అతని దగ్గరకు తల్లి తండ్రి ఎవరూ వెళ్ళ సాహసించలేకపోతున్నారు.
"ముందు భోజనం చెయ్యిబాబు" అంది ఆవిడ.
"భోజనం హు..." అంటూ కటువుగా నవ్వాడు. ఆ నవ్వు ఎవరికైనా భయంకరంగా అనిపిస్తుంది. సుభద్రమ్మ గణేశ్ రావు ముఖముఖాలు చూసుకున్నారు. కొడుక్కి ఎలా నచ్చ చెప్పటమా అని.
కొడుకుని చూస్తుంటే అంబికను ఈ రోజు బ్రతకనివ్వడు ప్రాణం తీస్తేనేగాని అతని మనసు చల్లబడదు అనిపించసాగింది.
ఎలా! అంబికను ఈ రోజు యింటికి రానివ్వకుండా ఆపటం ఎలా అనుకున్నారు ఆ దంపతులు.
ఇంద్రసేనకి అన్నగారి ఆవేశం చూస్తేనే ఆమెకు సంతోషంగా అనిపించింది.
ఈ దెబ్బతో ఆవిడగారి అధికారం దర్జా ఎగిరిపోతాయి. దెబ్బకి పిల్లి అయి ముడుచుకుపోయి మూల కూర్చుంటుంది అనుకుంది.
ఆమెకు మనసులో పట్టరాని సంతోషంగా అనిపిస్తుంటుంది.
గణేశ్ రావు గారు అంబికను ఆరోజు యింటికి రావద్దు అని చెప్పటం కోసం హాస్పిటల్ కి తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్ లు చేశారు. అంబిక ఉందేమో అని ఎవరూ ఆమె అక్కడ లేనట్టు చెప్పారు.
గణేశ్ రావు గారు దంపతులు చేసేది లేక అలా ఉండిపోయారు.
జయరామ్ చేతులు కట్టుకుని ఆమె రావటంకోసం ఎదురు చూస్తూ హాలులో పచార్లు చెయ్యసాగాడు. అతనికోపం ఆవేశం చూస్తూనే గణేష్ రావుగారు దంపతులు అనుకున్నారు.
ఈ రోజుతో అంబిక ఆయుష్షు అయిపోయింది.
జయరామ్ మాట వినే రకం కాదు.
ఈ యింట్లో ఈ రోజు అంబిక శవం వెళ్ళిపోతుంది అని నిశ్చయించుకుని కోడలు ఏ క్షణాన వస్తుందో అని బెంగపడి భయపడిపోతూ అరిచేతిలో గుండెలు పెట్టుకుని అంబిక రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు ఆ దంపతులు. ఇందూ చూస్తుంది.
జయరామ్ సరేసరే ఆమె రావటంకోసం ఎదురు చూస్తున్నారు.
51
ఫోర్టికోలో కారు ఆగిన శబ్దం అయింది.
అందరూ ఒక్కసారిగా అలా అయిపోయారు.
అంబిక వచ్చింది. అందరి గుండెలు ఒక్కసారి అదిరిపోయాయి.
అంతవరకూ సంబరంగా ఎదురు చూస్తున్న ఇందు అన్నగారి వైపు చూస్తూ గజగజ వణికిపోయింది. అంబికను ఈరోజు చంపేస్తాడని భయం వేసింది. ఎదురువెళ్ళి ఆమెకు చెప్పేస్తే.
చెప్పే అవకాశం లేదు.
ఆమె లోపలికి వచ్చేస్తుంటుంది.
అన్నయ్య ఆమె రావటమే ఆలశ్యం అన్నట్లు కళ్ళు ఎర్రగా చేసుకుని శక్తి అంతా గుప్పెట్లోకి తెచ్చుకుని మరీ చూస్తున్నాడు.
ఎవరికి వాళ్ళే మాటలు పలుక్కోలేనట్లు అలా ఉండిపోయారు. యేం చెయ్యలేని పరిస్థితిలో భగవంతుడి మీద భారం వేసి.
అంబిక లోపలికి అడుగు పెడుతూనే హాలులో నిలబడ్డ అందరివైపు పరిశీలనగా చూసింది.
గణేశ్ రావు గారు, సుభద్రమ్మ అలా నిలబడిపోయారు ఏం మాట్లాడకుండా.
ఇంద్రసేన సరేసరి.
భర్తవైపు చూచింది. ఆ చూడటంలో భయపడుతూ చూడలేదు.
ధైర్యంగా ధీమాగా చూసింది.
జయరామ్ ఆమెను చూస్తూనే నిప్పులు కక్కుతూ ఒక్కో అడుగు ముందుకి వేస్తూ ఆమెని సమీపించాడు.
అయినా అంబిక అతని వైఖరి చూసి జడిసిపోలేదు. రెప్ప వాల్చకుండా అలగే భర్తవైపు చూడసాగింది.
"నన్ను... నన్ను చేతకాని వెధవని చేసి యింటిలో కూర్చోబెట్టి వెళతావా? నీకు ఎంత ధైర్యం! నా సంగతి తెలిసే అలా ప్రవర్తించేవా!" అంటూ పళ్ళు పటపట లాడించేడు.
"బోనులో పులి బోనులోనే జీవితాంతం వుండిపోతుంది అనుకున్నావా? బోనులో నుండి బయట పడలేదు అనుకున్నావా! మాట్లాడవేం!" అంటూ బిగ్గరగా అరిచాడు.
అతను అరిచిన ఆ అరుపుకి యిల్లు అంతా దద్దరిల్లిపోయింది.
సుభద్రమ్మ నిజంగా భయపడిపోయింది.
కొడుకు ఆరోజు కోడలిని చంపేస్తాడేమో అని. అతను అంత గట్టిగా అరిచినా అంబిక అదిరిపోలేదు బెదిరిపోలేదు.
హుందాగా చిరునవ్వు నవ్వింది, ఏ మాత్రం తొణక్కుండా.
"ఏమిటా ధీమా సమాధానం చెప్పవేం" అంటూ అరిచాడు.
"మీకు.... నేను.... సమాధానం చెప్పాలా!" ఒక్కోమాట విడివిడిగా నొక్కినొక్కి మరీ చెప్పింది.
"అంటే నాకు నువ్వు సమాధానం చెప్పనవసరం లేదన్నమాట. నేను అంటే నీకు అంత నిర్లక్ష్యమా!" అంటూ ఒకచేత్తోనే ఆమె చెంపలు రెండు అదిరిపోయినట్టు ఎడాపెడా వాయించేశాడు. బలంకొద్దీ కొట్టిన ఆ దెబ్బలకి ఆమె చెంపలు ఎర్రగా కందిపోయాయి.
కళ్ళనీళ్ళు గిర్రున తిరిగిపోయాయి.
పై పంటితో క్రింద పెదవిని గట్టిగా రక్తం వచ్చేట్టుగా నొక్కి పట్టి బాధను భరించడానికి ఆమె శక్తి అంతా వుపయోగిస్తూ దుఃఖాన్ని గుండెల్లో నుండి బయటపడకుండా ఆపుకోసాగింది.
సుభద్రమ్మ మనసు ఆగలేదు.
జయరాం అంబికను ఇంకా కొట్టి చంపడానికి సిద్ధపడ్డట్లు ఆమె చెయ్యి పట్టుకుని చెయ్యి పట్టుకుని చెయ్యి పైకెత్తాడు.
"బాబూ! ఆగు నా మాట విను. ఆ అమ్మాయి ఒంటిమీద చెయ్యివేస్తే నన్ను చంపుకు తిన్నట్టే ఆగు నా మాట విను" అంటూ కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుంది.
"ఉండు అమ్మా, నన్ను ఆపకు దీన్ని నరికి ప్రోగులు పెట్టినా తప్పులేదు. ముందు చెయ్యి వదలమ్మా" అన్నాడు ఆవేశంగా.