Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 16


    "ఆగు బాబూ నామాట శాంతంగా విను కాస్త ఆవేశం తగ్గించుకో. ఆ అమ్మాయి తప్పు ఏంలేదు" అంటూ కొడుకుని బ్రతిమాల సాగింది. అతను వినకుండా తల్లిని పక్కకు గెంటేయసాగాడు.


    గణేష్ రావు గాకు అంతవరకూ మౌనంగా ఉండిపోయినా ఇక మౌనంగా ఉండలేకపోయారు. కొడుకు దగ్గరకు వచ్చి "జయా!" అంటూ కొడుకు చెయ్యి పట్టుకున్నారు.


    ఆయన కంఠస్వరం గంభీరంగా పలికింది,


    "ఆగు నామాట విను అమ్మాయి తప్పు ఏం లేదు" అన్నారు.


    "ఉండండి నాన్నగారు నన్ను ఆపకండి" అన్నాడు మహా ఆవేశంగా.


    కొడుకుని బలవంతంగా ఇటు లాగేశారు ఆయన.


    ఇంద్రసేన చటుక్కున వెళ్ళి అన్నగారి చెయ్యి పట్టుకుంది "ఆగు అన్నయ్య కొంచెం శాంతంగా ఆలోచించు" అంది.


    జయరాంని అందరూ అన్ని వైపులా కట్టేశారు కదలకుండా.


    అతని కోపం మాత్రం చల్లారలేదు.


    తల్లీ తండ్రి చెల్లెలు తనని కాస్త వదిల్తే అంబికను నరికి పారేద్దామనిపిస్తుంది అతనికి.


    అందరూ జయరామ్ ని ఆపుతుంటే అంబిక వాళ్ళందరివపు శాంతంగా చూస్తూ.


    "ఎందుకండీ ఆయన్ని మాటలతో అలా కట్టి పడేస్తున్నారు! ముందు ఆయన్ని వదలండి."


    "ఆయన నాకు తాళికట్టిన భర్త. నా ప్రాణం తియ్యడానికి ఆయనకు హక్కు ఉంది. నన్ను దండించే హక్కు ఉంది. కాని నాకు నూరేళ్ళ జీవితం ప్రసాదించాలన్నా ఆయన చేతితోనే ఉంది. భార్య కష్టసుఖాల్లో పాలు పంచుకునే భర్త భార్యకు అనురాగాన్ని పంచి ఇచ్చే భర్తకు భార్యపై సర్వాధికారాలు ఉన్నాయండీ అందున ఆయన్ని వదిలేయమంటున్నాను. ఆయన నన్ను అర్ధం చేసుకుంటే సంతోషం మన చేతిక్రింద పనిచేస్తున్న వర్కర్స్ అంటే ఎవరు! మన పిల్లలతో సమానం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు! మనతో చెప్పుకోక."


    "కాలే కడుపులకి పంచభక్ష పరమన్నాలు పెట్టమని అడగలేదే కడుపునిండా ఇంత గంజి పొయ్యమని అడిగారు."


    "మండే గుండెలపై పన్నీరు పొయ్యమని అడగలేదే మంచిమాట చెప్పి ఓదార్చి ఆ మండే గుండెలను చల్లార్చమని చెప్పారు. అంతే అంతే వాళ్ళు అడిగారు."


    "తిన్నగా మనల్నే వచ్చి అడగాలి అంటే మనదాకా ఎవరు రానిస్తారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వనివ్వడు. మధ్యవాళ్ళు అడ్డేస్తారు. దాంతో వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయారు, కడుపులు నిండే దారిలేదు. చెప్పుకునే అవకాశం వాళ్ళకి కల్పించలేదు. దాంతో ఆకలికోసం పిచ్చెత్తించగా అందరూ ఎదురు తిరిగారు. అంతే అంతే వాళ్ళు చేసింది. బిడ్డలాకలితో పడుకుంటే పీక నులిమి చంపేస్తుందా ఏ తల్లి అయినా? బిడ్డ మనసు తెలుసుకుని కడుపునిండా అన్నంపెట్టి కళ్ళు తుడిచి జోకొట్టి నిద్రపుచ్చుతుంది. అంతే అలాగే యజమానులు తమ కర్తవ్యాన్ని బాధ్యతల్ని గుర్తు తెచ్చుకుని వర్కర్స్ పట్ల అలాగే ప్రవర్తించాలి" అంది ఆవేశంగా.


    అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయి. పిడికిళ్ళు బిగుసుకుపోయాయి.


    ఒళ్ళు అంతా చెమట బిందువులతో తడిసిపోయింది, అంబిక అంత ఆవేశంగా ఒక్కోమాట వివరించి నొక్కి చెప్తుంటే.


    గణేష్ రావుగారు, జయరాం ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు.


    గణేష్ రావు గారు కోడలి మాటలు వింటూనే సిగ్గుపడ్డట్టు అయి తలవంచుకున్నారు.


    జయరాం బుర్ర గిర్రున తిరిగిపోసాగింది.


    అంబిక మాటల్లో ఎంత నిజం దాగి ఉంది!


    వర్కర్స్ పనిచెయ్యకుండా ఎదురు తిరిగారు అంటే అర్ధం!


    జయరాం కోపం అంతా మెల్లమెల్లగా తగ్గిపోసాగింది.


    అంబిక నెమ్మదిగా అంది.


    నేను ఈ యింటి కోడలిగా వచ్చాను అంటే కొన్ని బాధ్యతలు నా నెత్తిమీద వేసుకున్నట్టే మొట్టమొదట నా భర్తను ఎవరైనా ఏమైనా అంటే సహించి భరించలేను. ఆయన్ను అందరూ గౌరవించాలి. పూజించాలి అందుకు ఆయన తన బాధ్యతల్ని గుర్తుపెట్టుకుని మసులుకోవాలి. అందరి మంచిచెడ్డలు కనుక్కుంటూ ఆయన అందరికీ మంచి అవ్వాలి. అందుకు భార్యగా నేను చేస్తున్న కృషి ఇది."


    "ఇక రెండవ బాధ్యత అత్తగారు మావగారు అంటే నా భర్తకు జన్మనిచ్చిన పూజ్యులు వారిని ఈ పెద్ద వయసులో కష్టపెట్టకుండా వారికి కోడల్ని అయినా వారి మనసు తెలుసుకుని కూతురిగా వార్ని సుఖపెట్టి పూజించాలి అదే నా రెండవ బాధ్యత."


    "ఇక మూడవ బాధ్యత" అంటూ ఇంద్రసేన వైపు తలతిప్పి చిరునవ్వుతో చూసింది.


    గణేశ్ రావు గారు సుభద్రమ్మ కోడలి మాటలు వింటూనే పొంగిపోయారు.


    ఇంద్రసేన అర్ధంకానట్లు అంబిక వైపు చూసింది. దగ్గరగా వెళ్ళి ఆడపడుచు తల ప్రేమగా నిమురుతూ ఆమెను దగ్గరగా తీసుకుంటూ --


    "మా ఆడపడుచు ఇందూ-ఆడపడుచులు, మరదలు వదినగార్కి పిల్లలతో సమానం. ఇందూ మా పిల్ల మా ఆడపడుచు అందాల బొమ్మ బంగారు మొలక. ఈమెకు తగిన వరుడ్ని చూచి పెళ్ళి చెయ్యవలసిన బాధ్యత నాకు ఉంది. మంచి చదువుకున్న వాడ్ని ఫారిన్ రిటర్న్ ని అందగాడు, బుద్ధిమంతుడు, ఐశ్వర్యవంతుడ్ని చూచి పెళ్ళి జరిపిస్తాను. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది. వాళ్ళకి కబురు చేశాను. వాళ్ళు వస్తారు. మీకు అందరికీ ఆ సంబంధం నచ్చి తీరుతుంది. అబ్బాయి అంత అందంగా ఉంటాడు. అన్ని విధాల మన ఇందూకి తగిన సంబంధం నేను మెట్టినింట్లో అందరూ సుఖంగా, హాయిగా ఉండాలన్నదే నా కోరిక" అంది చిన్నగా నవ్వుతూ.


    అందరూ ఆశ్చర్యంగా, సంతోషంగా చూశారు ఆమెవైపు.


    జయరాం మనసులో రవ్వంత సిగ్గుపడ్డట్టు అయ్యాడు. మౌనంగా ఉండిపోయాడు అలా.


    ఇంద్రసేన వదిన మాటలకి తడబడినట్టు అయింది. అంబిక గురించి.... అదే వదిన గురించి తను ఇన్ని రోజులు పొరపడిందా!


    ఆమెను తను అర్ధం చేసుకోలేకపోయిందా!


    వదిన తన గురించి ఇంతగా ఆలోచిస్తుందా!


    మంచి సంబంధం చూచి పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకుని అప్పుడే సంబంధం కూడా చూచి ఉంచిందా!


    అతను నిజంగా అంత అందగాడా!


    అంత చదువుకున్నాడా!

 Previous Page Next Page