Previous Page
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 17

 

నీ  విషయంలో నువ్వు పెద్ద తప్పే చేసావు. అవన్నీ మర్చిపో. నీ తెలివి తేటలను నిరూపించుకో. ఈ కేసు నేను పెర్సనల్ గా తీసుకోవడానికి కారణం కేవలం నిన్ను రక్షించడానికె. నీకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చెయ్యాలనే. నేను అనుకున్నట్లు అంతా సవ్యంగానే జరిగింది. ఒక చక్కటి గమ్యం తో ముందుకెళ్లు. విజయం ఎప్పుడూ నీవెంటే ఉంటుంది. నీకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా నా ఫోన్ నెంబర్ మీ ఫాదర్ దగ్గర ఉంది. ఒక్క ఫోన్ చెయ్యి. నీ పూర్తి రక్షణ బాధ్యత నాది. మంచి మనసుతో ముందుకు వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది నీకు అని ధైర్యం చెప్పాను మంజరికి. 
మనసులో బాధ చెప్పిన తరువాత చాలా తేలికగా కనిపించింది మంజరి. 
అల్ ది బెస్ట్ అని చెప్పి లేచాను.
సంవత్సరంలోపే డివోర్స్ మంజూరయ్యింది.
డివోర్స్ జడ్జ్మెంట్ కాపీ రాగానే ముకుందరావు కు మంజరి క్రియేట్ చేసిన ఫేక్ ఇమెయిల్ , ఫేస్ బుక్ పాస్వర్డ్స్ అప్పచెప్పాను. 
ఆ పాస్వర్డ్స్ నా ముందే సీక్రెట్గా మార్చుకోమని చెప్పాను.  
నా దగ్గరున్న పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాను. 
అన్నీ డిస్ట్రాయ్ చేసేమని మరీ మరీ చెప్పాను. 
అవి ఉంటె మంజరి జీవితానికి భవిష్యత్తలో చాలా ప్రమాదమని చెప్పాను. 
ఈ విషయం గురించి మంజరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నాకు చెప్పమని చెప్పాను. 
ఇక మధు, సంజయ్ విషయానికొస్తే ఎవరూ కోర్ట్ కు రాకుండానే డివోర్స్ వ్యవహారం పూర్తయ్యింది.  
మా మధు కుటుంబమంతా ఇది ఒక కలలా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. తమ కుటుంబానికి పెద్ద ఆపద తప్పినందుకు గొప్ప రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. 
(సమాప్తం)
(ఇందులోని పాత్రలు, వాటి పేర్లు ఎవరిని ఉద్దేశించినవి కావు.
కేవలం కల్పితాలు మాత్రమే)


'మా' విడాకులు 
భువిలో పెళ్ళికి
దివిలో తాంబూలాలు
ఇది నానుడి.
మరి నేడో…
విచ్చలవిడితనం
రాజ్యమేలుతోంది.
పెళ్ళి పవిత్రతకి
కాలం చెల్లింది.
ఏడు అడుగులు
మూడు ముళ్ళు
నాతిచరామిలు
అన్నీ హుళక్కయ్యాయి.
నేడు జరిగిన పెళ్ళికి
మరునాడు విడాకులు.
రిజిష్టర్ మారేజికి
డబ్బులే విలువలయ్యాయి.
మామిడాకులు
ఎండిపోకముందే
విడాకుల సంతకాలకు
కళ్ళాలొచ్చాయి.
పవిత్రబంధాలు
అర్ధం లేనివయ్యాయి.
కుర్రకారు పరుగులో
పెద్దవాళ్ళ మాటలు
పెదవి దాటట్లేదు.
ప్రేమ ఒకరితో
డేటింగ్ ఒకరితో
పెళ్ళి ఒకరితో
ఎలా వెళ్తున్నాం మనం ?
పెళ్ళికి మనసు వద్దా ?
వివాహబంధానికి  విలువే లేదా ?
పెళ్లంటే నూరేళ్ళ పంటే కాదు 
పవిత్రమైన అనుబంధం కూడా 
ఇరు మనసులు ఒక్కటై 
జీవితాంతం కలసి ఉంటూ 
ఒకరికొకరు ఆప్యాయతలు పెనవేసుకుని 
తమ ప్రేమకు ప్రతిరూపాలుగా 
చక్కగా కుటుంబాన్ని విస్తరించుకుని 
ఆడుతూ పాడుతూ అన్యోన్యంగా 
అనవసరమైన భేషజాలకు తావులేకుండా 
ఒకరినొకరు అర్ధం చేసుకుని 
నూరేళ్ళ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ 
తల్లితండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ 
ముందుకు సాగాలి మనో నిశ్చయంతో 
ఇకనైనా వివాహం విలువలని గుర్తెరిగి 
భౌతికవాదానికి స్వస్తిపలికి
సంప్రదాయాలకు పెద్దపీట వేద్దాం
పెళ్ళికి పూర్వవైభవం తెద్దాం
కుటుంబ వ్యవస్థకు తలవంచుదాం
సంతోషంగా జీవనం సాగిద్దాం
'ఆరంభం ఒక్క అడుగుతోనే'
మార్పుకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుదాం
ఉత్తమ ఆశయాలను స్వాగతిద్దాం.


****


      శుభం
 

 

 Previous Page