చిన్న ట్రంకు సర్దుకుని ముందే కూలి మాట్లాడుకుని కూలివాడి నెత్తిమీద పెట్టి, తల్లితో వెడుతున్నానని చెప్పడానికి వొస్తే మళ్ళీ రవణ హృదయం చిన్నిపిట్టలాగు కొట్టుకుంది. తను దాచుకున్న నాలుగు రూపాయలూ అత్తచేతుల్లో పెట్టి, మెల్లిగా- "ఇయ్యండి" అంది.
వెనక దొడ్డిగుమ్మంలో నుంచుని రవణ చూస్తోంది గోపాల్రావు చేతుల్లో తల్లి రూపాయలు పెట్టి "యియ్యమంది" అంది.
అతనికి నోట మాట రాలేదు. ఆశ్చర్యం, దుఃఖం అన్నీ వొచ్చాయి. సిగ్గు మరీ హెచ్చింది. తీసుకోవాలని లేదు. కాని యియ్యడమెట్లాగో తెలీక జేబులో వేసుకుని, తల పైకెత్తి రవణవేపు చూసి వెళ్ళిపోయినాడు.
4
డిశంబరు శలవలకి రావమ్మ తమ్ముడు అక్కని చూడ్డానికి వొచ్చాడు. అతను కవి. అనేక పత్రికల్లో అచ్చుపడ్డ అతని పద్యాలను బావకీ, అక్కకీ వినిపిస్తో వుంటాడు. రసవంతమైన చోట్ల తలెత్తి రవణవంక చూస్తాడు. ఆమె కవేమీ అర్ధంకాకపోయినా, కవిచేసే వ్యాఖ్యానాల వల్లా, అతని కంఠస్వరపు స్ఫురణలవల్లా అర్ధమైనట్టూ, ఆనందదాయకంగానూ తోచేవి. ఒకరోజు మధ్యాహ్నం తాసిల్దారుగారి వాళ్ళువొస్తే రావమ్మ వెళ్ళింది. అదివరకే కుర్చీలో వెంకన్న పంతులు నిద్రపోయినాడు. కవి రవణకి చదువుతోనే వున్నాడు. రవణకి నిద్రవస్తోంది. చెప్పడానికి సిగ్గు.
"నిద్ర పోతున్నావా."
రవణ కళ్ళు తెరవలేదు. ఆమె చెయ్యిపట్టుకు వూపాడి. ఆమె వళ్ళు ఝల్లుమన్నది.
"వింటున్నా, చదవండి"
"ఏం వింటున్నావు? నిద్రమసకల అలజడేనా?"
ఇంకా అతని చెయ్యి ఆమె మీదనే వుంది. చెయ్యి దూరంగా లాక్కుని కూచుని - "చదవండి" అంది.
మర్నాటినుంచి రవణకి అతన్ని చూడడమంటేనే సిగ్గుగా వుండేది. ఆ వొక్క నిమిషపు స్పర్శతో కొత్తలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. రవణకి ఆమెకి తెలీకనే ఆమె శరీరం అట్లాంటి అనుభవం కోసం వెతుకుతోంది. ఆ అనుభవానికీ తన మోహపు జీవనానికీ సంబంధమున్నదని ఆమెకు తెలీదు. కాని సుబ్బారావునీ అతని ముఖాన్నీ, అతని మాటల్నీ యెంతో సరదాగా చూస్తోంది. ఆమె మనసులో యే మాత్రమూ వికార మన్నది లేకుండా చిన్నపిల్లలు బాజాలని చూసినట్లు కాని సుబ్బారావు ఆ చూపుల్ని తన యందలి అనురాగ చిహ్నాలుగా గ్రహించి, ఆమె వేపు గాఢమైన అనురక్తిని కనపరచాడు. రవణ కవి అర్ధంకాలేదు. వాటిలోని అసాయం ఆమె మనస్సుకి తెలీలేదు. సుబ్బారావుకి పెళ్ళి అయింది. పురుషుల్లోనూ, ముఖ్యంగా స్త్రీలలో నూతన పద్యాల రసానికి సహృదయుల్ని వెతుకుతో వుంటాడు. తన కవి హృదయంతోనూ, తన భావాధిక్యంతోనూ రవణ ఐక్యమై తనను ప్రేమించి, తన అసంతృప్తిని పరిహారము చెయ్య నిశ్చయించుకొన్న దనుకున్నాడు. ఈ కవి కుమారుడికి అంతరాత్మ తక్కువ. సంఘ బంధనాలు అంటవు. కాని యితని స్వేచ్ఛావిహారం వల్ల కలిగే బాధ్యతలను మాత్రం సహించడు. పర స్త్రీ హృదయాన్ని జయించి, శరీరాన్ని అనుభవించి, సంతానాన్ని కటాక్షించేవరకే యితని బాధ్యత.