Previous Page Next Page 
వివాహం పేజి 17

   
    ఆ స్త్రీ పడే బాధలూ, ఆ సంతాన పురోభివృద్ధీ, పరమేశ్వరుడి బాధ్యతృ కావలిస్తే ఆమెకి తను కల్పించిన అశ్రుధారల మీద రెండుగీతాలు వ్రాస్తాడు. అవి చదువుకొని ఉపశమన పడవొచ్చు ఆ అనామక స్త్రీ. యితని అంతరాత్మ అంతటితో సంతృప్తి పడుతుంది. యీనీతి నిబంధనలను యితని మనసులోనూ, గదులలో రహస్యంగానూ, స్నేహితులతో వేళాకోళంగానూ, మాట్లాడుతాడుగాని యెదిర్చి లోకం అడిగితే, యే కించిత్తయినా బాధగాని, తటస్తించేట్టుంటే, "నిజమంటే ఏమిటి?" అని అడుగుతాడు. ఈ శెలవులు అయిపోతే తాను వెళ్ళిపోతాడు. ఒక్క రోజు ఆగడు. రవణ కన్నీళ్ళుగానీ, ప్రేమగానీ, ఒక్క గంట అతన్నిఆపవు. తనను నమ్మి వెంట వస్తానంటే, చెప్పకుండా పారిపోతాడు. కాని ఆ పది రోజులూ ఆమె ననుభవించడానికేమీ అభ్యంతరం లేదు. యింకా యెక్కువ మాట్లాడారంటే, కృష్ణలీలకుందా, ఆధ్యాత్మిక ప్రేమక్రిందా మార్చి పద్యాలు రాసేస్తాడు.

    సుబ్బారావు చూపులు రవణని చాలా కలవర పెట్టాయి.

    ఒకరోజు బావి గట్టున రవణ నొక్కదాన్ని పట్టాడు.

    "నిన్నరాత్రి వినడానికి రాలేదేం?"

    "అత్త ముట్టయింది. పని చేస్తున్నాను"

    "పనా? లేన నా పద్యాలు బావుండవా?"

    "బావుంటాయి. పనివల్లే రాలేదు"

    "బావుంటే, నీ కోసం అవన్నీ రాసి, చదువుతో వుంటే...."

    "నాకోసం?"

    "నీ కోసమే. నిన్ను చూడకపోతేనేం, యిన్నాళ్ళూ నాకు తెలీకుండా, నీ రూపమే, నీ సౌందర్యమే నన్ను ప్రోత్సహించాయి."

    "నాకు తెలీటం లేదు."

    "మరి. నాకేం బహుమానం?"

    "బహుమానం యేమిటి?"

    "మరి కవిని సత్కరించవా?"

    "నేనా?"

    "నువ్వే"

    "యెట్లా?"

    "నీ చూపు, ప్రేమగల వొక్కమాట చాలదూ?"

    "సరేలెండి నాకేం తెలీదు" అని వొచ్చేసింది.

    మర్నాడు అప్పమ్మగారు "సుబ్బారావు వంక అట్లా చూస్తావేమిటి? మంచిదానివే! యిట్లాంటి అమర్యాద పనులు
చేశావంటే వాడికి రాయిస్తాను." అంది.

 Previous Page Next Page