ప్రతిమానవుడికీ కావాలి స్వాతంత్ర్యం
ఆరుకోట్ల అశేష తెలుగు ప్రజావాహినికి నా స్వాతంర్హ్య శుభాభినందనలు.
ఇది భారత జాతి మరువలేని శుభదినం. భరతమాత సంతానం ఎన్నో త్యాగాలతో, మరెంతో దీక్షతో, త్యాగనిరతితో రక్త తర్పణం చేసి సంపాదించుకున్న పర్వదినం. కాలపుటలపై సుస్థిరంగా, చారిత్రాత్మకంగా చెరగని రక్తాక్షరాలతో లిఖించబడిన సుదినం. స్వాతంత్ర్యపు పౌరసత్వపు పరమార్థాన్ని ప్రాణప్రదంగా కాపాడుకొంటూ, సాటి దేశాలతో పోటీగా దీటైన స్వేచ్చా వాయువులు పీల్చగలిగిన దినం. ప్రపంచ మానవ సమాజంలో మేమూ మనుషులమే అని ఉబికిన గుండెతో, పెల్లుబికిన ఆవేశంతో తలెత్తి తొడచరిచి అలనాటి పలనాటి వీరగాధలు, బొబ్బిలి పులి గాండ్రింపులు, కాకతీయుల విచ్చు కరవాలాల కణకణలు, వెల్లువలా పొంగి పొరలే తుంగభద్రా వీచికలలో మిళితమై మధురంగా, సుమధురంగా వినిపించే విజయనగర కవితా స్రవంతులు మరొక్కసారి గురుతుకు తెచ్చుకున్న రోజు. రక్త తర్పణంతో తెలుగు తల్లి పాదాలకు పారాణి దిద్ది, అమ్మను బంధించిన బానిస శృంఖలాలను భళ్ళున తెగనరికిన రోజు.'స్వాతంత్ర్యం మానవ హక్కు' అని నినదించి నిరంకుశత్వాన్ని తిరోగమనం చేయించిన రోజు. మానవాళి ఏనాటికీ మరచిపోని మధుర స్వప్నంగా శాంతియుత అన్వేషణలోగల మహాద్భుత శక్తిని అత్యద్భుతంగా, అతి ఆదర్శవంతంగా నిరూపించిన రోజు. అదే ఆగష్టు 15. అదే ఈ రోజు. ఇదే మనకు స్వాతంత్ర్యం ప్రాప్తించిన రోజు. ఈ చారిత్రాత్మక దినాన మీ వాడిగా, తెలుగువాడిగా నా జాతికి నేను శుభాభినందనలు సమర్పిస్తున్న మంచిరోజు.
ఇవే ఇవే నా వారికి నమస్కారాలు. ఇవే ఇవే స్వాతంత్ర్య సమారా మహాయజ్ఞంలో సమిధలైన మన తెలుగు వీరులకు నేను సమర్పించే శ్రద్ధాంజలులు. ఇవే ఇవే స్వాతంత్ర్య సముపార్జన కృషీవలుడు, ధన్యజీవి జాతిపిత పూజ్య బాపూజీకి నేను అర్పించే పుష్పాంజలులు. జాతీయ, రాష్ట్రీయ భారత స్వాతంత్ర్య సమర వీరవర్యులకు, అమరజీవులకు అందరికీ నేనర్పించే నివాళులు. ఈనాడు సమధికోత్సాహంతో జాతి అంతా జరుపుకొంటున్న ఈ స్వాతంత్ర్య శుభదినం ఎప్పటికీ, ఎన్నటికీ అందరం పరిరక్షించుకొని, అత్యున్నత ప్రమాణాలను, నైతిక, శ్రామిక, పారిశ్రామిక విలువలతో మించి అన్ని దేశాలను అధిగమించి పై అంతస్తుల అందలం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ శుభ సందర్భాన పెద్దలకు పూజ్యులకు, చిట్టి తమ్ముళ్లకు, పెద్దన్నలకు, అక్కాచెల్లెండ్రకు, యువతకు, కవితకు అందరికీ అనురాగంతో, ఆప్యాయతతో, నిండు మనసుతో స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అయితే వచ్చిన స్వాతంత్ర్యం మన సమాజానికి ఏమిచ్చింది? తెచ్చుకున్న ఈ స్వాతంత్ర్యం ఎంత ప్రగతికి మార్గం చూపింది? సామాజిక పరమైన న్యాయం మానవునికి అందకుండా అంతస్థుల్లో వున్నవారికే కేవలం స్వంతంగా, తమ హక్కుగా అనుభవించటం సంఘ సమానతకు సరైన నిర్వచనం కాదు. గుండెల నిండా గుబులు నింపుకొని, కన్నుల నిండా నీరు తొణికిసలాడుతూ, కష్టాలలోనే కాలం వెళ్లబుచ్చుకుంటున్న దురదృష్టవంతులు యింకా వున్నారు ఈ సమాజంలో. తినడానికి తిండి నోచుకోక, కట్టుకున్న చివికిన పాత ఏ పాత కాలానిదో పాపం, తట్టుకోలేక ఆ పాతలోనే రోతగా బ్రతుకుతున్న కష్టజీవులు, హక్కులకు వెలియై దురాచారాలకు బలియై, కర్మసిద్ధాంతంతో ప్రస్తుతాన్ని సరిపెట్టుకొంటూ భవిష్యత్తు లేక, దారిగానక, చీకటిలో కొట్టుమిట్టాడే కర్మజీవులు, నిస్సహాయులు, నిర్భాగ్యులు ఆనాటి నుంచి ఈనాటి వరకు తీరని అవమానాలతో వరకట్న పిశాచి వికటాట్టహాసాలలో కుమిలిపోతూ స్వాతంత్ర్యం అన్నది మానినికి లేదా? అని మూగబోయిన గొంతుతో ఆడపడుచులు అడుగుతున్నారు సామాజికపరమైన న్యాయం. వక్తల ప్రవచనాలకు, పాలనా కర్తల పైచూపులకు అందక, ఆలనా పాలనా లేక అధోగతిలో, రొంపిలో, రోతలో, అజ్ఞానంలో బిత్తరవోతున్న చిరు బిడ్డలు, కష్టం గిట్టని కార్మికులు, ఫలితం దక్కని రైతులు, చట్టం కాపాడలేని శ్రామికులు-కన్నీళ్ళింకిపోయి, కాలే కడుపులతో, మండే డొక్కలతో "ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం" అని నిలదీసి అడిగితే_ స్వార్థం పేరుకుపోయిన లంచగొండితనానికి అందామా? ప్రజా సంక్షేమాన్ని కాకుల్లా, గద్దల్లా, రాబందుల్లా తన్నుకుపోయే దళారీ తనానికని అందామా? మిలమిలలాడే రొక్కానికి అమ్ముడుపోయిన మానవత్వానికి అందామా? ఏమందాం? చెప్పాలి మీరు.
అర్థంకాని అంధకారంలో వెలుతురు కోసం వెతుకుతున్న మీ ప్రతినిధిని నేను. మోడువారిన పేద బ్రతుకుల్లో పన్నీరు జల్లాలని, కష్టజీవుల గాయాలను నా కన్నీళ్లతో కడగాలని, రైతన్నల సంక్షేమం ఈ చేతి మీద జరగాలని, స్వాతంత్ర్యానికి సరైన నిర్వచనం ఏనాటికైనా ఇవ్వగలగాలని నా ప్రయత్నం. అప్పటికిగాని, ఆనాటికిగాని నా శ్రమకు నేనే నిర్వచనం చెప్పుకోలేను. ఆనాడు గాని మీ అన్నగా నా పెద్దరికాన్ని నేను నిలబెట్టుకోలేను. అందుకే ఈ తాపత్రయం. అందుకే ఈ ప్రస్థానం. ఈ అనుచరణలో, ఆచరణలో ఒక భాగమే తలదాచుకోడానికి నీడయినాలేని నిర్భాగ్యులకు శాశ్వత గృహ నిర్మాణ పథకం. ఆ కార్యక్రమంలో ఒక భాగమే రేపవలు రెక్కలు ముక్కలు చేసుకున్నా కన్నపట్టికి పట్టెడన్నం పెట్టడానికి నోచుకోని పేదల బిడ్డలకు మధ్యాహ్న భోజన పథకం.
ఆకలి డొక్కలతో పూటకు టికాణా లేక భారంగా బ్రతుకేడ్చే బడుగు వర్గాలకు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించాలన్న ప్రయత్నం. ఈ ఉత్కర్షలో ఒక భాగమే కన్నవారి ఆస్తిలో కొడుకులతోబాటు ఆడపడుచులకు కూడా సమాన హక్కులు కల్పించాలన్న ప్రయత్నం.
నిరుద్యోగ రక్కసిని నిర్మూలించడానికి, యువతలో నిస్పృహ పోగొట్టడానికి, ఉత్పత్తులకు సరైన కిమ్మత్తు రైతన్నకు లభింపజేయడానికి, సహకార వ్యవస్థను సహజీవనానికి ముడిపెట్టడానికి, మేథస్సు కొడిగట్టి పోతున్న ఈనాడు అర్హతకు ఆదరం పోయి చదువులు అమ్ముకునే దుస్సంప్రదాయ విధానానికి స్వస్తి చెప్పడానికే ప్రభుత్వ ప్రయత్నం. పసపోయిన డిగ్రీలను పంచే పసివాడిన విద్యా విధానానికి నూతన జీవం పోసి, నిరుద్యోగ నివృత్తికై వృత్తి విద్యలకు ప్రాధాన్యత కల్గించాలని, ఆధారం లేని ఆడపడుచులకు ఆదరవు కల్పించాలని, స్వతంత్రంగా జీవితం గడుపుకొనే అవకాశం అక్క చెల్లెళ్లకు కల్పించాలని, ఎన్నో కలలు కన్న విద్యాపీఠమే నేటి మహిళా విశ్వ విద్యాలయం. వ్యయాన్ని అదుపులోపెట్టి ఆదాయాన్ని పెంచి రాష్ట్రాభివృద్ధిని సాధించాలన్న ప్రయత్నమే ఈనాడు మస్తిష్కంలో మథింపబడుతున్న మాండలిక నూతన వ్యవస్థీకరణ విధానం.
పుణ్యంలో పురుషార్థమన్నట్టు పక్కవారిని మరువకుండా మనవారికింత మేలు చేయడం ప్రభుత్వ ఆదర్శం. అలనాటి భగీరథ ప్రయత్నాన్ని తలపిస్తూ, మరపిస్తూ నింగికెగసిన వరవడిలో శ్రీశైల మల్లిఖార్జునస్వామి శిరో వేషంలో చిందులాడుతున్న తెలుగుగంగ రాయలసీమ మాగాణంలో మథించి మదరాసు వాసుల దప్పిక తీర్చే పరమార్థమే మన మానవతాదృక్పథం.
లక్ష్మీ సరస్వతుల కేరింతల్లో శ్రీశైలం డామ్ కుడి ఎడమ కాల్వల స్రవంతుల్లో__బీటలు వారిన భూములు నిండుగా పండగా పుష్టివంతమైన ఆహారాన్ని పరిపుష్టిగా అందించగా ఆనందంలో తొణకిసలాడే తెలుగుతల్లిని సందర్శించాలన్న ఆశలు ఎన్నెన్నో వున్నాయి. ఎప్పుడో ఆ గోదావరిని కృష్ణమ్మతో కలిపే రోజు ఎప్పుడో. పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా ఒక ఆకృతి దాల్చి ఆనంద సాగరమయ్యే ఆ శుభదినం ఎప్పుడో, ఎప్పుడో. పాతుకుపోయిన పేదరికం పీడ విడిపోయేది ఎప్పుడో, ఎప్పుడో! సంతృప్తితో, పండిన ఆశలతో గుండె నిండుగా వెన్నెల చెండుగా తెలుగుజాతి హసించేది ఎప్పుడో, ఎప్పుడో? దానికే నా ప్రయత్నం. దానికే ఈ సాధన. 'నా', 'మా' వల్ల మాత్రం కాదు. 'మీ' అన్న పరమపదం కలవాలి. మనమందరం కలసి ముందుకు నడవాలి. అడుగులో అడుగువేసి భుజం, భుజం కలుపుతూ నడుం గట్టుకొని నడవాలి. ఇది మరో స్వాతంత్ర్య సమరం. మనం సాధించుకోబోయేదే నిజమైన స్వాతంత్ర్యం. దేశానికే కాదు, ప్రతి మానవుడికి కావాలి స్వాతంత్ర్యం. ప్రతి జీవిని పునీతం చేయాలి స్వాతంత్ర్యం. ఉమ్మడి సొత్తైజాతికి నీరాజనం పట్టాలి స్వాతంత్ర్యం. అందుకే, అందుకే ఈ పయనం. విజయం తథ్యం. పూజ్యులందరికీ అభివందనం. మరోసారి శుభాభివందనం. ఈ ఆగష్టు 15వ ఈ స్వాతంత్ర్య దినం అందరికీ పండుగై, ఆవేశపూరితమై, భావి మానవ కళ్యాణానికీ, సమసమాజ స్థాపనకూ, సంఘ శ్రేయస్సుకూ, ప్రజాహితానికీ ప్రగతి పథం చూపాలి, వెలుగు దివ్వె కావాలి_అని కోరుకొంటూ వినమ్రతతో, చిత్తశుద్ధితో నా శేష జీవితం తెలుగుజాతికి అంకితమని ప్రమాణం చేస్తున్నాను.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 1983 ఆగస్టు 15న రేడియో, దూరదర్శన్ లలో.