ఆ చిన్న కాగితం ముక్కని ఎవరూ చూడకుండా వెయ్యి జాగ్రత్తలు తీసుకుని వుండచుట్టి అజయ్ చందర్ వడిలోకి విసిరి మెరుపులా అక్కడనుంచి వెళ్ళిపోయింది.
అజయ్ ఏమన్నా తక్కువ తిన్నాడా! ఎవరూ చూడకుండా కోమలాదేవి గదిముందు నుంచి వెళుతూ కాళ్ళ దగ్గరపడేటట్లు వారపత్రిక విసిరి వెళ్ళాడు.
కోమలకి అర్ధం అయింది. గబుక్కున పత్రిక అందుకుని దాని మధ్యలో ఉన్న బుల్లి లెటర్ తీసుకుంది.
"కోమల్! ప్రియ కోమల్! పెళ్ళికి ముందు ప్రేమలో పడి కళ్ళు మూసుకుపోయి, పెళ్ళి అయినా మరుక్షణం ఏ కాశ్మీరో వెళ్ళి ఆ...అనుకున్నాం. పెళ్ళయిం తర్వాత పెద్దల ముచ్చట తీర్చాలన్న ఆచారం వుందన్న సంగతి నాకేం తెలుసు? డోంట్ వర్రీ. రాత్రికి సిగ్గుల చిన్నారి బుగ్గలు మల్లెమొగ్గలు అయేటట్లు చూస్తాకదా? నేను మగాడ్ని నాకు సిగ్గు వెయ్యటం లేదు.
నీ
అజయ్
ఆ లెటర్ చదివి "ఛీ...ఉత్త అల్లరి గడుగ్గాయి...కాసేపు ఏడిపించి ఏడిపించి ఆ పై....!" ఆపై ఆలోచించటానికి కోమలకి సిగ్గేసింది. ఇంతలో బిలబిల లాడుతూ స్నేహితురాళ్ళు గదిలో దూరారు. వాళ్ళందరినీ భోజనాలకి పిలిచింది శారదాంబ. చేతిలో లెటర్ ని గబుక్కున దిండుకిందకి తోసేసింది.
కోమల స్నేహితురాళ్ళల్లో పెళ్ళయి కాపురాలు చేస్తున్న వాళ్ళు ద్వందర్ధంగా మొరటు జోకువేసి ఏడిపిస్తుంటే కోమలతో పాటు మిగతా వాళ్ళు సిగ్గుపడుతూ..."ఆపండి బాబు మీ గోల ఇప్పుడు. మీ వారికలలుఎవరడిగారు! మేమంటూ ఒంటరిగా వున్నాం" అంటే "ఎవరుండమన్నారే, కోమల వెదుక్కున్నట్లు ఓ మన్మధుడ్ని వెతుక్కోండి" అన్నారు.
కోమలకి పెదవి కదిపే అవసరం లేకపోయింది. వాళ్ళే జోకుచేస్తున్నారు ఎవరికి వారే తమ మీదనే జోకులేసుకుంటున్నారు.
ఆ పగలంతా పది నిమిషాలలో ముగిసి రాత్రయినట్లయింది.
రాత్రి పదకొండు పది నిముషాలయింది.
అజయ్ అదేపనిగా వారపత్రికతిరగేస్తూ అసహనంగా కూర్చున్నాడు. చదివిన కథ పేరే మళ్ళీ చదివాడు. చూసిన బొమ్మలే మళ్ళీ చూశాడు. పెదవులు కదులుతున్నాయ్. కళ్ళు చూస్తున్నాయ్. యాంత్రికంగా వార పత్రిక పేజీలని వేళ్ళు తిప్పేస్తున్నాయ్. మనసు మాత్రం కోమల కోసం మధనపడుతున్నది.
మరో అయిదు నిముషాల తర్వాత కోమల గదిలో అడుగుపెట్టింది.
గది తలుపులు నెమ్మదిగా మూసుకు పొయ్యాయి.
ఆనందం పట్టలేక ఈల వెయ్యబోయి టకీమని ఆగిపొయ్యాడు అజయ్. "ఇదేమన్నా అచ్చమయిన తెలుగు సినిమానా ఏమన్నానా! ఈల వేసి గోలచేసి గెంతులేస్తూ పాటపాడటానికి గట్టిగా మాట్లాడితేనే బయటికెక్కడ వినిపిస్తుందో అని ఓ పక్క మనసు బితుకు బితుకు మంటుంటే..." అనుకుంటూ లేచి నెమ్మదిగా అడుగులేస్తూ కోమల దగ్గర కొచ్చాడు.
"కోమల్!" అంటూ భుజం మీద చేయివేశాడు.
అజయ్ చేతిని విసిరి కొట్టింది కోమల.
"కోమల్! ఇదంతా కోపమేనా? సారీ కోమల్...! నీలాగే నాకూ ఈ నాలుగు గోడల మధ్య నచ్చదు. ఎలాగో అలా సరిపెట్టుకుందాంలేవోయ్!"
అజయ్ చేతులు చాచాడు. ఆ చేతుల్లో బందీకాలేదు అతని ఎదపై ఒరిగి పోనూలేదు. ఓ అడుగు వెనక్కు వేసి దూరంగా జరిగింది వంచిన తల మాత్రం ఎత్తలేదు కోమల్.
"కోమల్...యిదంతాసిగ్గా...ఇన్నాళ్ళూ ఏమయిందట అమ్మాయిగారికి ఈ సిగ్గు! నా వడిలో తల పెట్టుకుని పడుకున్నప్పుడు లేదేం ఈ సిగ్గు! ముద్దుపెట్టుకుంటే..."తప్పు నాయనా నేను పరాయి ఆడదాన్ని ముద్దుపెట్టుకో కూడదు" మాటలతో వారిస్తూ బుగ్గ అందించేదానివే, కాలం మన చేతుల్లో వుంది కాలయాపన కూడదు దేవీ!"