"మీ అమ్మగారు రావటం అంత నమ్మకమైతే. మామూలు పెళ్ళి జరిగేదిగా! ఈ రిజిస్టర్డ్ మేరేజ్ దేనికీ?" అనేశారెవరో పుసుక్కున.
"నేను రిజిస్టర్డ్ మేరేజ్ చేసుకుంటున్నది ఈ పధ్ధతి నాకిష్టం గనుక!. ట్రెడిషనల్ మేరేజ్ కుదరక కాదు" కోపంగా అన్నాడు వివేక్.
నలుగురిలో ఈ ఆలస్యం యశోదకి కూడా చిరాగ్గానే ఉంది. వివేక్ ని ఏమి అనలేకపోయింది. పార్వతి. దక్షిణామూర్తులు బెంబేలెత్తి చూస్తున్నారు. మరో పావుగంట గడిచింది.
ఒక్కొక్కరిలోనూ అసహనం పెరుగుతోంది." పోనీ వెళ్ళి మళ్ళీ రామా?" అడిగారు కొందరు.
"వెళ్ళాలనుకుంటే వెళ్ళండి! కానీ మళ్ళీ రానక్కరలేదు" చాలా సీరియస్ గా అన్నాడు. అతడి ముఖం చూసి ఉలికిపడింది యశోద. కఠోర దీక్ష లాంటిది స్పష్టంగా కనిపిస్తుంది అతని ముఖంలో!. తండ్రి వ్యక్తిత్వంలో ఒక అంచు.. మరో కోణంలోంచి.....
"అమ్మ వొస్తోంది!" అన్నాడు వివేక్... సంతోషంతో లేచి.
"ఎక్కడా?" అయోమయంగా అడిగింది యశోద.
"కారు హారన్ వినిపించింది. మరో నిమిషంలో వస్తుంది!"
ఆఫీస్ మెయిన్ రోడ్డు మీద ఉంది. అంచేత ఏవేవో కారు హారన్ లు వినిపిస్తున్నాయి. ఎవరి కారు హారన్ వాళ్ళు గుర్తుపట్టగలరు.
వివేక్ అన్నట్లే మరో నిమిషంలో మారుతీ కారు వచ్చి కాంపౌండ్ లో ఆగింది. అందులోంచి దిగింది ప్రసూన.
జరీ బుటాలున్న పెద్ద బోర్డరు కంచిపట్టుచీర, నడుముకి వడ్డాణం, మెడలో పలక సరులూ, వజ్రాల నెక్లెస్, వజ్రాల ముక్కుపుడక, పూచిన బంగారు చెట్టులా ఉంది ఆవిడ. ముఖంలో లక్ష్మి కళ.
"నేను ఆలశ్యం చేశానా?" లోపలికి వస్తూ అంది ఆవిడ.
మాటలో నమ్రత! సంస్కారం.
"ఆలస్యం ఏమిటమ్మా! నువ్వెప్పుడొస్తే అదే టైం" తల్లి వచ్చినందుకు పట్టరాని ఆనందంతో అన్నాడు.
"ఏమి అనుకోవద్దు! వివేక్ వాళ్ల నాన్నగారు వచ్చేసరికి కొంచెం ఆలశ్యమయింది! ఆయనకూడా వస్తారని ఆగాను. ఆయన పార్టీకి వస్తానన్నారు" చెప్పింది ప్రసూన.
లోలోపల ఆశ్చర్యపోయాడు వివేక్. తండ్రికి చెప్పి వచ్చిందా తల్లి?
సంతకాలూ, వగైరా తతంగం పూర్తయింది. ప్రసూన మొదటిసాక్షి సంతకం చేసింది. ఆనందభాష్పాలతో వధూవరులపై అక్షింతలు చల్లింది.
"మొదట దంపతులిద్దరూ మన ఇంటికి రండి!. ఆ తర్వాతే మీ ఇంటికీ. పార్టీకి" యశోద, వివేక్ లిద్దరినీ ఉద్దేశించి అంది.
పార్వతికీ. దక్షిణామూర్తికీ ఏం మాట్లాడాలో తోచలేదు. తమకి ఆహ్వానం లేదు... వివేక్ ఆ పరిస్థితిని గమనించి అతి నెమ్మదిగా యశోదతో అన్నాడు "అక్కడి వాతావరణం ముందు మనం చూసి ఆ తర్వాత మీ అమ్మగారినీ, నాన్నగారినీ తీసికెళ్దాం."
పొంగి వస్తోన్న చికాకుని అతి ప్రయత్నం మీద అణుచుకుంది యశోద. ప్రతీ చిన్న విషయంలోనూ భయాలూ, సందేహాలూ, అనుమతులూ. ఇవికాదు... యశోద వైవాహిక జీవితంలో కోరుకున్నది!
అదీగాక ఏ రకంగానూ తననుకన్న తల్లినీ, తండ్రినీ. చిన్నబుచ్చటం ఆమె సహించలేదు. పార్వతితో అంది..." అమ్మా! మీరు ముందుగా వాళ్ల ఇంటికి రావద్దు. వాళ్ళు మన ఇంటికి వస్తే అప్పుడు మీరు ఆ ఇంటికి వద్దురు గానీ...."
ఈ మాటలు ప్రసూనకి వినిపించాయి. వినపడకుండా ఉండాలని యశోద ప్రయత్నించలేదు. పార్వతి తేరుకుంది.
తల్లి కష్టపెట్టుకుంటుందేమోనని వివేక్ భయంగా చూశాడు. ప్రసూన నిండుగా నవ్వి "బాగా చెప్పావమ్మా!" అంది.
ఆమె మాటల్లో వెటకారం లేదు. కోడలు విషయాన్ని అర్థం చేసుకుందన్న సంతృప్తి ఉంది.
వరండాలో, సోఫాల్లో కూర్చుని ఉన్నారు దేవిశంకర్ ఇంకా ఎవరో నలుగురు పెద్ద మనుష్యులు. దేవిశంకర్ వ్యవసాయం వదిలేసి వ్యాపారంలోకి వచ్చాక, రాజకీయాల్లో కూడా కొంత పలుకుబడి సంపాదించుకున్నాడు.
అంటే అతనికి రాజకీయ పరిజ్ఞానం ఉందని కాదు. ప్రజలు ఎన్నుకున్న యం.యల్.ఏ. లకీ ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉందో, అతనికీ అంతే ఉంది అందరికీ తెలిసింది ఒక్కటే! వ్యాపారం, డబ్బు! ఓట్లు ఎలా సంపాదించాలి? అందుకోసం ఎంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి? పదవిలోకి వచ్చాక పెట్టుబడి పెట్టింది వడ్డీతో సహా ఎలా రాబట్టుకోవాలి? - ఈ విషయాలే క్షుణ్ణంగా తెలుసు అందరికీ! అంతే కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యలేమిటి? రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చాలంటే ఏం చెయ్యాలి? ఈ విషయాలు కనీస పరిజ్ఞానమున్న ఎవరికీ ఉండదు. తెలుసుకోవడానికీ. ప్రయత్నించరు. దేవిశంకర్ కి రాజకీయాల్లో కూడా పలుకుబడి ఉండటం చేత అనేకమంది అనేక పనుల మీద అతని దగ్గరికి వస్తుంటారు. ఇది కూడా ఒక వ్యాపారం అతడికి.
కారులో దిగి లోపలికి వెళ్తోన్న భార్యనీ ఆ వెనకే మెడలో పూల దండలతో నడుస్తోన్న కొడుకునీ, ఎవరో కొత్త అమ్మాయినీ చూసి మతిపోయినట్లయింది దేవిశంకర్ కి.
తర్వాత స్నేహితులతో మాట్లాడలేకపోయాడు. అతడేం మాట్లాడుతున్నాడో అతడికి తెలియడం లేదు. స్నేహితులేవి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. అందరినీ వెళ్లిపొమ్మని లోపలికి వచ్చాడు.
అతడి భయాలు నిజంచేస్తూ యశోదా వివేక్ లు అతడి పాదాలకు నమస్కారం చేశారు.
"మీ కొడుకూ కోడలూ! ఆశీర్వదించండి!" చిరునవ్వుతో పరిచయం చేసింది ప్రసూన. తొణక్కుండా బెణక్కుండా నిబ్బరంగా ఉంది ఆమె.
దేవిశంకర్ లాంటి లోకజ్ఞుడూ చతురుడూ కూడా దిమ్మెరపోయాడు. నోటమాట రాలేదు.
"తొందరగా ఆశీర్వదించండీ! వాళ్ళు ఎంతసేపు అలా వొంగుంటారు?" ఎన్నో సందర్భాలలో లాగ అప్పుడూ కర్తవ్యం చేసింది ప్రసూన.
"చిరంజీవ! దీర్ఘసుమంగళీభవ!" పలికాయి అతని పెదాలు. ప్రసూన చేతిలో ఉంచిన అక్షింతలు తీసుకుని వాళ్లమీద చల్లాడు. వాళ్ళు లేచి కూర్చున్నారు.
అప్పుడు తిరిగాడు భార్యవైపు. మెత్తని కత్తుల్లా ఉన్నాయి అతని చూపులు.
"వివేక్ కి పెళ్లయిందా? నాకు తెలియకుండా చేసుకున్నాడా? నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళివాడిని ఆశీర్వదించావా?" మెత్తగానే ఉంది గొంతు! కానీ కస్సున కోస్తున్నట్లుగా వస్తున్నాయి మాటలు. ఆ మాటల్లో ఎంతకోపం ఉందో దానికి రెండు రెట్లు ఆవేదన ఉంది.
"వివేక్ కి ఎన్నోసార్లు తను చెయ్యదలుచుకున్నది చేశాకే మీకు చెప్తున్నాడు. అందుకు కారణం నాకు తెలియదు. నేను మాత్రం మీకు చెప్పే వెళ్ళాను."
"నాకు చెప్పి వెళ్ళావా? నాతో అబద్ధమా?"
"అబద్ధం కాదు. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు. అబ్బాయి పెళ్ళికి వెళ్ళొస్తాను" అని అన్నాను. "నగలన్నీ పెట్టుకుని నా కారులో వెళ్ళు" అన్నారు. ఆ తర్వాతే వెళ్ళాను.