ఏదేమైనా జీవితం గొప్పది. అందులో సమస్యలు వస్తుంటాయి.
సమస్యలు లేకుండా జీవితం ఉండదు.
ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించడంలోనే మన విజ్ఞత కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. అందుకే జాగ్రత్తగా డీల్ చెయ్యాలి.
కోర్ట్ నుంచి జూనియర్స్ రావడంతో మళ్ళీ బిజీ అయ్యాను.
రాత్రి బోజనాలప్పుడు శశిరేఖతో చెప్పాను.
రేపు మధు ఫామిలీ వస్తున్నట్లు, ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన సంగతి అన్నీ ఏకరువుపెట్టాను.
ఈ మెయిల్స్, ఫొటోస్ గొడవ చెప్పలేదు.
సమయం వచ్చినప్పుడు చెపుదాంలే అని ఆగాను.
రోజూ చాలా సేపు మేలుకునేవాడిని ఆరోజు త్వరగా పడుకున్నాను బాగా మానసిక అలసట ఉండటంతో.
****
ప్రొద్దున్నే మొబైల్ చూస్తే వాట్సాప్ లో సంజయ్ మెసేజ్ కనిపించింది.
హాయ్ అంకుల్, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఆగినప్పుడు మంజరి మురళీకృష్ణ కి ఫోన్ చేసినట్లుంది.
కొద్ధి నిముషాలకే ఇమెయిల్ పాస్వర్డ్ టాంపర్ చేసేందుకు ప్రయత్నించారు. నాకు అలెర్ట్ వచ్చింది. అయినా అది టాంపర్ కాకుండా ముందే కంట్రోల్స్ పెట్టి ఉంచాను, ఇబ్బందేమీ లేదు అని ఉంది అందులో.
ఓకే గుడ్ అని రిప్లై ఇచ్చాను. న్యాయపరంగా మనకు అంతా అనుకూలంగా ఉంది సంజయ్. మీ ఎవ్వరి అవసరం లేకుండా కోర్ట్ వ్యవహారమంతా నేను నడిపించి ఒక సంవత్సరంలో విడాకులు వచ్చేట్లు చేస్తాను. అంతా ఆలోచించి ఉంచాను. మంజరికి కూడా ఇబ్బంది లేని విధంగా అంతా జరుగుతుంది. కీప్ కూల్ అని సంజయ్ కి మెసేజ్ పెట్టాను.
త్వరగా రెడీ అయి మధు కోసం వెయిట్ చేస్తున్నాను.
మా ఇంటికి ఎయిర్పోర్ట్ దగ్గరే. అరగంటలో వెళ్ళచ్చు.
ఎనిమిదిగంటలైంది. మధు వాళ్ళు వచ్చారు.
ప్రవల్లిక, శ్రుతీ ని చూస్తే మా ఆవిడ శశికి ప్రాణం లేచొస్తుంది.
ఎదురెళ్లి వాళ్ళను లోపలి తీసుకొచ్చింది.
నేనిచ్చిన ధైర్యంతో మధు కొంచెం రిలాక్స్డ్ గ ఉన్నట్లు కనిపించాడు.
రా రా అంటూ వాడిని చూసి హ్యాపీగ ఫీల్ అయ్యాను.
ఎవ్వరూ మంజరి విషయం మాట్లాడలేదు.
అందరూ ఇగ్నోర్ చేశారు.
ఇక ఆమె గురించి చర్చించడం అనవసరం కూడా.
నేను మధు కి చెప్పిన విషయాలు ప్రవల్లిక కి తెలిసినట్లున్నాయి.
తాను కామ్ గానే ఉంది.
లోకాభిరామాయణం మాట్లాడుతూ అందరం టిఫిన్ చేసాం.
మధు వాళ్లొస్తే శశి వాళ్లకి నచ్చిన వంటలు చేస్తుంది.
వాళ్ళఇంటికి వెళితే మాకు నచ్చినవి చేస్తారు.
శృతి జోక్స్ వేసి నవ్విస్తోంది అందరిని.
ముందే చెప్పినట్లు శృతి మా రెండిళ్ళకి ఒక్కతే ఆడపడుచు.
సరే అని అందరికి చెప్పి నా కారులో ఎయిర్పోర్ట్ కి బయలుదేరాం.
మధుది బాంకు కారు. అందులో డ్రైవర్ అది ఉంటాడు.
ఎందుకులే దారిలో ముఖ్య విషయాలు చెప్పొచ్చు కదా అని నా కారులోనే బయలుదేరాం.
మధుకి అన్నీ విషయాలు చెప్పాను.
చాలా ఆశ్చర్యం, దానితో పాటు ఆవేశం కలిగాయి మధుకి.
వాడికి నువ్వు ఏమీ మాట్లాడొద్దని సూచనలిచ్చాను. అంతా నేను చూసుకుంటాను రా. నాదీ పూచి. నువ్వు ఏమీ కలుగచేసుకోకు . నీ అవసరముంటే నేను ముందే చెప్తాను అని చెప్పాను.
సరేరా. నువ్వెలా చెప్తే అలా అన్నాడు మధు.
కారు ఎయిర్పోర్ట్ లో పార్క్ చేసి ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గరికి వెళ్ళాము. కరెక్టుగా తొమ్మిదయ్యింది టైం.
అప్పటికే ముకుందరావు వాళ్ళు వచ్చున్నారు.
ముకుందరావు, భార్య, పెద్ద కూతురు, అల్లుడు కనిపించారు.
మమ్మల్ని చూసి ముకుందరావు విష్ చేసాడు.
మధుకి చాలా కోపంగా ఉంది. బదులివ్వలేదు.
నేనే హలొ అంటూ పలకరించి ఆ పక్కనే ఖాళీ గా ఉన్న రెస్టారెంట్ లో కూర్చుందామని చెప్పాను.
ఫ్లైట్ వచ్చేందుకు ఇంకా గంట టైముంది.
మంజరి వచ్చే లోపు కొన్ని ముఖ్య విషయాలు వాళ్లకి చెప్పేస్తే వాళ్ళు కూడా తయారుగా ఉంటారు అనుకున్నాను.
రెస్టారెంట్ అంత ఖాళీగా ఉంది.
ఒక మూల డిస్టర్బెన్స్ లేని చోట ఉన్న టేబుల్ దగ్గర అందరం కూర్చున్నాం.
ముకుందరావు పలకరిస్తున్నా మధు అస్సలు అతనివైపు చూడటం లేదు.
వాడికి చాలా కోపంగా ఉంది.
అది సహజమే.
మంజరి సంజయ్ ప్రాణాలతో చెలగాటమాడింది.
ఎంతో అపాయకరమైన పరిస్థితి నుంచి సంజయ్ బయట పడ్డాడు.
అది కేవలం వాడి అదృష్టం.
అదే తను ఇండియా లో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే చాలా డేంజర్ జరిగుండేది. అలా ప్లాన్ చేశారు మంజరి, మురళీకృష్ణ.
అంతా స్థబ్దతగా ఉంది.
నేనే కలుగచేసుకుని అన్నీ విషయాలు వివరంగా చెప్పాను.
అందరూ నిర్ఘాంతపోయారు. ఎవ్వరికీ నోట మాట లేదు.
ముకుందరావు మాట్లాడలేని స్థితి లో ఉన్నాడు. మంజరి తల్లి ఏడ్చేసింది. మంజరి అక్క తనని ఓదారుస్తోంది. వాళ్లకి అంతా అయోమయంగా ఉంది.
నా వెంట తెచ్చిన బ్యాగులోనుంచి ట్యాబు తీసి చుట్టూ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని మంజరి తల్లి, అక్కకి ఒక ఫోటో చూపించాను.
వాళ్లకి దిమ్మ తిరిగిపోయింది.
కొన్ని పేపర్స్ ముకుందరావుకు ఇచ్చాను చూడమని.
అవి మంజరి, మురళీకృష్ణ మధ్య జరిగిన ఇమెయిల్ సంభాషణ.
ఆయనకు కొన్ని చదవగానే పూర్తిగా అర్ధమైపోయింది.
ఇక చదవలేక నాకు పేపర్లు తిరిగి ఇచ్చేసాడు.
ఈలోపు ముకుందరావు అల్లుడు అందరికీ కాఫీలు తెచ్చాడు.
ముకుందరావు వాళ్ళతో పాయింట్ బ్లాంకుగా చెప్పాను.
ఈ సమస్యకి విడాకులొక్కటే పరిష్కారమని.
ఆయన విచారంతో అన్నాడు.
పుట్టి పెరిగిన ఊరు సార్. కోర్ట్ చుట్టూ తిరగడమంటే మా పరువు పోతుంది అన్నాడు.
అక్కడి లాయర్లు ను అడిగి వాళ్ళ ద్వారా కేసు వేస్తె ఇంకా ఇబ్బందిగా ఉంటుంది నాకు అని చెప్పాడు.
మీరు ఏ లాయర్ పెట్టుకోవద్దు సార్.
ఈ కేసు నేనే వాదిస్తాను. నాకు మీనుంచి ఒక్క పైసా ఫీజు వద్దు.
విజయవాడ కు వచ్చి కోర్ట్ కు అటెండ్ అయ్యే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను.
మా సంజయ్ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూడమని మరీ మరీ చెప్పాడు. మీరు, మీ అమ్మాయి కేవలం మూడు సార్లు కోర్ట్ కు అటెండ్ అయితే చాలు. మిగతా నేను చూసుకుంటాను.
కాకుంటే నావి కొన్ని షరతులు. ఈ కేసు మీ అమ్మాయి చేతే వేయిస్తాను. ఇందులో సంజయ్ పాత్ర ఉండదు.
అలాగని మంజరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు ఫైల్ చేస్తాను. మీరు మీ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసినట్టు, అది ఆమెకు ఇష్టం లేదన్నట్లు, పెళ్లి జీవితం గడపలేక విడాకులు కోరుతున్నట్లు కేసు వేయిస్తాను.
దానివల్ల మంజరి భవిష్యత్తు కు ఏ ఇబ్బంది ఉండదు.
మీరు మా మధు వాళ్ళు పెట్టిన నగలు మొదలైనవి వాపసు ఇచ్చెయ్యాలి. మంజరి చేత ఒక క్షమాపణ లెటర్ మా మధు వాళ్లకి ఇప్పించాలి అని చెప్పాను.
మధు వైపు తిరిగి అడిగాను. ఏ రా నీకు సమ్మతమేనా అని.
నాకు ఓకే అన్నాడు మధు.
మరి నీకు పెళ్ళికి ఐన ఖర్చు వాపసు ఇవ్వాలా అని అడిగాను మధుని. ఎందుకంటే నీకు భారీగానే ఖర్చయింది కదా !
నాకేమీ అక్కరలేదు అని మధు తడుముకోకుండా చెప్పాడు.
అప్పటిదాకా ఉగ్గబట్టుకుని కూర్చున్న ముకుందరావు మధు దగ్గర కొచ్చి పాదాలు తాకి బిగ్గరగా ఏడ్చేశాడు.
రెస్టారెంట్ లో ఉన్న కొద్ధి మంది మావైపు చూసారు ఏంటన్నట్లు.
నేను ముకుందరావును ఓదార్చాను.
కర్చీఫ్ అడ్డు పెట్టుకుని వెక్కిళ్లు పెడుతున్నాడు ముకుందరావు.
ఏడుపు మంచిదేలే అని అందరం ఊరుకున్నాం.
కాసేపైన తరువాత తేరుకున్నాడు ముకుందరావు.
మీ వంటి ఉత్తమ కుటుంబం వదులుకోవడం మా దురదృష్టం అన్నాడుమధు తో.
మధు ముక్తసరిగా మన చేతుల్లో ఏమీ లేదుగా ముకుందరావు గారు అన్నాడు.
మీ అమ్మాయి ఏ అఘాయిత్యం చేసుకోకుండా చూసుకోండి. ఎందుకంటే జీవితం ముఖ్యం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ అమ్మాయి విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా, మురళీకృష్ణ నుంచి ఏ ఇబ్బంది ఎదురైనా నాకు చెప్పండి. నేను చూసుకుంటాను అని చెప్పాను ముకుందరావుకి.
మీ ఋణం తీర్చుకోలేనిది సార్ అంటూ నా పాదాలు తాకబోయాడు ముకుందరావు.
నేను వారించాను. సార్ మీరు పెద్దవారు. కేవలం మిమ్మల్ని చూసే మా మధు కానీ, సంజయ్ కానీ ఏ కేసులు లేకుండా చూడమని నాకు మరీ మరీ చెప్పారు. లేకుంటే మీ అమ్మాయి మీద క్రిమినల్ కేసు, మీ మీద పరువు నష్టం కేసు వేసి ఉండేవాడిని అని