ సంగతి ఏమీ ప్రస్తావించలేదు.
ఈ మధ్య మధుబాబు స్త్రీగురించి యెక్కువగా ఆలోచించటం మొదలు పెట్టాడు. అతనికి వచ్చే ఉత్తరాలు కొన్ని అందుకు ముఖ్యకారణాలై నాయి. కొందరు తమ విషాదగాధల్ని, విచిత్ర చరిత్రల్నీ అతనికి వాటిల్లో విపులంగా చెప్పుకున్నారు. తర్వాత తమ బంధువుల్లోని కొందరు ఆడవాళ్ళ దారుణస్థితి గతులు అతనికి తెలుసు. రచనావ్యాసంగం ఆరంభమైనప్పటినుంచీ అతను ప్రతిమనిషి స్వభావాన్ని పరిశీలనదృష్టితో చూడటం ప్రారంభించాడు. స్త్రీలకూ జరిగే అన్యాయాలని గురించీ, పురుషుల వికృత చర్యలగురించీ అతను ప్రతిమనిషి స్వభావాన్ని పరిశీలనదృష్టితో చూడటం ప్రారంభించాడు. స్త్రీలకు జరిగే అన్యాయాలని గురించీ, పురుషుల వికృత చర్యలగురించీ అతను ఇదివరకే రాశాడు కాని ఇప్పుడు ప్రత్యేకంగా ఆ పరిశీలనలోనూ తృష్ణ ఎక్కువైంది. దాంతో సాంఘిక ధర్మాలనిగురించి ఆలోచించటం మొదలు పెట్టాడు. వివాహ బంధం, స్తీమీద పురుషుడి అధికారం, ప్రేమ, కూతురిగా, తల్లిగా, భార్యగా, స్త్రీ బాధ్యత, కుటుంబాల్లో అరాజకం, అశాంతి, భార్యాభర్తల మధ్య విముఖత్వం, హింసాకాండ, లేచిపోవటం, వెళ్ళగొట్టటం, ఆత్మహత్యలు అతడ్ని కలవర పరిచినై. ప్రపంచం ఇంత అస్తవ్యస్తంగా, అపశృతులతో, ఆర్భాటాలతో ఎట్లా ఇంతవరకూ నడిచిందో అతనికి అర్థంకాలేదు. చేయని తప్పుకు భార్యని చావగొట్టినవాడ్ని చూశాడు. లేని నిజాన్ని సృష్టించటం కోసం కూతుర్ని చిత్రహింస చేసినవాడ్ని చూశాడు. భర్త తనని చావగొట్టి చెవులుమూసినా అతన్ని మనస్పూర్తిగా ఆరాధించటం చూసి విస్తుపోయాడు. రోజూ చిత్రహింస పెడుతున్నా పెనిమిటికి ప్రాణంమీదకు వస్తే "నా మంగళ సూత్రం కాపాడమని" భగవంతుడ్ని ప్రార్థించే అతివనిచూసి కలవరపడ్డాడు. ఎట్లా యీ వ్యవస్థ చక్కబడటం? ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. ఈ భేదాలు కలకాలం నశించవా? సమానత్వంవల్ల నష్టముందా? సంభవమూ అది?
ఈ మానసిక గందరగోళంలో అతను మళ్ళీ శరత్, చలం చదివాడు. ఒకే విషయాన్ని గురించి వివిధకోణాలలో ఎందుకు చెప్పారు? శరత్ పాత్రలను కరుణామాయంగా చిత్రంచాడు. చలం సంఘంపట్ల తనకున్న కసినికూడా జోడించి విడిచిపెట్టాడు. శరత్ తన హృదయాంతర్గత వేదనని పాత్రల అసమర్థతద్వారా వెలిబుచ్చాడు. చలం పాత్రలను తనే డామినేట్ చేసి విశ్వవిహారం చేశాడు. జరిగేది రాశాడు శరత్ తన హృదయాంతర్గత వేదనని పాత్రల అసమర్థతద్వారా వెలిబుచ్చాడు. చలం పాత్రలను తనే డామినేట్ చేసి విశ్వావిహారం చేశాడు. జరిగేది రాశాడు శరత్. ఇలా జరిగితే బాగుంటుందనుకున్నది రాశాడు చలం. శరత్ తాను తీసుకున్న సమస్యకు అనుగుణంగా సరిపోయే వాతావరణం, బలమైన ఇతివృత్తం తీసుకున్నాడు. చలం ఇతివృత్తంకోసం, వాతావరణంకోసం పేచీపడక సూటిగా చెప్పటమే పనిగా పెట్టుకోవటంవల్ల అవి వ్యాసాలుగా, విమర్శలుగా కనిపించాయి. శరత్ తానే గాకుండా అతని పాత్రలుకూడా నిలిచేటట్లుగా చేశాడు. చలం తానుమాత్రమే నిలిచే రచనలు చేశాడు. శరత్ సాహిత్యం పాఠకుల్ని కన్విన్స్ చేసి తనవైపు లాక్కుంటుంది. చలం సాహిత్యం పాఠకుల్ని భయపెడుతుంది, గంద్రగోళ పరుస్తుంది. ఆ గంద్రగోళం యెటువైపు యీడ్చుకుపోతోందో ఏమీ తేల్చి చెప్పలేం.
ఎంత ఉత్తమ ప్రయోజనాన్ని ఆశించి రచనచేసినా ప్రజల్ని భయపెట్టే సాహిత్యం సృష్టించటం మంచిదికాదనే నిర్ణయానికి వచ్చాడు మధుబాబు. కాగాపోగా ఇన్ని అరుపులు అరిచి, అతివాదాలు రేపి, యీ మొగాళ్ళందర్నీ కత్తితో పొడిచిపారేయాలన్న ఉద్రేకం ప్రదర్శించి వీళ్లంతా శరత్ శేషప్రశ్న చరిత్రహీనులకు తూగే నవల రాశారా అని ప్రశ్న వేసుకునేసరికి "లేదు" అని జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది మధుబాబుకు. అక్షయబాబువంటి పరమఛాందసుడ్ని కూడా తన వాదన ప్రభావంతో జయించి సానుభూతి సంపాదిస్తుంది కమల. అలాంటి పాత్రలు ఏవి ఇతరుల సాహిత్యసృష్టిలో? అదీగాక సెక్సువాదం అసలు విషయాన్ని మరుగుపరచి అనుకోని పరిణామాలకు దారితీసిందని విశ్వసించాడు మధుబాబు. జీవితంగా సెక్సుకు ప్రముఖ స్థానం వుంటే వుండవచ్చుగాని..... సెక్సునే జీవితంగా చిత్రంచటం, అది యితర సమస్యలను మ్రింగివేసినట్టు చిత్రించటం అతనికి నచ్చలేదు. వాస్తవికతకు అపార్థాలేమో యివన్నీ! అదీగాక యీ కొత్త సాహిత్యంలోని మనుషులు తాము ఏది అసహ్యించుకుని కొత్తజీవితాన్ని వెదుక్కుంటూపోతున్నారో, తిరిగి అక్కడ అలాంటి అసహ్యాన్నే ఆదరించటం చికాకని పించింది. భర్త నశ్యంపీలిస్తే భరించలేని వ్యక్తి, అందుకుగాను అతడ్ని చీదరించుకున్న వ్యక్తి, ప్రియుడు తాగివచ్చినా, తనకు సమ్మతంకాని మాంసం భుజించినా, బండబూతులు తిట్టినా, తన్నిన్నా అదో ప్రేమక్రింద అభిమాని స్తోంది. ఏమిటి ఈ నిజాయితీ? ప్రేమించినవాడికోసం భర్తనూ, సంసారాన్నీ, సమస్తాన్ని త్యజించి వెళ్ళటం త్యాగమే అయితే ఈ భూమ్మీద త్యాగం అని మనం దేనినీ సమర్థించలేం. నిజమైన త్యాగానికి నిర్వచనం ఏమిటి?