ఫారిన్ రిటర్న్ డా!
ఆలోచిస్తూ తనకి తాను సిగ్గుపడ్డట్టు అయింది. ఇన్నాళ్ళు ఆమె గురించి తను అపార్ధం చేసుకుంది! తను ఈ రోజు నుండి ఆమెతో స్నేహంగా ఉండి వదినా అని మనసారా పిలవాలి అని నిశ్చయించుకుంది.
అంబిక మాటలు వింటూనే అందరి మనసులూ తేలికపడినట్టు అయ్యాయి.
గణేష్ రావు గారు, సుభద్రమ్మ ఏదో చెప్పబోతుంటే వీధిగేటు దగ్గర, పెద్ద గోలగా, గొడవగా మాటలు వినిపించాయి.
ఏమిటా అని అందరూ హాలు గుమ్మం వేపుగా వెళ్ళి చూశారు.
వర్కర్స్ అందరూ గేటుదగ్గర నిలబడి లోపలికి వదలమంటున్నారు గుర్ఖాని.
గేటుదగ్గర ఉన్న గుర్ఖా గేటు తియ్యటం లేదు.
గణేష్ రావు గారు, జయరాం ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు ఏమిటా అన్నట్టు.
మళ్ళీ ఏం గొడవ జరుగుతుందా అని.
అంబిక ఎవ్వరివైపూ చూడలేదు. ఎవ్వరి సలహా తీసుకోలేదు.
గబగబ రెండడుగులు ముందుకువేసి గుర్ఖావానికి చెప్పింది,
గేటు తెరిచి వాళ్ళందర్నీ లోపలకు పంపించమని.
అంతే గేటు తెరవగానే బిలబిలలాడుతూ వర్కర్సే లోపలికి వచ్చేశారు.
అందరి చేతిలోను పూలహారాలు ఉన్నాయి. ప్రొప్రయిటర్ గణేష్ రావు గారికి జై!
ప్రొప్రయిటక్ జయరాం గార్కి జై! అంటూ గట్టిగా అరుస్తూ.
అందరూ తండ్రీ కొడుకులు ఇద్దర్నీ పూలహారాలతో ముంచేసి వాళ్ళ ఆనందాన్ని అలా వ్యక్తపర్చుకోసాగారు.
గణేష్ రావుగారు, జయరాం ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు.
అంబిక చిన్నగా నవ్వుతూ చూడసాగింది.
వర్కర్స్ అందరూ తండ్రీ కొడుకుల్ని ఇద్దర్నీ పొగుడుతూ.
"డాక్టరమ్మగారిచేత చెప్పించారు జీతాలు పెంచుతామని, బోనస్ లు ప్రతి సంవత్సరం మీకు తప్పకుండా ఇప్పిస్తామని. మా ఆనందం ఇంతాంత కాదు బాబుగారూ. మీ పేరు చెప్పుకుని కడుపునిండా తింటా"మంటూ అందరూ గొడవగా గోలలు ఎవరికి తోచినట్టు వాళ్ళలా చెప్తూ వారిని పొగడసాగేరు.
గణేష్ రావు గారు చిరునవ్వుతో వాళ్ళందరికీ ఏవో రెండు మాటలు చెప్పి అందరిని పంపించేశారు.
జయరామ్ వాళ్ళ అభిమానానికి తట్టుకోలేకపోయాడు.
అందరూ అలా పొగుడుతూ ఉంటే తను తొందరపడ్డందుకు నిజంగా సిగ్గుపడ్డాడు.
ఇక అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఇంద్రసేనకి కూడా సంతోషంగానే అనిపించింది.
సుభద్రమ్మ భర్తతో అంది సంతోషంతో మురిసిపోతూ "నిజంగా అమ్మాయి ఎంత తెలివయిందండీ"
"అవును చదువుకున్న అమ్మాయి చదువుకున్నమ్మాయే! అందుకే అంత తెలివిగా సమస్యను తేలిగ్గా పరిష్కారం చేసేసి నాకు జయరాంకు పేరు తెచ్చింది" ఆయన తృప్తిగా, సంతోషంగా మనస్ఫూర్తిగా అన్నారు.
ఆయన ఎవర్నీ ఎప్పుడూ అలా మనస్ఫూర్తిగా మెచ్చుకోలేదు. అది మొదటిసారనే చెప్పాలి.
* * *
జయరాం తన మంచంపై పడుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు.
అంబిక గదిలోకి వచ్చి మెల్లగా తలుపులువేసి లైటార్పి మంచంమీద పడుకుంది.
తలతిప్పి భార్యవైపు చూశాడు.
అతని కళ్ళకి ఆమె ఆ రోజు ఎంతో అందంగా అపురూపంగా కనిపించసాగింది.
ఇలాంటమ్మాయి ఎక్కడో ఏ పురుషుడికో భార్యవవుతుంది. అందరి పురుషులకి ఈ అదృష్టం దక్కదు. ఇంత తెలివయిన అంబిక తనకి భార్య అయిందంటే నిజంగా ఎంత అదృష్టం!
తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. గుండెలనిండా సంతోషం పొంగిపోసాగింది.
తను ఎంత తొందరపడ్డాడు. ఆమె కనుక తనని గదిలో పెట్టి బంధించకపోతే వర్కర్సందరూ తనని ఇలా పొగిడేవారా! తను నిజం తెలుసుకోకుండా ఆవేశంతో అక్కడికి వెళితే పెద్ద గొడవ జరిగిపోయి ఉండేది. వాళ్ళు రెచ్చిపోయి ఉండేవారు.
ఎంత తెలివిగా ప్రవర్తించింది అంబిక.
నిజం తెలుసుకోకుండా ఆమెను కొట్టి అనుమానించేడు అందరిలో. ఎంత అనాలోచితంగా ప్రవర్తించాడు తను. భార్యవేపు జాలిగా, పరీక్షగా చూశాడు.
అంబిక అటు తిరిగి పడుకుంది.
దగ్గరగా జరిగి ఆమె భుజముపై చెయ్యివేసి "నిద్రపోతున్నావా!" అపురూపంగా అడిగాడు.
తలత్రిప్పి చూసి "లేదు. ఇంకా నిద్ర రావటంలేదు" అంది మెల్లగా.
"నా మీద కోపం వచ్చిందా!" పశ్చాత్తాప పడుతూ అడిగాడు.
"మీమీదా! ఎందుకు!" అర్ధంకానట్టు ఇటు తిరిగి భర్త వేపు చూస్తూ అడిగింది.
"నిన్ను అందరిలో అలా అవమానించి కొట్టినందుకు" లో గొంతుతో అన్నాడు. అతనికి మాట్లాడడానికి శక్తిలేనట్టు అదోలా అయిపోతూ.
"అదా!" అంటూ నవ్వి అతని చేతిని చేతుల్లోకి తీసుకుని పెదవులకి ఆనించుకుంటూ.
"నేను మీ భార్యని. నేను ఏదయినా తప్పుచేస్తే దండించే అధికారం మీకు ఉంది. అలాగే మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికయినా ఏ విషయంలో అయినా మీమీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. మన ఇద్దరం భార్యాభర్తలం మన అనుబంధం అటువంటిది. మీరు నన్నుకొట్టి అవమానించారు అని బాధపడనవసరం లేదు. నన్ననక మీరు ఇంకే పరాయి స్త్రీని అంటారు చెప్పండి!" అంటూ చేతివేళ్ళతో మెల్లగా దువ్వసాగింది.
"అంబికా!" అన్నాడు సంతోషంగా చూస్తూ.
చిన్నగా నవ్వుతూ అంది. "భార్య కోరుకునేది భర్త గుండెల్లో చోటు, భర్త అనురాగం. ఇదేనండి నేను కోరుకునేది తెల్లవారి హాస్పిటల్ కి వెళ్ళి యింటికి వచ్చిందాకా బాధ్యతగల ఒక డాక్టర్ని నేను. ఇంటికి వచ్చాక బాధ్యతగల గృహిణిని మాత్రమే."
"అంబికా! నేను నిజంగా ఎంత అదృష్టవంతుడ్లి అంటూ ఆమెను అపురూపంగా అనురాగంగా దగ్గరకు తీసుకుంటూ గుండెలకు అదుముకున్నాడు.
* * *