Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 16

 

చెప్పాను. పిల్లలు చేసిన తప్పులకు పెద్దలని శిక్షించడం నాకు నచ్చని పని. అందుకే ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగియాలని, మీకు ఎటువంటి మానసిక ఇబ్బందులు కలగకూడదని నిర్ణయించుకున్నాము అని చెప్పాను.
ముకుందరావు ఫామిలీకి కొండంత ఊరట కలిగింది మా మాటలతో.   
అందరం లేచాం మంజరిని రిసీవ్ చేసుకునేందుకు.
****
ముకుందరావు, వాళ్ళ ఫామిలీ అందరూ ముందు నడుస్తున్నారు. 
నేను, మధు వాళ్ళ వెనుక నడుస్తున్నాం.  
అంతర్జాతీయ అరైవల్స్ గేట్ దగ్గర పడేప్పుడు మధు నా వైపు తిరిగి నేను ఇందాక మనం వెళ్లిన రెస్టారెంట్ లో కూర్చొనుంటానురా. 
నువ్వు ఇక్కడ ఎలాగోలా మేనేజ్ చేసి అక్కడికి వచ్చేయి అన్నాడు. 
సరేరా నువ్వెళ్లు. నేను చూసుకుంటానులే అని చెప్పి పంపాను.  
అనుమానం వచ్చి అడిగాను వేరే ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా అని. 
ఇంకేం లేదురా. నేను తనని చూడదలచుకోలేదు అన్నాడు.  
మంజరి పేరు ఉచ్చరించడం కూడా మా వాడికి ఇష్టం లేదు. 
సరేరా. అక్కడే ఉండు. నేను మంజరిని తన తల్లితండ్రులకు అప్పగించి నీ దగ్గరకి వస్తాను అని చెప్పాను.
అమెరికా నుంచి  ఫ్లైట్ వచ్చింది. అందరూ బయటకు వస్తున్నారు.
ఒక గంట తరువాత మెల్లగా లగ్గేజ్ తో బయటకు వచ్చింది మంజరి. 
అంటే ఆ గంటలో ప్రియునితో మాట్లాడి బయటకు వచ్చింది అని అర్ధమైంది నాకు. 
తల్లితండ్రులను చూసి కౌగలించుకుని బిగ్గరగా ఏడ్చేసింది మంజరి. 
ఆ ఏడుపు ఎందుకో నాకు అర్ధం కాలేదు. 
తన బండారం మొత్తం బయటపడిందనా, లేక తన జీవితం ఇలా ఎందుకయ్యిందనా?  
ఏదైతే మనకెందుకులే. ఇక మనకు సంబంధం లేని విషయం ఆమెది అనుకుని కొద్ది దూరంలో నిలబడ్డాను.   
ముకుందరావు నా వైపు తిరిగి మధు గురించి అడిగాడు. 
తనకు మీ అమ్మాయిని చూడటం ఇష్టం లేదండి. అందుకనే క్రింద రెస్టారెంట్ లో కూర్చోనున్నాడు అని చెప్పాను ఇక దాచడమెందుకని. 
ఆయన మొహం చిన్నబోయింది. 
అప్పటికే మంజరికి విషయం పూర్తిగా అర్ధమైంది. 
ఆమె మొహంలో చటుక్కున ఏడుపు మాయమైంది.  
నివ్వెరపోయినట్లు చూస్తోంది. 
నేను ఎయిర్పోర్ట్ కు వచ్చిన ముఖ్య ఉద్దేశం మంజరిని తన తల్లితండ్రులకు అప్పగించడం. ఆ పని పూర్తయ్యింది.  
ఎందుకంటే ముకుందరావు బాగా కోపిష్టి మనిషి. మంజరి సంభాషణలో తన తండ్రి అప్పుడప్పుడు కోపమొస్తే, చెప్పిన మాట వినకపోతే తిట్టడం, కొట్టడం చేస్తాడు అని ఉంది. 
అందుకనే ముకుందరావు తో పాటు వేరే వాళ్ళను కూడా తీసుకురమ్మని చెప్పాను.
లక్కీగా పెద్ద కూతురు అల్లుడు వచ్చారు. 
వాళ్ళను చూసి నాకు కొంత ఉపశమనం కలిగింది. 
కోపంతో ముకుందరావు అక్కడే మంజరిని కొట్టడం లాంటివి చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.  
అందుకే మంజరి ని కలవక ముందే ముకుందరావు వాళ్లకు విషయం పూర్తిగా వివరించడం కూడా జరిగింది. 
దాంతో ముకుందరావు ప్రాక్టికల్ థింకింగ్ లో పడ్డాడు.
ఇంకో కోణంలో ఆలోచిస్తే మంజరి ప్రియుడు అక్కడికొచ్చి ఆమెను తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. మంజరి కదలికలన్నీ అతనికి తెలుస్తుంటాయి. అందువల్ల తన పోకిరి గ్యాంగ్ తో వచ్చి ముకుందరావు వాళ్ళను బెదిరించి మంజరికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. 
అందుకే నేను నా క్లోజ్ పోలీస్ ఫ్రెండ్స్ ను కూడా అలెర్ట్ చేసి ఉంచాను ఈ విషయంలో. 
ఇలాంటి అవాంతరాలు ముంచుకొస్తే అరగంట వ్యవధిలో వాళ్ళు ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేసి ఉంచాను. 
పెళ్ళికి ముందైతే మంజరి ఏమి చేసినా మధు ఫామిలీ కి సంబంధం లేదు.    కానీ ఇప్పుడామె సంజయ్ భార్య, మధు కోడలు. 
విడాకులు మంజూరయ్యేంతవరకు ఆ టాగ్ అలానే ఉంటుంది. 
ఒక సారి విడాకులు మంజూరైతే ఇక తనకు మధు కుటుంబానికి సంబంధం ఉండదు. 
అప్పటివరకు మంజరి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 
అలా ఆలోచించే మంజరి తల్లితండ్రులను ముందే ప్రిపేర్ చేసి ఉంచాను. 
అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. 
మంజరి ని తన తల్లితండ్రులకు అప్పగించిన పని  విజయవంతంగా పూర్తయ్యింది. 
ముకుందరావు దగ్గరికెళ్లి చెప్పాను. 
నా క్లోజ్ ఫ్రెండ్ లాయర్  భాస్కర్ విజయవాడలో తనని కలిసి మంజరి చేత డివోర్స్ పిటిషన్ వేయిస్తాడని, అతనికి సహకరించమని. 
అందుకు ఆయన సరే అన్నాడు.
డివోర్స్ పిటిషన్ వేసే ముందు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నాము. 
అందులో మాత్రం జరిగిన యదార్ధం రాసాను,  అంటే మంజరి ప్రేమ గురించి వగైరా వగైరా. 
దానికి మంజరి, తల్లితండ్రులు సంతకం చేశారు. 
ఆ డాక్యుమెంట్ ముకుందరావు, మధు మధ్యే ఉంటుంది కాబట్టి బయటికి తెలిసే విషయం కాదు. 
అందువల్ల మంజరికి భవిష్యత్తులో ఇబ్బందేమీ లేదు. 
ముకుందరావు అల్లుడు మధు వాళ్ళు మంజరికి పెళ్ళిలో పెట్టిన నగలు అన్నీ తెచ్చి ఇచ్చాడు. 
అవి కూడా నేనే తీసుకుని మధుకి అప్పగించాను. 
అంతా సరిపోయాయి అని చెప్పాడు మధు. 
డివోర్స్ పిటిషన్ లో మాత్రం మంజరికి ఇష్టం లేకున్నా తల్లితండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, పెళ్ళైనప్పటినుంచి తాను వేరుగానే ఉన్నానని, వివాహ జీవితం తనకు ఇష్టం లేనందున డివోర్స్ మంజూరుచెయ్యమని కోర్ట్ లో మంజరి చేత పిటిషన్ దాఖలు చేయించాను. 
కోర్ట్ లో కేసు జరుగుతున్నప్పుడు మంజరికి చాలా మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 
విజయవాడ లో ప్రముఖ సైకాలజిస్ట్ కు చూపించారు. బైపోలార్ గా నిర్దారణ అయ్యింది.
నా ఊహ ప్రకారం తన ప్లాన్ అంతా తెలిసిపోవడంతో, తన శృంగార లీలలు, సంజయ్ ఫ్యామిలీని అంతం చేయాలనుకోవడం వంటి విషయాలు సాక్ష్యాధారంగా తెలియడంతో మంజరి విపరీతమైన మానసిక వత్తిడి కి గురైందని భావించాను. 
అంతేగాక డివోర్స్ కు కూడా అప్లై చెయ్యడం జరిగి కోర్ట్ లో కేసు నడుస్తోంది. ఇవన్నీ తనపై తనకు ఏహ్య భావన కలిగించుంటాయి. 
ఒక్కసారిగా భవిష్యత్తు తలచుకుని భయపడి ఉంటుంది. అందులోనూ పేస్ బుక్ లో తను దాచి ఉంచిన ఫోటో లు, వీడియో లు చూస్తే ఇక బ్రతకడం వేస్ట్ అనిపిస్తుంది ఎవరికైనా. 
అంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ఫోటో లు, వీడియో లు. 
అందుకే నేను వాటిని కంప్యూటర్ నుంచి తీసేసి పెన్ డ్రైవ్ లో భద్రపరిచాను. డివోర్స్ మంజూరు ఐన తరువాత అది ముకుందరావు కు అప్పచెప్తే నా పని పూర్తవుతుంది. 
అవి పొరపాటున లోకం వెలుగు చూసాయంటే ఇక మంజరికి జీవితం ఉండదు.  
అవి ఎవరైనా చూస్తే ఆ అమ్మాయి జీవితం బజారున పడ్డట్లే.  
ఒక ఆడపిల్ల ను రక్షించే బాధ్యత నేను తీసుకున్నాను. 
కోర్ట్ కు వచ్చినప్పుడు కూడా మంజరి పిచ్చి చూపులు చూస్తూండేది. 
కోర్ట్  లో జెడ్జి ముందు హాజరైనప్పుడు ఆమెను చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. 
అందుకే ఈ కేసు విచారణ కు వచ్చినప్పుడు నేను పర్సనల్ గా విజయవాడ కి వెళ్లి కోర్ట్ కి అటెండ్ అయ్యేవాడిని.
నేను డివోర్స్ పిటిషన్ వేయించిన నెలరోజులకు 'బలవంతపు పెళ్లి చెల్లదు ! ' అని ప్రముఖ దినపత్రికలలో పెద్ద వార్త వచ్చింది. 
'వధువు అంగీకారం' హిందూ వివాహ చట్టంలో అంతర్భాగం అని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టీకరించింది. 
పెండ్లి కుమార్తె అంగీకారం లేకుండా, లేదా మోసపూరితంగా జరిగిన హిందూ వివాహాన్ని చట్టరీత్యా చెల్లదని చెప్పనవసరం లేదంది. 
ఇవన్నీ నా కేసుకు బలం చేకూర్చాయి. 
కోర్ట్ లో నా వాదనలకు సప్పోర్ట్ గా నిలిచాయి. మార్గం సుగమమైంది. 
కేసు ఆఖరి వాయిదా అప్పుడు వాదనలు ముగించి కోర్ట్ బయటకు వచ్చాను . మంజరి దగ్గరికొచ్చి మీతో మాట్లాడాలి అంకుల్ అంది. 
సరే అన్నాను. నీకు ఇబ్బంది లేకుంటే తల్లితండ్రులు కూడా ఉంటారు మనతోటి అన్నాను. 
సరే అంది. 
అందరం కోర్ట్ కాంటీన్లో కూర్చున్నాము. 
మంజరి ఆపుకోలేక ఏడ్చేసింది. 
తల్లి తండ్రి ఓదార్చారు. 
చాలా తప్పు చేసాను అంకుల్ నేను. ఎవ్వరినీ లెక్క చేయలేదు. అహంకారంగా ముందుకెళ్ళాను. నాకు తగిన శాస్తే జరిగింది. అందరినీ బాధ పెట్టాను అని ఏడుపు గొంతుతోనే అంది.
అవన్నీ గతం మంజరి. ఇక అటువైపు చూడకు. ముందుకు వెళ్ళలేవు. నీవు ఎంతో తెలివిగల దానివి. మంచి రాంక్ హోల్డర్ వి. ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది నీకు. నీ తల్లి తండ్రులకు కూడా చెప్పాను. నిన్ను ఏమీ అనవద్దని. నీవు చేసింది పెద్ద తప్పే. అలా అని బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు. జీవితం ఒక ప్రయాణం. కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయి. అవి పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి కూడా. ఒక్కోసారి జీవితాలు కూడా బలితీసుకుంటాయి.

 

 Previous Page Next Page