స్వేచ్ఛగా రామ్మూర్తి దగ్గర పెరిగిన ఒక్క రవణకి మాత్రం ఈ గోపాల్రావు అవస్థ దుర్భరమయింది. యెట్లాగో అతనికి సహాయం చెయ్యాలనిపించేది. నారాయణనీ, నరుసునీ చివాట్లేసింది. వాళ్ళతో మాట్లాడటం మానేసింది. కాని వాళ్ళు ఆమెని కూడా అల్లరి చేశారు. ఒక రోజు సాయంత్రం నారాయణ గోపాల్రావుని బజారుపోయి తనకి తెల్ల కాయితాలు తీసుకురమ్మన్నాడు. షకారు వెళ్ళి వచ్చేటప్పుడు తెస్తానన్నాడు. కాని మరిచిపోయినాడు గోపాలరావు.
"మరిచిపోయినావూ? రేపెట్లా నాకు? మా మాష్టరు కొడితే నువ్వడ్డమొస్తావా? కావాలని నన్ను కొట్టించాలనే తీసుకురాలేదు. మరిచిపోయినా నంటావా దొంగగాడిదా!
రవణ చీకట్లో నుంచుని, చూస్తోంది. గోపాలరావు మొహం కూడా జంకినట్లు కనపడ్డది. ఆమె యింక సహించలేకపోయింది. అందరూ భోజనాలు చేసేప్పుడా రాత్రి -"
"నారాయణ యామన్నా అంటే రెండు చెంపలూ వాయించండి. వూరుకోడం నీచం. వూరుకుంటే యింకా అంటారు., యామైతే అదే అవుతుంది. వూరుకోకండి" అని రాసి అతని ఆ ఫారం జేబులో పెట్టింది. అది చూసుకున్నాడో లేదోగాని, గోపాలరావు పిల్లల్ని యేమీ చెయ్యలేదు.
గోపాలరావు మళ్ళీ పట్నం వెళ్ళకముందు అప్పమ్మగారు కార్యం సంగతి యెత్తింది.
ఎందుకెత్తిందో ఆమెకే తెలీదు. ఏదో సాధారణంగా పిల్ల పెద్దవగానే అట్లా అడగటం తల్లి విధి అనుకుని వుంటుంది. కాని వెంకన్న పంతులిదివరకే సమాధానం యోచించి పెట్టుకున్నాడు. యిప్పుడు కార్యం చేస్తే వీళ్ళిద్దర్నీ పట్నంలో కాపరం పెట్టాలేమో కాపరం పెట్టకపోయినా యిప్పుడు రెండు మూడు వందలు తగలేసి యెందుకు తను కార్యం చెయ్యాలి? ఆ రవణని అప్పుడే వీడికి స్నేహం చేసి యెందుకు వాణ్ణి సుఖపెట్టాలి? వెంకన్న పంతులు మనసుకి ఆ నిమిషానికి ఆ కార్య మంతా ఏదో అసహ్యంగా కనపడ్డది. ఈ గోపాలుగాడే తన తల్లికి పురెక్కించి మాట్లాడించి వుంటాడు. వాడికి సిగ్గులేదు, అంత తొందరికి. దమ్మిడీ లేని వెధవ, వాడి పెళ్ళాన్నీ పిల్లల్నీ యెవడ పోషించను? వీడి మీద శ్రద్ధ యెక్కువై రవణ తనని సరిగ్గా చూస్తుందా? తన మీద వున్న గౌరవం ముందు వుంటుందా? రవణ తన కూతురైనట్లూ, యీ గోపాల్రావు ఆమెకి యేమాత్రమూ తగని నీచుడైనట్లూ తోచింది పంతులికి. పైకి మాత్రం, యింత చిన్నతనంలో కార్యం కూడదని నిశ్చయించాడు. అదివరకు మూడునెలలకిందే యెంత చిన్నతనంలో కార్యం చేస్తే నైతికంగా అంత మంచిదని క్లబ్బులో గంట వాయించాడీ పంతులే. అదీగాక, కార్యమైతే యింటి సంగతే ఆలోచిస్తూ, సరిగా చదవడనేశాడు తీరిపోయింది.
ఈ గోలంతా వొదిలి చెన్నపట్నం యెప్పుడు పోదామా అనిపించినా, వెళ్ళే చివరిరోజు వొచ్చేప్పటికి గోపాలరావుకి చాలా కష్టమనిపించింది, రవణని వొదిలి వెళ్ళడం. తనొక్కమాట రవణతో మాట్లాడక పోయినా, నిలకడగా రవణవొంక చూడ్డానికి కూడా యీసారి అవకాశం దొరక్కపోయినా, ఏదో రవణ హృదయం తన్నావరించినట్లే వుండేది. ఆమె పమిటచెంగు చివరో, కాలుమడమో, కంఠస్వరమో, అతన్ని ఝల్లుమనిపించేవి. తనకోసం ఒకరు సిగ్గుపడుతున్నారంటే, తనని ఘనంగా చూసుకుంటున్నారంటే యెంతో ఆహ్లాదం కలిగింది అతనికి. ఈ వూళ్ళో యీ కుటుంబంలో అతనింత నీచంగావున్నా, తన కాలేజీలో తనని అందరూ గౌరవిస్తారని తను చాలా తెలివిగా పనిచేస్తాననీ, రవణకి తెలియచెయ్యాలని వుండేది. ఒకసారి రవణకి వినపడేట్టు నరుసుతో తన సంగతీ, తన కాలేజీ సంగతీ చెప్పాడు. కాని యింతలో నారాయణ వొచ్చి నవ్వి, అన్నీ అబద్ధాలు పొమ్మన్నాడు.